రామా.. కానరావా..? | sri rama giri swami and bhadradri ramudu split due to state bifurcation | Sakshi
Sakshi News home page

రామా.. కానరావా..?

Published Thu, Jul 24 2014 3:30 AM | Last Updated on Tue, Nov 6 2018 6:01 PM

sri rama giri swami and bhadradri ramudu split due to state bifurcation

 వేలేరుపాడు:  భద్రాద్రి పేరుచెబితే అఖిలాండ భక్తకోటి మదిలో మెదిలేది శ్రీ సీతారామచంద్రస్వామివారి కల్యాణ వైభోగమే. రామయ్య కల్యాణోత్సవానికి శ్రీకారం చుట్టేది మాత్రం మారుమూల శ్రీరామగిరి కొండకోనల్లోని పుట్టుస్వామి రాములోరి సమక్షంలోనే. పుట్టుస్వామికి తలంబ్రాల ప్రక్రియ ముగిస్తే గానీ భద్రాచలం రాములోరి పెళ్లి తంతు ప్రారంభం కాదు.
 
అలాంటిది రాష్ట్ర విభజన జరిగాక చోటుచేసుకున్న పరిణామాల్లో ఈ ఇద్దరు స్వాములు చెరో దిక్కయ్యారు. భద్రాద్రి రాములోరు తెలంగాణ పరమైతే, శ్రీరామగిరి స్వామి వారు ఆంధ్ర వశమయ్యారు. పోలవరం ప్రాజెక్ట్ పుణ్యాన పుట్టుస్వాముల వారి పుట్టిమునిగే పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో భద్రాద్రి సీతారాముల కల్యాణోత్సవంపై భక్తుల మదిలో అనేక సందేహాలు తలెత్తుతున్నాయి. ఈసారి జరగబోయే శ్రీరామనవమి పెళ్లి తంతు ఎక్కడ మొదలై ఎక్కడ ముగుస్తుందో? అంతుపట్టకుండా పోయింది.

 పురాణగాథ..
 జిల్లాలో పుణ్యక్షేత్రాలుగా భద్రాద్రి రామాలయంతో పాటు వీఆర్‌పురం మండలంలోని శ్రీరామగిరి ఆలయం పేరొందాయి. ఈ రెండింటికీ ఎంతో ప్రాధాన్యం ఉంది. భద్రాచలానికి 65 కిలోమీటర్ల దూరంలో ఉన్న శ్రీరామగిరిలో శ్రీ సీతారామాలయం ఉంది. సీతాన్వేషణలో భాగంగా ఈ ప్రాంతంలో శ్రీరాముడు ఏకశిల మీద తపస్సు చేశాడట. అందుకే ఇక్కడి స్వామిని యోగ రాముడని పిలుస్తుంటారు. ఇక్కడ గుడి వద్ద నిల్చుని చూస్తే, ఒక వైపు వాలి పర్వతం, మరో వైపు సుగ్రీవుని పర్వతం కన్పిస్తుంటాయి.

 ఇక్కడే వాలి, సుగ్రీవులకు యుద్ధాలు జరిగాయని, ఇక్కడే సుగ్రీవునికి, రామునికి మైత్రి కుదిరిందని పురాణాలు చెబుతున్నాయి. శ్రీరాముడు జటాయువుకు దహనసంస్కారాలు చేసి, గోదావరి తీరాన పిండ ప్రదానం చేసే సమయంలో గోదావరి ఒడ్డునే ఉన్న పరుపు బండలపై ఉన్న పాదాలు, మోకాలి ముద్రల ఆనవాళ్లు ఇప్పటికీ భక్తులతో పూజలందుకుంటున్నాయి.  

 రామలక్ష్మణుల టేకువృక్షాలూ కనుమరుగు..
 రామలక్ష్మణులు అరణ్యవాసం చేసిన సమయంలో వారి స్వహస్తాలతో నాటిన రెండు టేకు వృక్షాలు శ్రీరామగిరికి 25 కిలోమీటర్ల దూరంలో దట్టమైన అటవీ ప్రాంతం దారపల్లి సమీపంలో ఉన్నాయి. వీటిని రామలక్ష్మణుల టేకు వృక్షాలుగా భక్తులు కొలుస్తున్నారు. భారీ కైవారంతో ఎత్తుగా ఉన్న ఈ వృక్షాలను నరకడానికి ఎవరూ సాహసిం చరు. ఎందుకంటే వీటిని తాకితే రక్తం కక్కుకొని చస్తారని అంటుంటారు. అందువల్లనే ఈ వృక్షాలను తాకేందుకు కూడా ప్రయత్నించరు.

 కొంతమంది శాస్త్రవేత్తలు ఈ భారీ వృక్షాలపై పరిశోధనలు చేశారు. వేల సంవత్సరాల కాలంనాటి వృక్షాలుగా నిర్ధారించినట్లు స్థానికులు చెబుతున్నారు. ఈ ప్రాంతాన్ని పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేద్దామని ఆలోచనలు చేస్తున్న దశలోనే ఈ వృక్షాలు, ఈ చారిత్రక ప్రదేశం పోలవరం నీటిలో కనుమరుగుకానున్నా యి. శ్రీరామగిరిని నీట ముంచితే పాపం మూటగట్టుకోవాల్సి వస్తుందని జనం ఆందోళన చెందుతున్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement