నరసాపురం : వర్షాకాలంలో ఆగస్టు నెల వచ్చిందంటే చాలు గోదావరిలో పులసలు సందడి చేస్తుంటాయి. మత్స్యకారులు సంప్రదాయ పడవల్లో వాటి వేటలో బిజీగా ఉంటారు. అయితే ఈ ఏడాది గోదావరిలో పులసల జాడ ఆగస్టు నెల వచ్చినా కానరావడం లేదు. ప్రస్తుతం వరదల ఉధృతి తగ్గడంతో చేపల వేట సాగుతోంది. గోదావరిలో కేవలం ఎర్ర నీరు ఉన్నప్పుడు మాత్రమే లభ్యమయ్యే పులసల కోసం మత్స్యకారులు వేటను ముమ్మరం చేశారు. కొన్ని రోజులుగా అటు అంబేడ్కర్ కోనసీమ జిల్లా అంతర్వేది నుంచి ఇటు పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం నుంచి సిద్ధాంతం వరకూ గోదావరిలో పులసలు పట్టడం కోసం తీవ్రంగా శ్రమిస్తున్నారు. పులసలకు ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశవ్యాప్తంగా మంచి క్రేజ్ ఉంది.
పుస్తెలమ్మయినా పులస తినాలనే నానుడి గోదావరి జిల్లాలో ఎప్పటి నుంచో ఉంది. ఎంత ధరైనా కొని తినాలని ఆరాటపడుతుంటారు. అంత డిమాండ్ ఉన్నందుకే వీటి ధరలు కూడా అంతే స్థాయిలో ఉంటాయి. పులసల సీజన్‌లో ఈ ప్రాంతం వారు వాటిని కొనుగోలు చేసి హైదరాబాద్, విశాఖపట్నం లాంటి దూర ప్రాంతాల్లోవున్న బంధువులు, స్నేహితులకు పంపుతుంటారు. పలువురు ముఖ్యమంత్రులు, ప్రజాప్రతినిధులు కూడా పులస రుచి చూసి ప్రశంసించారు. సముద్రంలో ఇలసగా పిలిచే చేప గోదావరిలోకి ఎర్రనీరు రాగానే ఈదుకుంటూ వస్తాయి.
సముద్రంలో వందల మైళ్లు ప్రయాణించి.. ఎర్రనీటికి ఎదురు ప్రవహించి రావడం వీటి ప్రత్యేకత. గోదావరిలోకి రాగానే వీటి శరీరంలో కొన్ని మార్పులు చోటుచేసుకుంటాయి. దానిలో ఒమేగా ఫ్యాటీ ఆమ్లాలు శాతం పెరగడంతో మంచి రుచి వస్తుంది. నీటికి ఎదురు ప్రవహించే క్రమంలో రెండు మూడు రోజుల్లోనే ఇలస.. పులసగా మారుతుంది. మారిన ఇలస రుచి మంచి వాసనతో నోరూరిస్తుంది. పులస, ఇలస ఒకేలా ఉండడంతో వీటిని గుర్తించడం కొంచెం కష్టం. గోదావరిలో ఎర్రనీరు ఎప్పటి వరకూ ఉంటుందో అప్పటి వరకూ దొరికేవి మాత్రమే పులసలని, మిగతావన్నీ ఇలసలుగా భావించాలని చెబుతారు.
పులసలు దొరికేది ఇక్కడే..
ప్రధానంగా నరసాపురం, సిద్ధాంతం, అంతర్వేది ప్రాంతాల్లో పులసలు ఎక్కువగా దొరుకుతాయి. ఈ ప్రాంతంలోనే పెద్ద సంఖ్యలో మత్స్యకారుల వలలకు చిక్కుతాయి. ఇటు సిద్ధాంతం వరకూ అలాగే తూర్పు గోదావరి జిల్లాలోని రాజోలు, గన్నవరం ప్రాంతాల వరకూ పులసల వేట ముమ్మరంగా సాగుతుంది. నరసాపురం, అంతర్వేది మార్కెట్‌ల్లోనూ రావులపాలెం, సిద్ధాంతం, చించినాడ వంతెనల వద్ద పులసల అమ్మకాలు సాగుతాయి.
రంగపొల వలలకే పులస చిక్కేది
సముద్రంలో వేట సాగించే పెద్ద బోట్ల కంటే చెక్కనావల్లోని వలలకే పులసలు చిక్కుతాయి. పులసల వేట కోసం చెక్కనావలపై మత్స్యకారులు ప్రత్యేక వలలను ఉంచుతారు. వీటిని ‘రంగపొల’ వలలుగా పిలుస్తారు. ఓ వంద వరకూ చెక్కనావల ద్వారా వేట సాగిస్తే ఓ పదిహేను, ఇరవై పడవలకు మాత్రమే పులసలు పడతాయని మత్స్యకారుడు రేవు అప్పారావు చెప్పారు. పెద్ద బోట్ల వలలకు పరిమిత సంఖ్యలోనే పులసలు లభిస్తాయి. పులసలు తెల్లవారుజాము ప్రాంతంలో ఎక్కువగా పడతాయి. దీంతో మత్స్యకారులు అర్ధరాత్రి నుంచి వేట సాగిస్తారు.
వేల నుంచి రూ. లక్షల్లో ధర
పులసలు అరకిలో నుంచి రెండు కిలోల వరకూ బరువుంటాయి. సైజును బట్టి వీటి ధర లక్షల వరకూ వెళ్లిన సందర్బాలు కూడా ఉన్నాయి. నగరాల్లో పులసలకు డిమాండ్ ఉన్నా ఎగుమతులకు ఆస్కారం లేదు. తక్కువ సంఖ్యలో పులసలు దొరకడమే అందుకు కారణం.
అర్ధరాత్రి వేటకు వెళ్తాం
ఈ సీజన్‌లో పులసలు పడతాయి. ఒక్క పులస దొరికినా మాకు రెండు, మూడు నెలలకు సరిపడా డబ్బులు వస్తాయి. మా చెక్క బోట్లకే పులసలు ఎక్కువగా పడతాయి. అందుకే అర్ధరాత్రి గోదావరిలోకి వెళ్ళి ఉదయం వరకూ వేటాడతాం.
– మోకా సత్యనారాయణ, మత్స్యకారుడు
రంగపొల వలలకే చిక్కుతాయి
మా పెద్ద బోటు వలలకు పులసలు పెద్దగా పడవు. చిన్నగా వుండే రంగపొల వలలకే పులసలు చిక్కుతాయి. ఎర్రనీటిలో దొరికేవి మాత్రమే పులసలు. ఇతర రాష్ట్రాల నుంచి పులసలను పోలిఉండే చేపలు పట్టుకొచ్చి అమ్మేస్తున్నారు.
– తిరుమాని గంగయ్య, మత్స్యకారుడు
Comments
Please login to add a commentAdd a comment