సర్కారు ‘మత్స్య’మంత్రం | CM KCR speaks in Assembly over Development of Fisheries Industry in Telangana | Sakshi
Sakshi News home page

సర్కారు ‘మత్స్య’మంత్రం

Published Wed, Jan 4 2017 2:43 AM | Last Updated on Tue, Aug 14 2018 10:54 AM

సర్కారు ‘మత్స్య’మంత్రం - Sakshi

సర్కారు ‘మత్స్య’మంత్రం

చేపల పరిశ్రమను అద్భుతంగా తీర్చిదిద్దుతాం: సీఎం కేసీఆర్‌
రూ. 500 కోట్లు కూడా లేని ఆ రంగాన్ని రూ.5 వేల కోట్ల స్థాయికి తీసుకెళ్తాం
మత్స్యశాఖలో కొత్తగా 600 మంది సిబ్బందిని నియమిస్తాం
బెస్తలకు తొలి ప్రాధాన్యం.. ఇతర కులాలకూ భాగస్వామ్యం కల్పిస్తాం
కొత్త సహకార సంఘాలు ఏర్పాటు చేస్తాం
కాళేశ్వరం, పాలమూరు పథకాలు పూర్తయితే అద్భుత ప్రగతని వ్యాఖ్య


సాక్షి, హైదరాబాద్‌ : ‘‘సమైక్య పాలనలో ధ్వంసమైన మత్స్య సమాఖ్యను ఓ పరిశ్రమగా అభివృద్ధి చేయబోతున్నాం. ఏడాదికి రూ. 500 కోట్లు కూడా సంపాదించిపెట్టని ఆ రంగాన్ని 5 వేల కోట్ల స్థాయికి తీసుకెళ్లే ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి. కాకతీయ రాజుల పుణ్యమా అని రాష్ట్రంలో ఆ రంగం పరిఢవిల్లేందుకు చెరువుల రూపంలో అద్భుత అవకాశాలున్నాయి. భారీ పెట్టుబడులను ఆకట్టుకునే రంగంగా ఇది అవతరించనుంది’’ అని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఉద్ఘాటించారు. ఇందుకు వీలుగా మత్స్యశాఖలో దాదాపు 600 వరకు కొత్త సిబ్బంది నియామకాలు చేపట్టి, ఆ శాఖకు బడ్జెట్‌లో భారీగా నిధులు కేటాయిస్తామని ప్రకటించారు.

చేపల పరిశ్రమ అంటే కోస్తా ప్రాంతమనే భావనను చెరిపేసి పొరుగు రాష్ట్రాలే కాకుండా వేరే దేశాలకు కూడా చేపలను ఎగుమతి చేసే స్థాయికి తెలంగాణను తీర్చిదిద్దుతామని తెలిపారు. బెస్త కులస్తులకే తొలి ప్రాధాన్యం ఇచ్చినా.. ఆ రంగంలో ఉపాధి వెతుక్కుంటున్న ఇతర కులాలవారినీ భాగస్వాములను చేస్తామని, ఇందుకు వీలుగా కొత్త సహకార సంఘాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించిట్లు వెల్లడించారు. కష్టపడి తెచ్చుకున్న తెలంగాణ తన జీవికను సుస్థిరం చేసుకోవాల్సి ఉందని, అప్పుడే బంగారు తెలంగాణ సాధ్యమని చెప్పారు. అందుకు ఇలాంటి రంగాలను అద్భుతంగా తీర్చిదిద్దాలని నిర్ణయించినట్టు పేర్కొన్నారు. మంగళవారం అసెంబ్లీలో మత్స్య పరిశ్రమ అభివృద్ధిపై జరిగిన స్వల్పకాలిక చర్చలో సీఎం ఈ మేరకు తెలిపారు.

 ‘‘సహజంగా చెరువుల్లో పెరిగే ఎర్ర రొయ్యలు నా చిన్నతనంలో విరివిగా దొరికేవి. చింతచిగురు, శనగపప్పు వేసి వండితే వాటి రుచి అద్భుతం. ఇప్పుడు వాటి జాడే లేదు. మళ్లీ చెరువులకు పూర్వవైభవం వస్తే అవి విరివిగా దొరుకుతవి. మల్లన్న సాగర్‌ను భారీ విస్తీర్ణంలో నిర్మించాలనే యోచనకు కూడా ఇలాంటి కారణాలే మూలం’’

‘‘నేను దుబ్బాక జిల్లా పరిషత్‌ పాఠశాలలో చదివేప్పుడు వైజ్ఞానిక పర్యటన కోసం అప్పర్‌ మానేరు డ్యాం వద్దకు తీసుకెళ్లారు. ఆ ప్రాజెక్టు చేప పిల్లల ఉత్పత్తి కేంద్రమని మా ఉపాధ్యాయులు చెప్పటం నాకింకా గుర్తు. అప్పట్లో తెలంగాణలో అలా ఎన్నో కేంద్రాలుండేవి. ఇప్పుడు జీరో..’’

నా కళ్ల ముందు గొప్ప తెలంగాణ కదలాడుతోంది
కాళేశ్వరం, పాలమూరు ఎత్తిపోతల పథకాలు పూర్తయి, కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమాలాంటివి పూర్తి సామర్థ్యంతో అందుబాటులోకి వస్తే అద్భుతమైన తెలంగాణ ఆవిషృతమవుతుందని ముఖ్యమంత్రి అన్నారు. ‘‘దేవాదుల దిగువన ఉన్న కొత్తూరు నుంచి ధర్మపురి చేరువలోని జైన వరకు దాదాపు 140 కిలోమీటర్ల వరకు గోదావరి గలగలలను చూడబోతున్నాం. రోహిణి కార్తె వస్తే మొగులుకు ముఖంపెట్టి చూసే రోజులుపోయి సాగు, తాగునీటికే కాకుండా అద్భుత మత్స్య పరిశ్రమకు ఆలవాలం కానుంది. ఆ చిత్రం ఊహించుకుంటేనే కడుపు నిండుతోంది. నిజంగా అది ఆవిష్కృతమైనప్పుడు తెలంగాణ రూపురేఖలే మారిపోతాయి. నేను కలలుగంటున్న ఆ దృశ్యం చూసేవరకు బతికుండాలని దేవున్ని కోరుకుంటున్నా’’అని సీఎం అన్నారు. ఒకప్పుడు మత్స్యపరిశ్రమ అనగానే ఆంధ్రాలోని కోస్తా తీరమే అన్నట్టు చేశారని, కానీ ఇక్కడ ఉన్న 46 వేల చెరువులు, గోదావరి నది, దానిపై ప్రాజెక్టులు, ఎత్తిపోతల ద్వారా చేపట్టే మల్లన్నసాగర్‌ లాంటి రిజర్వాయర్లు.. మత్స్య పరిశ్రమను సుస్థిరం చేస్తాయన్నారు.

11 లక్షల టన్నుల వరకు చేపల ఉత్పత్తి
మేలు రకం చేపలను పెంచేందుకు వీలుగా పరిశోధనల కోసం ఉత్తర, దక్షిణ తెలంగాణల్లో ఒక్కొక్కటి చొప్పున రెండు పరిశోధన కళాశాలలను ఏర్పాటు చేయనున్నట్టు సీఎం ప్రకటించారు. సొంతంగా చేప విత్తన ఉత్పత్తి కేంద్రాలను కూడా అభివృద్ధి చేయనున్నట్టు తెలిపారు. సహకార సంఘాలకు నాణ్యమైన వలలు సహా మరబోట్లు, ఇతర వస్తువులు, పరికరాలను ప్రభుత్వమే సమకూరుస్తుందన్నారు. ఇప్పుడున్నట్టే ఫెడరేషన్‌నే కొనసాగించాలా, కార్పొరేషన్‌గా మార్చాలా అన్న విషయాన్ని త్వరలో తేలుస్తామన్నారు. ప్రస్తుతం జవజీవాలు లేకుండా ఉన్న మత్స్య సమాఖ్యకు ఓ ఐఏఎస్‌ అధికారిని నియమించి నిధులు, చాలినంత సిబ్బందితో పరిపుష్టం చేస్తామన్నారు. ప్రమాదవశాత్తు చనిపోయే మత్స్యకారులకు రూ.6 లక్షల బీమా సౌకర్యం కల్పించనున్నట్టు తెలిపారు. ప్రస్తుతం తెలంగాణలో లక్ష టన్నుల చేపలు సహజంగా, మరో లక్ష టన్నులు చేప విత్తనం ద్వారా ఉత్పత్తి అవుతోందని, కానీ ఈ సంవత్సరం ఏకంగా 32 కోట్ల చేప పిల్లలను వదలటం ద్వారా అదనంగా 1.25 లక్షల టన్నుల ఉత్పత్తి పెరుగుతుందని సీఎం వివరించారు. ప్రభుత్వ ప్రణాళికలతో భవిష్యత్తులో ఈ మొత్తం 11 లక్షల టన్నుల వరకు చేరుకునే అవకాశం ఉందన్నారు. నదీ జలాల అంతర్‌ రాష్ట్ర బోర్డు తెలంగాణ–ఏపీ ఉమ్మడి ప్రాజెక్టుల్లో తెలంగాణ చేపల వాటాను నిర్ధారించాల్సి ఉందన్నారు. సొసైటీలను దగా చేస్తున్న బేగంబజార్‌ బ్రోకర్లను తరిమికొట్టనున్నట్టు వెల్లడించారు. చేపల వేటలో ఉన్న బెస్తలు, ముదిరాజ్‌లు ఇతర కులస్థులు ఘర్షణల జోలికి వెళ్లొద్దని, అందరికీ కడుపునిండేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నందున ఎవరి పని వారు ప్రశాంతంగా చేసుకోవాలని సూచించారు.

కులవృత్తులు అంతరిస్తే ప్రత్యామ్నాయం చూపాల్సిందే..
సామాజిక పరివర్తనలో కొన్ని కులవృత్తులు అంతరించటం సహజమేనని ముఖ్యమంత్రి అన్నారు. ఇప్పుడు కుండల్లో వండుకునే పరిస్థితులు లేక కుండలకు గిరాకీ పోయిందని, దీపావళి ప్రమిదలు, పెళ్లిళ్లలో ఐరేనీ కుండలు తప్ప కుండల తయారీదారులకు గిరాకే లేదన్నారు. ఇలా స్వర్ణకార, చేనేత వృత్తులు కూడా అంతరించే పరిస్థితి వచ్చిందన్నారు. ఇలాంటి తరుణంలో తెలివైన ప్రభుత్వాలు వారికి ప్రత్యామ్నాయ ఆదాయ దారులు చూపాల్సి ఉందన్నారు. ఈ దిశగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని వివరించారు. కేవలం నేత వస్త్రాలు వేసుకోవటాన్ని ప్రచారం చేసినంత మాత్రాన వారికి ఉపాధి సుగమం కాదన్నారు. గొర్రెల పెంపకం దారులకు కూడా భారీ బడ్జెట్‌ కేటాయించాలని నిర్ణయించినట్టు వెల్లడించారు. గొర్రెల యూనిట్లను భారీగా పెంచుతామని, ప్రస్తుతం రాజస్తాన్‌ నుంచి తెలంగాణకు 300 గొర్రెల లారీలు వచ్చే దుస్థితిని నిరోధిస్తామన్నారు. బడ్జెట్‌ సమావేశాల నాటికి చేపలు, గొర్రెల పెంపకానికి సంబంధించి రెండు పాలసీలను రూపొందించనున్నట్టు వెల్లడించారు. వీటి విధివిధానాల రూపకల్పనకు ముందు సూచనలు, సలహాల కోసం అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయనున్నట్టు ప్రకటించారు.

ముందే మేల్కొనాల్సింది: జీవన్‌రెడ్డి
చేపల పెంపకందారులను ఆదుకునేందుకు ప్రభుత్వం ఇటీవల చెరువుల్లో 28 కోట్ల చేప పిల్లలను విడవటాన్ని స్వాగతిస్తున్నామని కాంగ్రెస్‌ సభ్యుడు జీవన్‌రెడ్డి పేర్కొన్నారు. అయితే ప్రభుత్వం ఈ ప్రక్రియను కొన్ని నెలల ముందే నిర్వహించి ఉంటే మత్స్యకారులకు మరింత మేలు కలిగేదని అభిప్రాయపడ్డారు. మత్స్య శాఖపై స్వల్పకాలిక చర్చలో ఆయన మాట్లాడుతూ.. చేపలు ఎదిగేందుకు చాలా సమయం పడుతుందని, జూలై, ఆగస్టు నెలల్లో పిల్లలను చెరువుల్లో వదిలి ఉంటే ఎక్కువ బరువు తూగేలా పెరిగేవని, నవంబర్‌లో వేయటం వల్ల ఏప్రిల్‌ నాటికి నీళ్లు తగ్గి తక్కువ బరువుకే వాటిని పట్టాల్సిన పరిస్థితి వస్తుందన్నారు. ప్రభుత్వం గతంలో జార్ఖండ్‌లో కేజ్‌ కల్చర్‌ విధానాన్ని పరిశీలించిందని, ఇప్పుడు దాని జాడే లేదని విమర్శించారు. దీనికి సీఎం బదులిస్తూ.. చెరువుల్లో తొలుత నీళ్లు తక్కువ ఉండటం వల్ల చేప పిల్లలను ఆలస్యంగా వదలాల్సి వచ్చిందన్నారు. కేజ్‌ కల్చర్‌ విధానం ప్రయోగాత్మక పరిశీలన కొనసాగుతోందని తెలిపారు.

వైఎస్‌ హయాంలో జాతీయ స్థాయి బోర్డు: రామ్మోహన్‌రెడ్డి
దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి చొరవతో కేంద్రం హైదరాబాద్‌లో జాతీయ స్థాయి మత్స్య పరిశ్రమ అభివృద్ధి బోర్డును ఏర్పాటు చేసిందని, అప్పట్లో దేశంలో చేపల పెంపకంలో ఏపీ తొలిస్థానంలో నిలిచిందని కాంగ్రెస్‌ సభ్యుడు రామ్మోహన్‌రెడ్డి పేర్కొన్నారు. ప్రస్తుతం చెరువుల్లో తక్కువ మొత్తంలో చేప పిల్లలు వదిలి ఎక్కువ వదిలినట్టు లెక్కలు చూపారన్నారు.

చేపల చెరువులుగా మార్చండి: కిషన్‌రెడ్డి
హైదరాబాద్‌లోని చెరువుల్లో ఒకప్పుడు చేపల పెంపకం విస్తృతంగా సాగేదని, వాటిలోకి డ్రైనేజీ నీళ్లు వదలటం మొదలుపెట్టడంతో చేపల జాడే లేకుండా పోయిందని బీజేఎల్పీ నేత కిషన్‌రెడ్డి వాపోయారు. ఆ చెరువులను శుభ్రపరిచి చేపల పెంపకానికి అనువుగా మార్చాలన్నారు

విద్యార్థులకు చేపల భోజనం: ఆర్‌.కృష్ణయ్య
పాఠశాల విద్యార్థుల మెనూలో చేపలు కూడా చేర్చాలని టీడీపీ సభ్యుడు ఆర్‌.కృష్ణయ్య కోరారు. చేప నూనెకు మంచి డిమాండ్‌ ఉన్నందున అలాంటి అనుబంధ ఉత్పత్తుల తయరీ యూనిట్లను ఏర్పాటు చేయాలని కోరారు.

మండలానికో మార్కెట్‌: సున్నం
మత్స్యకారుల సంక్షేమం కోసం కేటాయించిన నిధులన్నింటిని అదే సంవత్సరంలో ఖర్చు చేసేలా చూడాలని సీపీఎం సభ్యుడు సున్నం రాజయ్య కోరారు. మండలానికో ఓ చేపల మార్కెట్‌ ఉండేలా చూడాలన్నారు. కాగా, మత్స్యకారులుగా ఉన్న మైనారిటీలను ఆదుకోవాలని మజ్లిస్‌ సభ్యుడు కైసర్‌ మొహినుద్దీన్‌ కోరారు. ఈ సందర్భంగా ఆయన తెలుగులో మాట్లాడారు. మొహినుద్దీన్‌ అచ్చ తెలుగులో మాట్లాడి అలరించారంటూ మంత్రి హరీశ్‌రావు అభినందించారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement