వేలేరుపాడు :వేలేరుపాడు మండలంలోని రుద్రమకోట గ్రామానికి చెందిన కొత్తపల్లి లక్ష్మిసాయి(23) అనే బీటెక్ మెకానికల్ ఫైనలియర్ చదువుతున్న విద్యార్థి కళాశాల హాస్టల్ గదిలో ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం గంగారం సాయిస్ఫూర్తి ఇంజినీరింగ్ కళాశాలలో గురువారం చోటు చేసుకుంది. సత్తుపల్లి పట్టణ సీఐ యు.వెంకన్నబాబు కథనం ప్రకారం.. గురువారం కొత్తపల్లి లక్ష్మిసాయి కళాశాల హాస్టల్ గదిలో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. గదిలో గడిపెట్టుకొని ఫ్యాన్‌కు దుప్పటితో ఉరి వేసుకొని వేలాడుతుండటంతో స్నేహితులు గుర్తించి తలుపు పగులగొట్టి లక్ష్మిసాయిని కిందకు దింపారు. కొన ఊపిరితో ఉన్నాడనే ఆశతో హుటాహుటిన సత్తుపల్లి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మృతుని వద్ద ఆత్మహత్యకు పాల్పడినట్టు లేఖ కూడా లభించింది.
నా కొడుకును చంపేశారు : తండ్రి ఆరోపణ
నా ఒక్కగాను ఒక్క కొడుకును ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకున్నాం.. లక్షలు ఖర్చుపెట్టి చదివిస్తున్నాం..ఈవ్‌టీజింగ్ చేసి, నా కొడుకును చంపి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని, తండ్రి కొత్తపల్లి నర్సింహారావు(బాబు) విలపిస్తూ చెప్పారు. బుధవారం రాత్రి హాస్టల్‌లో ఘర్షణ జరిగిందని.. ఎవరో కావాలని నా కొడుకును చంపేసి ఉరి వేసుకున్నట్టు నమ్మిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉదయం తొమ్మిది గంటల సమయంలో మృతిచెందితే ఒంటిగంటకు కూడా సమాచారం ఇవ్వలేదని.. నిర్లక్ష్యంగా వ్యవహరించారని సత్తుపల్లి సీఐ వెంకన్నబాబుతో వాగ్వాదానికి దిగారు. ఉరి వేసుకుంటే నాలుక బయటకు వస్తుందని.. అలా ఏమీ కన్పించటం లేదంటూ ఆరోపించారు. ఉరి వేసుకుంటే పోలీసులు వచ్చేవరకు మృతదేహాన్ని ఉంచకుండా హడావుడిగా ఆస్పత్రికి తరలించటంలో ఆంతర్యమేమిటని నిలదీశారు.
ఉద్రిక్తత.. రాస్తారోకో..
లక్ష్మిసాయి మృతిపై అనుమానాలు ఉన్నాయంటూ బంధువులు, కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. అదే సమయంలో ఆస్పత్రికి వచ్చిన కళాశాల ప్రిన్సిపాల్ సీహెచ్ విజయ్‌కుమార్‌తో ఘర్షణకు దిగారు. ఆస్పత్రి ఆవరణలో ఉదిక్త వాతావరణం నెలకొంది. ఆస్పత్రికి తరలించిన మృతదేహాన్ని పోస్టుమార్టం చేయకుండా అడ్డుకున్నారు. సమగ్ర విచారణ నిర్వహించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని సత్తుపల్లి రాష్ట్రీయ రహదారిపై రాస్తారోకో చేశారు. అక్కడకు చేరుకున్న సీఐ వెంకన్నబాబు ఆందోళనకారులకు నచ్చచెప్పటంతో రాస్తారోకో విరమించారు.
ఇంజినీరింగ్ విద్యార్థి ఆత్మహత్య
Published Fri, Sep 11 2015 1:45 AM | Last Updated on Sun, Sep 3 2017 9:08 AM
Advertisement