పండినా ఎండినా చేను చేనేరా... అంది!
మా అమ్మ : ఆర్. నారాయణమూర్తి
అరవై రెండేళ్ల ఆర్. నారాయణమూర్తి గొంతెత్తితే కంచు గంట మోగినట్లు ఉంటుంది. పిడికిలి బిగిస్తే అది పోరాట గళం అవుతుంది. కళ్లెర్ర చేస్తే పీడించే వర్గం వెన్నులో వణుకు పుడుతుంది. నిత్యం రగిలే సూర్యుడిలా కనిపించే ఈ విప్లవ నారాయణుడిని తన మాతృమూర్తి గురించి చెప్పమని అడిగినప్పుడు.. అమ్మను, అమ్మ మలిచిన తన బాల్యాన్ని గుర్తు చేసుకున్నారు. ఆ కొద్దిసేపూ మమకారపు ఊయలలో ఊగుతున్నట్లే కనిపించారు.
‘‘మాది తూర్పు గోదావరి జిల్లా, రౌతులపూడి మండలం, మల్లంపేట గ్రామం. మా అమ్మ చిట్టెమ్మ, నాన్న రెడ్డి చిన్నయ్య నాయుడు. మాది చాలా సామాన్యమైన రైతు కుటుంబం. మా ఊరి నుంచి చదువుకోడానికి వెళ్లేది నేనొక్కడినే. రౌతులపూడిలో ఐదవ తరగతి తర్వాత శంఖవరం హైస్కూల్లో చేరాను. అది మా మల్లంపేటకు 14 కిలోమీటర్లు. రానూపోను రోజూ 28 కిలోమీటర్ల నడక. అది కాదు కష్టం. నన్ను బడికి పంపించడానికి మా అమ్మ రోజూ తెల్లవారుజామున మూడున్నరకే లేచి అన్నం వండి క్యారియర్ పెట్టేది. నేను నాలుగున్నరకు బయలుదేరేవాడిని.
దారంతా చీకటి. దారి మధ్యలో గుమ్మరేకల మెట్ట అనే కొండను చూడాలంటేనే భయమేసేది. ఆ కొండమీద దెయ్యాలుంటాయనే కథలు మా ఊరంతా చెప్పుకునేవారు. రాత్రి ఇంటికొచ్చేటప్పుడూ ఆ కొండ దగ్గరకు వచ్చేటప్పటికి చీకటయ్యేది. అమ్మతో... ‘‘కొండ పక్కనుంచి వెళ్లాలంటే భయమేస్తోందమ్మా’’ అన్నాను. అప్పుడామె పల్లెలో అందరూ భయపడినట్లు దెయ్యానికి భయపడలేదు సరికదా ‘జై భజరంగభళీ’ అని ఆంజనేయుడిని తలుచుకో. నిన్ను ఏ దెయ్యమూ ఏం చేయదు’ అని చెప్పింది.
ఊరికి నన్ను తొలి గ్రాడ్యుయేట్‌ని చేసింది
మా అమ్మ అంత కష్టపడి నన్ను బడికి పంపిస్తే నేనేమో టెన్త్ ఫెయిలయ్యాను. మా నాన్న అసలే కోపిష్టి. ఫెయిలైనందుకు కొడతాడని ఇంట్లో వాళ్లకు కనిపించలేదు. అమ్మ ఊరంతా వెతికింది. నేను ఇంటి వెనకాలే దాక్కుని ఏడుస్తున్నాను. నాకోసం వెతికి వెతికి అలసిపోయింది అమ్మ. చీకటి పడే వేళకు ఇంటికొచ్చి ఏదో పని మీద పెరట్లోకి వచ్చింది. ఏడుస్తున్న నన్ను అమాంతం దగ్గరకు తీసుకుని ఓదార్చింది.
ఓదార్చి ఆమె అన్న మాట ఇప్పటికీ గుర్తొచ్చినప్పుడు ఆమె పాదాలను తాకి దణ్ణం పెట్టాలనిపిస్తుంది. ఆమె ఏమన్నదో తెలుసా!! ‘‘మనం ఏటా చేలో పంటవేస్తాం. ఒక ఏడాది పండితే మరొక ఏడాది ఎండుతుంది. మరో ఏడాది వరదకు కొట్టుకుపోతుంది. అలాగని పంట వేయడం మానుతామా? చేను చెడ్డదని తప్పు పడతామా? పక్కటేడాది దుక్కి దున్నడం మానేస్తామా? పరీక్షా అంతే. వచ్చే ఏడు పాసవుతావు’’ అన్నది అమ్మ.
అలా మా అమ్మ నన్ను ఊరికి తొలి గ్రాడ్యుయేట్‌ని చేసింది. ఆఖరికి నేను సినిమాల్లోకి వెళ్తానంటే నాన్నకు తెలియకుండా 70 రూపాయలిచ్చి పంపించింది. ఇప్పుడు మీరు చూస్తున్న నారాయణమూర్తి ఆవిర్భావానికి ఆమె తోడ్పాటే కారణం. ఆ రోజు అమ్మకు దణ్ణిం పెట్టి వెళ్లాను. ఇప్పటికీ ప్రతి సినిమా విడుదల తర్వాత ఓసారి మా ఊరెళ్లి అమ్మకు కనిపిస్తాను’’.
కడుపు నిండా అమ్మ ప్రేమ
సినిమాల్లోకి వచ్చాక కొంతకాలం వేషాల్లేక కష్టాలు పడ్డాను. అప్పుడు అమ్మ ఓ మాటంది. ‘‘నువ్వింకా కొంతకాలం వేషాల కోసం ప్రయత్నిస్తానంటే అలాగే చెయ్యి. కానీ డబ్బుల్లేవని పస్తులు మాత్రం ఉండకు. బియ్యం, పప్పులు పంపిస్తాను. వండుకుని రోజూ అన్నం తిను’’ అన్నది. ఆ మాట తలుచుకుంటే ఇప్పటికీ కళ్లలో నీళ్లు తిరుగుతాయి నాకు.
కళ్లారా రాముని కోవెల
నేను సంపాదించడం మొదలు పెట్టాక కూడా తమ కోసం డబ్బు పంపించమని అడగలేదింతవరకు మా అమ్మ. ఆమె కోరింది మా ఊళ్లో రాముని కోవెల మాత్రమే. ఊరంతా పెళ్లిళ్లు, ఇతర వేడుకలు చేసుకోవడానికి అనువుగా ఉంటుందని ఆమె ఉద్దేశం. ఆ కోవెలలో ఎన్నో పెళ్లిళ్లను ఆమె కళ్లారా చూస్తోందిప్పటికీ. నా పెళ్లి చూడలేని కొరతను ఆమె ఆ రకంగా పూరించుకుంటోంది.
-సంభాషణ: వాకా మంజులారెడ్డి