చేతబడి అనుమానంతో..
Published Fri, Sep 8 2017 11:20 PM | Last Updated on Tue, Sep 12 2017 2:16 AM
కత్తిపీటతో పొట్ట కోసుకున్న గిరిజనుడు
వేలేరుపాడు మండలంలో ఘటన
ఆలస్యంగా వెలుగుచూసిన వైనం
జంగారెడ్డిగూడెం/వేలేరుపాడు : రాకెట్ యుగంలో కూడా మూఢ నమ్మకాలను ఇంకా గిరిజనులు వదలలేకపోతున్నారు. మూఢ నమ్మకాలతో ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. ఇటువంటి ఘటనే వేలేరుపాడు మండలంలో ఎర్రబోరులో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గ్రామానికి చెందిన కారం వెంకటేశ్వరరావు కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. కడుపులో నొప్పిరావడంతో భయాందోళనకు గురయ్యాడు. ఈ క్రమంలో మూఢ నమ్మకాలకు ప్రభావితమైన వెంకటేశ్వరరావు తనకు ఎవరో చేతబడి చేయించారనే అనుమానంతో భయానికి గురయ్యాడు. కడుపులో ఎలుకలు తిరుగుతున్నట్టు, పురుగులు ఉన్నట్టు అనిపిస్తూ ఉండేదని కుటుంబ సభ్యులకు తెలిపేవాడు. అలా ఉండటానికి కారణం తనకు ఎవరో చేతబడి చేసేవారని అనుమానం మరింత పెంచుకున్నాడు. అందువల్లే కడుపులో ఎలుకలు, పురుగులు ఉన్నట్టు భావించి ఈ నెల 6న ఇంట్లో ఉన్న కత్తిపీటతో కడుపును అడ్డంగా కోసేసుకున్నాడు. ఇది గమనించిన అతని సోదరులు సతీష్, శివశంకర్‌లు హుటాహుటిన సమీపంలోని వేలేరుపాడు ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యులు ప్రాథమిక చికిత్స చేసి మెరుగైన వైద్యం కోసం జంగారెడ్డిగూడెం రిఫర్ చేశారు. ప్రస్తుతం జంగారెడ్డిగూడెం ఏరియా ఆసుపత్రిలో వెంకటేశ్వరరావు చికిత్స పొందుతున్నాడు. తమ సోదరుడు వెంకటేశ్వరరావు చేతబడి అనుమానంతోనే కత్తిపీటతో కడుపును కోసేసుకున్నాడని సతీష్ వెల్లడించాడు. చికిత్స అనంతరం వెంకటేశ్వరరావు కోలుకుంటున్నాడని వారు తెలిపారు.
Advertisement