రుణమాఫీపై రెండు ప్రభుత్వాల దొంగాట
వేలేరుపాడు, న్యూస్‌లైన్: రైతుల రుణమాఫీపై ఆంధ్రా, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలు దొంగాట ఆడుతున్నాయని ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి విమర్శించారు. ఆదివారం పోలవరం ముంపు ప్రాంతాలైన వేలేరుపాడు, కుక్కునూరు, కూనవరం, వీఆర్‌పురం, భద్రాచలం మండలాల్లో ఆయన పర్యటించారు. ఆయన వెంట అశ్వారావుపేట, పినపాక ఎమ్మెల్యేలు తాటి వెంకటేశ్వర్లు, పాయం వెంకటేశ్వర్లు కూడా ఉన్నారు. వేలేరుపాడు మండలంలోని రేపాకగొమ్ము, రుద్రమకోట గ్రామాల్లో పర్యటించారు.
రైతుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. రుద్రమకోట వద్ద లాంచీలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పొంగులేటి మాట్లాడారు. ప్రభుత్వాలు ఏర్పడి వందరోజులవుతున్నా రుణమాఫీపై ఇప్పటివరకు స్పష్టత ఇవ్వలేదన్నారు. తెలంగాణా రాష్ట్రంలో లక్ష వరకు మాఫీ అన్నారు...ఆంధ్రాలో లక్షన్నర అంటున్నారు...కానీ మాఫీ చేయడం లేదు...ఈ రెండు ప్రభుత్వాల తీరుతెన్నులు రైతులకు నష్టం తెచ్చిపెట్టేలా ఉన్నాయని విమర్శించారు.
రాష్ట్రాల విభజన కాకముందు రైతులు ఆ ప్రాంత బ్యాంకుల్లో బంగారం పై వ్యవసాయ రుణాలు పొందారని, విభన జరిగాక బ్యాంకులు తెలంగాణలోకి వెళ్ళాయని, ఖమ్మం జిల్లాలో రుణాలు పొందిన రైతుల ప్రాంతమంతా పోలవరం ముంపు పేరుతో ఆంధ్రాలోకి కలిపారని, వీరందరికీ తెలంగాణ ప్రభుత్వమే మాఫీ చేయాలని డిమాండ్ చేసారు. ఇప్పటికైనా రుణమాఫీ విధివిధానాల పై స్పష్టత ఇచ్చి, రైతుల్ని ఆదుకోవాలని డిమాండ్ చేశారు.
ముంపు మండలాల వాసులకు ఎల్లవేళలా అండగా ఉంటా....
‘మీరంతా ఓట్లువేసి నన్ను గెలిపించారు. మీకు ఎల్లవేళలా అండగా ఉంటా...ఆంధ్రలో కలిపినా మీరంతా తెలంగాణ బిడ్డలు...ముంపు ప్రాంతం నా సొంత కుటుంబం లాంటిది..ఏడు మండలాల ప్రజలను అన్ని విధాలా ఆదుకుంటాను’ అని శ్రీనివాసరెడ్డి భరోసా ఇచ్చారు. గత ఏడాది వచ్చిన వరదలు, తుపానులకు రైతులు తీవ్రంగా నష్టపోయినా ప్రభుత్వం నేటివరకు పంటనష్టపరిహారం అందించకపోవడం దారుణ మన్నారు. ఇటీవల వచ్చిన గోదావరి వరదలకు నష్టపోయిన రైతులకు పత్తి, మిర్చి పంటలకు ఎకరాకు 30 వేలు, వరికి 25 వేలు నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు.
పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆధ్వర్యంలో రైతుసమస్యలపై గవర్నర్ నర్సింహన్‌ను కలవనున్నట్లు శ్రీనివాసరెడ్డి తెలిపారు. ముంపు ప్రాంతంలో రైతులకు మంచి ప్యాకేజీ అందేలా గవర్నర్‌కు నివేదిస్తామని పేర్కొన్నారు. ఎంపీ వెంట రేపాకగొమ్ము సర్పంచ్ కారం వెంకటరమణ, వేలేరుపాడు మండల పార్టీ కన్వీనర్ కేసగాని శ్రీనివాసగౌడ్, కామినేని వెంకటేశ్వర్లు, సత్తుపల్లి నాయకులు మట్టా దయానంద్ తదితరులు ఉన్నారు.