సాక్షి, అమరావతి: ఆక్వా రంగ సుస్థిరాభివృద్ధికి గడిచిన రెండేళ్లుగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలిస్తున్నాయి. కరోనా కష్టకాలంలో కూడా రికార్డు స్థాయిలో దిగుబడులు వచ్చాయి. దీంతో ఈ రంగంలో ఆంధ్రప్రదేశ్ రికార్డులను తిరగరాస్తోంది. రాష్ట్రంలో 974 కిలోమీటర్ల తీర ప్రాంతముంది. 54,500 హెక్టార్ల ఉప్పు నీటిలో, 1.44 లక్షల హెక్టార్ల మంచినీటిలో సాగు విస్తీర్ణం కలిగి ఉంది. మరో 48 వేల హెక్టార్లలో ఆక్వా సాగును పెంచేందుకు చర్యలు చేపట్టారు. మరోవైపు.. రాష్ట్ర ప్రభుత్వం గడిచిన రెండేళ్లుగా తీసుకొస్తున్న విప్లవాత్మక విధానాలు ఆక్వారంగ సుస్థిరాభివృద్ధికి దోహదపడుతున్నాయి. ఫలితంగా సాగు విస్తీర్ణం పెరగడమే కాదు.. దిగుబడులు కూడా గణనీయంగా పెరుగుతున్నాయి. ఎంతలా అంటే..
► ఆక్వా సాగు, దిగుబడిలోనే కాదు.. ఇన్‌ల్యాండ్ (సంప్రదాయ చెరువులు), మెరైన్ ఉత్పత్తుల్లో దేశంలోనే ఏపీ టాప్‌లో కొనసాగుతోంది.
► దేశవ్యాప్తంగా జరుగుతున్న చేపల ఉత్పత్తిలో 29 శాతం, రొయ్యల ఉత్పత్తిలో 68 శాతం ఇక్కడ నుంచే జరుగుతోంది.
► అలాగే, మత్స్య ఉత్పత్తుల ఎగుమతుల్లో 40 శాతం వాటా ఏపీదే.
► 2019–20లో 18,860 కోట్ల విలువైన మత్స్య ఉత్పత్తులను ఎగుమతి చేయగలిగారు.
పదేళ్లలో భారీగా గణనీయమైన వృద్ధిరేటు
గడిచిన పదేళ్లుగా రాష్ట్రంలో చేపలు, రొయ్యల ఉత్పత్తులు మూడింతలు పెరిగాయి. 2010–11లో కేవలం 14,23,811 టన్నులున్న ఉత్పత్తులు 2019–20కి వచ్చేసరికి 41,75,511 టన్నులకు చేరింది. సముద్ర చేపల ఉత్పత్తి రెట్టింపు కాగా.. రొయ్యల ఉత్పత్తి నాలుగు రెట్లు పెరిగింది. ఇక సంప్రదాయ చెరువుల్లో చేపల ఉత్పత్తి రెండున్నర రెట్లు పెరగగా.. ఉప్పునీటి, మంచినీటి రొయ్యల ఉత్పత్తి 15 రెట్లు పెరిగింది. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 2014–15లో 19.78 లక్షల టన్నులున్న మెరైన్, ఆక్వా ఉత్పత్తులు 2020–21 ఆర్థిక సంవత్సరంలో ఫిబ్రవరి నాటికి రికార్డు స్థాయిలో 42.19 లక్షల టన్నులకు చేరింది. ఈ ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి ఇది కనీసం 44 లక్షల టన్నులు దాటే అవకాశాలు కన్పిస్తున్నాయి.
ప్రభుత్వ తోడ్పాటుతోనే..
సంప్రదాయ చెరువులతో పాటు ఆక్వా చెరువులకు గడిచిన రెండేళ్లుగా నీటికొరత లేకుండా చేయడంతో పాటు ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు వైఎస్ జగన్ సీఎం కాగానే విద్యుత్ టారీఫ్ తగ్గించి యూనిట్ రూ.1.50లకే అందించడం ఆక్వాసాగుకు ఊతమిచ్చింది. వీటికితోడు రైతుభరోసా కేంద్రాల ద్వారా గడిచిన ఏడాదిగా నిర్వహిస్తున్న మత్స్య సాగుబడులు సత్ఫలితాలనిచ్చాయి. శాస్త్రవేత్తలు, నిపుణులు ఎప్పటికప్పుడు ఇచ్చిన మెళకువలు నాణ్యమైన దిగుబడుల సాధనకు దోహదపడ్డాయి.
ఉత్పత్తులు భారీగా పెరిగాయి
గడిచిన రెండేళ్లుగా ఉత్పత్తులు గణనీయంగా పెరుగుతున్నాయి. 2019–20లో 41.75 లక్షల టన్నులుగా నమోదు కాగా, 2020–21లో ఫిబ్రవరి నెలాఖరు నాటికే 42.19లక్షలు దాటింది. ప్రభుత్వం ఇస్తున్న ప్రోత్సాహకాలకు తోడు శాస్త్రీయ పద్ధతులను అవలంబించడం, నాణ్యమైన సీడ్, ఫీడ్ వినియోగించడం ద్వారా దిగుబడుల పెరుగుదలకు కారణమైంది.
– కె. కన్నబాబు, కమిషనర్, మత్స్యశాఖ
Comments
Please login to add a commentAdd a comment