Fisheries Industry
-
గంగపుత్రులకు మరింత చేరువగా..
కొవ్వూరు: జిల్లాల పునర్విభజన పుణ్యమా అని మత్స్యకారులకు ఆ శాఖ సేవలు మరింత చేరువయ్యాయి. గతంలో ఉన్న జాయింట్ డైరెక్టర్ పోస్టును ఇప్పుడు జిల్లా మత్స్యశాఖ అధికారిగా మార్చారు. రాజమహేంద్రవరంలో 10, కొవ్వూరులో 9 మండలాలు ఉండేటట్లు జిల్లాను రెండు డివిజన్లుగా విభజించారు. అసిస్టెంట్ డైరెక్టర్ల (ఏడీ) పర్యవేక్షణలో ఈ డివిజన్లు పని చేస్తాయి. రాజమహేంద్రవరం డివిజన్లో రాజమహేంద్రవరం అర్బన్, రూరల్, కడియం, కోరుకొండ, సీతానగరం, గోకవరం, రాజానగరం, అనపర్తి, బిక్కవోలు, రంగంపేట మండలాలు ఉంటాయి. ఈ డివిజన్లో ఏడీతో పాటు ఇద్దరు మత్స్యశాఖ డెవలప్మెంట్ అధికారులు, ఇద్దరు అసిస్టెంట్ ఇన్స్పెక్టర్లు, 10 మంది గ్రామ మత్స్యశాఖ సహాయకులు పని చేస్తారు. కొవ్వూరు డివిజన్లో కొవ్వూరు, చాగల్లు, తాళ్లపూడి, నిడదవోలు, గోపాలపురం, దేవరపల్లి, నల్లజర్ల, పెరవలి, ఉండ్రాజవరం మండలాలు ఉంటాయి. ఈ ఏడీ పరిధిలో ఇద్దరు అసిస్టెంట్ ఇన్స్పెక్టర్లు, గ్రామ మత్స్యశాఖ సహాయకులు ఉంటారు. గోదారే ఆధారం జిల్లావ్యాప్తంగా రాజమహేంద్రవరం అర్బన్, రూరల్, సీతానగరం, కొవ్వూరు, తాళ్లపూడి, గోపాలపురం మండలాల్లో మాత్రమే మత్స్యకారులున్నారు. వీరిలో గోపాలపురం మినహా మిగిలిన చోట్ల మత్స్యకారులు ప్రధానంగా గోదావరి నది పైనే ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. మత్స్యసంపద అభివృద్ధికి జిల్లాలో అవకాశాలు అధికంగా ఉన్నాయి. పురుషోత్తపట్నం నుంచి ధవళేశ్వరం ఆనకట్ట వరకూ 41 కిలోమీటర్ల పొడవునా గోదావరి విస్తీర్ణం 12 వేల హెక్టార్లు కాగా, ఇందులో వెయ్యి హెక్టార్లలో నిరంతరం నీరుంటుందని మత్స్యశాఖ అధికారులు లెక్కలు కట్టారు. చేపలు గుడ్డు పెట్టే దశ కావడంతో ఏటా మే 1 నుంచి సెప్టెంబర్ 30వ తేదీ వరకూ గోదావరిలో వేట నిషేధం అమలులో ఉంటుంది. మత్స్యకారుల ఉపాధిని దృష్టిలో ఉంచుకుని మత్స్యశాఖ ఆధ్వర్యాన ఏటా 20 లక్షల నుంచి 30 లక్షల వరకూ చేప పిల్లలను గోదావరి నదిలో విడిచిపెడుతున్నారు. జిల్లా వ్యాప్తంగా 16 మండలాల్లోని 489 మంది రైతులు 974.99 ఎకరాల్లో ఆక్వా సాగు చేస్తున్నారు. ప్రధానంగా నిడదవోలు, పెరవలి, బిక్కవోలు, సీతానగరం, చాగల్లు తదితర మండలాల్లో ఆక్వా సాగు జరుగుతోంది. మిగిలిన మండలాల్లో 50 ఎకరాల్లోపే ఈ సాగు జరుగుతోంది. కడియంలో చేప పిల్లల నర్సరీ కడియంలో 6.54 ఎకరాల్లో మేజర్ చేపల పిల్లల నర్సరీ ఏర్పాటు చేశారు. ఇక్కడ ఏటా చిరు చేపపిల్లలు (స్పాన్) 5 కోట్లు, 12 ఎంఎం చేప పిల్లలు 53.21 లక్షలు, 80 నుంచి 100 మిల్లీమీటర్ల సైజు చేపపిల్లలు 20 లక్షలు ఉత్పత్తి చేస్తున్నారు. కోనసీమ, కాకినాడ, అల్లూరి సీతారామరాజు జిల్లాలకు అవసరమైన చేప పిల్లలను ఇక్కడి నుంచే సరాఫరా చేస్తున్నారు. గోదావరితో పాటు, ఏలేరు రిజర్వాయర్‌కు ఉచితంగా చేప పిల్లలను అందిస్తున్నారు. రైతులకు అవసరమైన చేప స్పాన్‌ను విక్రయిస్తారు. ప్రధానంగా బొచ్చలు, శీలావతి, మోసే, బంగారు తీగ రకాల చేప పిల్లలను ఉత్పత్తి చేస్తున్నారు. మత్స్యసంపద అభివృద్ధికి చాన్స్ గోదావరి తీర ప్రాంతం కావడంతో మత్స్యసంపద అభివృద్ధికి అవకాశాలు అధికంగా ఉన్నాయి. మత్స్యకారుల జీవనోపాధిని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ఏటా 20 లక్షల నుంచి 30 లక్షల చేపపిల్లల్ని నదిలో విడిచిపెడుతోంది. ఏపీ ఇరిగేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ అగ్రికల్చర్ ట్రాన్స్ఫార్మేషన్ ప్రాజెక్టు (ఏపీఐఐఏటీపీ) కింద ఒక హెక్టారు చెరువు తవ్వి చేపపిల్లల పెంపకాన్ని ప్రోత్సహిస్తున్నాం. కడియం నర్సరీ ద్వారా అవసరమైన వారందరికీ చేపపిల్లలను అందిస్తున్నాం. 50 ఏళ్లు దాటిన మత్స్యకారులకు రాష్ట్ర ప్రభుత్వం పింఛను అందిస్తోంది. మత్స్యకారులకు సబ్సిడీపై వివిధ వాహనాలు, బోట్లు అందజేస్తున్నాం. వీటిని మత్స్యకారులు వినియోగించుకోవాలి. – ఇ.కృష్ణారావు, జిల్లా మత్స్యశాఖాధికారి -
మత్స్య ఎగుమతుల్లో ఆంధ్రప్రదేశ్‌ది అగ్రస్థానం
సాక్షి, మచిలీపట్నం: మత్స్యసంపద ఎగుమతుల్లో దేశంలో ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో ఉందని, ఇది ఇతర రాష్ట్రాలకు స్ఫూర్తిగా నిలుస్తుందని కేంద్ర మత్స్యశాఖ, సమాచార ప్రసార శాఖల సహాయ మంత్రి డాక్టర్ ఎల్.మురుగన్ అన్నారు. కృష్ణా జిల్లా మచిలీపట్నం ఫిషింగ్ హార్బర్ నిర్మాణ పనులను పరిశీలించేందుకు శుక్రవారం వచ్చిన ఆయన ఈ సందర్భంగా మాట్లాడారు. మత్స్యసంపదను ప్రపంచ దేశాలకు ఎగుమతి చేసే సత్తా ఆంధ్రప్రదేశ్‌కు ఉందని, ఎగుమతుల్లో 36 శాతంతో దేశంలో మొదటిస్థానంలో నిలిచిందన్నారు. ఎగుమతులు 50 శాతానికి చేరేలా కేంద్ర ప్రభుత్వం సహాయం అందిస్తోందన్నారు. ప్రధాని నరేంద్రమోదీ మత్స్యపరిశ్రమ అభివృద్ధికి అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నారని తెలిపారు. నీలి విప్లవానికి రూ. 5 వేల కోట్లు కేటాయించిన ఘనత మోదీ ప్రభుత్వానిదన్నారు. మత్స్య పరిశ్రమకు ప్రత్యేకంగా మంత్రిత్వశాఖను ఏర్పాటు చేయడం దేశచరిత్రలో ఇదే తొలిసారన్నారు. ఏపీ నుంచి ఇతర దేశాలకు మత్స్య సంపద ఎగుమతి చేసేలా ఫిషింగ్‌హార్బర్లను ఆధునికీకరిస్తున్నట్లు చెప్పారు. రాష్ట్ర మత్స్యశాఖ మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు మాట్లాడుతూ.. రాష్ట్రంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం ఒకేసారి తొమ్మిది ఫిషింగ్ హార్బర్లు నిర్మాణానికి శ్రీకారం చుట్టిందన్నారు. రాష్ట్రంలో మత్స్య పరిశ్రమను మరింత బలోపేతం చేసే దిశగా ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. రాబోయే మూడు నెలల్లో రాష్ట్రంలోని మత్స్యకారులకు వలలు, బోట్లు, మోటార్లను సబ్సిడీపై ఇవ్వబోతున్నట్లు వెల్లడించారు. మచిలీపట్నం ఎంపీ బాలశౌరి మాట్లాడుతూ.. ఈ ప్రాంత మత్స్యకారులకు అత్యాధునిక టెక్నాలజీతో తయారు చేసిన బోట్లను సబ్సిడీపై అందించనున్నట్లు చెప్పారు. ఎమ్మెల్యే పేర్ని నాని మాట్లాడుతూ.. కేంద్ర మంత్రి రాకతో ఈ ప్రాంత మత్స్యకారులకు మేలు జరుగుతుందనే నమ్మకం కలిగిందన్నారు. మత్స్యశాఖ కమిషనర్ కన్నబాబు, కలెక్టర్ రంజిత్‌బాషా తదితరులు పాల్గొన్నారు. -
మత్స్యానికి మహర్దశ
నరసాపురం: మత్స్య పరిశ్రమ అభివృద్ధి దిశగా రాష్ట్ర ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో ఏర్పాటు చేస్తున్న రాష్ట్రంలో తొలి ఫిషరీస్ యూనివర్సిటీకి నిధులు మంజూరు చేసింది. ఆక్వా పరిశ్రమ అభివృద్ధికి ఎంతో కీలకమైన ఈ విశ్వవిద్యాలయానికి తొలి విడతగా రూ.100 కోట్లు మంజూరు చేసింది. నరసాపురం మండలం తీరగ్రామం వేములదీవి ప్రాంతంలో 400 ఎకరాల్లో వర్సిటీ నిర్మాణం చేపడతారు. పరిపాలన భవనాన్ని 40 ఎకరాల్లో సమీపంలోని సరిపల్లి గ్రామంలో నిర్మిస్తారు. వీటికి స్థల సేకరణ కూడా పూర్తయింది. విశ్వవిద్యాలయం నిర్మాణం, కోర్సుల నిర్వహణ, ప్రయోగాలు తదితర అంశాలకు ఐదేళ్లలో రూ.400 కోట్ల వరకూ ఖర్చుచేస్తారని అధికారులు తెలిపారు. ఈ విశ్వవిద్యాలయం ద్వారా ఆక్వా రంగానికి నిపుణుల కొరత తీరుతుంది. పెద్ద ఎత్తున పరిశోధనలకు, ఆక్వా రంగం అభివృద్ధికి వర్సిటీ దోహదం చేస్తుందని అధికారులు చెబుతున్నారు. దీని ద్వారా ప్రత్యక్షంగా 90 వేల మంది ఆక్వా రైతులు, పరోక్షంగా 8 లక్షల మంది ప్రజలు లబ్ధిపొందుతారని అంచనా. మత్స్య శాఖకు సంబంధించిన అన్ని కోర్సుల బోధన ఈ వర్సిటీ ద్వారానే సాగుతుంది. ఆక్వా రంగానికి జగన్ సర్కారు దన్ను మత్స్య సంపద, ఆక్వా ఎగుమతుల్లో రాష్ట్రానికి ప్రత్యేక స్థానం ఉంది. ఇక్కడి నుంచి దేశ, విదేశాలకు భారీగా ఆక్వా ఎగుమతులు జరుగుతాయి. ఆదాయం భారీగా సమకూరుతుంది. అయితే ఈ రంగం అభివృద్ధిపై గత ప్రభుత్వాలు దృష్టి పెట్టలేదు. దీంతో పూర్తిస్థాయిలో ఆదాయం రావడంలేదు. నిపుణులు, హార్బర్, ఇతర మౌలిక వసతులు ఉంటే ఎగుమతులు మరో 40 శాతం పెరుగుతాయని అధికారులు చెబుతున్నారు. నిపుణులు లేక ప్రయోగాలు, కొత్త ఆవిష్కరణలు లేవు. వైరస్లు సోకకుండా, లాభదాయకంగా ఆక్వా సాగు చేయడం లాంటి ప్రయోజనాలు రైతులు కోల్పోతున్నారు. ఆక్వా నిపుణుల కొరత కారణంగా రాష్ట్రం ఏటా రూ.25 వేల కోట్ల అదనపు ఆదాయం కోల్పోతోందని అంచనా. గత ప్రభుత్వాల తప్పిదాలను వైఎస్ జగన్మోహన్రెడ్డి సర్కారు తొలి నాళ్లలోనే గుర్తించింది. భారీగా ఆదాయం వచ్చే ఆక్వా, మత్స్య ఎగుమతుల అభివృద్ధిపై దృష్టిపెట్టింది. రాష్ట్రంలో మత్స్యకారుల జీవన ప్రమాణాలు, మత్స్య ఉత్పత్తులను పెంచే చర్యలు చేపట్టింది. మత్స్యకారుల వలసలను నివారించడానికి రూ.3,200 కోట్లతో రాష్ట్రంలో మేజర్ ఫిషింగ్ హార్బర్లు, మినీ ఫిషింగ్ ల్యాండింగ్ సెంటర్ ఏర్పాటు చేయాలని సీఎం వైఎస్ జగన్ నిర్ణయం తీసుకున్నారు. ఇందులో భాగంగా నరసాపురం మండలం బియ్యపుతిప్పలో 600 ఎకరాల్లో రూ.350 కోట్లతో హార్బర్ నిర్మించనున్నారు. ఆక్వా చెరువులకు నిబంధనలు సరళతరం చేయడం, సబ్సిడీపై విద్యుత్ అందించడం లాంటి చర్యలు జగన్ ప్రభుత్వం చేపట్టింది. ఇప్పుడు విశ్వవిద్యాలయం ఏర్పాటుకు చకచకా చర్యలు చేపడుతోంది. ఆక్వా, మత్స్య ఉత్పత్తులకు మహర్దశ జిల్లాలో ఫిషరీస్ యూనివర్సిటీకి తొలివిడతగా రూ.100 కోట్లు మంజూరు చేయడం హర్షణీయం. ఇది ఆక్వా, మత్స్య రంగాల్లో నూతన విప్లవం. ఆక్వా రంగ నిపుణులను తయారు చేసుకుని, సాగులో నైపుణ్యాలను పెంచుకుంటే నష్టాలు తగ్గుతాయి. ప్రభుత్వం జిల్లాలో ఆక్వా, మత్స్య రంగాల అభివృద్ధికి పరితపిస్తోంది. అందుకే బియ్యపుతిప్పలో హార్బర్ కట్టబోతున్నారు. –ముదునూరి ప్రసాదరాజు, ఎమ్మెల్యే -
జనాలకు చేరువగా జల పుష్పాలు.. ఇక ఈజీ!
ఆ వారానికి చేపల నుంచి పీతల మీదకు మనసు మళ్లింది. కానీ ఎలా..? అన్ని ఏరియాల్లో అవి దొరకవే. కొందరికి కంచంలో కారంగా రొయ్యలు కనిపిస్తే గానీ ఆ వీకెండ్ పూర్తవదు. ఏం లాభం..? ఉదయాన్నే మార్కెట్‌పై పడితే గానీ పని జరగదు. అలా కాకుండా ఎప్పుడు కావాలంటే అప్పుడు, ఏవి కావాలంటే అవి దొరికేలా.. మన చెంతనే మీనాల జాతర జరిగితే..? కానాగార్తల నుంచి ఖరీదైన పీతల వరకు అన్నీ మనకు సమీపంలోనే విక్రయిస్తే..? సగటు మనిషి జిహ్వ‘చేప’ల్యం తీరుతుంది కదా. సర్కారు అదే పనిలో ఉంది. అటు మత్స్యకారులకు లాభం కలిగేలా.. ఇటు చేపల వినియోగం మరింత పెరిగేలా ప్రత్యేక యూనిట్లను మంజూరు చేసి రాయితీ నిధులు కూడా కేటాయించింది. సాక్షి, శ్రీకాకుళం: జనాలకు మత్స్య సంపదను మరింతగా చేరువ చేసేందుకు, మత్స్యకారుల విక్రయాలు ఇంకా పెరిగేందుకు కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు సన్నద్ధమయ్యాయి. తోపుడు బళ్లపై కూరగాయలు, పండ్లు విక్రయించినట్టు.. భవిష్యత్‌లో జల పుష్పాలను కూడా జనాలకు చేరువ చేసేందుకు ప్రయత్నిస్తున్నాయి. చేపలు, రొయ్యిలు, పీతలు కూడా స్వచ్ఛంగా నాణ్యతతో ప్రజల చెంత ఉండాలని ప్రభుత్వం నిర్ణయించింది. మత్స్య ఉత్పత్తుల తలసరి వినియోగాన్ని పెంచేందుకు సరికొత్త పథకాలను రూపొందించింది. నూతనంగా ఆక్వా హబ్‌లు, ఫిష్ కియోస్క్‌లు, రిటైల్ ఔట్ లెట్లు, లైవ్ ఫిష్ వెండింగ్ సెంటర్లు, ఫిష్ వెండింగ్ కం ఫుడ్ కార్ట్లు, ఈ–రిక్షాలు, వ్యాల్యూ యాడెడ్ యూనిట్లు ఏర్పాటు చేయడానికి సర్కారు ఇప్పటికే చర్యలు చేపట్టింది. స్వయం ఉపాధిని కోరుకుంటున్న వారి కోసం ప్రత్యేక రాయితీలతో పథకాలను అమలు చేయనున్నారు. అందుకోసం సమీప గ్రామ/వార్డు సచివాలయాల్లో విలేజ్ ఫిషరీస్ అసిస్టెంట్స్ ద్వారా ఆన్లైన్ ద్వారా ఆసక్తి గల వారి నుంచి దరఖాస్తులను కూడా ఆహ్వానించింది. చదవండి: అయ్యో పాపం.. టీవీ మీద పడటంతో చిన్నారి మృతి శ్రీకాకుళం జిల్లాలో రూ.7.34 కోట్లతో 300 యూనిట్లు.. ♦ అన్ని రంగాలపై పడినట్టే కోవిడ్ ప్రభావం మత్స్య సంపదపై కూడా పడింది. ♦దీంతో అటు గంగపుత్రులను ఆర్థిక ఇబ్బందుల నుంచి గట్టెక్కించడానికి, జనాలకు మత్స్య సంపదను చేరువ చేసేందుకు ప్రధాన మంత్రి సంపద యోజన పథకం (పీఎంఎంఎస్వై) కింద 300 యూనిట్లు మంజూరయ్యాయి. ♦ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేసే క్రమంలో జిల్లాలో లబ్దిదారుల దరఖాస్తులను పరిశీలించి పథకాల అమలుకు చర్యలు చేపట్టింది. ♦ ఇందుకోసం సుమారు 13 విభాగాల యూనిట్లను సిద్ధం చేసి, బీసీ (జనరల్) కేటగిరీకి 40 శాతం, ఎస్సీ, ఎస్టీ, మహిళా కేటగిరీలకు 60 శాతం రాయితీలను కల్పించేలా చర్యలు చేపడుతోంది. ♦జిల్లాలో రాయితీల కోసం రూ.7.34 కోట్లు మంజూరు చేసింది. ఈ పథకాలతో జిల్లాలో ఉన్న 11 మండలాల తీర ప్రాంతాల నుంచి వస్తున్న మత్ప్య ఉత్పత్తులకు మార్కెటింగ్ సౌకర్యాలు కల్పించాలని భావించిన రాష్ట్ర మత్స్య శాఖ ఈ మేరకు జిల్లాలో దాదాపుగా అన్ని యూనిట్లను ఏర్పాటు చేసి లక్ష్యాన్ని సాధించాలని చర్యలు చేపట్టింది. ♦అలాగే జిల్లా కేంద్రంలో ఒక ఆక్వా హబ్‌ను కూడా రూ.1.85 కోట్లతో ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఇందుకోసం స్థల సేకరణ పనులు జరుగుతున్నాయి. చదవండి: ఇన్నాళ్లు ఎక్కడున్నావయ్యా.. భర్తను చూడగానే.. తలసరి వినియోగం పెంచేందుకే చేపల తలసరి వినియోగం పెంచేందుకు మత్స్యశాఖలో ఈ పథకాలను అమలు చేస్తున్నాం. కేంద్ర ప్రభుత్వ పథకంలో భాగంగా జిల్లాలో 300 యూనిట్లు ప్రారంభించేందుకు చర్యలు చేపడుతున్నాం. ఇప్పటికే 50 శాతం నిధులు విడుదలయ్యాయి. సచివాలయాల్లో నవ శకంలో భాగంగా ఆసక్తి ఉన్న వారు ఈ పథకాల్లో లబ్దిదారులుగా తమ పేర్లను రిజిస్టర్ చేసుకోవచ్చు. వివరాలకు 9346007766 నంబర్‌ను సంప్రదించవచ్చును. – ఎం.షణ్ముఖరావు,జిల్లా ప్రోగ్రాం మేనేజర్, శ్రీకాకుళం -
పులస.. తగ్గుతోంది వలస
సృష్టిలో ఏ జీవి అయినా సంతానోత్పత్తి కోసం పుట్టింటికే వెళుతుంది. సముద్ర జలాల్లో జీవించే ఇలసలు సైతం సంతానోత్పత్తి కోసం వేలాది కిలోమీటర్ల దూరం ప్రయాణించి తమ పుట్టినిల్లయిన గోదావరి నదిలోకి చేరుకుంటాయి. గోదావరి నీటిలోని తీపిని ఆస్వాదిస్తూ.. నదిలోనే సంతానాన్ని వృద్ధి చేస్తాయి. ఈ క్రమంలో వాటి శరీరంలో మార్పులు సంభవించి.. తెల్లటి ఇలసలు కాస్తా ఎరుపు, గోధుమ వర్ణాలను సంతరించుకుని పులసలుగా మారతాయి. సంతానోత్పత్తి అనంతరం తిరిగి సముద్రంలోకి చేరుకుని ఇలసలుగా రూపాంతరం చెందుతాయి. ఇలస.. పులస అవుతుందిక్కడ ఆస్ట్రేలియా, థాయ్‌లాండ్ వంటి దేశాల్లోని సముద్ర జలాల్లో జీవించే ఈ అరుదైన చేప సంతానోత్పత్తి కోసం హిందూ మహాసముద్రాన్ని దాటి బంగాళాఖాతంలోకి చేరుకుంటుంది. ఆయా ప్రాంతాల్లో దీనిని హిల్సా, హిల్సా హెర్రింగ్, ఇలిషా పేర్లతో పిలుస్తారు. మన ప్రాంతంలో మాత్రం సముద్ర జలాల్లో ఉన్నప్పుడు వీటిని ఇలస అంటారు. వేల కిలోమీటర్ల దూరాన్ని ఈదుకుంటూ గోదావరి, సముద్రం కలిసే ప్రాంతానికి చేరుకుంటాయి. వరదల సమయంలో వచ్చే ఇలసలు ఎర్ర నీటిలోని తీపిదనాన్ని ఆస్వాదిస్తూ.. గోదావరి ప్రవాహానికి ఎదురీదుకుంటూ ముందుకొస్తాయి. ఈ నదిలోనే సంతానాన్ని ఉత్పత్తి చేస్తాయి. ఈ క్రమంలో వాటి శరీరంలో మార్పులు సంభవిస్తాయి. తెల్లటి ఇలసలు కాస్తా ఎరుపు, గోధుమ వర్ణాలను సంతరించుకుని పులసలుగా మారతాయి. సంతానాన్ని వృద్ధి చేశాక పిల్లలతో తిరిగి బంగాళాఖాతం గుండా హిందూ మహాసముద్రంలోకి వెళ్లిపోతాయి. సాక్షి ప్రతినిధి, రాజమహేంద్రవరం: ఏడాదిలో ఒక్కసారి మాత్రమే లభించే పులస ఉనికి కోల్పోతోందా. అవుననే అంటున్నారు మత్స్య రంగ నిపుణులు. గోదావరికి వరద (ఎర్ర నీరు) వచ్చినప్పుడు మాత్రమే కనిపించే పులస రాక దారుణంగా తగ్గిపోయింది. పులసల సీజన్ మొదలై రెండు నెలలు గడిచిపోయింది. చివరి దశకు చేరుతోంది. అయినా.. గోదావరిలో ఈ ఏడాది పులసల జాడ పెద్దగా కనిపించలేదు. గతంలో కేజీ నుంచి నాలుగైదు కేజీలుండే పులసలు లభించేవి. ఒక్కొక్కటీ రూ.10 వేల నుంచి రూ.15 వేల వరకు ధర పలికేవి. ప్రస్తుత సీజన్లో అరకిలో పులస దొరకడమే గగనమైపోయింది. తూర్పు గోదావరి జిల్లా యానాం, కోటిపల్లి, ఎదుర్లంక, ధవళేశ్వరం, రావులపాలెం, కేదార్లంక, పశ్చిమ గోదావరి జిల్లా సిద్ధాంతం, మల్లేశ్వరం, ఖండవల్లి, తీపర్రు, పెండ్యాల, ఆచంట, యలమంచిలి మండలాల్లోని గోదావరి తీరంలో పులసలు విరివిగా దొరికేవి. ప్రస్తుతం ఎక్కడా వీటి జాడ కనబడటం లేదు. తగ్గడానికి కారణాలివీ.. ► సముద్ర ముఖ ద్వారాల నుంచి పులస గోదావరి నదిలోకి ప్రయాణిస్తుంది. అఖండ గోదావరి సముద్రంలో కలిసే ముందు ఏడు పాయలుగా విడిపోయింది. ప్రధాన పాయలైన వశిష్ట, వైనతేయ, గౌతమి పాయల వద్ద ఉండే సముద్ర ముఖద్వారాల నుంచి ధవళేశ్వరం వరకూ సుమారు 60 కిలోమీటర్ల మేర గోదావరి నదిలోకి ఎదురీదుకుంటూ వస్తాయి. కృష్ణా, గోదావరి (కేజీ బేసిన్)లో చమురు కార్యకలాపాలు, ధ్వని కాలుష్యం పెరిగిపోవడంతో పులసలు సముద్రం నుంచి గోదావరి నదిలోకి రావడం లేదు. ► గోదావరి, బంగాళాఖాతం కలిసే ముఖద్వారం వద్ద రిలయన్స్, ఓఎన్జీసీ, కెయిర్న్ ఎనర్జీ తదితర చమురు సంస్ధలు చమురు వెలికితీత పనులు నిర్వహిస్తున్నాయి. ఈ కార్యకలాపాల వల్ల సముద్ర జలాల్లో కంపనాల (వైబ్రేషన్స్)కు భయపడి పులసలు గోదావరి జలాల వైపు రావడం లేదు. ► మరోవైపు సముద్ర ముఖద్వారాల వద్ద ఇసుక మేటలు వేయడం కూడా వాటి రాకకు అడ్డుపడుతున్నాయి. ► గోదావరి పొడవునా రాజమహేంద్రవరం, అంతర్వేది, కరవాక, యానాం సమీప ప్రాంతాల్లో పారిశ్రామిక వ్యర్థాలు గోదావరిలో కలిసిపోతున్నాయి. సల్ఫర్, అమోనియా, లెడ్, పాదరసం ఇతర కర్బనాలు నదిలో కలుస్తున్నాయి. తీరం వెంబడి వేలాది ఎకరాల్లోని రొయ్యల చెరువుల సాగు వ్యర్థాలు నేరుగా గోదావరిలోనే కలుస్తున్నాయి. దాదాపు అన్ని నదీపాయల పరిధిలో రొయ్యల సాగు జరుగుతోంది. ఈ పాయల పరిధిలో డంపింగ్ యార్డులు కూడా ఉన్నాయి. ఆక్వా సాగులో యాంటీ బయోటిక్స్‌తో పాటు పటిక(అం) వినియోగిస్తారు. గోదావరి నుంచి ఈ అవశేషాలన్నీ సముద్రంలో కలుస్తుండటంతో పులస గోదావరిలోకి రావడం తగ్గిపోయింది. ► సముద్రంలో చేపల వేట విచక్షణా రహితంగా సాగటం కూడా పులస అంతరించిపోవడానికి మరో కారణం. కాలుష్యంతో పులస మనుగడకే ముప్పు గోదావరి నది కాలుష్యంతో పాటు విచక్షణా రహితంగా సాగుతున్న వేట వల్ల గోదావరి నదిలో పులసల సంఖ్య పదేళ్లుగా తగ్గుతూ వస్తోంది. ఆధునిక వలలతో లోతు జలాల్లో వేట సాగుతోంది. దీనివల్ల పులసల పునరుత్పత్తి తగ్గిపోతోంది. ఈ తగ్గుదల ఆందోళనకరంగా ఉంది. మత్స్యకారులకు సూచనలు చేసినా పెద్దగా ఫలితం ఉండడం లేదు. – పీవీ కృష్ణారావు,అసిస్టెంట్ డైరెక్టర్, ఫిషరీస్ చమురు కార్యకలాపాలూ ప్రధాన కారణం సముద్ర జలాల్లో చమురు కార్యకలాపాలే పులసల తగ్గుదలకు ప్రధాన కారణం. అధిక వేట, నీటి కాలుష్యం కూడా దీనికి కారణాలే. బ్రీడింగ్ సమయంలో వేట నిషేధం కఠినతరం చేయాలి. పరిశ్రమలు, పట్టణాల కాలుష్యం గోదావరిలోకి వదిలేయటాన్ని నివారించాలి. – డాక్టర్ చంద్రశేఖర్, అసిస్టెంట్ ప్రొఫెసర్, జువాలజీ విభాగం యానాం -
మత్స్య దిగుబడులు మిలమిల
సాక్షి, అమరావతి: ఆక్వా రంగ సుస్థిరాభివృద్ధికి గడిచిన రెండేళ్లుగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలిస్తున్నాయి. కరోనా కష్టకాలంలో కూడా రికార్డు స్థాయిలో దిగుబడులు వచ్చాయి. దీంతో ఈ రంగంలో ఆంధ్రప్రదేశ్ రికార్డులను తిరగరాస్తోంది. రాష్ట్రంలో 974 కిలోమీటర్ల తీర ప్రాంతముంది. 54,500 హెక్టార్ల ఉప్పు నీటిలో, 1.44 లక్షల హెక్టార్ల మంచినీటిలో సాగు విస్తీర్ణం కలిగి ఉంది. మరో 48 వేల హెక్టార్లలో ఆక్వా సాగును పెంచేందుకు చర్యలు చేపట్టారు. మరోవైపు.. రాష్ట్ర ప్రభుత్వం గడిచిన రెండేళ్లుగా తీసుకొస్తున్న విప్లవాత్మక విధానాలు ఆక్వారంగ సుస్థిరాభివృద్ధికి దోహదపడుతున్నాయి. ఫలితంగా సాగు విస్తీర్ణం పెరగడమే కాదు.. దిగుబడులు కూడా గణనీయంగా పెరుగుతున్నాయి. ఎంతలా అంటే.. ► ఆక్వా సాగు, దిగుబడిలోనే కాదు.. ఇన్‌ల్యాండ్ (సంప్రదాయ చెరువులు), మెరైన్ ఉత్పత్తుల్లో దేశంలోనే ఏపీ టాప్‌లో కొనసాగుతోంది. ► దేశవ్యాప్తంగా జరుగుతున్న చేపల ఉత్పత్తిలో 29 శాతం, రొయ్యల ఉత్పత్తిలో 68 శాతం ఇక్కడ నుంచే జరుగుతోంది. ► అలాగే, మత్స్య ఉత్పత్తుల ఎగుమతుల్లో 40 శాతం వాటా ఏపీదే. ► 2019–20లో 18,860 కోట్ల విలువైన మత్స్య ఉత్పత్తులను ఎగుమతి చేయగలిగారు. పదేళ్లలో భారీగా గణనీయమైన వృద్ధిరేటు గడిచిన పదేళ్లుగా రాష్ట్రంలో చేపలు, రొయ్యల ఉత్పత్తులు మూడింతలు పెరిగాయి. 2010–11లో కేవలం 14,23,811 టన్నులున్న ఉత్పత్తులు 2019–20కి వచ్చేసరికి 41,75,511 టన్నులకు చేరింది. సముద్ర చేపల ఉత్పత్తి రెట్టింపు కాగా.. రొయ్యల ఉత్పత్తి నాలుగు రెట్లు పెరిగింది. ఇక సంప్రదాయ చెరువుల్లో చేపల ఉత్పత్తి రెండున్నర రెట్లు పెరగగా.. ఉప్పునీటి, మంచినీటి రొయ్యల ఉత్పత్తి 15 రెట్లు పెరిగింది. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 2014–15లో 19.78 లక్షల టన్నులున్న మెరైన్, ఆక్వా ఉత్పత్తులు 2020–21 ఆర్థిక సంవత్సరంలో ఫిబ్రవరి నాటికి రికార్డు స్థాయిలో 42.19 లక్షల టన్నులకు చేరింది. ఈ ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి ఇది కనీసం 44 లక్షల టన్నులు దాటే అవకాశాలు కన్పిస్తున్నాయి. ప్రభుత్వ తోడ్పాటుతోనే.. సంప్రదాయ చెరువులతో పాటు ఆక్వా చెరువులకు గడిచిన రెండేళ్లుగా నీటికొరత లేకుండా చేయడంతో పాటు ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు వైఎస్ జగన్ సీఎం కాగానే విద్యుత్ టారీఫ్ తగ్గించి యూనిట్ రూ.1.50లకే అందించడం ఆక్వాసాగుకు ఊతమిచ్చింది. వీటికితోడు రైతుభరోసా కేంద్రాల ద్వారా గడిచిన ఏడాదిగా నిర్వహిస్తున్న మత్స్య సాగుబడులు సత్ఫలితాలనిచ్చాయి. శాస్త్రవేత్తలు, నిపుణులు ఎప్పటికప్పుడు ఇచ్చిన మెళకువలు నాణ్యమైన దిగుబడుల సాధనకు దోహదపడ్డాయి. ఉత్పత్తులు భారీగా పెరిగాయి గడిచిన రెండేళ్లుగా ఉత్పత్తులు గణనీయంగా పెరుగుతున్నాయి. 2019–20లో 41.75 లక్షల టన్నులుగా నమోదు కాగా, 2020–21లో ఫిబ్రవరి నెలాఖరు నాటికే 42.19లక్షలు దాటింది. ప్రభుత్వం ఇస్తున్న ప్రోత్సాహకాలకు తోడు శాస్త్రీయ పద్ధతులను అవలంబించడం, నాణ్యమైన సీడ్, ఫీడ్ వినియోగించడం ద్వారా దిగుబడుల పెరుగుదలకు కారణమైంది. – కె. కన్నబాబు, కమిషనర్, మత్స్యశాఖ -
బోనస్ పేరుతో బురిడీ
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో చేపల రైతుల పాలిట ‘బోనస్’ విధానం వారి ఆదాయంపై ప్రతికూల ప్రభావం చూపుతోంది. చేపల అమ్మకాల సమయంలో రైతులు ఏటా దాదాపు రూ.500 కోట్ల వరకు నష్టపోతున్నారు. రైతుల నుంచి చేపలను కొనుగోలు చేసే సమయంలో వ్యాపారులు 5 శాతం బోనస్ విధానాన్ని అనుసరిస్తూ దోపిడీకి పాల్పడుతున్నారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి ఆక్వా రంగంపై ప్రత్యేక దృష్టి పెట్టిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ సమస్యను కూడా పరిష్కరించి తమను ఆదుకోవాలని చేపల రైతులు కోరుతున్నారు. ఈ ‘బోనస్’ దందాను మత్స్యశాఖ మంత్రి మోపిదేవి వెంకట రమణారావు దృష్టికి తీసుకెళ్లారు. మంత్రి గత నెలలో రైతులతో సమావేశం నిర్వహించి వివరాలు తెలుసుకున్నారు. విషయాన్ని సీఎంకు వివరించి, మరోసారి రైతులు, వ్యాపారులతో సమావేశం నిర్వహించి నిర్ణయం తీసుకుంటామని మంత్రి చెప్పారు. ఐదు శాతం బోనస్ అంటే: రైతు నుంచి చేపలు కొనుగోలు చేసిన సమయంలో ఎన్ని కిలోలు కొంటే ఆ మొత్తానికి ధర చెల్లించాలి. కానీ బోనస్ పేరుతో అదనంగా మరో అయిదు కిలోలు తీసుకుంటున్నారు. ఉదాహరణకు 100 కిలోలు కొంటూ 105 కిలోల చేపలను తీసుకుని, 100 కిలోలకే ధర చెల్లిస్తున్నారు. ఈ విధానం 30 ఏళ్లుగా కొనసాగుతోందని అదనంగా తీసుకుంటున్న అయిదు కిలోల విలువను ఇతర రాష్ట్రాల్లోని బ్రోకర్లు, కమిషన్ ఏజెంట్లకు ఖర్చు చేస్తున్నామని చెబుతున్నారు. అలా చేయకపోతే అక్కడి మార్కెట్లలో ధర రానీయకుండా చేస్తారని అంటున్నారు. ఈ దందాతో రైతులు ఏటా దాదాపు రూ.500 కోట్లు నష్టపోతున్నారు. అధికారులు దీనికి సంబంధించి పూర్తి వివరాలతో నివేదిక రూపొందించే పనిలో ఉన్నారు. రైతులు ఎంత నష్టపోతున్నారంటే: ► ఏటా 16 లక్షల టన్నుల చేపల దిగుబడి అవుతోంది. ► వ్యాపారులు కొనుగోలు సమయంలో అయిదు శాతం అదనంగా తూకం వేసుకుని దానికి ధర చెల్లించట్లేదు. ఇలా మొత్తం 80 వేల టన్నులు నష్టపోతున్నారు. ► చెరువులు వద్ద చేపల ధర కిలో రూ.60 నుంచి రూ.100లోపు ఉంటుంది. కనిష్టంగా రూ. 60గా అంచనా వేసినా.. బోనస్ దందాతో రూ.480 కోట్ల మేర ఆదాయం కోల్పోతున్నారు. వాస్తవాలు తెలుసుకుని త్వరలో మరో సమావేశం: మోపిదేవి ‘బోనస్’పై వాస్తవాలు తెలుసుకుంటాం. రాష్ట్ర దిగుబడిలో 90 శాతం చేపలు ఇతర రాష్ట్రాలకు ఎగుమతి అవుతుంది. వ్యాపారులు, రైతులు ఇరు వర్గాలకు ప్రయోజనాలు కాపాడేలా వారితో త్వరలో మరో సమావేశం నిర్వహిస్తాం. -
4 ఏళ్లలో 4 పోర్టులు
సాక్షి, అమరావతి: సముద్ర ఆధారిత వ్యాపారంలో (బ్లూ ఎకానమీ) ఆంధ్రప్రదేశ్‌ను దేశంలోనే అగ్రగామిగా నిలబెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం స్పష్టమైన కార్యాచరణతో ముందుకెళ్తోంది. ఇందులో భాగంగా కొత్తగా నాలుగు పోర్టుల నిర్మాణాన్ని చేపట్టి మూడు, నాలుగేళ్లలో పూర్తిచేసేలా అడుగులు వేస్తోంది. అలాగే, ఎనిమిది ఆధునిక ఫిషింగ్ హార్బర్ల ఏర్పాటు ద్వారా మత్స్యరంగంలో అనూహ్య మార్పులు తీసుకురావడానికి రంగం సిద్ధమైంది. ఎగుమతులు,దిగుమతులు మూడింతలు పెంపు దేశంలో గుజరాత్ తర్వాత 974 కిలోమీటర్ల అత్యధిక తీర ప్రాంతం ఉన్న రాష్ట్రం మనది. ప్రస్తుతం ఒక మేజర్ పోర్టు, 16 మైనర్ పోర్టులు ఉన్నాయి. వీటిద్వారా (విశాఖ మేజర్ పోర్టును మినహాయించి) ఏటా 103 మిలియన్ టన్నుల ఎగుమతులు, దిగుమతులు జరుగుతున్నాయి. వీటిని మూడింతలు పెంచేలా పోర్టుల ఏర్పాటుకు మారిటైమ్ బోర్డు ప్రణాళిక రూపొందించింది. అలాగే.. ► 2024 సంవత్సరానికల్లా భావనపాడు, మచిలీపట్నం, రామాయపట్నం, కాకినాడ సెజ్ గేట్‌వే పోర్టుల నిర్మాణం పూర్తిచేసి కార్గో ఎగుమతులు ప్రారంభించేందుకు కసరత్తు చేస్తోంది. ► సీఎం వైఎస్ జగన్ ఇప్పటికే వీటి అభివృద్ధిపై ప్రత్యేక దృష్టిపెట్టారు. ఈ నాలుగు పోర్టుల నిర్మాణానికి ఈ నెలలోనే టెండర్ల ప్రక్రియ ప్రారంభం కానుంది. ► రూ.3,800 కోట్ల అంచనాతో రామాయపట్నం, రూ.4 వేల కోట్ల అంచనాతో మచిలీపట్నం పోర్టుల సవివర నివేదికలు (డీపీఆర్) ఇప్పటికే తయారయ్యాయి. ► రూ.3,200 కోట్ల అంచనాతో భావనపాడు పోర్టు సవివర నివేదిక ఈ నెల పదో తేదీకల్లా సిద్ధం కానుంది. ► కాకినాడ సెజ్ గేట్‌వే పోర్టును ప్రైవేటుగా అభివృద్ధి చేసేందుకు ఇప్పటికే జీఎంఆర్‌కు అప్పగించారు. త్వరలో అది ఫైనాన్షియల్ క్లోజర్‌కు రానుంది. ► ఈ నాలుగింటినీ చేపట్టేందుకు ఈ నెలలోనే పీఎంసీ (ప్రాజెక్టు మేనేజ్మెంట్ కన్సల్టెంట్)ని నియమించనున్నారు. ► నెలరోజుల్లో ఈ నాలుగు పోర్టుల నిర్మాణానికి టెండర్ల ప్రక్రియ మొదలుపెట్టనున్నారు. ► ఇక భావనపాడు, రామాయపట్నం పోర్టులను ప్రభుత్వ ఆధ్వర్యంలో ఈపీసీ విధానంలో చేపట్టనున్నారు. ► మచిలీపట్నం పోర్టును పీపీపీ విధానంలో చేపడతారు. ► ఈ నాలుగు పోర్టుల ద్వారా సంవత్సరానికి దాదాపు 400 మిలియన్ టన్నుల కార్గో ఎగుమతులు, దిగుమతులు చేసే అవకాశం ఉంది. ఫిషింగ్ హార్బర్లతో అనూహ్య మార్పు మత్స్యకారుల అవసరాలు తీర్చేలా రాష్ట్రంలోని ఎనిమిది తీర ప్రాంత జిల్లాల్లో ఫిషింగ్ హార్బర్లు ఏర్పాటు చేయాలని సీఎం వైఎస్ జగన్ నిర్ణయించారు. ఇందులో భాగంగా రాబోయే రెండున్నరేళ్లలో రాష్ట్రంలో ఎనిమిది ఆధునిక ఫిషింగ్ హార్బర్లు రాబోతున్నాయి. అవి.. ► శ్రీకాకుళం జిల్లా బుడగట్లపాలెం, విశాఖ జిల్లా పూడిమడక, తూర్పుగోదావరి జిల్లా ఉప్పాడ, పశ్చిమ గోదావరి జిల్లా బియ్యపుతిప్ప, కృష్ణాజిల్లా మచిలీపట్నం రెండో దశ, గుంటూరు జిల్లా నిజాంపట్నం రెండో దశ, ప్రకాశం జిల్లా కొత్తపట్నం, నెల్లూరు జిల్లా జువ్వలదిన్నెలో వీటిని ఏర్పాటుచేస్తున్నారు. ఈ నెలలో వీటికి టెండర్లు పిలవనున్నారు. ► సాధారణ హార్బర్లలా కాకుండా మత్స్యకారులకు ఉపయోగపడేలా.. మార్కెటింగ్, నిల్వకు ఇబ్బంది లేకుండా అందులోనే ఫిష్ ప్రాసెసింగ్ యూనిట్, కోల్డ్ స్టోరేజి ఏర్పాటుచేస్తున్నారు. ► ఒక్కో హార్బర్ నిర్మాణానికి రూ.250కోట్ల నుంచి రూ.300 కోట్లు ఖర్చవుతుంది. ► కేంద్ర ప్రభుత్వం, నాబార్డు, ఇతర బ్యాంకుల ద్వారా వీటికి అవసరమైన నిధులు సమకూర్చుకునేలా ప్రణాళిక రూపొందించారు. ► ఈ ఫిషింగ్ హార్బర్లలోనే ఒకటి, రెండు బెర్తులు ఏర్పాటుచేయడానికి సాధ్యాసాధ్యాలను మారిటైమ్ బోర్డు పరిశీలిస్తోంది. కోస్ట్‌గార్డ్ ఈ తరహా బెర్తులను తీసుకుని పనిచేసేందుకు ఆసక్తి చూపుతోంది. ► రాబోయే రోజుల్లో కోస్టల్ షిప్పింగ్‌కు ఎక్కువ ప్రాధాన్యం పెరిగే అవకాశాలున్న నేపథ్యంలో ఈ తరహా ఆలోచన చేస్తున్నారు. ► జువ్వలదిన్నె ఇందుకు అనువుగా ఉందని ఇప్పటికే నిర్ధారించారు. మిగిలిన హార్బర్లలోనూ ఇలాంటి అవకాశాలను పరిశీలిస్తున్నారు. 2024కి నాలుగు పోర్టులు పూర్తి చేస్తాం నాలుగు పోర్టులను 2024 నాటికి పూర్తిచేసి కార్గో ఎగుమతులు, దిగుమతులు చేసేలా కార్యాచరణ రూపొందించాం. ఎనిమిది ఆధునిక హార్బర్లను కూడా చేపట్టనున్నాం. ఈ నెలలోనే వీటికి టెండర్ల ప్రక్రియ మొదలవుతుంది. పోర్టులు, హార్బర్ల విషయంలో సీఎం వైఎస్ జగన్ చాలా స్పష్టమైన దిశానిర్దేశం చేశారు. అందుకనుగుణంగా ముందుకెళ్తున్నాం. – రామకృష్ణారెడ్డి, మారిటైమ్ బోర్డు సీఈఓ ఎన్పీ -
చేప సూపర్!
కవాడిగూడ: దేశంలోనే ఏ రాష్ట్రంలో అమలు చేయని విధంగా సీఎం కేసీఆర్ మత్స్యకారుల ఆర్థిక ఎదుగుదలకు పలు అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారని, ఇందులో తెలంగాణ దేశంలోనే నంబర్ 1 స్థానంలో ఉందని మత్స్యశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ అన్నారు. శుక్రవారం ఎన్టీఆర్ స్టేడియంలో జాతీయ మత్స్య అభివృద్ధి సంస్థ, తెలంగాణ మత్స్య సహకార సంఘం సమాఖ్య ఆధ్వర్యంలో ఫిష్ ఫెస్టివల్ ఏర్పాటు చేశారు. ఈ ఫెస్టివల్‌ను మంత్రి ప్రారంభించి, చేపల వంటకాలను పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ.. గంగపుత్ర, బెస్త, ముదిరాజ్‌ల కుటుంబాలు ఆర్థికంగా అభివృద్ధి చెందేందుకు రాష్ట్ర ప్రభుత్వం పలు సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తోందన్నారు. నగర ప్రజలకు చేపలు అందుబాటులో ఉండేందుకు, మత్స్యకారుల ఉపాధి కోసం త్వరలో ఔట్లెట్లను ప్రారంభిస్తామన్నారు. బేగంబజార్, రాంనగర్ చేపల మార్కెట్‌వాసులు అంగీకరిస్తే ఆర్టీసీ క్రాస్ రోడ్డు సమీపంలో పెద్ద మార్కెట్‌ను కట్టించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ముఠా గోపాల్, ఎన్ఎఫ్డీబీ జనార్థన్, మత్స్యశాఖ కమిషనర్ సువర్ణ తదితరులు పాల్గొన్నారు. -
చేపలు చూస్తే చవులూరుతున్నాయి
సాక్షి, హైదరాబాద్: చేపల వినియోగంలో గ్రామాలే అగ్రస్థానంలో ఉన్నాయి. పట్టణ ప్రజల కంటే రెట్టింపుస్థాయిలో పల్లె ప్రజలు వినియోగిస్తున్నారు. ఈ విషయాన్ని రాష్ట్ర మత్స్యశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన బేస్‌లైన్ సర్వే తేల్చింది. చేపలు తినే జనాభాను లెక్కలోకి తీసుకుంటే రాష్ట్రంలో తలసరి వినియోగం 7.88 కిలోలుంది. అందులో గ్రామీణ ప్రాంతాల ప్రజలు తలసరి 9.66 కిలోలు తింటుండగా, పట్టణ ప్రజలు 4.88 కిలోలే తింటున్నారని వెల్లడైంది. భారత వైద్య పరిశోధన మండలి(ఐసీఎంఆర్) సిఫారసుల ప్రకారం తలసరి చేపల వినియోగం 12 కిలోలు ఉండాలి. దాని ప్రకారం చూస్తే రాష్ట్రంలో మాత్రం చేపల వినియోగం తక్కువగా ఉంది. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన అనేక మత్స్య పథకాల కారణంగా ఇప్పుడిప్పుడే పరిస్థితి మెరుగవుతోంది. చేపల ఉత్పత్తి పెరుగుదలలో మార్పు వస్తుందని మత్స్యశాఖ వర్గాలు చెబుతున్నాయి. పట్టణ ప్రజలకు చేపలు సరిపడా అందుబాటులో ఉండటంలేదన్న చర్చ జరుగుతోంది. ఫలితంగా చేపల వినియోగం సగమే ఉంది. మూడేళ్లలో పెరిగిన చేపల ఉత్పత్తి... ప్రభుత్వం చేపట్టిన పథకాలతో రాష్ట్రంలో చేపల ఉత్పత్తి పెరుగుతోంది. ముఖ్యంగా ఉచిత చేపపిల్లల పంపిణీ వల్ల పరిస్థితి మెరుగు పడింది. రాష్ట్ర ప్రభుత్వం 2017– 18లో 11,068 జలాశయాలు, చెరువులు, ఇతర జలవనరుల్లో 51.01 కోట్ల చేపపిల్ల లను ఉచితంగా విడుదల చేసింది. 2018–19లో 10,786 జలవనరుల్లో 49.15 కోట్ల చేపపిల్లలను విడుదల చేసింది. మత్స్యకారులకు సబ్సిడీపై పరికరాలు అందజేసింది. ఫలితంగా రాష్ట్రంలో చేపల ఉత్పత్తి పెరిగిందని మత్స్యశాఖ డిప్యూటీ డైరెక్టర్ శ్రీనివాస రావు తెలిపారు. 2016–17లో 1.93 లక్షల టన్నుల చేపల ఉత్పత్తి ఉండగా 2017– 18లో 2.62 లక్షల టన్నులకు పెరిగింది. 2018–19లో 2.40 లక్షల టన్నుల ఉత్పత్తి జరి గింది. వర్షాభావ పరిస్థితుల కారణంగా ఒక్కోసారి కొన్నిచోట్ల చేపపిల్లలను కూడా విడుదల చేయలేని పరిస్థితులుండటంతో ఈ ఏడాది ఉత్పత్తి కాస్తంత తగ్గిందని అధికారులు విశ్లేషిస్తున్నారు. రాష్ట్రంలో చేపలు తినేవారు 90% తెలంగాణ ప్రజలు మాంసప్రియులు. జాతీయ స్థాయిలో 71% మంది మాంసప్రియులైతే, తెలంగాణలోనే 98.7% మాంసం, చేపలు తింటారు. పశ్చిమ బెంగాల్లో 98.55 %, ఏపీలో 98.25%, ఒడిషా 97.35%, కేరళ 97% ప్రజలు మాంసం, చేపలు తింటారు. రాష్ట్రంలో చేపలు తినేవారు 90% మంది ఉంటారని మత్స్యశాఖ నిర్ధారించింది. జాతీయ తలసరి ప్రకారం చూస్తే రాష్ట్రంలో ఇంకా 30% అదనంగా చేపలు అందుబాటులోకి రావాల్సి ఉంది. బేస్‌లైన్ సిఫారసులు.. - యువతను ఈ రంగంవైపు తీసుకొని రావాలి. వారిని ఫోకస్డ్ యాక్టివిటీ గ్రూప్‌లుగా తయారు చేయాలి. - చేపల ఉత్పత్తిపై మత్స్యకారుల్లో శిక్షణ కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా అవగాహన కల్పించాలి. - చేపల రంగంలో వ్యాపార అవకాశాలు కల్పించాలి. చేపల ఉత్పత్తి మొదలు మార్కెటింగ్, రిటైల్ వరకు ఉన్న అవకాశాలపై అవగాహన, శిక్షణ ఇవ్వాలి. - రిజర్వాయర్లలో కేజ్ కల్చర్ ద్వారా చేపల ఉత్పత్తిపై యువతకు శిక్షణ ఇవ్వాలి. వివిధ పథకాలను రూపొం దించాలి. మార్కెట్ లింకేజీ కల్పించాలి. చేప అనుబంధ ఉత్పత్తులు తయారు చేయాలి. - నేరుగా వినియోగదారుల ఇష్టాయిష్టాలను బట్టి చేప అనుబంధ ఉత్పత్తుల తయారీలో నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తీసుకొని రావాలి. - నాబార్డు సాయంతో ఆర్థిక సాయం అందించాలి. - పెట్టుబడులు పెట్టేలా ‘ప్రైవేటు’ను ప్రోత్సహించాలి. -
మత్స్య అభివృద్ధికి రూ.1,000 కోట్లు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఏడాది పొడవునా అన్ని ప్రాంతాల్లో చేపలు లభ్యమయ్యేలా ప్రభుత్వం ప్రణాళిక రూపొందించింది. ఇందుకోసం సమీకృత మత్స్య అభివృద్ధి పథకానికి (ఐఎఫ్‌డీఎస్) రూపకల్పన చేసింది. ఈ పథకం అమలుకు జాతీయ సహకార అభివృద్ధి సంస్థ (ఎన్సీడీసీ) రూ.వెయ్యి కోట్లు మంజూరు చేసింది. ఈ నిధులతో చేపల ఉత్పత్తిని పెంచడం, ప్రాసెసింగ్, మార్కెటింగ్, అవసరమైన మౌలిక సదుపాయా లను ఏర్పాటు చేస్తారు. ఈ పథకం కింద అన్ని జిల్లాల్లో ఉన్న ప్రాథమిక మత్స్య సహకార సంఘాలు, మహిళా మత్స్య సహకార సంఘాలు, మత్స్య మార్కెటింగ్ సంఘాలు, జిల్లా మత్స్య సహకార సంఘాలు, తెలంగాణ రాష్ట్ర మత్స్య సహకార సంఘాల సమాఖ్య సభ్యులు లబ్ధిపొందుతారు. రొయ్యలు, చెరువుల్లో, పంజరాల్లో చేపల సాగు వంటి విభిన్న పద్ధతుల ద్వారా చేపల పెంపకం చేపట్టాలని సర్కారు నిర్ణయించింది. సమీకృత మత్స్య అభివృద్ధి పథకం కింద లబ్ధిదారులకు అనేక రకాల పరికరాలు అందజేసేందుకు సర్కారు ఏర్పాట్లు చేసింది. వాటిలో లబ్ధిదారులకు 75 శాతం నుంచి 100 శాతం వరకు రాయితీ లభిస్తుంది. చేపలు అమ్ముకునేందుకు 50 వేల ద్విచక్ర వాహనాలను ప్రభుత్వం అందించనుంది. వాటిని 75 శాతం రాయితీపై ఇవ్వనుంది. -
సర్కారు గొర్రెలకు ఉచిత దాణా
సాక్షి, హైదరాబాద్: వేసవిని దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేసిన గొర్రెలకు రూ.66 కోట్లతో ఉచితంగా దాణా పంపిణీ చేయనున్నట్లు పశుసంవర్ధకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ వెల్లడించారు. శనివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 2.53 లక్షల మందికి 53 లక్షల పైచిలుకు గొర్రెలను పంపిణీ చేశామన్నారు. కేవలం గొర్రెలను పంపిణీ చేయడమే కాకుండా వాటికి దాణా, నీరు, ఆరోగ్య పరిరక్షణ కార్యక్రమాలను చేపడుతున్నామన్నారు. యూనిట్‌కు 4 బస్తాల దాణా అందిస్తామన్నారు. గొర్రెలకు బీమా సౌకర్యం కల్పించామని, చనిపోయిన వాటి వివరాలను అధికారులకు తెలియజేస్తే క్లెయి మ్స్ చెల్లిస్తారన్నారు. గొర్రెల పెంపకందారు ప్రమాదవశాత్తు చనిపోతే రూ.ఆరు లక్షల ఎక్స్ గ్రేషియా ఇస్తామన్నారు. రంగారెడ్డి జిల్లా మామిడిపల్లిలో ఆధునిక సౌకర్యాలతో గొర్రెల పెంపకంపై శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. వేసవిని దృష్టిలో ఉంచుకొని ఎక్కువ కోతలు ఇచ్చే మేలు రకపు పశుగ్రాస విత్తనాలను 75 శాతం రాయితీపై రైతులకు ఇస్తామన్నారు. వెయ్యి కోట్లతో మత్స్యశాఖ అభివృద్ధి: మత్స్యరంగ అభివృద్ధి కోసం ప్రభుత్వం రూ.వెయ్యి కోట్లతో సమీకృత మత్స్య అభివృద్ధి పథకం కింద అనేక కార్యక్రమాలు అమలు చేస్తుందని మంత్రి తలసాని వెల్లడించారు. సచివాలయం నుంచి జిల్లా కలెక్టర్లు, మత్స్యశాఖల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. పథకాలపై విస్తృత ప్రచారం చేయాలని వారిని ఆదేశించారు. మత్స్య విత్తన అభివృద్ధి పథకం కింద రూ.204 కోట్లతో హేచరీలు, విత్తన క్షేత్రాల బలోపేతం వంటివి చేపడుతున్నామన్నారు. చేపల వేట కోసం మత్స్యకారులకు రూ.82 కోట్లతో సబ్సిడీపై క్రాఫ్ట్‌లు, వలలను పంపిణీ చేస్తామన్నారు. రూ. 370 కోట్లతో చేపల మార్కెటింగ్‌కు అవసరమైన చర్యలను చేపడతామన్నారు. 201718 సంవత్సరంలో 51 కోట్ల చేపపిల్లలను రూ.42 కోట్ల ఖర్చుతో 11,067 జలాశయాల్లో విడుదల చేశామన్నారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో మత్స్యశాఖ కమిషనర్ సువర్ణ పాల్గొన్నారు. -
మత్స్య పరిశ్రమకు సాయం
సాక్షి, హైదరాబాద్: మత్స్యకారులకు అన్ని రకాలుగా సహాయం అందించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. శనివారం ఆక్వా ఎక్స్పో ఇండియా 2018 ముగింపు వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రాష్ట్రం ఏర్పడక ముందు మత్స్య పరిశ్రమ అభివృద్ధికి నోచుకోలేదని, కోస్తా తీర ప్రాంతాల మత్స్యకారులను ఒక రకంగా, తెలంగాణ మత్స్యకారులను మరో విధంగా చూసేవాళ్లని, తెలంగాణ ప్రభుత్వం వచ్చాక ప్రభుత్వం మత్స్యకారుల అభివృద్ధికి చర్యలు చేపట్టిందన్నారు. దేశంలో ఎక్కడాలేని విధంగా ఉచితంగా సీడ్‌ను అందిస్తుందన్నారు. చేపల సీడ్ ఇవ్వడం నుంచి, అవి పెరిగాక కోల్డ్ స్టోరేజ్‌లో పెట్టి మంచి ధరకు అమ్మేదాక ప్రభుత్వం మత్స్యకారులకు తోడుగా ఉంటుందన్నారు. టెక్నాలజీని వాడుకుని మత్స్య సంపదను పెంచాలన్నారు. మత్య్సకారులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూసుకుంటామని మంత్రి తలసాని అన్నారు. -
సర్కారు ‘మత్స్య’మంత్రం
► చేపల పరిశ్రమను అద్భుతంగా తీర్చిదిద్దుతాం: సీఎం కేసీఆర్ ► రూ. 500 కోట్లు కూడా లేని ఆ రంగాన్ని రూ.5 వేల కోట్ల స్థాయికి తీసుకెళ్తాం ► మత్స్యశాఖలో కొత్తగా 600 మంది సిబ్బందిని నియమిస్తాం ► బెస్తలకు తొలి ప్రాధాన్యం.. ఇతర కులాలకూ భాగస్వామ్యం కల్పిస్తాం ► కొత్త సహకార సంఘాలు ఏర్పాటు చేస్తాం ► కాళేశ్వరం, పాలమూరు పథకాలు పూర్తయితే అద్భుత ప్రగతని వ్యాఖ్య సాక్షి, హైదరాబాద్ : ‘‘సమైక్య పాలనలో ధ్వంసమైన మత్స్య సమాఖ్యను ఓ పరిశ్రమగా అభివృద్ధి చేయబోతున్నాం. ఏడాదికి రూ. 500 కోట్లు కూడా సంపాదించిపెట్టని ఆ రంగాన్ని 5 వేల కోట్ల స్థాయికి తీసుకెళ్లే ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి. కాకతీయ రాజుల పుణ్యమా అని రాష్ట్రంలో ఆ రంగం పరిఢవిల్లేందుకు చెరువుల రూపంలో అద్భుత అవకాశాలున్నాయి. భారీ పెట్టుబడులను ఆకట్టుకునే రంగంగా ఇది అవతరించనుంది’’ అని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఉద్ఘాటించారు. ఇందుకు వీలుగా మత్స్యశాఖలో దాదాపు 600 వరకు కొత్త సిబ్బంది నియామకాలు చేపట్టి, ఆ శాఖకు బడ్జెట్లో భారీగా నిధులు కేటాయిస్తామని ప్రకటించారు. చేపల పరిశ్రమ అంటే కోస్తా ప్రాంతమనే భావనను చెరిపేసి పొరుగు రాష్ట్రాలే కాకుండా వేరే దేశాలకు కూడా చేపలను ఎగుమతి చేసే స్థాయికి తెలంగాణను తీర్చిదిద్దుతామని తెలిపారు. బెస్త కులస్తులకే తొలి ప్రాధాన్యం ఇచ్చినా.. ఆ రంగంలో ఉపాధి వెతుక్కుంటున్న ఇతర కులాలవారినీ భాగస్వాములను చేస్తామని, ఇందుకు వీలుగా కొత్త సహకార సంఘాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించిట్లు వెల్లడించారు. కష్టపడి తెచ్చుకున్న తెలంగాణ తన జీవికను సుస్థిరం చేసుకోవాల్సి ఉందని, అప్పుడే బంగారు తెలంగాణ సాధ్యమని చెప్పారు. అందుకు ఇలాంటి రంగాలను అద్భుతంగా తీర్చిదిద్దాలని నిర్ణయించినట్టు పేర్కొన్నారు. మంగళవారం అసెంబ్లీలో మత్స్య పరిశ్రమ అభివృద్ధిపై జరిగిన స్వల్పకాలిక చర్చలో సీఎం ఈ మేరకు తెలిపారు. ‘‘సహజంగా చెరువుల్లో పెరిగే ఎర్ర రొయ్యలు నా చిన్నతనంలో విరివిగా దొరికేవి. చింతచిగురు, శనగపప్పు వేసి వండితే వాటి రుచి అద్భుతం. ఇప్పుడు వాటి జాడే లేదు. మళ్లీ చెరువులకు పూర్వవైభవం వస్తే అవి విరివిగా దొరుకుతవి. మల్లన్న సాగర్‌ను భారీ విస్తీర్ణంలో నిర్మించాలనే యోచనకు కూడా ఇలాంటి కారణాలే మూలం’’ ‘‘నేను దుబ్బాక జిల్లా పరిషత్ పాఠశాలలో చదివేప్పుడు వైజ్ఞానిక పర్యటన కోసం అప్పర్ మానేరు డ్యాం వద్దకు తీసుకెళ్లారు. ఆ ప్రాజెక్టు చేప పిల్లల ఉత్పత్తి కేంద్రమని మా ఉపాధ్యాయులు చెప్పటం నాకింకా గుర్తు. అప్పట్లో తెలంగాణలో అలా ఎన్నో కేంద్రాలుండేవి. ఇప్పుడు జీరో..’’ నా కళ్ల ముందు గొప్ప తెలంగాణ కదలాడుతోంది కాళేశ్వరం, పాలమూరు ఎత్తిపోతల పథకాలు పూర్తయి, కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమాలాంటివి పూర్తి సామర్థ్యంతో అందుబాటులోకి వస్తే అద్భుతమైన తెలంగాణ ఆవిషృతమవుతుందని ముఖ్యమంత్రి అన్నారు. ‘‘దేవాదుల దిగువన ఉన్న కొత్తూరు నుంచి ధర్మపురి చేరువలోని జైన వరకు దాదాపు 140 కిలోమీటర్ల వరకు గోదావరి గలగలలను చూడబోతున్నాం. రోహిణి కార్తె వస్తే మొగులుకు ముఖంపెట్టి చూసే రోజులుపోయి సాగు, తాగునీటికే కాకుండా అద్భుత మత్స్య పరిశ్రమకు ఆలవాలం కానుంది. ఆ చిత్రం ఊహించుకుంటేనే కడుపు నిండుతోంది. నిజంగా అది ఆవిష్కృతమైనప్పుడు తెలంగాణ రూపురేఖలే మారిపోతాయి. నేను కలలుగంటున్న ఆ దృశ్యం చూసేవరకు బతికుండాలని దేవున్ని కోరుకుంటున్నా’’అని సీఎం అన్నారు. ఒకప్పుడు మత్స్యపరిశ్రమ అనగానే ఆంధ్రాలోని కోస్తా తీరమే అన్నట్టు చేశారని, కానీ ఇక్కడ ఉన్న 46 వేల చెరువులు, గోదావరి నది, దానిపై ప్రాజెక్టులు, ఎత్తిపోతల ద్వారా చేపట్టే మల్లన్నసాగర్ లాంటి రిజర్వాయర్లు.. మత్స్య పరిశ్రమను సుస్థిరం చేస్తాయన్నారు. 11 లక్షల టన్నుల వరకు చేపల ఉత్పత్తి మేలు రకం చేపలను పెంచేందుకు వీలుగా పరిశోధనల కోసం ఉత్తర, దక్షిణ తెలంగాణల్లో ఒక్కొక్కటి చొప్పున రెండు పరిశోధన కళాశాలలను ఏర్పాటు చేయనున్నట్టు సీఎం ప్రకటించారు. సొంతంగా చేప విత్తన ఉత్పత్తి కేంద్రాలను కూడా అభివృద్ధి చేయనున్నట్టు తెలిపారు. సహకార సంఘాలకు నాణ్యమైన వలలు సహా మరబోట్లు, ఇతర వస్తువులు, పరికరాలను ప్రభుత్వమే సమకూరుస్తుందన్నారు. ఇప్పుడున్నట్టే ఫెడరేషన్‌నే కొనసాగించాలా, కార్పొరేషన్‌గా మార్చాలా అన్న విషయాన్ని త్వరలో తేలుస్తామన్నారు. ప్రస్తుతం జవజీవాలు లేకుండా ఉన్న మత్స్య సమాఖ్యకు ఓ ఐఏఎస్ అధికారిని నియమించి నిధులు, చాలినంత సిబ్బందితో పరిపుష్టం చేస్తామన్నారు. ప్రమాదవశాత్తు చనిపోయే మత్స్యకారులకు రూ.6 లక్షల బీమా సౌకర్యం కల్పించనున్నట్టు తెలిపారు. ప్రస్తుతం తెలంగాణలో లక్ష టన్నుల చేపలు సహజంగా, మరో లక్ష టన్నులు చేప విత్తనం ద్వారా ఉత్పత్తి అవుతోందని, కానీ ఈ సంవత్సరం ఏకంగా 32 కోట్ల చేప పిల్లలను వదలటం ద్వారా అదనంగా 1.25 లక్షల టన్నుల ఉత్పత్తి పెరుగుతుందని సీఎం వివరించారు. ప్రభుత్వ ప్రణాళికలతో భవిష్యత్తులో ఈ మొత్తం 11 లక్షల టన్నుల వరకు చేరుకునే అవకాశం ఉందన్నారు. నదీ జలాల అంతర్ రాష్ట్ర బోర్డు తెలంగాణ–ఏపీ ఉమ్మడి ప్రాజెక్టుల్లో తెలంగాణ చేపల వాటాను నిర్ధారించాల్సి ఉందన్నారు. సొసైటీలను దగా చేస్తున్న బేగంబజార్ బ్రోకర్లను తరిమికొట్టనున్నట్టు వెల్లడించారు. చేపల వేటలో ఉన్న బెస్తలు, ముదిరాజ్‌లు ఇతర కులస్థులు ఘర్షణల జోలికి వెళ్లొద్దని, అందరికీ కడుపునిండేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నందున ఎవరి పని వారు ప్రశాంతంగా చేసుకోవాలని సూచించారు. కులవృత్తులు అంతరిస్తే ప్రత్యామ్నాయం చూపాల్సిందే.. సామాజిక పరివర్తనలో కొన్ని కులవృత్తులు అంతరించటం సహజమేనని ముఖ్యమంత్రి అన్నారు. ఇప్పుడు కుండల్లో వండుకునే పరిస్థితులు లేక కుండలకు గిరాకీ పోయిందని, దీపావళి ప్రమిదలు, పెళ్లిళ్లలో ఐరేనీ కుండలు తప్ప కుండల తయారీదారులకు గిరాకే లేదన్నారు. ఇలా స్వర్ణకార, చేనేత వృత్తులు కూడా అంతరించే పరిస్థితి వచ్చిందన్నారు. ఇలాంటి తరుణంలో తెలివైన ప్రభుత్వాలు వారికి ప్రత్యామ్నాయ ఆదాయ దారులు చూపాల్సి ఉందన్నారు. ఈ దిశగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని వివరించారు. కేవలం నేత వస్త్రాలు వేసుకోవటాన్ని ప్రచారం చేసినంత మాత్రాన వారికి ఉపాధి సుగమం కాదన్నారు. గొర్రెల పెంపకం దారులకు కూడా భారీ బడ్జెట్ కేటాయించాలని నిర్ణయించినట్టు వెల్లడించారు. గొర్రెల యూనిట్లను భారీగా పెంచుతామని, ప్రస్తుతం రాజస్తాన్ నుంచి తెలంగాణకు 300 గొర్రెల లారీలు వచ్చే దుస్థితిని నిరోధిస్తామన్నారు. బడ్జెట్ సమావేశాల నాటికి చేపలు, గొర్రెల పెంపకానికి సంబంధించి రెండు పాలసీలను రూపొందించనున్నట్టు వెల్లడించారు. వీటి విధివిధానాల రూపకల్పనకు ముందు సూచనలు, సలహాల కోసం అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయనున్నట్టు ప్రకటించారు. ముందే మేల్కొనాల్సింది: జీవన్‌రెడ్డి చేపల పెంపకందారులను ఆదుకునేందుకు ప్రభుత్వం ఇటీవల చెరువుల్లో 28 కోట్ల చేప పిల్లలను విడవటాన్ని స్వాగతిస్తున్నామని కాంగ్రెస్ సభ్యుడు జీవన్‌రెడ్డి పేర్కొన్నారు. అయితే ప్రభుత్వం ఈ ప్రక్రియను కొన్ని నెలల ముందే నిర్వహించి ఉంటే మత్స్యకారులకు మరింత మేలు కలిగేదని అభిప్రాయపడ్డారు. మత్స్య శాఖపై స్వల్పకాలిక చర్చలో ఆయన మాట్లాడుతూ.. చేపలు ఎదిగేందుకు చాలా సమయం పడుతుందని, జూలై, ఆగస్టు నెలల్లో పిల్లలను చెరువుల్లో వదిలి ఉంటే ఎక్కువ బరువు తూగేలా పెరిగేవని, నవంబర్‌లో వేయటం వల్ల ఏప్రిల్ నాటికి నీళ్లు తగ్గి తక్కువ బరువుకే వాటిని పట్టాల్సిన పరిస్థితి వస్తుందన్నారు. ప్రభుత్వం గతంలో జార్ఖండ్‌లో కేజ్ కల్చర్ విధానాన్ని పరిశీలించిందని, ఇప్పుడు దాని జాడే లేదని విమర్శించారు. దీనికి సీఎం బదులిస్తూ.. చెరువుల్లో తొలుత నీళ్లు తక్కువ ఉండటం వల్ల చేప పిల్లలను ఆలస్యంగా వదలాల్సి వచ్చిందన్నారు. కేజ్ కల్చర్ విధానం ప్రయోగాత్మక పరిశీలన కొనసాగుతోందని తెలిపారు. వైఎస్ హయాంలో జాతీయ స్థాయి బోర్డు: రామ్మోహన్‌రెడ్డి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి చొరవతో కేంద్రం హైదరాబాద్‌లో జాతీయ స్థాయి మత్స్య పరిశ్రమ అభివృద్ధి బోర్డును ఏర్పాటు చేసిందని, అప్పట్లో దేశంలో చేపల పెంపకంలో ఏపీ తొలిస్థానంలో నిలిచిందని కాంగ్రెస్ సభ్యుడు రామ్మోహన్‌రెడ్డి పేర్కొన్నారు. ప్రస్తుతం చెరువుల్లో తక్కువ మొత్తంలో చేప పిల్లలు వదిలి ఎక్కువ వదిలినట్టు లెక్కలు చూపారన్నారు. చేపల చెరువులుగా మార్చండి: కిషన్‌రెడ్డి హైదరాబాద్‌లోని చెరువుల్లో ఒకప్పుడు చేపల పెంపకం విస్తృతంగా సాగేదని, వాటిలోకి డ్రైనేజీ నీళ్లు వదలటం మొదలుపెట్టడంతో చేపల జాడే లేకుండా పోయిందని బీజేఎల్పీ నేత కిషన్‌రెడ్డి వాపోయారు. ఆ చెరువులను శుభ్రపరిచి చేపల పెంపకానికి అనువుగా మార్చాలన్నారు విద్యార్థులకు చేపల భోజనం: ఆర్.కృష్ణయ్య పాఠశాల విద్యార్థుల మెనూలో చేపలు కూడా చేర్చాలని టీడీపీ సభ్యుడు ఆర్.కృష్ణయ్య కోరారు. చేప నూనెకు మంచి డిమాండ్ ఉన్నందున అలాంటి అనుబంధ ఉత్పత్తుల తయరీ యూనిట్లను ఏర్పాటు చేయాలని కోరారు. మండలానికో మార్కెట్: సున్నం మత్స్యకారుల సంక్షేమం కోసం కేటాయించిన నిధులన్నింటిని అదే సంవత్సరంలో ఖర్చు చేసేలా చూడాలని సీపీఎం సభ్యుడు సున్నం రాజయ్య కోరారు. మండలానికో ఓ చేపల మార్కెట్ ఉండేలా చూడాలన్నారు. కాగా, మత్స్యకారులుగా ఉన్న మైనారిటీలను ఆదుకోవాలని మజ్లిస్ సభ్యుడు కైసర్ మొహినుద్దీన్ కోరారు. ఈ సందర్భంగా ఆయన తెలుగులో మాట్లాడారు. మొహినుద్దీన్ అచ్చ తెలుగులో మాట్లాడి అలరించారంటూ మంత్రి హరీశ్‌రావు అభినందించారు.