నరసాపురం: మత్స్య పరిశ్రమ అభివృద్ధి దిశగా రాష్ట్ర ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో ఏర్పాటు చేస్తున్న రాష్ట్రంలో తొలి ఫిషరీస్ యూనివర్సిటీకి నిధులు మంజూరు చేసింది. ఆక్వా పరిశ్రమ అభివృద్ధికి ఎంతో కీలకమైన ఈ విశ్వవిద్యాలయానికి తొలి విడతగా రూ.100 కోట్లు మంజూరు చేసింది. నరసాపురం మండలం తీరగ్రామం వేములదీవి ప్రాంతంలో 400 ఎకరాల్లో వర్సిటీ నిర్మాణం చేపడతారు. పరిపాలన భవనాన్ని 40 ఎకరాల్లో సమీపంలోని సరిపల్లి గ్రామంలో నిర్మిస్తారు. వీటికి స్థల సేకరణ కూడా పూర్తయింది. విశ్వవిద్యాలయం నిర్మాణం, కోర్సుల నిర్వహణ, ప్రయోగాలు తదితర అంశాలకు ఐదేళ్లలో రూ.400 కోట్ల వరకూ ఖర్చుచేస్తారని అధికారులు తెలిపారు. ఈ విశ్వవిద్యాలయం ద్వారా ఆక్వా రంగానికి నిపుణుల కొరత తీరుతుంది. పెద్ద ఎత్తున పరిశోధనలకు, ఆక్వా రంగం అభివృద్ధికి వర్సిటీ దోహదం చేస్తుందని అధికారులు చెబుతున్నారు. దీని ద్వారా ప్రత్యక్షంగా 90 వేల మంది ఆక్వా రైతులు, పరోక్షంగా 8 లక్షల మంది ప్రజలు లబ్ధిపొందుతారని అంచనా. మత్స్య శాఖకు సంబంధించిన అన్ని కోర్సుల బోధన ఈ వర్సిటీ ద్వారానే సాగుతుంది.
ఆక్వా రంగానికి జగన్ సర్కారు దన్ను
మత్స్య సంపద, ఆక్వా ఎగుమతుల్లో రాష్ట్రానికి ప్రత్యేక స్థానం ఉంది. ఇక్కడి నుంచి దేశ, విదేశాలకు భారీగా ఆక్వా ఎగుమతులు జరుగుతాయి. ఆదాయం భారీగా సమకూరుతుంది. అయితే ఈ రంగం అభివృద్ధిపై గత ప్రభుత్వాలు దృష్టి పెట్టలేదు. దీంతో పూర్తిస్థాయిలో ఆదాయం రావడంలేదు. నిపుణులు, హార్బర్, ఇతర మౌలిక వసతులు ఉంటే ఎగుమతులు మరో 40 శాతం పెరుగుతాయని అధికారులు చెబుతున్నారు. నిపుణులు లేక ప్రయోగాలు, కొత్త ఆవిష్కరణలు లేవు. వైరస్‌లు సోకకుండా, లాభదాయకంగా ఆక్వా సాగు చేయడం లాంటి ప్రయోజనాలు రైతులు కోల్పోతున్నారు. ఆక్వా నిపుణుల కొరత కారణంగా రాష్ట్రం ఏటా రూ.25 వేల కోట్ల అదనపు ఆదాయం కోల్పోతోందని అంచనా.
గత ప్రభుత్వాల తప్పిదాలను వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సర్కారు తొలి నాళ్లలోనే గుర్తించింది. భారీగా ఆదాయం వచ్చే ఆక్వా, మత్స్య ఎగుమతుల అభివృద్ధిపై దృష్టిపెట్టింది. రాష్ట్రంలో మత్స్యకారుల జీవన ప్రమాణాలు, మత్స్య ఉత్పత్తులను పెంచే చర్యలు చేపట్టింది. మత్స్యకారుల వలసలను నివారించడానికి రూ.3,200 కోట్లతో రాష్ట్రంలో మేజర్ ఫిషింగ్ హార్బర్లు, మినీ ఫిషింగ్ ల్యాండింగ్ సెంటర్ ఏర్పాటు చేయాలని సీఎం వైఎస్ జగన్ నిర్ణయం తీసుకున్నారు. ఇందులో భాగంగా నరసాపురం మండలం బియ్యపుతిప్పలో 600 ఎకరాల్లో రూ.350 కోట్లతో హార్బర్ నిర్మించనున్నారు. ఆక్వా చెరువులకు నిబంధనలు సరళతరం చేయడం, సబ్సిడీపై విద్యుత్ అందించడం లాంటి చర్యలు జగన్ ప్రభుత్వం చేపట్టింది. ఇప్పుడు విశ్వవిద్యాలయం ఏర్పాటుకు చకచకా చర్యలు చేపడుతోంది.
ఆక్వా, మత్స్య ఉత్పత్తులకు మహర్దశ
జిల్లాలో ఫిషరీస్ యూనివర్సిటీకి తొలివిడతగా రూ.100 కోట్లు మంజూరు చేయడం హర్షణీయం. ఇది ఆక్వా, మత్స్య రంగాల్లో నూతన విప్లవం. ఆక్వా రంగ నిపుణులను తయారు చేసుకుని, సాగులో నైపుణ్యాలను పెంచుకుంటే నష్టాలు తగ్గుతాయి. ప్రభుత్వం జిల్లాలో ఆక్వా, మత్స్య రంగాల అభివృద్ధికి పరితపిస్తోంది. అందుకే బియ్యపుతిప్పలో హార్బర్ కట్టబోతున్నారు.
–ముదునూరి ప్రసాదరాజు, ఎమ్మెల్యే
Comments
Please login to add a commentAdd a comment