ఇళ్లు పోయాయ్‌..  కన్నీళ్లూ  ఇంకిపోయాయ్‌! | House Collapse With Peddavagu Water At Velerupadu | Sakshi
Sakshi News home page

ఇళ్లు పోయాయ్‌..  కన్నీళ్లూ  ఇంకిపోయాయ్‌!

Published Sun, Jan 20 2019 8:56 AM | Last Updated on Sun, Jan 20 2019 8:56 AM

House Collapse With Peddavagu Water At Velerupadu - Sakshi

ప్రస్తుతం మైదాన ప్రాంతాల్లోనే చలి తీవ్రంగా ఉంది. జనాన్ని వణికించేస్తోంది. ఇక ఏజెన్సీ, గిరిజన ప్రాంతాల్లో ఇంకెలా ఉంటుంది? ఊహించడానికే కష్టం. ఎముకలు కొరికే చలి చంపేస్తోంది. ఈ చలిలో కనీసం ఉండడానికి గూడు లేక ఆ రెండు గ్రామాల ప్రజలు అల్లాడుతున్నారు. అయినా ప్రభుత్వంలో చలనం లేదు. ఆ గ్రామాలకు ఇవ్వాల్సిన నష్టపరిహారం.. వసతుల కల్పనపై నోరుమెదపడం లేదు. ఫలితంగా అక్కడి గిరిజనం పిల్లాపాపలతో అష్టకష్టాలు పడుతున్నారు. 

వేలేరుపాడు: పశ్చిమగోదావరి జిల్లా వేలేరుపాడు మండలంలో పెదవాగు వెంట ఉన్న కమ్మరిగూడెం, అల్లూరినగర్‌ గ్రామాల్లో మొత్తం 335 గిరిజన కుటుంబాలున్నాయి. గత ఏడాది ఆగస్టు 18న తెలంగాణలోని అశ్వారావుపేట మండలంలో పెదవాగు మూడుగేట్లు ఎత్తడంతో భారీగా వచ్చిన నీటి ప్రవాహానికి ఈ గ్రామాల్లో పక్కా భవనాలు మినహా 137 పూరిళ్లు కొట్టుకుపోయాయి. కమ్మరిగూడెంలో 120, అల్లూరి నగర్‌లో 17 ఇళ్లు కొట్టుకుపోయాయి. ఈ గ్రామాలు పెదవాగుకు అత్యంత చేరువలో ఉన్నందున వరద పోటెత్తిన సమయంలో వంట సామగ్రి, బట్టలు కూడా బయటికి తీయలేకపోయారు. ప్రాణ భయంతో కమ్మరిగూడెం వాసులు గ్రామానికి చేరువలో గుట్ట వైపు పరుగులు తీయగా.. అల్లూరినగర్‌ గ్రామస్తులు ఓ పక్కా భవనం పైకి ఎక్కి ప్రాణాలు కాపాడుకున్నారు.

నిత్యావసర వస్తువులతోపాటు, ధాన్యం, బియ్యం, ఇతర వస్తువులన్నీ నీటి ప్రవాహంలో కొట్టుకుపోయాయి. దీంతో ఈ గ్రామస్తుల పరిస్థితి హృదయ విదారకంగా ఉంది. ఈ సంఘటన జరిగి ఐదు నెలలు దాటుతోంది. నేటివరకు ఈ గ్రామాల గిరిజనులకు ప్రభుత్వం నష్ట పరిహారం చెల్లించలేదు. ఈ గ్రామాలు పోలవరం ప్రాజెక్ట్‌ ముంపు పరిధిలో లేకపోయినప్పటికీ పరిహారం చెల్లించకపోవడం విమర్శలకు తావిస్తోంది. ఇళ్లు అగ్ని ప్రమాదంలో కాలిపోయినా, వరదల్లో కొట్టుకుపోయినా తక్షణమే నష్ట పరిహారం అందించాల్సి ఉంది. కానీ నేటికీ ఆ రెండు గ్రామాల గిరిజనులకు నష్టపరిహారం ఇవ్వలేదు.

మొదట్లో అరకొర సాయంతో వదిలేశారు 
ఈ గ్రామ గిరిజనులకు వరదల సమయంలో అరకొరగా సాయం అందింది. కుటుంబానికి 20 కేజీల బియ్యం, కిరోసిన్, కందిపప్పు, మంచినూనె, రెండు దుప్పట్లు అందించి ప్రభుత్వం చేతులు దులుపుకుంది. ఇళ్లు కొట్టుకుపోయి నిలువ నీడలేక రహదారిపై ఉంటున్న గిరిజనులకు పూర్తి స్థాయిలో టార్పాలిన్‌ పట్టాలు కూడా ఇవ్వలేదు. కమ్మరిగూడెంలో 120 ఇళ్లు కొట్టుకుపోగా, కేవలం 35 టార్పాలిన్‌ పట్టాలు పంపిణీ చేసారు. అల్లూరినగర్‌లో 17 ఇళ్లకుగాను 8 పట్టాలు ఇచ్చారు. ఇంకా అనేక మందికి ఇవ్వకపోవడంతో ఒకే టార్పాలిన్‌ కవర్‌తో నిర్మించిన తాత్కాలిక పాకల్లో రెండు కుటుంబాల చొప్పున నివాసముంటున్నాయి. 

ఇళ్ల పరిహారం అందేది ఎప్పటికో?
పూర్తిగా కొట్టుకుపోయిన ఇళ్లకు తక్షణమే రూ.5 వేలు, పాక్షికంగా దెబ్బతిన్న ఇళ్లకు రూ.3,200 చొప్పున ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది. రెవెన్యూ అధికారులు బాధితుల బ్యాంకు ఖాతా నెంబర్లు సేకరించారు. ఆన్‌లైన్‌లో డబ్బులు పడతాయని అధికారులు తమకు చెప్పారని, కానీ నేటివరకు పరిహారం రాలేదని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రెండు గ్రామాల్లో వ్యవసాయ శాఖ లెక్కల ప్రకారం 300 ఎకరాల్లో వరి పూర్తిగా నాశనమైంది. పొలాలు రాళ్లు తేలి, ఇసుక మేటలతో మళ్లీ సాగుకు పనికిరాకుండా పోయాయి. పంట నష్టం సర్వే పూర్తయి ఐదు నెలలైనప్పటికీ, పంట నష్టం పరిహారం నేటికీ అందలేదు.

ప్రభుత్వానికి నివేదించాం
ఇళ్ల పరిహారానికి సంబంధించి అన్ని వివరాలు ప్రభుత్వానికి నివేదించాం. పూర్తిగా దెబ్బతిన్న ఇళ్లకు రూ.5 వేలు, పాక్షికంగా దెబ్బతిన్న ఇళ్లకు రూ.3,200 ఇస్తాం. సాంకేతిక లోపం తలెత్తడం వల్ల నిధులు ప్రభుత్వం నుంచి విడుదల కావడంలేదు. నిధులు వస్తే బాధితులకు పంపిణీ చేస్తాం.  – రవికుమార్, తహసీల్దార్‌ వేలేరుపాడు

చలిలోనే పిల్లాపాపలతో..
చిత్రంలో కనిపిస్తున్న ఈమె పేరు సోయం కుమారి. గత ఏడాది ఆగస్టులో పెదవాగు వరద ప్రవాహానికి కమ్మరిగూడెంలోని వీరి రెండిళ్లు కొట్టుకుపోయాయి. ఆమె తండ్రి జక్కులు ఇంటితో పాటు ఈమె సొంత ఇల్లు వరదలో కొట్టుకుపోయింది. సొంతంగా ఇల్లు నిర్మించుకునే స్థోమత లేదు. ప్రభుత్వం రెండిళ్లకు కలిపి ఒక టార్పాలిన్‌ కవర్‌ ఇచ్చింది. దాంతో వేసిన చిన్న పాకలోనే æచిన్న పిల్లలతో ఆమె కుటుంబం చలిగాలికి వణుకుతూ నివాసముంటోంది. ఇళ్లు కోల్పోయినందున నష్ట పరిహారం అందించాలని వేడుకుంటోంది.

కట్టుబట్టలే మిగిలాయి..
ఈమె పేరు వేటగిరి అంజమ్మ. కమ్మరిగూడెం గ్రామం. ఈమె ఇల్లు గతంలో వచ్చిన వరదకు అరమైలు దూరం కొట్టుకుపోయింది. సామాన్లు బయటికి తీయలేకపోయింది. ఒంటిమీద బట్టలే మిగిలాయి. ఇళ్లకు పరిహారం ఇవ్వక పోవడంలో ఇల్లు నిర్మించుకోలేక, టార్పాలిన్‌ కవర్‌తో నిర్మించిన తాత్కాలిక ఇంట్లో ఉంటూ అగచాట్లు పడుతోంది.

నివాస గృహం కూలినా దిక్కులేదు
ఈమె పేరు ఎన్‌.రమాదేవి. అల్లూరినగర్‌ గ్రామం. కూలికెళితే గానీ ఇల్లు గడవని నిరుపేద గిరిజన కుటుంబం. కూలికెళ్లి పైసా పైసా జమచేసి, ఇందిరమ్మ ఇంటి పథకంలో భాగంగా నిర్మించుకోగా, పెదవాగు ప్రవాహానికి అది కుప్పకూలిపోయింది. దీంతో ఐదునెలలుగా టార్పాలిన్‌ కవర్‌తో నిర్మించిన తాత్కాలిక ఇంట్లో నివాసముంటూ బతుకీడుస్తోంది.

చీకటి కోరల్లో కాలం వెళ్లదీస్తున్న మిరియం బజారు
ఈ వృద్ధురాలి పేరు మిరియం బజారు. కమ్మరిగూడెం గ్రామం. పెదవాగు వరద ప్రవాహానికి ఈమె పూరింటి పైకప్పు కూలిపోయింది. ప్రభుత్వమిచ్చిన టార్పాలిన్‌ కవర్‌నే ఇంటిపైన కప్పుకుంది. ఇంటికి కరెంట్‌ లేదు. ఇచ్చిన కిరోసిన్‌ ఎప్పుడో అయిపోయింది. దీంతో ఆమె చీకట్లో మగ్గుతూ నానా ఇబ్బందులు పడుతోంది.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement