మ్యాప్‌ను పరిశీలిస్తున్న కేంద్ర మంత్రి మురుగన్, రాష్ట్ర మంత్రి సీదిరి అప్పలరాజు, ఎంపీ బాలశౌరి
సాక్షి, మచిలీపట్నం: మత్స్యసంపద ఎగుమతుల్లో దేశంలో ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో ఉందని, ఇది ఇతర రాష్ట్రాలకు స్ఫూర్తిగా నిలుస్తుందని కేంద్ర మత్స్యశాఖ, సమాచార ప్రసార శాఖల సహాయ మంత్రి డాక్టర్ ఎల్.మురుగన్ అన్నారు. కృష్ణా జిల్లా మచిలీపట్నం ఫిషింగ్ హార్బర్ నిర్మాణ పనులను పరిశీలించేందుకు శుక్రవారం వచ్చిన ఆయన ఈ సందర్భంగా మాట్లాడారు. మత్స్యసంపదను ప్రపంచ దేశాలకు ఎగుమతి చేసే సత్తా ఆంధ్రప్రదేశ్‌కు ఉందని, ఎగుమతుల్లో 36 శాతంతో దేశంలో మొదటిస్థానంలో నిలిచిందన్నారు. ఎగుమతులు 50 శాతానికి చేరేలా కేంద్ర ప్రభుత్వం సహాయం అందిస్తోందన్నారు.
ప్రధాని నరేంద్రమోదీ మత్స్యపరిశ్రమ అభివృద్ధికి అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నారని తెలిపారు. నీలి విప్లవానికి రూ. 5 వేల కోట్లు కేటాయించిన ఘనత మోదీ ప్రభుత్వానిదన్నారు. మత్స్య పరిశ్రమకు ప్రత్యేకంగా మంత్రిత్వశాఖను ఏర్పాటు చేయడం దేశచరిత్రలో ఇదే తొలిసారన్నారు. ఏపీ నుంచి ఇతర దేశాలకు మత్స్య సంపద ఎగుమతి చేసేలా ఫిషింగ్‌హార్బర్లను ఆధునికీకరిస్తున్నట్లు చెప్పారు. రాష్ట్ర మత్స్యశాఖ మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు మాట్లాడుతూ.. రాష్ట్రంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం ఒకేసారి తొమ్మిది ఫిషింగ్ హార్బర్లు నిర్మాణానికి శ్రీకారం చుట్టిందన్నారు.
రాష్ట్రంలో మత్స్య పరిశ్రమను మరింత బలోపేతం చేసే దిశగా ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. రాబోయే మూడు నెలల్లో రాష్ట్రంలోని మత్స్యకారులకు వలలు, బోట్లు, మోటార్లను సబ్సిడీపై ఇవ్వబోతున్నట్లు వెల్లడించారు. మచిలీపట్నం ఎంపీ బాలశౌరి మాట్లాడుతూ.. ఈ ప్రాంత మత్స్యకారులకు అత్యాధునిక టెక్నాలజీతో తయారు చేసిన బోట్లను సబ్సిడీపై అందించనున్నట్లు చెప్పారు. ఎమ్మెల్యే పేర్ని నాని మాట్లాడుతూ.. కేంద్ర మంత్రి రాకతో ఈ ప్రాంత మత్స్యకారులకు మేలు జరుగుతుందనే నమ్మకం కలిగిందన్నారు. మత్స్యశాఖ కమిషనర్ కన్నబాబు, కలెక్టర్ రంజిత్‌బాషా తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment