బడిఅమ్మ... | Donation to education | Sakshi
Sakshi News home page

బడిఅమ్మ...

Published Tue, Nov 17 2015 12:10 AM | Last Updated on Sat, Sep 15 2018 4:12 PM

బడిఅమ్మ... - Sakshi

బడిఅమ్మ...

మొక్కులు చెల్లించుకుంటాం.
కానుకలు చదివించుకుంటాం.
కానీ గనికమ్మ ఏ దైవానికీ మొక్కుకోలేదు.
ఏ దైవ సమానులకూ కానుకలు చదివించుకోలేదు.
సరస్వతీదేవి ఒడి లాంటి బడి కోసం
ఏ ముడుపూ కట్టకుండానే...
ఏ మొక్కూ మొక్కకుండానే...
ఆస్తి మొత్తాన్ని చదివించుకుంది!
ఊరి బడి కోసం ఉన్నదంతా ఊడ్చిపెట్టింది.
గనికమ్మను ఏమనాలి?
చదువుల తల్లి అనొచ్చు.
చదువులకు తల్లి అనొచ్చు.
పెద్ద మనసున్న ఈ అమ్మను...
బడి అమ్మ అనీ అనొచ్చు.
అక్షరం ముక్కరాని గనికమ్మ...
అ.. ఆ.. లకు... కానుకమ్మ!

 
తూర్పు గోదావరి జిల్లా.. అమలాపురం.. కామనగరువు దగ్గర్లో చిట్టెమ్మ చెరువు గ్రామం. ఆ గ్రామానికి చెందిన గిడ్డి గనికమ్మకు 75 ఏళ్లు. అమె  నిరక్షరాస్యురాలు. గొప్ప గొప్ప వారి జీవిత కథలేవీ ఆమె వినలేదు, వారి నుంచి స్ఫూర్తి పొందడానికి. ఆమెకు తెలిసింది తనకు లేకపోయినా సరే, ఉన్నదాన్ని నలుగురికీ పంచాలన్న మంచి. ఆ గుణమే ఈ రోజు ఆమెను అందరిలో ప్రత్యేకంగా నిలిపింది. ఇంటి జాగా తప్ప మరే ఆస్తిపాస్తులు లేని ఈ నిరుపేద వృద్ధురాలు గ్రామం కోసం తనకున్న మొత్తం ఆస్తిని రాసి ఇచ్చేసి నేటి ‘శ్రీమంతులను’ మించిపోయింది. నిలువ నీడ లేకుండా సర్వస్వాన్ని దానం చేసిన ఆమె సేవా గుణానికి ఆ ఊరు ఊరంతా బ్రహ్మరథం పట్టింది. కడుపేదరాలై ఉండి.. ఏకాకిగా ఉన్న తనకు రోజు ఎలా గడుస్తుందన్న ఆలోచన లేకుండా 20 లక్షల రూపాయల విలువచేసే ఆస్తిని అవలీలగా దానం చేసిన గనికమ్మ గురించి ఎంత చెప్పినా తక్కువే అని కొనియాడుతున్నారు గ్రామస్తులు.

ఊళ్లో బడి తొలిగిస్తారని తల్లడిల్లి...
 చిట్టెమ్మ చెరువు గ్రామంలో గల ప్రభుత్వ స్థలంలో మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల ఉంది. అయితే జాతీయ రహదారి బైపాస్ రోడ్డు
 నిర్మాణంలో భాగంగా ఊళ్లోని బడిని తొలగించాల్సి వస్తోంది. ఈ వార్త విన్నప్పటి నుంచి గనికమ్మ తల్లడిల్లిపోయింది. ‘అయ్యో... నా ఊళ్లో బడి భవనాన్ని తొలగించేస్తే పిల్లలు ఎక్కడ చదువుకుంటారు’ అని ఆందోళన చెందింది. ఇదే విషయాన్ని ఊళ్లో అందరి వద్ద వాపోయింది. గనికమ్మకు చదువుకునే పిల్లలంటే తగని ప్రేమ. అప్పడప్పుడు ఆ బడికి వెళ్లి పిల్లలకు చాక్‌లెట్లు, మిఠాయిలు పంచిపెట్టి వస్తుండేది. తన వద్దకు వచ్చే పిల్లలకు చదవు విలువ చెప్పేది. అక్కడ అందరూ కూలినాలి చేసుకుని బతికే కుటుంబాలకు చెందిన పిల్లలే కావటంతో వారు చక్కగా చదువుకుంటే జీవితం ఎంతబాగుంటుందో తెలియజెప్తుతుండేది. పిల్లలంతా పొద్దునే బడికెళుతుంటే వారినే చూస్తూ ఉండిపోయేది. బళ్లో పిల్లల పాఠాలు వల్లెవేస్తుంటే ఆనందంగా వింటూ ఉండిపోయేది. ఎందరికో అక్షరాలు నేర్పిన బడిని దేవాలయంలా తలచేది.  చదువుకునే పిల్లలపై మమకారం పెంచుకున్న ఆమె బడి తొలగింపు మాట విని తట్టుకోలేకపోయింది.

 కాయకష్టంతో సంపాదించిన సొమ్ము...
 గనికమ్మకు పేగు తెంచుకుని పుట్టిన సంతానం లేదు. భర్త వెంకన్న 40 ఏళ్ల కిందటే చనిపోయాడు. తమ్ముడి కూతురైన మేనకోడలు అప్పుడప్పుడు గనికమ్మ బాగోగులు చూసేది. ఆమెకు పెళై ్ల మెట్టినింటికి వెళ్లింది. అయితే మేనకోడలు సొంత ఇల్లు లేక కష్టాలు పడుతుండటం చూసిన గనికమ్మే భర్త ద్వారా తనకు సంక్రమించిన భూమిని అమ్మేసి పదేళ్ల కిందటే ఇల్లు కట్టించి ఇచ్చింది. భర్త చనిపోయినప్పటి నుంచీ కూలీ పనిచేసుకుంటూ బతికింది. అన్నమో రామచంద్ర అని తల్లడిల్లిన వారికి తను తినే దాంట్లో ఇంత పంచింది. వృద్ధాప్యం మీద పడటంతో ఓపికి లేక ఈ మధ్యే కూలీ పనులకు దూరమైంది. కాయ కష్టంతో సంపాందించిన సొమ్ము, ప్రభుత్వం ఇచ్చిన గృహ నిర్మాణ ఆర్ధిక సాయంతో 20 ఏళ్ల కిందట కట్టుకున్న సొంత ఇల్లే ఆమెకున్న ఏకైక ఆస్తి. ఇప్పుడు ఆ ఇల్లు, ఇంటి స్థలం విలువ రూ.20 లక్షల పైనే ఉంటుంది.

 ఇంటి స్థలాన్ని బడికి ఇచ్చేసి...
 గనికమ్మను తొలచివేస్తున్న బడి తొలగింపు సమస్యను తన సేవా భావంతో... తనకున్న ఇంటి స్థలంతో పరిష్కరించి ఊపిరి పీల్చుకుంది. తనకు ఒకే ఒక్క ఆధారంగా ఉన్న ఇంటిని, అయిదు సెంట్ల ఇంటి స్థలాన్ని బడి కోసం త్యాగం చేసింది. తాను బతికి ఉండగానే ఆ స్థలంలో బడి భవనాన్ని నిర్మించి దానికి తన భర్త పేరు పెట్టాలని గ్రామపంచాయతీని అభ్యర్థించింది. దానికి అంతా సంతోషంగా అంగీకరించారు.
 
జగమంత కుటుంబం...

 గనికమ్మ ఒంటరిదైనా ఊళ్లోని బడికి భూదానం చేయటంతో ఆమెను ఇప్పుడంతా సేవా మూర్తిగా కొలుస్తున్నారు. ఇంటి స్థలంలో బడిని నిర్మించేస్తే గనికమ్మకు తల దాచుకునే వీలు ఉండదని తెలిసి గ్రామస్థులు ఆమెకు అండగా ఉంటామంటూ ముందుకు వచ్చారు. గ్రామ సర్పంచి రాజులపూడి భీముడు, అమలాపురం మండల పరిషత్ అధ్యక్షుడు బొర్రా ఈశ్వరరావు ఆమె ఆలనా పాలనా తాము చూసుకుంటామని ప్రకటించారు. గనికమ్మను ఊళ్లో ఊరేగించి ఘనంగా సన్మానం చేశారు.
 - అరిగెల రుద్ర శ్రీనివాసరావు, అమలాపురం రూరల్, తూర్పు గోదావరి
 
ఊరు బాగుండాలనే...

నాకంటూ ఎలాంటి ఆశలు లేవయ్యా. ఒంటిరిగానే బతుకుతున్నాను. ఇంక ఎంతో కాలం బతకను. నాకున్న ఈ కొద్దిపాటి ఆస్తితో బడి ఏర్పడుతోందని చాలా ఆనందంగా ఉంది. ఊరు బాగుండాలని ఎప్పుడూ కోరుకుంటాను. అందుకే ఈ భూదానం చేశాను. పోతూ కూడా ఏమీ తీసికెళ్లలేం. నేను చనిపోయినా నా గుర్తుగా బడి ఉంటుంది. అది చాలు నా పేద బతుక్కి.
 - గిడ్డి గనికమ్మ
 
అన్ని దానాలనూ మించిన దానం...
బడికెళ్లే పిల్లలు బడే లేకపోతే ఏమైపోతారనే  ఆలోచనతో గనికమ్మ చేసిన ఈ దానం అన్ని దానాలనూ మించిన దానం. నిలువ నీడ కూడా ఉంచుకోకుండా ఊరి కోసం... బడి కోసం ఆస్తిని రాసిచ్చిన గనికమ్మకు ఊరంతా రుణపడి ఉంటుంది.
 - బొర్రా ఈశ్వరరావు, అమలాపురం
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement