వేలేరుపాడు: ఆంధ్రాలోని బడా పారిశ్రామిక వేత్తల ప్రయోజనాల కోసమే పోలవరం ముంపు మండలాల విలీన ఆర్డినెన్స్‌ను కేంద్ర సర్కారు తీసుకొచ్చిందని రాష్ట్ర మానవ హక్కుల వేదిక ప్రధాన కార్యదర్శి విఎస్.కృష్ణ విమర్శించారు. లక్షలాది మంది ఆదివాసీల జీవితాలను, వారి సంస్కృతీ సాంప్రదాయాలను నిలువునా ముంచుతున్న ఈ ప్రాజెక్టు దేశంలోనే అత్యంత దుర్మార్గమైనదని అన్నారు.
పోలవరం ప్రాజెక్టుకు వ్యతిరేకంగా గిరిజన సంక్షేమ పరిషత్ ఆధ్వర్యంలో సోమవారం ఇక్కడ భారీ ప్రదర్శన, తహశీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా జరిగింది. ధర్నానుద్దేశించి విఎస్.కృష్ణ మాట్లాడుతూ.. ముంపు ప్రజల మనోభావాలు తెలుసుకోకుండా వారి ప్రాంతాలను ఆంధ్రాలో విలీనం చేయడం దారుణమన్నారు. పోలవరం ప్రాజెక్టును మానవ హక్కుల వేదిక మొదటి నుంచి వ్యతిరేకిస్తోందన్నారు. పోలవరానికి వ్యతిరేకంగా ముంపు ప్రాంత ప్రజలు ఆంధ్రాలో కూడా పోరాడాలని కోరారు. ఆదివాసీల పోరాటాలకు తమ వేదిక సంపూర్ణ మద్దతు ఉంటుందన్నారు.
హైకోర్టు న్యాయమూర్తి పల్లా త్రినాధరావు మాట్లాడుతూ.. పోలవరం ప్రాజెక్టుతో లాభాల కన్నా నష్టాలే ఎక్కువగా ఉన్నాయన్నారు. దీని పై సుప్రీంకోర్టులో అనేక కేసులు పెండింగులో ఉన్నాయన్నారు. ఇవన్నీ ఒక కొలిక్కి రాకుండా నే పనులు చేపట్టడం విచారకరమన్నారు.
గిరిజన సంక్షేమ పరిషత్ రాష్ట్ర కన్వీనర్ సోందె వీరయ్య మాట్లాడుతూ.. ఆదివాసీలను పోలవరం ప్రాజెక్టుకు బలిచ్చి, తెలంగాణ సాధించుకున్నారని ధ్వజమెత్తారు. తెలంగాణ ఏర్పాటు తరువాత ‘ముంపు’ సమస్యను తెలంగాణ ఉద్యమకారులు విస్మరించారని విమర్శించారు. ‘‘ఆంధ్రాలో తాడిపుడి, పుష్కర, చాగల్‌నాడు తదితర ఎత్తిపోతల పథకాల ద్వారా నాలుగు లక్షల ఎకరాల్లో రెండు పంటలు పండుతున్నారుు. మిగిలిన మూడులక్షల ఎకరాలకోసం రెండులక్షల మంది ఆదివాసీలను జల సమాధి చేయడం అనాగరికం’’ అని అన్నారు. పోలవరానికి వ్యతిరేకంగా జాతీయస్థాయిలో అవిశ్రాంత పోరాటం సాగిస్తామన్నారు.
న్యూడెమోక్రసీ జిల్లా నాయకుడు కెచ్చెల రంగారెడ్డి మాట్లాడుతూ.. జిల్లాలో 100 కిలోమీటర్ల దూరాన పారుతున్న గోదావరి నీటిపై ఇక్కడి ఆదివాసీలకు హక్కు లేకుండా చేసేందుకే ముంపు మండలాలను ఆంధ్రాలో కలిపారని విమర్శించారు.
ఈ ప్రదర్శన, సభలో ఏఆర్‌ఎస్ రాష్ట్ర అధ్యక్షుడు కీసరు బజారు, న్యూడెమోక్రసీ నాయకులు గోకినేపల్లి వెంకటేశ్వర్లు, ఎస్‌కె.గౌస్, గడ్డాల. ముత్యాల్‌రావు, గిరిజన నాయకులు ఆదినారాయణ, నవీన్, న్యాయవాది పాయం సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
బడా బాబులకే పోలవరం
Published Tue, Nov 25 2014 2:45 AM | Last Updated on Tue, Aug 21 2018 8:34 PM
Advertisement
Advertisement