Chitemma
-
పండినా ఎండినా చేను చేనేరా... అంది!
మా అమ్మ : ఆర్. నారాయణమూర్తి అరవై రెండేళ్ల ఆర్. నారాయణమూర్తి గొంతెత్తితే కంచు గంట మోగినట్లు ఉంటుంది. పిడికిలి బిగిస్తే అది పోరాట గళం అవుతుంది. కళ్లెర్ర చేస్తే పీడించే వర్గం వెన్నులో వణుకు పుడుతుంది. నిత్యం రగిలే సూర్యుడిలా కనిపించే ఈ విప్లవ నారాయణుడిని తన మాతృమూర్తి గురించి చెప్పమని అడిగినప్పుడు.. అమ్మను, అమ్మ మలిచిన తన బాల్యాన్ని గుర్తు చేసుకున్నారు. ఆ కొద్దిసేపూ మమకారపు ఊయలలో ఊగుతున్నట్లే కనిపించారు. ‘‘మాది తూర్పు గోదావరి జిల్లా, రౌతులపూడి మండలం, మల్లంపేట గ్రామం. మా అమ్మ చిట్టెమ్మ, నాన్న రెడ్డి చిన్నయ్య నాయుడు. మాది చాలా సామాన్యమైన రైతు కుటుంబం. మా ఊరి నుంచి చదువుకోడానికి వెళ్లేది నేనొక్కడినే. రౌతులపూడిలో ఐదవ తరగతి తర్వాత శంఖవరం హైస్కూల్లో చేరాను. అది మా మల్లంపేటకు 14 కిలోమీటర్లు. రానూపోను రోజూ 28 కిలోమీటర్ల నడక. అది కాదు కష్టం. నన్ను బడికి పంపించడానికి మా అమ్మ రోజూ తెల్లవారుజామున మూడున్నరకే లేచి అన్నం వండి క్యారియర్ పెట్టేది. నేను నాలుగున్నరకు బయలుదేరేవాడిని. దారంతా చీకటి. దారి మధ్యలో గుమ్మరేకల మెట్ట అనే కొండను చూడాలంటేనే భయమేసేది. ఆ కొండమీద దెయ్యాలుంటాయనే కథలు మా ఊరంతా చెప్పుకునేవారు. రాత్రి ఇంటికొచ్చేటప్పుడూ ఆ కొండ దగ్గరకు వచ్చేటప్పటికి చీకటయ్యేది. అమ్మతో... ‘‘కొండ పక్కనుంచి వెళ్లాలంటే భయమేస్తోందమ్మా’’ అన్నాను. అప్పుడామె పల్లెలో అందరూ భయపడినట్లు దెయ్యానికి భయపడలేదు సరికదా ‘జై భజరంగభళీ’ అని ఆంజనేయుడిని తలుచుకో. నిన్ను ఏ దెయ్యమూ ఏం చేయదు’ అని చెప్పింది. ఊరికి నన్ను తొలి గ్రాడ్యుయేట్‌ని చేసింది మా అమ్మ అంత కష్టపడి నన్ను బడికి పంపిస్తే నేనేమో టెన్త్ ఫెయిలయ్యాను. మా నాన్న అసలే కోపిష్టి. ఫెయిలైనందుకు కొడతాడని ఇంట్లో వాళ్లకు కనిపించలేదు. అమ్మ ఊరంతా వెతికింది. నేను ఇంటి వెనకాలే దాక్కుని ఏడుస్తున్నాను. నాకోసం వెతికి వెతికి అలసిపోయింది అమ్మ. చీకటి పడే వేళకు ఇంటికొచ్చి ఏదో పని మీద పెరట్లోకి వచ్చింది. ఏడుస్తున్న నన్ను అమాంతం దగ్గరకు తీసుకుని ఓదార్చింది. ఓదార్చి ఆమె అన్న మాట ఇప్పటికీ గుర్తొచ్చినప్పుడు ఆమె పాదాలను తాకి దణ్ణం పెట్టాలనిపిస్తుంది. ఆమె ఏమన్నదో తెలుసా!! ‘‘మనం ఏటా చేలో పంటవేస్తాం. ఒక ఏడాది పండితే మరొక ఏడాది ఎండుతుంది. మరో ఏడాది వరదకు కొట్టుకుపోతుంది. అలాగని పంట వేయడం మానుతామా? చేను చెడ్డదని తప్పు పడతామా? పక్కటేడాది దుక్కి దున్నడం మానేస్తామా? పరీక్షా అంతే. వచ్చే ఏడు పాసవుతావు’’ అన్నది అమ్మ. అలా మా అమ్మ నన్ను ఊరికి తొలి గ్రాడ్యుయేట్‌ని చేసింది. ఆఖరికి నేను సినిమాల్లోకి వెళ్తానంటే నాన్నకు తెలియకుండా 70 రూపాయలిచ్చి పంపించింది. ఇప్పుడు మీరు చూస్తున్న నారాయణమూర్తి ఆవిర్భావానికి ఆమె తోడ్పాటే కారణం. ఆ రోజు అమ్మకు దణ్ణిం పెట్టి వెళ్లాను. ఇప్పటికీ ప్రతి సినిమా విడుదల తర్వాత ఓసారి మా ఊరెళ్లి అమ్మకు కనిపిస్తాను’’. కడుపు నిండా అమ్మ ప్రేమ సినిమాల్లోకి వచ్చాక కొంతకాలం వేషాల్లేక కష్టాలు పడ్డాను. అప్పుడు అమ్మ ఓ మాటంది. ‘‘నువ్వింకా కొంతకాలం వేషాల కోసం ప్రయత్నిస్తానంటే అలాగే చెయ్యి. కానీ డబ్బుల్లేవని పస్తులు మాత్రం ఉండకు. బియ్యం, పప్పులు పంపిస్తాను. వండుకుని రోజూ అన్నం తిను’’ అన్నది. ఆ మాట తలుచుకుంటే ఇప్పటికీ కళ్లలో నీళ్లు తిరుగుతాయి నాకు. కళ్లారా రాముని కోవెల నేను సంపాదించడం మొదలు పెట్టాక కూడా తమ కోసం డబ్బు పంపించమని అడగలేదింతవరకు మా అమ్మ. ఆమె కోరింది మా ఊళ్లో రాముని కోవెల మాత్రమే. ఊరంతా పెళ్లిళ్లు, ఇతర వేడుకలు చేసుకోవడానికి అనువుగా ఉంటుందని ఆమె ఉద్దేశం. ఆ కోవెలలో ఎన్నో పెళ్లిళ్లను ఆమె కళ్లారా చూస్తోందిప్పటికీ. నా పెళ్లి చూడలేని కొరతను ఆమె ఆ రకంగా పూరించుకుంటోంది. -సంభాషణ: వాకా మంజులారెడ్డి -
బడిఅమ్మ...
మొక్కులు చెల్లించుకుంటాం. కానుకలు చదివించుకుంటాం. కానీ గనికమ్మ ఏ దైవానికీ మొక్కుకోలేదు. ఏ దైవ సమానులకూ కానుకలు చదివించుకోలేదు. సరస్వతీదేవి ఒడి లాంటి బడి కోసం ఏ ముడుపూ కట్టకుండానే... ఏ మొక్కూ మొక్కకుండానే... ఆస్తి మొత్తాన్ని చదివించుకుంది! ఊరి బడి కోసం ఉన్నదంతా ఊడ్చిపెట్టింది. గనికమ్మను ఏమనాలి? చదువుల తల్లి అనొచ్చు. చదువులకు తల్లి అనొచ్చు. పెద్ద మనసున్న ఈ అమ్మను... బడి అమ్మ అనీ అనొచ్చు. అక్షరం ముక్కరాని గనికమ్మ... అ.. ఆ.. లకు... కానుకమ్మ! తూర్పు గోదావరి జిల్లా.. అమలాపురం.. కామనగరువు దగ్గర్లో చిట్టెమ్మ చెరువు గ్రామం. ఆ గ్రామానికి చెందిన గిడ్డి గనికమ్మకు 75 ఏళ్లు. అమె నిరక్షరాస్యురాలు. గొప్ప గొప్ప వారి జీవిత కథలేవీ ఆమె వినలేదు, వారి నుంచి స్ఫూర్తి పొందడానికి. ఆమెకు తెలిసింది తనకు లేకపోయినా సరే, ఉన్నదాన్ని నలుగురికీ పంచాలన్న మంచి. ఆ గుణమే ఈ రోజు ఆమెను అందరిలో ప్రత్యేకంగా నిలిపింది. ఇంటి జాగా తప్ప మరే ఆస్తిపాస్తులు లేని ఈ నిరుపేద వృద్ధురాలు గ్రామం కోసం తనకున్న మొత్తం ఆస్తిని రాసి ఇచ్చేసి నేటి ‘శ్రీమంతులను’ మించిపోయింది. నిలువ నీడ లేకుండా సర్వస్వాన్ని దానం చేసిన ఆమె సేవా గుణానికి ఆ ఊరు ఊరంతా బ్రహ్మరథం పట్టింది. కడుపేదరాలై ఉండి.. ఏకాకిగా ఉన్న తనకు రోజు ఎలా గడుస్తుందన్న ఆలోచన లేకుండా 20 లక్షల రూపాయల విలువచేసే ఆస్తిని అవలీలగా దానం చేసిన గనికమ్మ గురించి ఎంత చెప్పినా తక్కువే అని కొనియాడుతున్నారు గ్రామస్తులు. ఊళ్లో బడి తొలిగిస్తారని తల్లడిల్లి... చిట్టెమ్మ చెరువు గ్రామంలో గల ప్రభుత్వ స్థలంలో మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల ఉంది. అయితే జాతీయ రహదారి బైపాస్ రోడ్డు నిర్మాణంలో భాగంగా ఊళ్లోని బడిని తొలగించాల్సి వస్తోంది. ఈ వార్త విన్నప్పటి నుంచి గనికమ్మ తల్లడిల్లిపోయింది. ‘అయ్యో... నా ఊళ్లో బడి భవనాన్ని తొలగించేస్తే పిల్లలు ఎక్కడ చదువుకుంటారు’ అని ఆందోళన చెందింది. ఇదే విషయాన్ని ఊళ్లో అందరి వద్ద వాపోయింది. గనికమ్మకు చదువుకునే పిల్లలంటే తగని ప్రేమ. అప్పడప్పుడు ఆ బడికి వెళ్లి పిల్లలకు చాక్లెట్లు, మిఠాయిలు పంచిపెట్టి వస్తుండేది. తన వద్దకు వచ్చే పిల్లలకు చదవు విలువ చెప్పేది. అక్కడ అందరూ కూలినాలి చేసుకుని బతికే కుటుంబాలకు చెందిన పిల్లలే కావటంతో వారు చక్కగా చదువుకుంటే జీవితం ఎంతబాగుంటుందో తెలియజెప్తుతుండేది. పిల్లలంతా పొద్దునే బడికెళుతుంటే వారినే చూస్తూ ఉండిపోయేది. బళ్లో పిల్లల పాఠాలు వల్లెవేస్తుంటే ఆనందంగా వింటూ ఉండిపోయేది. ఎందరికో అక్షరాలు నేర్పిన బడిని దేవాలయంలా తలచేది. చదువుకునే పిల్లలపై మమకారం పెంచుకున్న ఆమె బడి తొలగింపు మాట విని తట్టుకోలేకపోయింది. కాయకష్టంతో సంపాదించిన సొమ్ము... గనికమ్మకు పేగు తెంచుకుని పుట్టిన సంతానం లేదు. భర్త వెంకన్న 40 ఏళ్ల కిందటే చనిపోయాడు. తమ్ముడి కూతురైన మేనకోడలు అప్పుడప్పుడు గనికమ్మ బాగోగులు చూసేది. ఆమెకు పెళై ్ల మెట్టినింటికి వెళ్లింది. అయితే మేనకోడలు సొంత ఇల్లు లేక కష్టాలు పడుతుండటం చూసిన గనికమ్మే భర్త ద్వారా తనకు సంక్రమించిన భూమిని అమ్మేసి పదేళ్ల కిందటే ఇల్లు కట్టించి ఇచ్చింది. భర్త చనిపోయినప్పటి నుంచీ కూలీ పనిచేసుకుంటూ బతికింది. అన్నమో రామచంద్ర అని తల్లడిల్లిన వారికి తను తినే దాంట్లో ఇంత పంచింది. వృద్ధాప్యం మీద పడటంతో ఓపికి లేక ఈ మధ్యే కూలీ పనులకు దూరమైంది. కాయ కష్టంతో సంపాందించిన సొమ్ము, ప్రభుత్వం ఇచ్చిన గృహ నిర్మాణ ఆర్ధిక సాయంతో 20 ఏళ్ల కిందట కట్టుకున్న సొంత ఇల్లే ఆమెకున్న ఏకైక ఆస్తి. ఇప్పుడు ఆ ఇల్లు, ఇంటి స్థలం విలువ రూ.20 లక్షల పైనే ఉంటుంది. ఇంటి స్థలాన్ని బడికి ఇచ్చేసి... గనికమ్మను తొలచివేస్తున్న బడి తొలగింపు సమస్యను తన సేవా భావంతో... తనకున్న ఇంటి స్థలంతో పరిష్కరించి ఊపిరి పీల్చుకుంది. తనకు ఒకే ఒక్క ఆధారంగా ఉన్న ఇంటిని, అయిదు సెంట్ల ఇంటి స్థలాన్ని బడి కోసం త్యాగం చేసింది. తాను బతికి ఉండగానే ఆ స్థలంలో బడి భవనాన్ని నిర్మించి దానికి తన భర్త పేరు పెట్టాలని గ్రామపంచాయతీని అభ్యర్థించింది. దానికి అంతా సంతోషంగా అంగీకరించారు. జగమంత కుటుంబం... గనికమ్మ ఒంటరిదైనా ఊళ్లోని బడికి భూదానం చేయటంతో ఆమెను ఇప్పుడంతా సేవా మూర్తిగా కొలుస్తున్నారు. ఇంటి స్థలంలో బడిని నిర్మించేస్తే గనికమ్మకు తల దాచుకునే వీలు ఉండదని తెలిసి గ్రామస్థులు ఆమెకు అండగా ఉంటామంటూ ముందుకు వచ్చారు. గ్రామ సర్పంచి రాజులపూడి భీముడు, అమలాపురం మండల పరిషత్ అధ్యక్షుడు బొర్రా ఈశ్వరరావు ఆమె ఆలనా పాలనా తాము చూసుకుంటామని ప్రకటించారు. గనికమ్మను ఊళ్లో ఊరేగించి ఘనంగా సన్మానం చేశారు. - అరిగెల రుద్ర శ్రీనివాసరావు, అమలాపురం రూరల్, తూర్పు గోదావరి ఊరు బాగుండాలనే... నాకంటూ ఎలాంటి ఆశలు లేవయ్యా. ఒంటిరిగానే బతుకుతున్నాను. ఇంక ఎంతో కాలం బతకను. నాకున్న ఈ కొద్దిపాటి ఆస్తితో బడి ఏర్పడుతోందని చాలా ఆనందంగా ఉంది. ఊరు బాగుండాలని ఎప్పుడూ కోరుకుంటాను. అందుకే ఈ భూదానం చేశాను. పోతూ కూడా ఏమీ తీసికెళ్లలేం. నేను చనిపోయినా నా గుర్తుగా బడి ఉంటుంది. అది చాలు నా పేద బతుక్కి. - గిడ్డి గనికమ్మ అన్ని దానాలనూ మించిన దానం... బడికెళ్లే పిల్లలు బడే లేకపోతే ఏమైపోతారనే ఆలోచనతో గనికమ్మ చేసిన ఈ దానం అన్ని దానాలనూ మించిన దానం. నిలువ నీడ కూడా ఉంచుకోకుండా ఊరి కోసం... బడి కోసం ఆస్తిని రాసిచ్చిన గనికమ్మకు ఊరంతా రుణపడి ఉంటుంది. - బొర్రా ఈశ్వరరావు, అమలాపురం -
పాఠకుల హృదయం పెద్దది...
సాక్షి ఎఫెక్ట్ పశ్చిమగోదావరి జిల్లా వేలేరుపాడు మండలం సంతపాకలకు చెందిన ముర్తిపేట చిట్టెమ్మ కన్నీటి కథ గురించి అక్టోబర్ 27న ఫ్యామిలీ పేజీలో వెలువరించిన కథనం- ‘మీకు పుణ్యం ఉంటుంది!’ పాఠకుల్లో విశేష స్పందన తీసుకు వచ్చింది. సాటి మనిషి కష్టంలో ఉంటే స్పందించే హృదయం తెలుగువారికి ఉంది అని నిరూపించింది. రెండు తెలుగు రాష్ట్రాల నుంచే కాక కేరళ, తమిళనాడు, మహారాష్ట్ర, జమ్ము కాశ్మీర్ల నుంచి కూడా అక్కడి తెలుగువారు సహాయం చేయడానికి ముందుకు వచ్చారు. అమెరికా, అస్ట్రేలియా, ఖతర్, సౌదీ అరేబియా, దుబాయ్, కొవైట్, సింగపూర్ తదితర ఆవలి సీమల దాతలు స్పందించి చేయూతనందించారు. వీరందరి స్పందన వలన ఇప్పటి వరకూ చిట్టెమ్మ ఖాతాలో 8 లక్షల 56 వేల రూపాయలు జమ అయ్యాయి. నగదుగా వచ్చిన సొమ్ము కాకుండా చెక్‌ల రూపంలో పోస్టు ద్వారా ఇంకా ఆర్థిక సాయం అందనుంది. అనేక మంది నిత్యావసర వస్తువులు, దుస్తులు కూడా పంపిణీ చేసారు. చిట్టెమ్మ పిల్లలను చదివించేందుకు దాతలు ముందుకు రాగా, మరికొందరు వైద్యం చేయించేందుకు, ఇంకొందరు కుటుంబాన్ని దత్తత తీసుకునేందుకు ముందుకు వచ్చారు. చిట్టెమ్మ కుటుంబానికి నెలవారి ఆర్ధిక సహాయం అందించడానికి కూడా దాతలు ముందుకు వచ్చారు. అమెరికాలో ఉంటున్న శ్రీధర్ ప్రతి నెలా 5000, నాగరాజు నెలకు 4000, బెంగళూరుకు చెందిన రాజేష్ గౌడ్ వెయ్యిరూపాయలు, చిత్తూరు జిల్లాకు చెందిన జయరామిరెడ్డి అనే ఉపాధ్యాయుడు నెలకు వెయ్యిరూపాయలు, పశ్చిమగోదావరి జిల్లా నర్సాపురంకు చెందిన విశ్వనాధశాస్త్రి నెలకు వెయ్యి రూపాయలు, ఆమె వైద్య ఖర్చులకు పంపుతామని ముందుకొచ్చారు. ఈ దాతల స్పందన చూశాక ఇంతకాలం ఆకలితో అలమటించిన ఆ తల్లీ పిల్లల ఆనందానికి హద్దులు లేవు. చిట్టెమ్మ ఆత్మస్థైర్యం పుంజుకుంది. ఇల్లు బంధువుల రాకపోకలతో సందడిగా మారింది. సాక్షి పేపర్‌కు జీవితాంతం రుణపడి ఉంటానయ్యా... నా పిల్లల పెంపకంపై నాకున్న దిగులు తొలిగిపోయింది. నా పిల్లల బాధ్యతలు పూర్తి అయ్యేంతవరకు... ఇక నేను బతుకుతా... అంటూ ఎంతో ఆశతో చెప్పింది చిట్టెమ్మ. - ఎం.ఏ సమీర్, సాక్షి, వేలేరుపాడు -
రోడ్డు ప్రమాదంలో ముగ్గురి దుర్మరణం
=మరొకరికి తీవ్ర గాయాలు =మితిమీరిన వేగం ప్రమాదానికి కారణం దుండిగల్, నూస్లైన్: అతి వేగం ముగ్గురి ప్రాణాలను బలిగొంది. ఓవర్టేక్ చేయబోయిన ఆటో ముందు వస్తున్న కంటైనర్‌ను ఢీ కొట్టింది. ఈ దుర్ఘటనలో బ్యాంక్‌లో డబ్బులు డ్రా చేసేందుకు వెళ్తున్న ఇద్దరు డ్వాక్రా గ్రూపు సభ్యులు, మరో వ్యక్తి మృత్యువాత పడ్డారు. ఇంకో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. ఈ హృదయ విదారక ఘటన సోమవారం దుండిగల్ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. నల్లగొండ జిల్లా తిమ్మాపురానికి చెందిన భార్యాభర్తలు వెంకటేశ్, రాజేశ్వరి (30), రంగారెడ్డి జిల్లాకు చెందిన తాండూర్‌కు చెందిన దంపతులు నర్సింహ, చిట్టెమ్మ(34) నగరంలోని నిజాంపేట రాజీవ్ గృహకల్ప సముదాయంలో ఉంటున్నారు. కాగా డ్వాక్రా గ్రూపు రాజీవ్‌గాంధీ పొదుపు జ్యోతి సంఘానికి రాజేశ్వరి, చిట్టెమ్మ టీమ్ లీడ్లరుగా వ్యవహరిస్తున్నారు. సోమవారం గండిమైసమ్మలోని ఎస్బీహెచ్ బ్యాంక్‌లో డబ్బులు డ్రా చేసేందుకు రాజీవ్‌గృహకల్పలో ఆటో ఎక్కారు. అది బౌరంపేట సమీపంలోని డాంబర్ ప్లాంట్ వద్ద ముందు వెళ్తున్న వాహనాన్ని ఓవర్‌టెక్ చేయబోయి ఎదురుగా వస్తున్న హర్యానాకు చెందిన కంటైనర్‌ను ఢీ కొట్టింది. లారీ ఎదురుగా వేగంగా ఢీకొట్టడంతో పాటు సుమారు 20 అడుగుల వరకు ఆటోను లాక్కెళ్లింది. దీంతో తీవ్రంగా గాయపడ్డ రాజేశ్వరి, చిట్టెమ్మలతో పాటు బాచుపల్లి సాయినగర్‌కు చెందిన ఆటో డ్రైవర్ నర్సింహ(40) అక్కడికక్కడే మృతి చెందారు. నర్సింహ అల్లుడు నరేశ్‌కు తీవ్ర గాయాలవడంతో అతన్ని 108లో ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. రాజేశ్వరి, చిట్టెమ్మల తలలు నుజ్జునుజ్జయ్యాయి. కంటైనర్ డ్రైవర్ పరారీలో ఉన్నాడు. దుండిగల్ సీఐ బాలకృష్ణ సంఘటనా స్థలానికి చేసుకుని ట్రాఫిక్‌ను నియంత్రించారు. మృతదేహాలను గాంధీ ఆస్పత్రికి తరలించారు. కేసు దర్యాపులో ఉంది. రాజీవ్ గృహకల్పలో విషాదఛాయలు రాజేశ్వరి, చిట్టెమ్మల మృతితో నిజాంపేట రాజీవ్ గృహకల్పలో విషాదఛాయలు అలుముకున్నాయి. డ్వాక్రా గ్రూపునకు లీడర్లుగా వ్యహరిస్తూ ఎంతో కలివిడిగా ఉండే వారి హఠాన్మరణంతో ఆ ప్రాంత మహిళలు కన్నీరు మున్నీరయ్యారు. రాజేశ్వరి, చిట్టెమ్మలు దినసరి కూలీలుగా పని చేస్తుండగా.. వీరిద్దరికీ ఇద్దరు చిన్న పిల్లలున్నారు. కాగా చిట్టెమ్మ భర్త నర్సింహ మానసిక స్థితి బాగాలేదని స్థానికులు తెలిపారు.