VELERUPADU
-
వరదలతో నష్టపోయిన ప్రతి ఒక్కరినీ ఆదుకుంటాం: సీఎం జగన్
-
వీలైనంత త్వరగా ఆర్థిక సాయం అందించాలని ప్రధానిని కోరుతా: సీఎం జగన్
-
కన్నయ్యగుట్టకు చేరుకున్న సీఎం జగన్
-
మహోగ్రరూపం దాల్చిన గోదావరి
-
బాలింత మృతి.. ఆళ్ల నాని సీరియస్
సాక్షి, పశ్చిమగోదావరి: వైద్యం వికటించి బాలింత మృతి చెందిన ఘటనపై మృతి ఘటనపై డిప్యూటీ సీఎం ఆళ్ల నాని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఘటనపై సమగ్ర వివరాలను డీఎంహెచ్‌వోను అడిగి తెలుసుకున్నారు. వివరాల ప్రకారం..వేలేరుపాడులోని రామవరానికి చెందిన నాగమణి అనే నిండు గర్భిణి ప్రసవం కోసం స్థానిక వేలేరు పాడులోని శ్రీనివాస నర్సింగ్ హోంలో మంగళవారం రాత్రి చేరింది. ప్రసవం కష్టం కావడంతో ఆమెకు సిజేరియన్ ఆపరేషన్ చేసి బిడ్డను సురక్షితంగా బయటకు తీశారు. ఆ తరువాత నాగమణి ఫిట్స్‌తో మృతి చెందింది. ఈ ఘటనపపై సీరియస్ అయిన ఆళ్ల నాని ..ఎలాంటి అర్హతలు లేకుండా కాన్పు చేసిన ఆర్ఎంపీ వైద్యుడిపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అనుమతులు లేకుండా ఆస్పత్రులు నిర్వహిస్తే కఠిన చర్యలు ఉంటాయని, ఆర్ఎంపీలు పరిధి దాటి వైద్యం అందిస్తే చట్టపరమైన చర్యలుంటాయని హెచ్చరించారు. బాలింత మృతిపై సీనియర్ గైనకాలజిస్టు విచారణాధికారిగా నియమించారు. -
పెద్దవాగులో పెను విషాదం
సాక్షి ప్రతినిధి, ఏలూరు/వేలేరుపాడు: పశ్చిమ గోదావరి జిల్లా వేలేరుపాడు మండలంలో బుధవారం విషాదం జరిగింది. వనభోజనోత్సవానికి వెళ్లిన ఆరుగురు స్నేహితులను పెద్దవాగు మింగేసింది. ఒకరినొకరు చేతులుపట్టుకుని సరదాగా వాగులోకి దిగిన ఐదుగురు మునిగిపోయారు. వారిని రక్షించేందుకు ప్రయత్నించిన మరో స్నేహితుడు కూడా వారితోపాటే నీటమునిగాడు. అప్పటివరకు సరదాగా గడిపిన వారు క్షణాల్లో జలసమాధి అయ్యారు. భూదేవిపేట గ్రామానికి చెందిన వీరు వసంతవాడ ప్రాంతంలో పెద్దవాగులో ప్రాణాలు కోల్పోయారు. బాధిత కుటుంబాలకు మూడులక్షల రూపాయల వంతున ఆర్థికసాయం అందించాలని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించారు. ఆనవాయితీగా.. ఏటా దసరా పండుగ పూర్తయ్యాక భూదేవిపేట గ్రామస్తులు వసంతవాడ వాగు ప్రాంతంలో వనమహోత్సవం జరుపుకొంటారు. ఈ ఏడాది కూడా గ్రామస్తులు ఉత్సాహంగా వనభోజనానికి వెళ్లారు. స్నేహితులైన కెల్లా భువనసాయి (18), గంగాధరపు వెంకట్రావు (16), గొట్టిపర్తి మనోజ్ (16), కర్నాటి రంజిత్ (15), కూరవరపు రాధాకృష్ణ (15) పెద్దవాగులో ఆడుకునేందుకు వెళ్లారు. వీరెవరికీ ఈత రాకపోవడంతో ఒకరినొకరు చేయిచేయి పట్టుకుని వాగులోకి దిగి సరదాగా కొంతసేపు ఆడుకున్నారు. వాగులోతు తెలియని వీరు ముందుకెళ్లి మునిగిపోయారు. ప్రాణాలు కాపాడుకునేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. వీరిని రక్షించేందుకు వాగులోకి దిగిన శ్రీరాముల శివాజీ (17) కూడా మునిగిపోయాడు. వీరు నీళ్లల్లో మునిగిపోవడాన్ని గమనించిన కుటుంబసభ్యులు వెంటనే స్థానికులకు సమాచారం అందించి వారిని కాపాడేందుకు వాగులోకి దిగారు. సమాచారం అందుకున్న డీఎస్పీ ఎం.వెంకటేశ్వర్లు, కుక్కునూరు సీఐ బాలసురేశ్, ఎస్ఐ సుధీర్ వెంటనే అక్కడికి చేరుకున్నారు. స్థానికులు, పోలీసులు గాలించి నీళ్లల్లోనుంచి మృతదేహాలను వెలికితీశారు. భూదేవిపేట కన్నీరుమున్నీరైంది. మృతుల్లో శ్రీరాములు కార్పెంటర్‌గా పనిచేస్తున్నాడు. అతడే కుటుంబానికి జీవనాధారం. మనోజ్, రంజిత్ పదోతరగతి, రాధాకృష్ణ, వెంకట్రావు ఇంటర్మీడియెట్, భువనసాయి ఏజీబీఎస్సీ చదువుతున్నారు. మృతదేహాలకు వాగువద్దే పోస్ట్‌మార్టం నిర్వహించారు. సమాచారం తెలిసిన వెంటనే అధికారులను అప్రమత్తం చేసిన పోలవరం ఎమ్మెల్యే తెల్లం బాలరాజు బాధిత కుటుంబాలను పరామర్శించి, అంత్యక్రియల నిమిత్తం కుటుంబానికి రూ.5 వేల వంతున ఆర్థికసాయం అందించారు. ఎస్పీ నారాయణనాయక్ కూడా ఘటనాస్థలాన్ని పరిశీలించి వివరాలు తెలుసుకున్నారు. తక్షణం స్పందించిన సీఎం వసంతవాడ వాగు ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించింది. మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.3 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇస్తున్నట్లు ఉప ముఖ్యమంత్రి, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్ల నాని ప్రకటించారు. వాగులో మునిగి ఆరుగురు మృతిచెందిన విషయం తెలిసిన వెంటనే పోలవరం ఎమ్మెల్యే బాలరాజుతో మాట్లాడిన ఆళ్ల నాని ఆ కుటుంబాల పరిస్థితిని సీఎం దృష్టికి తీసుకువెళ్లారు. దీంతో ఆరు కుటుంబాలకు మూడు లక్షల రూపాయల చొప్పున ఎక్స్‌గ్రేషియా అందించాలని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించారు. బాధితులకు గురువారం మూడులక్షల రూపాయల చెక్కులను ఇస్తామని, ఆ కుటుంబాలకు అండగా ఉంటామని ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని చెప్పారు. -
కరోనాను జయించిన 95 ఏళ్ల వృద్ధుడు
వేలేరుపాడు: పశ్చిమగోదావరి జిల్లా వేలేరుపాడు మండలంలో ఓ 95 ఏళ్ల వృద్ధుడు కరోనా వైరస్‌ను జయించారు. జగన్నాథపురం గ్రామానికి చెందిన వృద్ధుడు షేక్ అబ్దుల్లాకు గత నెల 22న జ్వరం, ఆయాసం రావడంతో కుటుంబసభ్యులు వేలేరుపాడు ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. కరోనా లక్షణాలు ఉన్నట్లు అనుమానం వచ్చి పరీక్ష చేయగా పాజిటివ్ వచ్చింది. దీంతో ఏలూరులోని ఆశ్రం ఆస్పత్రికి తరలించారు. అక్కడి వైద్యులు ఆయనకు మరింత మెరుగైన చికిత్స అందించారు. దీంతో వృద్ధుడు కోలుకున్నారు. ఈ నెల 31న డిశ్చార్జ్ చేశారు. -
ఇళ్లు పోయాయ్.. కన్నీళ్లూ ఇంకిపోయాయ్!
ప్రస్తుతం మైదాన ప్రాంతాల్లోనే చలి తీవ్రంగా ఉంది. జనాన్ని వణికించేస్తోంది. ఇక ఏజెన్సీ, గిరిజన ప్రాంతాల్లో ఇంకెలా ఉంటుంది? ఊహించడానికే కష్టం. ఎముకలు కొరికే చలి చంపేస్తోంది. ఈ చలిలో కనీసం ఉండడానికి గూడు లేక ఆ రెండు గ్రామాల ప్రజలు అల్లాడుతున్నారు. అయినా ప్రభుత్వంలో చలనం లేదు. ఆ గ్రామాలకు ఇవ్వాల్సిన నష్టపరిహారం.. వసతుల కల్పనపై నోరుమెదపడం లేదు. ఫలితంగా అక్కడి గిరిజనం పిల్లాపాపలతో అష్టకష్టాలు పడుతున్నారు. వేలేరుపాడు: పశ్చిమగోదావరి జిల్లా వేలేరుపాడు మండలంలో పెదవాగు వెంట ఉన్న కమ్మరిగూడెం, అల్లూరినగర్ గ్రామాల్లో మొత్తం 335 గిరిజన కుటుంబాలున్నాయి. గత ఏడాది ఆగస్టు 18న తెలంగాణలోని అశ్వారావుపేట మండలంలో పెదవాగు మూడుగేట్లు ఎత్తడంతో భారీగా వచ్చిన నీటి ప్రవాహానికి ఈ గ్రామాల్లో పక్కా భవనాలు మినహా 137 పూరిళ్లు కొట్టుకుపోయాయి. కమ్మరిగూడెంలో 120, అల్లూరి నగర్లో 17 ఇళ్లు కొట్టుకుపోయాయి. ఈ గ్రామాలు పెదవాగుకు అత్యంత చేరువలో ఉన్నందున వరద పోటెత్తిన సమయంలో వంట సామగ్రి, బట్టలు కూడా బయటికి తీయలేకపోయారు. ప్రాణ భయంతో కమ్మరిగూడెం వాసులు గ్రామానికి చేరువలో గుట్ట వైపు పరుగులు తీయగా.. అల్లూరినగర్ గ్రామస్తులు ఓ పక్కా భవనం పైకి ఎక్కి ప్రాణాలు కాపాడుకున్నారు. నిత్యావసర వస్తువులతోపాటు, ధాన్యం, బియ్యం, ఇతర వస్తువులన్నీ నీటి ప్రవాహంలో కొట్టుకుపోయాయి. దీంతో ఈ గ్రామస్తుల పరిస్థితి హృదయ విదారకంగా ఉంది. ఈ సంఘటన జరిగి ఐదు నెలలు దాటుతోంది. నేటివరకు ఈ గ్రామాల గిరిజనులకు ప్రభుత్వం నష్ట పరిహారం చెల్లించలేదు. ఈ గ్రామాలు పోలవరం ప్రాజెక్ట్ ముంపు పరిధిలో లేకపోయినప్పటికీ పరిహారం చెల్లించకపోవడం విమర్శలకు తావిస్తోంది. ఇళ్లు అగ్ని ప్రమాదంలో కాలిపోయినా, వరదల్లో కొట్టుకుపోయినా తక్షణమే నష్ట పరిహారం అందించాల్సి ఉంది. కానీ నేటికీ ఆ రెండు గ్రామాల గిరిజనులకు నష్టపరిహారం ఇవ్వలేదు. మొదట్లో అరకొర సాయంతో వదిలేశారు ఈ గ్రామ గిరిజనులకు వరదల సమయంలో అరకొరగా సాయం అందింది. కుటుంబానికి 20 కేజీల బియ్యం, కిరోసిన్, కందిపప్పు, మంచినూనె, రెండు దుప్పట్లు అందించి ప్రభుత్వం చేతులు దులుపుకుంది. ఇళ్లు కొట్టుకుపోయి నిలువ నీడలేక రహదారిపై ఉంటున్న గిరిజనులకు పూర్తి స్థాయిలో టార్పాలిన్ పట్టాలు కూడా ఇవ్వలేదు. కమ్మరిగూడెంలో 120 ఇళ్లు కొట్టుకుపోగా, కేవలం 35 టార్పాలిన్ పట్టాలు పంపిణీ చేసారు. అల్లూరినగర్‌లో 17 ఇళ్లకుగాను 8 పట్టాలు ఇచ్చారు. ఇంకా అనేక మందికి ఇవ్వకపోవడంతో ఒకే టార్పాలిన్ కవర్‌తో నిర్మించిన తాత్కాలిక పాకల్లో రెండు కుటుంబాల చొప్పున నివాసముంటున్నాయి. ఇళ్ల పరిహారం అందేది ఎప్పటికో? పూర్తిగా కొట్టుకుపోయిన ఇళ్లకు తక్షణమే రూ.5 వేలు, పాక్షికంగా దెబ్బతిన్న ఇళ్లకు రూ.3,200 చొప్పున ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది. రెవెన్యూ అధికారులు బాధితుల బ్యాంకు ఖాతా నెంబర్లు సేకరించారు. ఆన్లైన్లో డబ్బులు పడతాయని అధికారులు తమకు చెప్పారని, కానీ నేటివరకు పరిహారం రాలేదని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రెండు గ్రామాల్లో వ్యవసాయ శాఖ లెక్కల ప్రకారం 300 ఎకరాల్లో వరి పూర్తిగా నాశనమైంది. పొలాలు రాళ్లు తేలి, ఇసుక మేటలతో మళ్లీ సాగుకు పనికిరాకుండా పోయాయి. పంట నష్టం సర్వే పూర్తయి ఐదు నెలలైనప్పటికీ, పంట నష్టం పరిహారం నేటికీ అందలేదు. ప్రభుత్వానికి నివేదించాం ఇళ్ల పరిహారానికి సంబంధించి అన్ని వివరాలు ప్రభుత్వానికి నివేదించాం. పూర్తిగా దెబ్బతిన్న ఇళ్లకు రూ.5 వేలు, పాక్షికంగా దెబ్బతిన్న ఇళ్లకు రూ.3,200 ఇస్తాం. సాంకేతిక లోపం తలెత్తడం వల్ల నిధులు ప్రభుత్వం నుంచి విడుదల కావడంలేదు. నిధులు వస్తే బాధితులకు పంపిణీ చేస్తాం. – రవికుమార్, తహసీల్దార్ వేలేరుపాడు చలిలోనే పిల్లాపాపలతో.. చిత్రంలో కనిపిస్తున్న ఈమె పేరు సోయం కుమారి. గత ఏడాది ఆగస్టులో పెదవాగు వరద ప్రవాహానికి కమ్మరిగూడెంలోని వీరి రెండిళ్లు కొట్టుకుపోయాయి. ఆమె తండ్రి జక్కులు ఇంటితో పాటు ఈమె సొంత ఇల్లు వరదలో కొట్టుకుపోయింది. సొంతంగా ఇల్లు నిర్మించుకునే స్థోమత లేదు. ప్రభుత్వం రెండిళ్లకు కలిపి ఒక టార్పాలిన్ కవర్ ఇచ్చింది. దాంతో వేసిన చిన్న పాకలోనే æచిన్న పిల్లలతో ఆమె కుటుంబం చలిగాలికి వణుకుతూ నివాసముంటోంది. ఇళ్లు కోల్పోయినందున నష్ట పరిహారం అందించాలని వేడుకుంటోంది. కట్టుబట్టలే మిగిలాయి.. ఈమె పేరు వేటగిరి అంజమ్మ. కమ్మరిగూడెం గ్రామం. ఈమె ఇల్లు గతంలో వచ్చిన వరదకు అరమైలు దూరం కొట్టుకుపోయింది. సామాన్లు బయటికి తీయలేకపోయింది. ఒంటిమీద బట్టలే మిగిలాయి. ఇళ్లకు పరిహారం ఇవ్వక పోవడంలో ఇల్లు నిర్మించుకోలేక, టార్పాలిన్ కవర్‌తో నిర్మించిన తాత్కాలిక ఇంట్లో ఉంటూ అగచాట్లు పడుతోంది. నివాస గృహం కూలినా దిక్కులేదు ఈమె పేరు ఎన్.రమాదేవి. అల్లూరినగర్ గ్రామం. కూలికెళితే గానీ ఇల్లు గడవని నిరుపేద గిరిజన కుటుంబం. కూలికెళ్లి పైసా పైసా జమచేసి, ఇందిరమ్మ ఇంటి పథకంలో భాగంగా నిర్మించుకోగా, పెదవాగు ప్రవాహానికి అది కుప్పకూలిపోయింది. దీంతో ఐదునెలలుగా టార్పాలిన్ కవర్‌తో నిర్మించిన తాత్కాలిక ఇంట్లో నివాసముంటూ బతుకీడుస్తోంది. చీకటి కోరల్లో కాలం వెళ్లదీస్తున్న మిరియం బజారు ఈ వృద్ధురాలి పేరు మిరియం బజారు. కమ్మరిగూడెం గ్రామం. పెదవాగు వరద ప్రవాహానికి ఈమె పూరింటి పైకప్పు కూలిపోయింది. ప్రభుత్వమిచ్చిన టార్పాలిన్ కవర్నే ఇంటిపైన కప్పుకుంది. ఇంటికి కరెంట్ లేదు. ఇచ్చిన కిరోసిన్ ఎప్పుడో అయిపోయింది. దీంతో ఆమె చీకట్లో మగ్గుతూ నానా ఇబ్బందులు పడుతోంది. -
దెయ్యం భయం.. ఊరు ఖాళీ!
సాక్షి, వేలేరుపాడు: ఆ ఊరి పొలిమేరల్లో ఓ పెద్ద బండరాయి.. దాని కింద ఓ సొరంగం.. అందులో ఉడుము రూపంలో ఎర్రమారి దెయ్యం.. నిత్యం బయట సంచరిస్తుంది.. కాలక్రమేణా ఆ సొరంగం మట్టితో పూడుకుపోయింది. ఇంకేం.. ఆ దెయ్యానికి కోపం వచ్చింది.. గ్రామస్తులను బలితీసుకోవడం మొదలుపెట్టింది.. అందుకే ఆ గ్రామాన్ని వదిలి వేరే ప్రాంతానికి వెళ్లిపోయారు.. సాంకేతిక పరిజ్ఞానం కొత్తపుంతలు తొక్కుతున్నా ఇంకా ఇటువంటి మూఢాచారాలు జన జీవనాన్ని బెంబేలెత్తిస్తూనే ఉన్నాయనడానికి పశ్చిమగోదావరి జిల్లా వేలేరుపాడు మండలంలో మారుమూల గిరిజన గ్రామమైన కొర్రాజులగూడెం నిలువెత్తు సాక్ష్యంగా నిలుస్తోంది. ఇళ్లను సైతం పడగొట్టారు గ్రామంలో మొత్తం 40 గిరిజన కుటుంబాలుండేవి. పెంకుటిళ్ల కాలనీలతో పాటు, మూడు మంచినీటి బోర్లు, లక్షలాది రూపాయలు వెచ్చించి రహదారి కూడా నిర్మించారు. తొమ్మిదేళ్ల కిందట పక్కా పాఠశాల భవనాన్ని కూడా నిర్మించారు. గతేడాది మరో అదనపు పాఠశాల భవనాన్ని నిర్మించారు. ఆ ఊరి పొలిమేరల్లో ఉన్న ఓ పెద్ద బండరాయి కింద ఉన్న సొరంగం రెండున్నరేళ్ల కిందట మట్టితో పూడిపోయింది. అదే ఏడాది గ్రామంలో వివిధ వ్యాధులతో కారం లక్ష్మయ్య, పరిశక లక్ష్మయ్య, బందం తమ్మయ్య, మిడియం రాములు మృతి చెందారు. మళ్లీ ఆరు నెలలకు మడివి చిన్నయ్య, కారం చిన్నక్క, సోడే రాజమ్మలు అనారోగ్యంతో మృతి చెందారు. ఇంకేముంది దీనికి ఎర్రమారి దెయ్యం ఆగ్రహమే కారణమని భయపడిన గ్రామస్తులు ఊరుని ఖాళీచేసి వెళ్లిపోయారు. గ్రామంలోని 30 పెంకుటిళ్లను సైతం పడగొట్టి.. కిలోమీటర్ దూరంలోని తారురోడ్డు ప్రాంతంలో పూరిగుడిసెలు నిర్మించుకున్నారు. అందుకే బలితీసుకుంటోంది.. ‘మా గ్రామంలో దెయ్యం ఉన్న సొరంగం మట్టితో పూడిపోవడంతో అది ఆగ్రహించి మా ఊరివాళ్లను బలితీసుకుంది’ అని ఆ గ్రామ పెద్దకాపులు తెల్లం సాయిబు, సోడే ముత్యాలు, కారం గంగులు ‘సాక్షి’తో చెప్పారు. అందువల్లనే ఊరు ఖాళీ చేశామని, ఇప్పుడు తమకు ప్రశాంతంగా ఉందన్నారు. గతంలో ఊరు అక్కడున్నప్పుడు 46 మంది విద్యార్థులు ప్రాథమిక పాఠశాలలో చదువుకునేవారు. గ్రామస్తులు కొత్తగా ఇళ్లు నిర్మించుకున్న ప్రాంతానికి అరకిలో మీటర్ దూరంలో ఉన్న ఈ పాఠశాలకు విద్యార్థులు వెళ్లకపోవడంతో ప్రభుత్వం మూసేసింది. దీంతో కొర్రాజులగూడేనికి చెందిన 18 మంది విద్యార్థులు కాలినడకన కిలోమీటరు దూరంలో ఉన్న చాగరపల్లి పాఠశాలకు వెళ్తున్నారు. బతుకుజీవుడా అంటూ బయటపడ్డాం.. ఆ దెయ్యం వల్ల మా వాళ్లను కోల్పోయాం. ఇంకా అక్కడే ఉంటే మమ్మలికూడా ఆ అది మింగేసేదే. అందుకే బతకుజీవుడా అంటూ అక్కడి నుంచి వెళ్లిపోయాం. వేరే చోట కొత్త ఇళ్లు కట్టుకున్నాం. ఇప్పుడు ప్రశాంతంగా ఉంది. – కణితి శ్రీరాములు కొర్రాజులగుడెం గ్రామస్తుడు నన్నూ భయపెట్టారు.. ఈ పాఠశాలలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌గా పనిచేయడానికి ఇక్కడకొచ్చాను. ‘మీరు పాఠశాలకు ఎలా వెళుతున్నారు.. అక్కడ దెయ్యం ఉంది’ అంటూ నన్ను భయపెట్టారు. మొదట్లో కొంత భయపడ్డాను. తర్వాత నెమ్మదిగా భయం వీడి పాఠశాలకెళ్లాను. తర్వాత పాఠశాలను ప్రభుత్వమే మూసేసింది. ఇక్కడి విద్యార్థులను కిలోమీటరు దూరంలోని చాగరపల్లి పాఠశాలలో విలీనం చేశారు. ప్రస్తుతం చాగరపల్లి పాఠశాలలో పర్మినెంట్ ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్నా. కొర్రాజులగూడెం విద్యార్థులు ఇక్కడికి వస్తున్నారు. – గుజ్జా శిరీష, అకడమిక్ ఇన్స్ట్రక్టర్ -
తల్లీ బిడ్డల ఆత్మహత్యాయత్నం
పశ్చిమగోదావరి జిల్లా : కుక్కునూరు మండలం రావికుంట గ్రామంలో ఓ మహిళ తన ఇద్దరు బిడ్డలతో కలిసి ఆత్మహత్యాయత్నానికి పూనుకుంది. గ్రామానికి చెందిన కృష్ణకుమారి సోమవారం తన భర్తతో బైక్ విషయంలో గొడవపడింది. భర్త తన మాట వినకపోవడంతో మనస్తాపంతో పురుగుల మందు తన పిల్లలకు తాగించి తర్వాత తానూ తాగింది. అప్రమత్తమైన స్థానికులు తల్లి సోమరాజు కృష్ణ కుమారి(25)తో పాటు ఆమె ఇద్దరు పిల్లలు రుతిక్(2), స్వప్నిక(3)లను దగ్గరలోని వేలేరుపాడు ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై స్థానికుల సమాచారం మేరకు పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకుని విచారణ జరుపుతున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
చేతబడి అనుమానంతో..
కత్తిపీటతో పొట్ట కోసుకున్న గిరిజనుడు వేలేరుపాడు మండలంలో ఘటన ఆలస్యంగా వెలుగుచూసిన వైనం జంగారెడ్డిగూడెం/వేలేరుపాడు : రాకెట్ యుగంలో కూడా మూఢ నమ్మకాలను ఇంకా గిరిజనులు వదలలేకపోతున్నారు. మూఢ నమ్మకాలతో ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. ఇటువంటి ఘటనే వేలేరుపాడు మండలంలో ఎర్రబోరులో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గ్రామానికి చెందిన కారం వెంకటేశ్వరరావు కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. కడుపులో నొప్పిరావడంతో భయాందోళనకు గురయ్యాడు. ఈ క్రమంలో మూఢ నమ్మకాలకు ప్రభావితమైన వెంకటేశ్వరరావు తనకు ఎవరో చేతబడి చేయించారనే అనుమానంతో భయానికి గురయ్యాడు. కడుపులో ఎలుకలు తిరుగుతున్నట్టు, పురుగులు ఉన్నట్టు అనిపిస్తూ ఉండేదని కుటుంబ సభ్యులకు తెలిపేవాడు. అలా ఉండటానికి కారణం తనకు ఎవరో చేతబడి చేసేవారని అనుమానం మరింత పెంచుకున్నాడు. అందువల్లే కడుపులో ఎలుకలు, పురుగులు ఉన్నట్టు భావించి ఈ నెల 6న ఇంట్లో ఉన్న కత్తిపీటతో కడుపును అడ్డంగా కోసేసుకున్నాడు. ఇది గమనించిన అతని సోదరులు సతీష్, శివశంకర్‌లు హుటాహుటిన సమీపంలోని వేలేరుపాడు ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యులు ప్రాథమిక చికిత్స చేసి మెరుగైన వైద్యం కోసం జంగారెడ్డిగూడెం రిఫర్ చేశారు. ప్రస్తుతం జంగారెడ్డిగూడెం ఏరియా ఆసుపత్రిలో వెంకటేశ్వరరావు చికిత్స పొందుతున్నాడు. తమ సోదరుడు వెంకటేశ్వరరావు చేతబడి అనుమానంతోనే కత్తిపీటతో కడుపును కోసేసుకున్నాడని సతీష్ వెల్లడించాడు. చికిత్స అనంతరం వెంకటేశ్వరరావు కోలుకుంటున్నాడని వారు తెలిపారు. -
అరణ్య ఘోష
నిర్వాసితుల గొంతు వినిపించే నాథుడేరి..? ఎన్నుకున్న ప్రతినిధులు తెలంగాణలో విలీనమైనా పట్టించుకోని జిల్లా నేతలు ప్రభుత్వానికి వెతలెలా విన్నవించాలి పోలవరం నిర్వాసితుల ఆవేదన వేలేరుపాడు: ’ఎవరికి పుట్టిన బిడ్డరా ఎక్కెక్కి ఏడుస్తోంది..’ అన్నట్లు వేలేరుపాడు, కుక్కునూరు మండలాల్లోని పోలవరం గిరిజన, గిరిజనేతర నిర్వాసితుల ఆక్రందనలు అరణ్య ఘోషగా మిగిలిపోతున్నాయి. రాష్ట్ర విభజన జరిగినప్పుడు అనేక కష్ట, నష్టాలను ఈ ప్రాంత ప్రజలు ఎదుర్కొన్నారు. విభజన అనంతరం ఆంధ్రప్రదేశ్‌లోని పోలవరం ముంపు పరిధిలోకి వచ్చి చేరారు. ఇప్పటికే అన్ని విధాలా నష్టపోతూ వస్తున్న నిర్వాసితులకు తమ గోడు ప్రభుత్వానికి విన్పించే సొంత గొంతు లేకుండా పోయింది. పోలవరం ముంపు ప్రాంతంలో ఉన్న వేలేరుపాడు, కుక్కునూరు మండలాల్లో ప్రాదేశిక ఎన్నికలు జరగలేదు. తెలంగాణలో ఉన్న తమ ప్రాంతాన్ని ఆంధ్రాలో కలపాలని కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని నిరసిస్తూ రాజకీయాలకతీతంగా అన్ని పార్టీలు అప్పట్లో ఏకమయ్యాయి. తమ గోడు రాష్ట్రపతి, గవర్నర్ ఎన్నికల కమిషన్ వరకు తీసుకు వెళ్లాలని, రెండు మండలాల్లో ఎన్నికలను బహిష్కరించారు. దీంతో పూర్తిగా ఎన్నికలు రద్దయ్యాయి. ఈ రెండు మండలాల్లో మొత్తం 32,513 మంది ఓటర్లు ఎన్నికలకు దూరమయ్యారు. కుక్కునూరు మండలంలో 18,272, వేలేరుపాడు మండలంలో 14,241 మంది ఓటర్లున్నారు. మొత్తం రెండు జడ్పీటీసీ, 15 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరగలేదు. కుక్కునూరు మండలంలో జడ్పీటీసీ, ఎనిమిది ఎంపీటీసీ స్థానాలకు అసలు నామినేషన్లు వేయకుండానే ఎన్నికలను బహిష్కరించారు. వేలేరుపాడు మండలంలో ఏడు ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరగలేదు. దీని ఫలితంగా ఈ ప్రాంత నిర్వాసితులకు అధికారులే దిక్కయ్యారు. ఈ ప్రాంత నిర్వాసితులు ఏ సమస్య పరిష్కారం కోసం అధికారుల దగ్గరకు వెళ్లినా ప్రభుత్వం వద్ద తేల్చుకోమని చెబుతున్నందున ఏమి చేయాలో పాలుపోక దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. ముంపు మండలాలను వదిలేసిన తెలంగాణ ఎంపీ, ఎమ్మెల్యేలు... విభజనకు ముందు ఈ రెండు మండలాలు తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం పార్లమెంట్ పరిధిలో ఉండేవి. అశ్వారావుపేట నియోజకవర్గ ఎమ్మెల్యేగా అప్పట్లో తాటి వెంకటేశ్వర్లుకు ఓట్లు వేసి ఇక్కడి ప్రజలు గెలిపించారు. తాటికి వేలేరుపాడు సొంత మండలం కావడంతో మెజార్టీ కూడా లభించింది. ఖమ్మం ఎంపీగా పొంగులేటి శ్రీనివాసరెడ్డిని ఈ రెండు మండలాల ప్రజలే ఎక్కువ మెజార్టీతో గెలిపించారు. విభజన అనంతరం వీరిద్దరు ఈ మండలాలను తమకు సంబంధం లేనట్లు వదిలేశారు. అప్పట్లో వీరిద్దరు వైసీపీ తరుపున గెలుపొందినప్పటికీ ప్రస్తుతం టీఆర్ఎస్లో చేరారు. మూడేళ్లలో ఒకసారి మండలాల కొచ్చిన కలెక్టర్ భాస్కర్... ఈ రెండు మండలాలు ఆంధ్రప్రదేశ్‌లో విలీనమైన మూడేళ్లలో కలెక్టర్ కాటంనేని భాస్కర్ వేలేరుపాడు, కుక్కునూరు మండలాలకు ఒక్కసారి మాత్రమే విచ్చేశారు. అది కూడా ఏలూరు ఎంపీ మాగంటి బాబు, పోలవరం ఎమ్మెల్యే మిడియం శ్రీనివాసరావు వెంట పర్యటించారు. ఆ తర్వాత ఈ మండలం వైపు కన్నెత్తి చూడలేదు. ‡ పట్టించుకోని పశ్చిమ ఎంపీ, ఎమ్మెల్యేలు... విభజన అనంతరం ఈ రెండు మండలాలు పశ్చిమగోదావరి జిల్లాలో కలిపారు. ఎంపీ వచ్చేటప్పటికి ఏలూరు, అసెంబ్లీ స్థానం పోలవరం పరిధిలో చేరారు. విలీనమయ్యాక ఈ రెండు మండలాల్లో ఏలూరి ఎంపీ మాగంటి బాబు ఒకసారి, పోలవరం ఎమ్మెల్యే మిడియం శ్రీనివాసరావు రెండు మూడు సార్లు వచ్చారు. ఆ తర్వాత ఈ మండలాలకు వచ్చిన దాఖలాలు లేవు. మా గోడు ఎవరికి చెప్పుకోవాలి? పొంగులూరి సాంబశివరావు, నిర్వాసిత రైతు, వేలేరుపాడు మాగోడు ఎవరికి చెప్పుకోవాలి. మేం ఓట్లు వేసి గెలిపించుకున్న ఎంపీ, ఎమ్మెల్యేలు తెలంగాణ రాష్ట్రంలోకి వెళ్లిపోయారు. మళ్లీ మా వైపు కన్నెత్తి కూడా చూడటంలేదు. మేం అన్ని రకాలుగా నష్టపోయాం. అనాథలుగా మిగిలాం: వెంకన్నబాబు, రైతు, తాట్కూరుగొమ్ము, వేలేరుపాడు మండలం తెలంగాణ ప్రభుత్వం మమ్మల్ని వదిలేసింది. మా మండలాలను పూర్తిగా ఆంధ్రాలో విలీనం చేసినా, పశ్చిమగోదావరి జిల్లా ఎంపీగానీ, ఎమ్మెల్యే గానీ మా సమస్యలు పట్టించుకోవడంలేదు. అనాథలుగా బతకాల్సిన దుస్థితి మా కొచ్చింది. మా గొంతు వినిపించే వారే కరువయ్యారు పూరెం లక్ష్మయ్య, మాజీ ఎంపీపీ పోలవరం ప్రాజెక్టు వల్ల ఈ ప్రాంత ప్రజలు ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నారు. అధికారుల దగ్గరకు వెళితే, ప్రభుత్వంతో మాట్లాడుకోమంటారు. ఎవరికి చెప్పుకోవాలి -
విలీన మండలాలకు ఎన్నికలు
సాక్షి ప్రతినిధి, ఏలూరు : తెలంగాణ నుంచి మన జిల్లాలో విలీనమైన వేలేరుపాడు, కుక్కునూరు మండలాల్లో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల సంఘం ముహూర్తం ఖరారు చేసింది. రెండు జెడ్పీటీసీ స్థానాలు, 14 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికల తేదీలను ప్రకటించింది. వీటితోపాటు పెరవలి మండలం తీపర్రు ఎంపీటీసీ స్థానానికి కూడా ఎన్నిక జరగనుంది. వేలేరుపాడు, కుక్కునూరు జెడ్పీటీసీ స్థానాలకు, వేలేరుపాడులోని మేడిపల్లి, కాటుకూరు, నర్లవరం, తట్కూరుగొమ్ము, భూదేవిపేట, రేపాకగొమ్ము, రామవరం ఎంపీటీసీ స్థానాలకు, కుక్కునూరులోని అమరవరం, దామరచర్ల, మాధవరం, వింజరం, కివ్వాక, కుక్కునూరు–1, కుక్కునూరు–2, దాచారం ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ మేరకు సోమవారం నోటిఫికేషన్ వెలువడింది. ఈ నెల 5న రిటర్నింగ్ అధికారులు ఎన్నికల నోటీసు జారీ చేస్తారు. 5 నుంచి 8వ తేదీ వరకూ నామినేషన్లు స్వీకరిస్తారు. 9న స్కూృట్నీ చేస్తారు. తిరస్కరించిన నామినేషన్లను అభ్యర్థులు మరోసారి పరిశీలన కోసం 10న అప్పీల్ చేసుకోవచ్చు. 11న ఆప్పీళ్లపై విచారణ చేపడతారు. నామినేషన్ల ఉపసంహరణకు 12వ తేదీ వరకు గడువు విధించారు. 21న పోలింగ్ నిర్వహిస్తారు. ఒకవేళ రీ పోలింగ్ జరపాల్సి వస్తే 22న చేపడతారు. 23వ తేదీన కౌంటింగ్ జరుగుతుందని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ డాక్టర్ ఎన్ .రమేష్‌కుమార్ తెలిపారు. ఎన్నికల నోటిఫికేషన్ వెలువడటంతో కుక్కునూరు రెవెన్యూ డివిజన్, పెరవలి మండలంలో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. -
పురుగుమందు తాగి గిరిజనుడి ఆత్మహత్య
వేలేరుపాడు : మండలంలోని చాగరపల్లి గ్రామానికి చెందిన మిరియాల బాబూరావు (35) శనివారం పురుగుమందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసుల కథనం ప్రకారం.. గిరిజనుడు బాబూరావు కొడుకు ఏడాదిగా వింతవ్యాధితో బాధపడుతున్నాడు. అప్పులు చేసి అతనికి హైదరాబాద్‌లోని కార్పొరేట్ ఆస్పత్రిలో ఆపరేషన్ కూడా చేయిం చాడు. అయితే జబ్బు నయం కాకపోవడంతో వైద్యులు మళ్లీ ఆపరేషన్ చేయాలన్నారు. దీంతో అంతగా ఆర్థిక స్తోమత లేని బాబూరావు తీవ్రంగా మనస్థాపం చెంది శనివారం ఉదయం ఇంట్లో పురుగుమందు తాగాడు. అతనిని కుటుంబ సభ్యులు వేలేరుపాడు ప్రాథమిక ఆరోగ్యకేంద్రానికి తరలిం చారు. అప్పటికే పరిస్థితి విషమించడంతో బాబూరావు మృతి చెందాడు. వేలేరుపాడు ఎస్ఐ రామచందర్‌రావు కేసు నమోదుచేసి దర్యాప్తుచేస్తున్నారు. -
విలీనమైనా విలువేది!
ఏలూరు (మెట్రో) : ఉమ్మడి రాష్ట్రం విడిపోవడంతో ఆంధ్రప్రదేశ్‌లో విలీనమై.. మన జిల్లాలో అంతర్భాగమైన కుక్కునూరు, వేలేరుపాడు మండలాలను సర్కారు చిన్నచూపు చూస్తోంది. ఆ రెండు మండలాల అభివృద్ధిని ప్రభుత్వ శాఖలు పట్టించుకోవడం లేదు. అధికారులు సైతం ఆ మండలాల వైపు కన్నెత్తి చూడటం లేదు. ప్రజారోగ్యాన్ని కాపాడాల్సిన వైద్య, ఆరోగ్య శాఖ సైతం ఇదే ధోరణితో వ్యవహరిస్తోంది. వేలేరుపాడు, కుక్కునూరు మండలాల్లో ఉంటున్న సుమారు 30వేల మంది ఆరోగ్యాన్ని కాపాడేందుకు గతంలో ఖమ్మం జిల్లా అధికారులు ప్రతి మండలంలో రెండేసి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను నెలకొల్పారు. కుక్కునూరు, అమరవరం, వేలేరుపాడు, కొయిదా ప్రాంతాల్లో వీటిని ఏర్పాటు చేసి ఆయా మండలాల పరిధిలోని ప్రజలకు వైద్యసేవలు అందించే ఏర్పాటు చేశారు. ఆ రెండు మండలాలు జిల్లాలో విలీనం అయ్యాక అక్కడి ప్రజలకు వైద్య సేవలు అందించేందుకు జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు వెనుకాడుతున్నారు. ఎందుకీ వివక్ష! పూర్వ జిల్లాలోని 46 మండలాల్లో 175 పీహెచ్‌సీలతోపాటు వేలేరుపాడు, కుక్కునూరు మండలాల్లో మరో 4 పీహెచ్‌సీలు కలిపి మొత్తం 179 పీహెచ్‌సీలు ఉన్నాయి. ప్రతి పీహెచ్‌సీకి ఏటా రూ.1.75 లక్షల చొప్పున ఆస్పత్రి అభివృద్ధి నిధులను జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ కేటాయిస్తుంది. ఇందులో రూ.లక్షను ఆస్పత్రి అభివృద్ధికి, రూ.50 వేలను ఆస్పత్రుల్లో కనీస సౌకర్యాలు కల్పించేందుకు, రూ.25 వేలను పారిశుధ్యం మెరుగుదలకు ఉపయోగించాల్సి ఉంటుంది. పూర్వ జిల్లాలోని 175 పీహెచ్‌సీలకు ఈ మొత్తాలను కేటాయించినా.. వేలేరుపాడు, కుక్కునూరు మండలాలకు ఒక్క రూపాయి కూడా విదల్చలేదు. -
పాఠకుల హృదయం పెద్దది...
సాక్షి ఎఫెక్ట్ పశ్చిమగోదావరి జిల్లా వేలేరుపాడు మండలం సంతపాకలకు చెందిన ముర్తిపేట చిట్టెమ్మ కన్నీటి కథ గురించి అక్టోబర్ 27న ఫ్యామిలీ పేజీలో వెలువరించిన కథనం- ‘మీకు పుణ్యం ఉంటుంది!’ పాఠకుల్లో విశేష స్పందన తీసుకు వచ్చింది. సాటి మనిషి కష్టంలో ఉంటే స్పందించే హృదయం తెలుగువారికి ఉంది అని నిరూపించింది. రెండు తెలుగు రాష్ట్రాల నుంచే కాక కేరళ, తమిళనాడు, మహారాష్ట్ర, జమ్ము కాశ్మీర్ల నుంచి కూడా అక్కడి తెలుగువారు సహాయం చేయడానికి ముందుకు వచ్చారు. అమెరికా, అస్ట్రేలియా, ఖతర్, సౌదీ అరేబియా, దుబాయ్, కొవైట్, సింగపూర్ తదితర ఆవలి సీమల దాతలు స్పందించి చేయూతనందించారు. వీరందరి స్పందన వలన ఇప్పటి వరకూ చిట్టెమ్మ ఖాతాలో 8 లక్షల 56 వేల రూపాయలు జమ అయ్యాయి. నగదుగా వచ్చిన సొమ్ము కాకుండా చెక్‌ల రూపంలో పోస్టు ద్వారా ఇంకా ఆర్థిక సాయం అందనుంది. అనేక మంది నిత్యావసర వస్తువులు, దుస్తులు కూడా పంపిణీ చేసారు. చిట్టెమ్మ పిల్లలను చదివించేందుకు దాతలు ముందుకు రాగా, మరికొందరు వైద్యం చేయించేందుకు, ఇంకొందరు కుటుంబాన్ని దత్తత తీసుకునేందుకు ముందుకు వచ్చారు. చిట్టెమ్మ కుటుంబానికి నెలవారి ఆర్ధిక సహాయం అందించడానికి కూడా దాతలు ముందుకు వచ్చారు. అమెరికాలో ఉంటున్న శ్రీధర్ ప్రతి నెలా 5000, నాగరాజు నెలకు 4000, బెంగళూరుకు చెందిన రాజేష్ గౌడ్ వెయ్యిరూపాయలు, చిత్తూరు జిల్లాకు చెందిన జయరామిరెడ్డి అనే ఉపాధ్యాయుడు నెలకు వెయ్యిరూపాయలు, పశ్చిమగోదావరి జిల్లా నర్సాపురంకు చెందిన విశ్వనాధశాస్త్రి నెలకు వెయ్యి రూపాయలు, ఆమె వైద్య ఖర్చులకు పంపుతామని ముందుకొచ్చారు. ఈ దాతల స్పందన చూశాక ఇంతకాలం ఆకలితో అలమటించిన ఆ తల్లీ పిల్లల ఆనందానికి హద్దులు లేవు. చిట్టెమ్మ ఆత్మస్థైర్యం పుంజుకుంది. ఇల్లు బంధువుల రాకపోకలతో సందడిగా మారింది. సాక్షి పేపర్‌కు జీవితాంతం రుణపడి ఉంటానయ్యా... నా పిల్లల పెంపకంపై నాకున్న దిగులు తొలిగిపోయింది. నా పిల్లల బాధ్యతలు పూర్తి అయ్యేంతవరకు... ఇక నేను బతుకుతా... అంటూ ఎంతో ఆశతో చెప్పింది చిట్టెమ్మ. - ఎం.ఏ సమీర్, సాక్షి, వేలేరుపాడు -
ఇంజినీరింగ్ విద్యార్థి ఆత్మహత్య
వేలేరుపాడు :వేలేరుపాడు మండలంలోని రుద్రమకోట గ్రామానికి చెందిన కొత్తపల్లి లక్ష్మిసాయి(23) అనే బీటెక్ మెకానికల్ ఫైనలియర్ చదువుతున్న విద్యార్థి కళాశాల హాస్టల్ గదిలో ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం గంగారం సాయిస్ఫూర్తి ఇంజినీరింగ్ కళాశాలలో గురువారం చోటు చేసుకుంది. సత్తుపల్లి పట్టణ సీఐ యు.వెంకన్నబాబు కథనం ప్రకారం.. గురువారం కొత్తపల్లి లక్ష్మిసాయి కళాశాల హాస్టల్ గదిలో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. గదిలో గడిపెట్టుకొని ఫ్యాన్‌కు దుప్పటితో ఉరి వేసుకొని వేలాడుతుండటంతో స్నేహితులు గుర్తించి తలుపు పగులగొట్టి లక్ష్మిసాయిని కిందకు దింపారు. కొన ఊపిరితో ఉన్నాడనే ఆశతో హుటాహుటిన సత్తుపల్లి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మృతుని వద్ద ఆత్మహత్యకు పాల్పడినట్టు లేఖ కూడా లభించింది. నా కొడుకును చంపేశారు : తండ్రి ఆరోపణ నా ఒక్కగాను ఒక్క కొడుకును ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకున్నాం.. లక్షలు ఖర్చుపెట్టి చదివిస్తున్నాం..ఈవ్‌టీజింగ్ చేసి, నా కొడుకును చంపి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని, తండ్రి కొత్తపల్లి నర్సింహారావు(బాబు) విలపిస్తూ చెప్పారు. బుధవారం రాత్రి హాస్టల్లో ఘర్షణ జరిగిందని.. ఎవరో కావాలని నా కొడుకును చంపేసి ఉరి వేసుకున్నట్టు నమ్మిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉదయం తొమ్మిది గంటల సమయంలో మృతిచెందితే ఒంటిగంటకు కూడా సమాచారం ఇవ్వలేదని.. నిర్లక్ష్యంగా వ్యవహరించారని సత్తుపల్లి సీఐ వెంకన్నబాబుతో వాగ్వాదానికి దిగారు. ఉరి వేసుకుంటే నాలుక బయటకు వస్తుందని.. అలా ఏమీ కన్పించటం లేదంటూ ఆరోపించారు. ఉరి వేసుకుంటే పోలీసులు వచ్చేవరకు మృతదేహాన్ని ఉంచకుండా హడావుడిగా ఆస్పత్రికి తరలించటంలో ఆంతర్యమేమిటని నిలదీశారు. ఉద్రిక్తత.. రాస్తారోకో.. లక్ష్మిసాయి మృతిపై అనుమానాలు ఉన్నాయంటూ బంధువులు, కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. అదే సమయంలో ఆస్పత్రికి వచ్చిన కళాశాల ప్రిన్సిపాల్ సీహెచ్ విజయ్‌కుమార్‌తో ఘర్షణకు దిగారు. ఆస్పత్రి ఆవరణలో ఉదిక్త వాతావరణం నెలకొంది. ఆస్పత్రికి తరలించిన మృతదేహాన్ని పోస్టుమార్టం చేయకుండా అడ్డుకున్నారు. సమగ్ర విచారణ నిర్వహించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని సత్తుపల్లి రాష్ట్రీయ రహదారిపై రాస్తారోకో చేశారు. అక్కడకు చేరుకున్న సీఐ వెంకన్నబాబు ఆందోళనకారులకు నచ్చచెప్పటంతో రాస్తారోకో విరమించారు. -
బడా బాబులకే పోలవరం
వేలేరుపాడు: ఆంధ్రాలోని బడా పారిశ్రామిక వేత్తల ప్రయోజనాల కోసమే పోలవరం ముంపు మండలాల విలీన ఆర్డినెన్స్‌ను కేంద్ర సర్కారు తీసుకొచ్చిందని రాష్ట్ర మానవ హక్కుల వేదిక ప్రధాన కార్యదర్శి విఎస్.కృష్ణ విమర్శించారు. లక్షలాది మంది ఆదివాసీల జీవితాలను, వారి సంస్కృతీ సాంప్రదాయాలను నిలువునా ముంచుతున్న ఈ ప్రాజెక్టు దేశంలోనే అత్యంత దుర్మార్గమైనదని అన్నారు. పోలవరం ప్రాజెక్టుకు వ్యతిరేకంగా గిరిజన సంక్షేమ పరిషత్ ఆధ్వర్యంలో సోమవారం ఇక్కడ భారీ ప్రదర్శన, తహశీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా జరిగింది. ధర్నానుద్దేశించి విఎస్.కృష్ణ మాట్లాడుతూ.. ముంపు ప్రజల మనోభావాలు తెలుసుకోకుండా వారి ప్రాంతాలను ఆంధ్రాలో విలీనం చేయడం దారుణమన్నారు. పోలవరం ప్రాజెక్టును మానవ హక్కుల వేదిక మొదటి నుంచి వ్యతిరేకిస్తోందన్నారు. పోలవరానికి వ్యతిరేకంగా ముంపు ప్రాంత ప్రజలు ఆంధ్రాలో కూడా పోరాడాలని కోరారు. ఆదివాసీల పోరాటాలకు తమ వేదిక సంపూర్ణ మద్దతు ఉంటుందన్నారు. హైకోర్టు న్యాయమూర్తి పల్లా త్రినాధరావు మాట్లాడుతూ.. పోలవరం ప్రాజెక్టుతో లాభాల కన్నా నష్టాలే ఎక్కువగా ఉన్నాయన్నారు. దీని పై సుప్రీంకోర్టులో అనేక కేసులు పెండింగులో ఉన్నాయన్నారు. ఇవన్నీ ఒక కొలిక్కి రాకుండా నే పనులు చేపట్టడం విచారకరమన్నారు. గిరిజన సంక్షేమ పరిషత్ రాష్ట్ర కన్వీనర్ సోందె వీరయ్య మాట్లాడుతూ.. ఆదివాసీలను పోలవరం ప్రాజెక్టుకు బలిచ్చి, తెలంగాణ సాధించుకున్నారని ధ్వజమెత్తారు. తెలంగాణ ఏర్పాటు తరువాత ‘ముంపు’ సమస్యను తెలంగాణ ఉద్యమకారులు విస్మరించారని విమర్శించారు. ‘‘ఆంధ్రాలో తాడిపుడి, పుష్కర, చాగల్నాడు తదితర ఎత్తిపోతల పథకాల ద్వారా నాలుగు లక్షల ఎకరాల్లో రెండు పంటలు పండుతున్నారుు. మిగిలిన మూడులక్షల ఎకరాలకోసం రెండులక్షల మంది ఆదివాసీలను జల సమాధి చేయడం అనాగరికం’’ అని అన్నారు. పోలవరానికి వ్యతిరేకంగా జాతీయస్థాయిలో అవిశ్రాంత పోరాటం సాగిస్తామన్నారు. న్యూడెమోక్రసీ జిల్లా నాయకుడు కెచ్చెల రంగారెడ్డి మాట్లాడుతూ.. జిల్లాలో 100 కిలోమీటర్ల దూరాన పారుతున్న గోదావరి నీటిపై ఇక్కడి ఆదివాసీలకు హక్కు లేకుండా చేసేందుకే ముంపు మండలాలను ఆంధ్రాలో కలిపారని విమర్శించారు. ఈ ప్రదర్శన, సభలో ఏఆర్ఎస్ రాష్ట్ర అధ్యక్షుడు కీసరు బజారు, న్యూడెమోక్రసీ నాయకులు గోకినేపల్లి వెంకటేశ్వర్లు, ఎస్కె.గౌస్, గడ్డాల. ముత్యాల్రావు, గిరిజన నాయకులు ఆదినారాయణ, నవీన్, న్యాయవాది పాయం సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. -
దీని దుంప తెగ
వేలేరుపాడు: పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం వల్ల గిరిజనుల సంసృతీ సంప్రదాయాలతో పాటు నాగరికత, ఆహారపు అలవాట్లకు ముప్పు ఏర్పడనుంది. అడవిలో లభించే కందమూలాలు, దుంపలు, వివిధ రకాల పండ్ల వంటివి తుడిచిపెట్టుకుపోనున్నాయి. అడవితో వారికున్న అనుబంధం, సీజనల్ వారీగా వారికి లభించే సహజసిద్ధ ఆహారం ఇక మీదట వారికి దూరం కానుంది. ఇష్టమైన చేపలవేట, బొంగు చికెన్ వంటి వాటికి కూడా గిరిజనులు నోచుకోకుండా పోతున్నారు. వెదురు బియ్యం.. బొంగు చికెన్‌కు ‘ముంపు’ అడవిలో దొరికే వెదురు బియ్యం గిరిజనులకు ఎంతో బలవర్ధకమైన ఆహారం. వెదురు ముదురు పిడియాలకు మాత్రమే బియ్యం వస్తాయి. పూతరూపంలో వచ్చి, గింజలు బయటికి వస్తాయి. వీటిని దంచుకొని అన్నం వండుకొని తింటారు. ఈ అన్నం తింటే సంతానం ప్రాప్తిస్తుందని గిరిజనులు చెబుతున్నారు. అంతేకాక వెదురు పిడియంతో బొంగుచికెన్ కూడా తయారుచేసుకొని తింటారు. ఏదైనా మాంసాన్ని పచ్చివెదురు పిడియం( గొట్టం)లో నింపుతారు. దానిని మంటలో వేసి కాలుస్తారు. వేడి వల్ల పిడియంలో మాంసం ఉడుకుతుంది. ఇది చాలా రుచికరంగా ఉంటుంది. అలాగే వెదురు కొమ్ముల కూర కూడా తింటారు. ఇక చేపలవేట లేనట్టేనా...? చేపల వేటకు గిరిజనులు అధిక ప్రాధాన్యం ఇస్తారు. ఎక్కడ చేపలున్నా ఊరంతా చిన్నాపెద్ద తేడాలేకుండా అక్కడికి చేరుకొని వేట ప్రారంభిస్తారు. వారు సొంతంగా వెదురుబద్దలతో తయారు చేసిన వలలను వేటకు వాడతారు. ఎక్కువగా గ్రామాల్లో కుంటలు, చెరువులు, గోదావరి మడుగుల్లో చేపల వేట సాగిస్తారు. ఎన్ని చేపలు దొరికినా సరే అందరూ సమంగా పంచుకుంటారు. బొద్దుకూర ఇక బందేనా..! అడవిలో దొరికే బొద్దుకూర తీగ, పొట్టను కూరచేసుకొని తింటారు. బొద్దుకూర తియ్యగా ఉంటుంది. అడవి పొట్ట మనం తినే మొక్కజొన్నను పోలి వుంటుంది. దీనిని ముందుగా ఒలిచి ఉడకబెట్టి, ఆ తర్వాత కూర వండుకొని తింటారు. ఇది కూడా చాలా బలమైన ఆహారంగా గిరిజనులు చెబుతున్నారు. కందమూలాలూ కనుమరుగు అటవీ ప్రాంతంలో లభ్యమయ్యే ట్యాగ, అడవి కంద, పంది దుంపలంటే గిరిజనులకు చాలా ఇష్టం. కూరగాయలన్నింటిలో ఉండే పోషకాలు ఈ దుంపల్లోనే ఉంటాయని చెబుతున్నారు. ఈ ప్రాంతంలో గిరిజనులు దుంపల అన్వేషణలో మునిగిపోతారు. ఇవి దట్టమైన అటవీ ప్రాంతంలో మాత్రమే దొరుకుతాయి. ఉడకబెట్టుకొనిగానీ, కాల్చుకొని గానీ తింటే ఆ మజాయే వేరని గిరిజనులు అంటున్నారు. ఇవి ఉదయం ఒక్కసారి తింటే ఆ రోజంతా అసలు ఆకలే కాదని, శరీరమంతా ఎంతో ఉల్లాసంగా ఉంటుందని పేర్కొంటున్నారు. తాటి, జీలుగు కల్లు తాగలేమా..? గిరిజనులు పూర్వం నుంచి తాటి వృక్షాలు పెంచడం ఆనవాయితీ. వారు సాగు చేసుకునే భూముల గట్లవెంట వీటిని పెంచుతారు. వీటి ద్వారా వచ్చే కల్లును ఇష్టంగా తాగుతారు. ఆడ, మగ, పిల్లాజెల్లా తేడా లేకుండా అంతా ఒకచోట చేరి కల్లును ఆస్వాదిస్తారు.అడవిలో దొరికే జీలుగు కల్లును కూడా ఇష్టపడతారు. కల్లు సీజన్లో ఆహారం కన్నా దీనికే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు. -
రుణమాఫీపై రెండు ప్రభుత్వాల దొంగాట
వేలేరుపాడు, న్యూస్‌లైన్: రైతుల రుణమాఫీపై ఆంధ్రా, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలు దొంగాట ఆడుతున్నాయని ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి విమర్శించారు. ఆదివారం పోలవరం ముంపు ప్రాంతాలైన వేలేరుపాడు, కుక్కునూరు, కూనవరం, వీఆర్‌పురం, భద్రాచలం మండలాల్లో ఆయన పర్యటించారు. ఆయన వెంట అశ్వారావుపేట, పినపాక ఎమ్మెల్యేలు తాటి వెంకటేశ్వర్లు, పాయం వెంకటేశ్వర్లు కూడా ఉన్నారు. వేలేరుపాడు మండలంలోని రేపాకగొమ్ము, రుద్రమకోట గ్రామాల్లో పర్యటించారు. రైతుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. రుద్రమకోట వద్ద లాంచీలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పొంగులేటి మాట్లాడారు. ప్రభుత్వాలు ఏర్పడి వందరోజులవుతున్నా రుణమాఫీపై ఇప్పటివరకు స్పష్టత ఇవ్వలేదన్నారు. తెలంగాణా రాష్ట్రంలో లక్ష వరకు మాఫీ అన్నారు...ఆంధ్రాలో లక్షన్నర అంటున్నారు...కానీ మాఫీ చేయడం లేదు...ఈ రెండు ప్రభుత్వాల తీరుతెన్నులు రైతులకు నష్టం తెచ్చిపెట్టేలా ఉన్నాయని విమర్శించారు. రాష్ట్రాల విభజన కాకముందు రైతులు ఆ ప్రాంత బ్యాంకుల్లో బంగారం పై వ్యవసాయ రుణాలు పొందారని, విభన జరిగాక బ్యాంకులు తెలంగాణలోకి వెళ్ళాయని, ఖమ్మం జిల్లాలో రుణాలు పొందిన రైతుల ప్రాంతమంతా పోలవరం ముంపు పేరుతో ఆంధ్రాలోకి కలిపారని, వీరందరికీ తెలంగాణ ప్రభుత్వమే మాఫీ చేయాలని డిమాండ్ చేసారు. ఇప్పటికైనా రుణమాఫీ విధివిధానాల పై స్పష్టత ఇచ్చి, రైతుల్ని ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ముంపు మండలాల వాసులకు ఎల్లవేళలా అండగా ఉంటా.... ‘మీరంతా ఓట్లువేసి నన్ను గెలిపించారు. మీకు ఎల్లవేళలా అండగా ఉంటా...ఆంధ్రలో కలిపినా మీరంతా తెలంగాణ బిడ్డలు...ముంపు ప్రాంతం నా సొంత కుటుంబం లాంటిది..ఏడు మండలాల ప్రజలను అన్ని విధాలా ఆదుకుంటాను’ అని శ్రీనివాసరెడ్డి భరోసా ఇచ్చారు. గత ఏడాది వచ్చిన వరదలు, తుపానులకు రైతులు తీవ్రంగా నష్టపోయినా ప్రభుత్వం నేటివరకు పంటనష్టపరిహారం అందించకపోవడం దారుణ మన్నారు. ఇటీవల వచ్చిన గోదావరి వరదలకు నష్టపోయిన రైతులకు పత్తి, మిర్చి పంటలకు ఎకరాకు 30 వేలు, వరికి 25 వేలు నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆధ్వర్యంలో రైతుసమస్యలపై గవర్నర్ నర్సింహన్‌ను కలవనున్నట్లు శ్రీనివాసరెడ్డి తెలిపారు. ముంపు ప్రాంతంలో రైతులకు మంచి ప్యాకేజీ అందేలా గవర్నర్‌కు నివేదిస్తామని పేర్కొన్నారు. ఎంపీ వెంట రేపాకగొమ్ము సర్పంచ్ కారం వెంకటరమణ, వేలేరుపాడు మండల పార్టీ కన్వీనర్ కేసగాని శ్రీనివాసగౌడ్, కామినేని వెంకటేశ్వర్లు, సత్తుపల్లి నాయకులు మట్టా దయానంద్ తదితరులు ఉన్నారు. -
ఆంధ్ర అధికారులూ.. గో బ్యాక్
వేలేరుపాడు : పోలవరం ముంపు మండలాల్లో బలవంతంగా తమ పాలన సాగించాలని చూస్తున్న ఆంధ్రా ఉన్నతాధికారులకు పరాభవం ఎదురైంది. పశ్చిమగోదావరి జిల్లా జీలుగుమిల్లిలో నిర్వహించిన సమీక్ష సమావేశానికి ముంపు మండలాల అధికారులు హాజరుకావాలని ఆ జిల్లా కలెక్టర్ కాటంనేని భాస్కర్ ఆదేశించిన విషయం తెల్సిందే. అయితే ఈ సమావేశానికి ఏ ఒక్క తెలంగాణా అధికారీ వెళ్లకపోవడంతో ఆ జిల్లా జేసీ బాబూరావునాయుడు, కోటరామచంద్రాపురం ఐటిడీఏ పీఓ టి.శ్రీనివాసరావు, రవాణ శాఖ కమిషనర్ శ్రీదేవి, ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ చంద్రశేఖర్‌బాబు, జేడీఏ సత్యనారాయణ, జెడ్పీ సీఈఓ వెంకటేశ్వర్లు, డ్వామా పీడీ రామచంద్రారెడ్డి తదితరులు శుక్రవారం వేలేరుపాడు వచ్చేందుకు యత్నించారు. అయితే వారిని పాతరెడ్డిగూడెం గ్రామం వద్ద ప్రజలు అడ్డుకున్నారు. ‘ తెలంగాణ వారే మా అధికారులు... మీరు ఆంధ్రా రాష్ట్రం వాళ్లు.. మా రాష్ట్రానికి ఎందుకొచ్చారు... ఇక్కడి నుంచి వెళ్లండి.. ముంపు ప్రాంతాలు తెలంగాణలోనే ఉన్నాయని, మా సేవలే కొనసాగుతాయని ఖమ్మం కలెక్టర్ శ్రీనివాస నరేష్ స్పష్టం చేశారు. అయినా మీరెందుకు వచ్చారు’ అంటూ నిలదీశారు. దీంతో ఆ జిల్లా అధికారులు మాట్లాడుతూ.. ‘మీ సమస్యలు పరిష్కరించడానికి వచ్చాం.. అన్ని విధాలా అండగా ఉంటాం’ అని నచ్చచెప్పే ప్రయత్నం చేశారు. వారి మాటలను ఖాతరు చేయని బాధితులు వెంటనే ఈ ప్రాంతం నుంచి వెళ్లిపోవాలంటూ పట్టుబట్టారు. దీంతో చేసేది లేక వారు అక్కడి నుంచే వెనుదిరిగారు. చిత్తయిన టీడీపీ నేతల ఎత్తులు... పశ్చిమ గోదావరి జిల్లా ఉన్నతాధికారుల వెంట ఆ జిల్లా టీడీపీ నేతలు వాహనాల్లో తరలి వచ్చారు. అధికారులకంటే ఎక్కువగా వీరే అంతా తామే అన్నట్టుగా వ్యవహరించడంతో స్థానికులు వారిపై తిరుగుబాటు చేశారు. ‘మా ప్రాంతంలో మీ పెత్తనం ఏంటి’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక అధికారులకు సమాచారం లేదు... పశ్చిమ అధికారుల రాకపై స్థానిక అధికారులకు ఎలాంటి సమాచారం లేదు. దీంతో ఇక్కడి అధికారులు ఉన్నతాధికారులను కలవలేదు. ఈ విషయమై వేలేరుపాడు తహశీల్దార్ పాపయ్యను వివరణ కోరగా, ఆ అధికారులు వస్తున్నారనే విషయం తమకు తెలియదని, అలాంటప్పుడు తామెందుకు వెళ్తామని అన్నారు. రక్షణగా వచ్చిన తెలంగాణ పోలీసులు... ఆంధ్రా ఉన్నతాధికారులకు రక్షణగా జంగారెడ్డిగూడెం సీఐతో పాటు, అశ్వారావుపేట ఎస్ఐ కిరణ్, సిబ్బంది, వేలేరుపాడు పోలీసులు పాల్గొనడం గమనార్హం. -
రామా.. కానరావా..?
వేలేరుపాడు: భద్రాద్రి పేరుచెబితే అఖిలాండ భక్తకోటి మదిలో మెదిలేది శ్రీ సీతారామచంద్రస్వామివారి కల్యాణ వైభోగమే. రామయ్య కల్యాణోత్సవానికి శ్రీకారం చుట్టేది మాత్రం మారుమూల శ్రీరామగిరి కొండకోనల్లోని పుట్టుస్వామి రాములోరి సమక్షంలోనే. పుట్టుస్వామికి తలంబ్రాల ప్రక్రియ ముగిస్తే గానీ భద్రాచలం రాములోరి పెళ్లి తంతు ప్రారంభం కాదు. అలాంటిది రాష్ట్ర విభజన జరిగాక చోటుచేసుకున్న పరిణామాల్లో ఈ ఇద్దరు స్వాములు చెరో దిక్కయ్యారు. భద్రాద్రి రాములోరు తెలంగాణ పరమైతే, శ్రీరామగిరి స్వామి వారు ఆంధ్ర వశమయ్యారు. పోలవరం ప్రాజెక్ట్ పుణ్యాన పుట్టుస్వాముల వారి పుట్టిమునిగే పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో భద్రాద్రి సీతారాముల కల్యాణోత్సవంపై భక్తుల మదిలో అనేక సందేహాలు తలెత్తుతున్నాయి. ఈసారి జరగబోయే శ్రీరామనవమి పెళ్లి తంతు ఎక్కడ మొదలై ఎక్కడ ముగుస్తుందో? అంతుపట్టకుండా పోయింది. పురాణగాథ.. జిల్లాలో పుణ్యక్షేత్రాలుగా భద్రాద్రి రామాలయంతో పాటు వీఆర్‌పురం మండలంలోని శ్రీరామగిరి ఆలయం పేరొందాయి. ఈ రెండింటికీ ఎంతో ప్రాధాన్యం ఉంది. భద్రాచలానికి 65 కిలోమీటర్ల దూరంలో ఉన్న శ్రీరామగిరిలో శ్రీ సీతారామాలయం ఉంది. సీతాన్వేషణలో భాగంగా ఈ ప్రాంతంలో శ్రీరాముడు ఏకశిల మీద తపస్సు చేశాడట. అందుకే ఇక్కడి స్వామిని యోగ రాముడని పిలుస్తుంటారు. ఇక్కడ గుడి వద్ద నిల్చుని చూస్తే, ఒక వైపు వాలి పర్వతం, మరో వైపు సుగ్రీవుని పర్వతం కన్పిస్తుంటాయి. ఇక్కడే వాలి, సుగ్రీవులకు యుద్ధాలు జరిగాయని, ఇక్కడే సుగ్రీవునికి, రామునికి మైత్రి కుదిరిందని పురాణాలు చెబుతున్నాయి. శ్రీరాముడు జటాయువుకు దహనసంస్కారాలు చేసి, గోదావరి తీరాన పిండ ప్రదానం చేసే సమయంలో గోదావరి ఒడ్డునే ఉన్న పరుపు బండలపై ఉన్న పాదాలు, మోకాలి ముద్రల ఆనవాళ్లు ఇప్పటికీ భక్తులతో పూజలందుకుంటున్నాయి. రామలక్ష్మణుల టేకువృక్షాలూ కనుమరుగు.. రామలక్ష్మణులు అరణ్యవాసం చేసిన సమయంలో వారి స్వహస్తాలతో నాటిన రెండు టేకు వృక్షాలు శ్రీరామగిరికి 25 కిలోమీటర్ల దూరంలో దట్టమైన అటవీ ప్రాంతం దారపల్లి సమీపంలో ఉన్నాయి. వీటిని రామలక్ష్మణుల టేకు వృక్షాలుగా భక్తులు కొలుస్తున్నారు. భారీ కైవారంతో ఎత్తుగా ఉన్న ఈ వృక్షాలను నరకడానికి ఎవరూ సాహసిం చరు. ఎందుకంటే వీటిని తాకితే రక్తం కక్కుకొని చస్తారని అంటుంటారు. అందువల్లనే ఈ వృక్షాలను తాకేందుకు కూడా ప్రయత్నించరు. కొంతమంది శాస్త్రవేత్తలు ఈ భారీ వృక్షాలపై పరిశోధనలు చేశారు. వేల సంవత్సరాల కాలంనాటి వృక్షాలుగా నిర్ధారించినట్లు స్థానికులు చెబుతున్నారు. ఈ ప్రాంతాన్ని పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేద్దామని ఆలోచనలు చేస్తున్న దశలోనే ఈ వృక్షాలు, ఈ చారిత్రక ప్రదేశం పోలవరం నీటిలో కనుమరుగుకానున్నా యి. శ్రీరామగిరిని నీట ముంచితే పాపం మూటగట్టుకోవాల్సి వస్తుందని జనం ఆందోళన చెందుతున్నారు. -
అత్తారింటికి దారి..!
పల్లెలన్నీ అల్లుళ్లతో కళకళలాడే పెద్ద పండుగ సంక్రాంతి. ఖమ్మం జిల్లా వేలేరుపాడు మండలంలోని భూదేవిపేటకు మాత్రం ఆ కళ ఏడాదంతా ఉంటుంది! ఈ గ్రామంలో ఉన్నవారంతా ఇల్లరికపుటల్లుళ్లు కావడమే అందుకు కారణం. ఎక్కడెక్కడో ఉన్న అల్లుళ్లంతా సంక్రాంతినాడు అత్తారిళ్లకు చేరితే ఇక్కడి అల్లుళ్లు మాత్రం ఊరు దాటకుండానే పండుగ సంబరాల్లో మునిగి తేలతారు. 120 కుటుంబాలున్న ఈ గ్రామంలో 115 మంది ఇల్లరికం అల్లుళ్లే కావడం గ్రామానికి ఒక ప్రత్యేకతను సంతరించి పెట్టింది. ఆడపడుచులకు ఇక్కడ లభించే ఆదరణ అంతా ఇంతా కాదు. దీనివల్ల అల్లుళ్లను ఈ ఊరు అక్కున చేర్చుకుంటోంది. అత్తమామలే వారికి కన్నవారితో సమానులు. అత్తిల్లే వారికి సొంతిల్లు. అత్తమామల ఆదరణ కారణంగా ఇల్లరికం అల్లుళ్లతో రికార్డు సృష్టించింది భూదేవిపేట. ఊళ్లో ఐదుగురు అమ్మాయిలను మాత్రమే వేరే ప్రాంతాల వారికి ఇచ్చి పెళ్లి చేయగా, కేవలం వారు మాత్రమే ఆయా ఊళ్లలో నివాసాలుంటున్నారు. మిగతా నూట పదిహేనుమంది అమ్మాయిలకు సొంతూరే అత్తింటి చిరునామాగా స్థిరపడింది. ఈ ఊరికి అల్లుళ్లుగా వచ్చిన వారిలో పశ్చిమ, తూర్పుగోదావరిజిల్లాలతోపాటు, శ్రీకాకుళం, ఖమ్మం జిల్లాలకు చెందిన వారు ఉన్నారు. ఇలా వచ్చిన అల్లుళ్లు ఇదే గ్రామానికి చెందిన వారిని మళ్లీ అల్లుళ్లను చేసుకోవడంతో ఇది అల్లుళ్ల గ్రామంగా పేరొందింది. పూర్వం ఈ గ్రామానికి బుడ్డిపేటగా పేరుండేది. వసంతవాడ పెదవాగు ఇవతలి ఒడ్డున ఈ గ్రామం ఉండేది. 60 ఏళ్లకు పూర్వం శ్రీకాకుళం జిల్లా బుడ్డిపేట గ్రామానికి చెందిన సన్నిపల్లి నర్సయ్య, అప్పారావు, వీరయ్య, రామయ్య, అనే నాలుగు వెలమ దొరలకుటుంబాలు ఈ ప్రాంతానికి వలస వచ్చాయి. క్రమేపీ ఈ కుటుంబాలు 20 అయ్యాయి. వీరి పూర్వీకులు అప్పట్లో భూదేవిపేటగా నామకరణం చేశారు. 1986వ సంవత్సరంలో వచ్చిన గోదావరి వరద సమయంలో ఊరంతా కొట్టుకుపోవడంతో వరద మునగని మెరకప్రాంతాన్ని ఎంచుకొని వలస వచ్చారు. పాతభూదేవిపేట నివాస ప్రాంతమంతా పొలాలుగా మారింది. ఈ గ్రామం అంతరించి పోయింది. ఆ స్థానంలో నేడు కొత్తభూదేవిపేట గ్రామం ఆవిర్భవించింది. అల్లుళ్ల గ్రామంగా పేరు పొందింది. - ఎం.ఏ సమీర్ సాక్షి, వేలేరుపాడు, ఖమ్మం జిల్లా మొదటి అల్లుణ్ణి: మాది అశ్వారావుపేట మండలం నారాయణపురం.1969లో కర్నాటి చినరామయ్య అల్లుడిగా ఇల్లరికం వచ్చా. అత్తమామలు పెళ్లికానుకగా రెండు ఎకరాలు పొలం ఇవ్వగా, మరో రెండు ఎకరాలు కొనుక్కున్నాను. అందులో వ్యవసాయం చేస్తున్నాను. మా గ్రామంలో ఉన్నంత ప్రశాంత వాతావరణం ఎక్కడా ఉండదని తెలుసుకున్నాను. - చందా ముత్తయ్య 32 ఏళ్ల క్రితం ఇల్లరికానికి... మాది పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు. 32 ఏళ్ల క్రితం భూదేవిపేటకు చెందిన నాగమణితో వివాహమైంది. ఇల్లరికం అల్లుడిగా వచ్చా. మా మామగారు రెండెకరాల భూమి మాకిచ్చారు. అందులో వ్యవసాయం చేసుకుంటున్నాం. - ఎం. నర్శింహారావు ఒరిస్సానుంచి వచ్చా... ఒరిస్సా లోని మోట్ నుండి 22 ఏళ్ల క్రితం అల్లుడిగా వచ్చి, భూదేవిపేటలో సెటిల్ అయిపోయాను. ఈ గ్రామానికి చెందిన రమాదేవిని పెళ్లాడాను. అప్పటి నుంచి టైలరింగ్ వృత్తిని సాగిస్తూ బతుకుబండి లాగిస్తున్నాను. నాకు ఇద్దరుఅమ్మాయిలు. వీరిలో ఒకరికి ఇదే గ్రామంలో వివాహం చేశాను. - ఇందారపు రాము