పాఠకుల హృదయం పెద్దది...
సాక్షి ఎఫెక్ట్
పశ్చిమగోదావరి జిల్లా వేలేరుపాడు మండలం సంతపాకలకు చెందిన ముర్తిపేట చిట్టెమ్మ కన్నీటి కథ గురించి అక్టోబర్ 27న ఫ్యామిలీ పేజీలో వెలువరించిన కథనం- ‘మీకు పుణ్యం ఉంటుంది!’ పాఠకుల్లో విశేష స్పందన తీసుకు వచ్చింది. సాటి మనిషి కష్టంలో ఉంటే స్పందించే హృదయం తెలుగువారికి ఉంది అని నిరూపించింది. రెండు తెలుగు రాష్ట్రాల నుంచే కాక కేరళ, తమిళనాడు, మహారాష్ట్ర, జమ్ము కాశ్మీర్‌ల నుంచి కూడా అక్కడి తెలుగువారు సహాయం చేయడానికి ముందుకు వచ్చారు. అమెరికా, అస్ట్రేలియా, ఖతర్, సౌదీ అరేబియా, దుబాయ్, కొవైట్, సింగపూర్ తదితర ఆవలి సీమల దాతలు స్పందించి చేయూతనందించారు.
వీరందరి స్పందన వలన ఇప్పటి వరకూ చిట్టెమ్మ ఖాతాలో 8 లక్షల 56 వేల రూపాయలు జమ అయ్యాయి. నగదుగా వచ్చిన సొమ్ము కాకుండా చెక్‌ల రూపంలో పోస్టు ద్వారా ఇంకా ఆర్థిక సాయం అందనుంది. అనేక మంది నిత్యావసర వస్తువులు, దుస్తులు కూడా పంపిణీ చేసారు. చిట్టెమ్మ పిల్లలను చదివించేందుకు దాతలు ముందుకు రాగా, మరికొందరు వైద్యం చేయించేందుకు, ఇంకొందరు కుటుంబాన్ని దత్తత తీసుకునేందుకు ముందుకు వచ్చారు.
చిట్టెమ్మ కుటుంబానికి నెలవారి ఆర్ధిక సహాయం అందించడానికి కూడా దాతలు ముందుకు వచ్చారు. అమెరికాలో ఉంటున్న శ్రీధర్ ప్రతి నెలా 5000, నాగరాజు నెలకు 4000, బెంగళూరుకు చెందిన రాజేష్ గౌడ్ వెయ్యిరూపాయలు, చిత్తూరు జిల్లాకు చెందిన జయరామిరెడ్డి అనే ఉపాధ్యాయుడు నెలకు వెయ్యిరూపాయలు, పశ్చిమగోదావరి జిల్లా నర్సాపురంకు చెందిన విశ్వనాధశాస్త్రి నెలకు వెయ్యి రూపాయలు, ఆమె వైద్య ఖర్చులకు పంపుతామని ముందుకొచ్చారు.
ఈ దాతల స్పందన చూశాక ఇంతకాలం ఆకలితో అలమటించిన ఆ తల్లీ పిల్లల ఆనందానికి హద్దులు లేవు. చిట్టెమ్మ ఆత్మస్థైర్యం పుంజుకుంది. ఇల్లు బంధువుల రాకపోకలతో సందడిగా మారింది. సాక్షి పేపర్‌కు జీవితాంతం రుణపడి ఉంటానయ్యా... నా పిల్లల పెంపకంపై నాకున్న దిగులు తొలిగిపోయింది. నా పిల్లల బాధ్యతలు పూర్తి అయ్యేంతవరకు... ఇక నేను బతుకుతా... అంటూ ఎంతో ఆశతో చెప్పింది చిట్టెమ్మ.
- ఎం.ఏ సమీర్, సాక్షి, వేలేరుపాడు