అరణ్య ఘోష
అరణ్య ఘోష
Published Tue, Sep 5 2017 9:56 PM | Last Updated on Sun, Apr 7 2019 4:41 PM
నిర్వాసితుల గొంతు వినిపించే నాథుడేరి..?
ఎన్నుకున్న ప్రతినిధులు తెలంగాణలో
విలీనమైనా పట్టించుకోని జిల్లా నేతలు
ప్రభుత్వానికి వెతలెలా విన్నవించాలి
పోలవరం నిర్వాసితుల ఆవేదన
వేలేరుపాడు:
’ఎవరికి పుట్టిన బిడ్డరా ఎక్కెక్కి ఏడుస్తోంది..’ అన్నట్లు వేలేరుపాడు, కుక్కునూరు మండలాల్లోని పోలవరం గిరిజన, గిరిజనేతర నిర్వాసితుల ఆక్రందనలు అరణ్య ఘోషగా మిగిలిపోతున్నాయి. రాష్ట్ర విభజన జరిగినప్పుడు అనేక కష్ట, నష్టాలను ఈ ప్రాంత ప్రజలు ఎదుర్కొన్నారు. విభజన అనంతరం ఆంధ్రప్రదేశ్‌లోని పోలవరం ముంపు పరిధిలోకి వచ్చి చేరారు. ఇప్పటికే అన్ని విధాలా నష్టపోతూ వస్తున్న నిర్వాసితులకు తమ గోడు ప్రభుత్వానికి విన్పించే సొంత గొంతు లేకుండా పోయింది.
పోలవరం ముంపు ప్రాంతంలో ఉన్న వేలేరుపాడు, కుక్కునూరు మండలాల్లో ప్రాదేశిక ఎన్నికలు జరగలేదు. తెలంగాణలో ఉన్న తమ ప్రాంతాన్ని ఆంధ్రాలో కలపాలని కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని నిరసిస్తూ రాజకీయాలకతీతంగా అన్ని పార్టీలు అప్పట్లో ఏకమయ్యాయి. తమ గోడు రాష్ట్రపతి, గవర్నర్ ఎన్నికల కమిషన్ వరకు తీసుకు వెళ్లాలని, రెండు మండలాల్లో ఎన్నికలను బహిష్కరించారు. దీంతో పూర్తిగా ఎన్నికలు రద్దయ్యాయి. ఈ రెండు మండలాల్లో మొత్తం 32,513 మంది ఓటర్లు ఎన్నికలకు దూరమయ్యారు. కుక్కునూరు మండలంలో 18,272, వేలేరుపాడు మండలంలో 14,241 మంది ఓటర్లున్నారు. మొత్తం రెండు జడ్‌పీటీసీ, 15 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరగలేదు. కుక్కునూరు మండలంలో జడ్‌పీటీసీ, ఎనిమిది ఎంపీటీసీ స్థానాలకు అసలు నామినేషన్‌లు వేయకుండానే ఎన్నికలను బహిష్కరించారు. వేలేరుపాడు మండలంలో ఏడు ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరగలేదు. దీని ఫలితంగా ఈ ప్రాంత నిర్వాసితులకు అధికారులే దిక్కయ్యారు. ఈ ప్రాంత నిర్వాసితులు ఏ సమస్య పరిష్కారం కోసం అధికారుల దగ్గరకు వెళ్లినా ప్రభుత్వం వద్ద తేల్చుకోమని చెబుతున్నందున ఏమి చేయాలో పాలుపోక దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు.
ముంపు మండలాలను వదిలేసిన తెలంగాణ ఎంపీ, ఎమ్మెల్యేలు...
విభజనకు ముందు ఈ రెండు మండలాలు తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం పార్లమెంట్ పరిధిలో ఉండేవి. అశ్వారావుపేట నియోజకవర్గ ఎమ్మెల్యేగా అప్పట్లో తాటి వెంకటేశ్వర్లుకు ఓట్లు వేసి ఇక్కడి ప్రజలు గెలిపించారు. తాటికి వేలేరుపాడు సొంత మండలం కావడంతో మెజార్టీ కూడా లభించింది. ఖమ్మం ఎంపీగా పొంగులేటి శ్రీనివాసరెడ్డిని ఈ రెండు మండలాల ప్రజలే ఎక్కువ మెజార్టీతో గెలిపించారు. విభజన అనంతరం వీరిద్దరు ఈ మండలాలను తమకు సంబంధం లేనట్లు వదిలేశారు. అప్పట్లో వీరిద్దరు వైసీపీ తరుపున గెలుపొందినప్పటికీ ప్రస్తుతం టీఆర్‌ఎస్‌లో చేరారు.
మూడేళ్లలో ఒకసారి మండలాల కొచ్చిన కలెక్టర్ భాస్కర్...
ఈ రెండు మండలాలు ఆంధ్రప్రదేశ్‌లో విలీనమైన మూడేళ్లలో కలెక్టర్ కాటంనేని భాస్కర్ వేలేరుపాడు, కుక్కునూరు మండలాలకు ఒక్కసారి మాత్రమే విచ్చేశారు. అది కూడా ఏలూరు ఎంపీ మాగంటి బాబు, పోలవరం ఎమ్మెల్యే మిడియం శ్రీనివాసరావు వెంట పర్యటించారు. ఆ తర్వాత ఈ మండలం వైపు కన్నెత్తి చూడలేదు. ‡
పట్టించుకోని పశ్చిమ ఎంపీ, ఎమ్మెల్యేలు...
విభజన అనంతరం ఈ రెండు మండలాలు పశ్చిమగోదావరి జిల్లాలో కలిపారు. ఎంపీ వచ్చేటప్పటికి ఏలూరు, అసెంబ్లీ స్థానం పోలవరం పరిధిలో చేరారు. విలీనమయ్యాక ఈ రెండు మండలాల్లో ఏలూరి ఎంపీ మాగంటి బాబు ఒకసారి, పోలవరం ఎమ్మెల్యే మిడియం శ్రీనివాసరావు రెండు మూడు సార్లు వచ్చారు. ఆ తర్వాత ఈ మండలాలకు వచ్చిన దాఖలాలు లేవు.
మా గోడు ఎవరికి చెప్పుకోవాలి?
పొంగులూరి సాంబశివరావు, నిర్వాసిత రైతు, వేలేరుపాడు
మాగోడు ఎవరికి చెప్పుకోవాలి. మేం ఓట్లు వేసి గెలిపించుకున్న ఎంపీ, ఎమ్మెల్యేలు తెలంగాణ రాష్ట్రంలోకి వెళ్లిపోయారు. మళ్లీ మా వైపు కన్నెత్తి కూడా చూడటంలేదు. మేం అన్ని రకాలుగా నష్టపోయాం.
అనాథలుగా మిగిలాం:
వెంకన్నబాబు, రైతు, తాట్కూరుగొమ్ము, వేలేరుపాడు మండలం
తెలంగాణ ప్రభుత్వం మమ్మల్ని వదిలేసింది. మా మండలాలను పూర్తిగా ఆంధ్రాలో విలీనం చేసినా, పశ్చిమగోదావరి జిల్లా ఎంపీగానీ, ఎమ్మెల్యే గానీ మా సమస్యలు పట్టించుకోవడంలేదు. అనాథలుగా బతకాల్సిన దుస్థితి మా కొచ్చింది.
మా గొంతు వినిపించే వారే కరువయ్యారు
పూరెం లక్ష్మయ్య, మాజీ ఎంపీపీ
పోలవరం ప్రాజెక్టు వల్ల ఈ ప్రాంత ప్రజలు ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నారు. అధికారుల దగ్గరకు వెళితే, ప్రభుత్వంతో మాట్లాడుకోమంటారు. ఎవరికి చెప్పుకోవాలి
Advertisement
Advertisement