aqua farming
-
మార్చిలోగా 4 వేల ఫిష్ అవుట్లెట్లు
సాక్షి, అమరావతి: మార్చి నెలాఖరులోగా రాష్ట్రంలో 4 వేల ఫిష్ అవుట్లెట్ల ఏర్పాటు పూర్తి చేయాలని ఆక్వా మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్స సత్యనారాయణ, డాక్టర్ సీదిరి అప్పలరాజు అధికారులను ఆదేశించారు. సోమవారం సచివాలయంలో జరిగిన ఆక్వా సాధికారత కమిటీ సమావేశంలో ఆక్వా రంగం అభివృద్ధికి తీసుకున్న నిర్ణయాలు, వాటి అమలు, భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్ ఆక్వా రంగానికి అధిక ప్రాధాన్యతనిస్తున్నారని చెప్పారు. సీఎం ఆదేశాల మేరకు ఆక్వా రైతులకు అండగా నిలవడం, సీడ్, ఫీడ్ రేట్లను శాస్త్రీయంగా నిర్ణయించడం, ధరల స్థిరీకరణ వంటి అంశాల్లో కమిటీ తీసుకున్న నిర్ణయాలు సత్ఫలితాలను ఇస్తున్నాయన్నారు. రాష్ట్రంలో ఉత్పత్తయ్యే వాటిలో స్థానిక వినియోగం కనీసం 30 శాతం పెంచేలా ప్రజల్లో అవగాహన కల్పించాలన్నారు. ఒడిశాలో ఆక్వా ఉత్పత్తులు స్థానిక అవసరాలకు సరిపోతున్నాయని, అంతర్జాతీయ మార్కెట్‌పై ఆధారపడాల్సిన పరిస్థితి లేదని తెలిపారు. దీనివల్ల మార్కెట్ ఒడిదొడుకుల సమయంలో రైతులు నష్టపోకుండా ప్రత్యామ్నాయ మార్కెట్ అవకాశాలు మెరుగు పడతాయన్నారు. మన రాష్ట్రంలో కూడా స్థానిక వినియోగం పెంచాలని అన్నారు. ఇందులో భాగంగా ఏర్పాటు చేస్తున్న ఫిష్ అవుట్లెట్లకు ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన (పీఎంఎంఎస్వై) కింద సబ్సిడీతో కూడిన రుణాలిచ్చేందుకు కేంద్రం అంగీకరించిందన్నారు. పొరుగు రాష్ట్రాల్లో కూడా ఆక్వా హబ్‌ల ద్వారా మన ఉత్పత్తులు విక్రయించాలని చెప్పారు. రాష్ట్రంతో పాటు దేశవ్యాప్తంగా అన్ని ప్రముఖ నగరాల్లో ఆక్వా ఫుడ్ ఫెస్టివల్స్ నిర్వహించాలన్నారు. నియంత్రణలో ఫీడ్, సీడ్ రేట్లు సీడ్ తయారీదారులు, ప్రాసెసింగ్ యూనిట్లతో ఎప్పటికప్పుడు జరుపుతున్న చర్చల ఫలితంగా సీడ్, ఫీడ్ ధరలు నియంత్రణలోకి వచ్చాయని, ఆక్వా ఉత్పత్తుల ధరలు పతనం కాకుండా అడ్డుకట్ట వేయగలిగామని మంత్రులు పేర్కొన్నారు. రైతుల్లోనూ అంతర్జాతీయ మార్కెట్లు, ధరలపై అవగాహన కల్పించి, హేతుబద్ధమైన విస్తీర్ణంలోనే సాగు చేసేలా చూడాలన్నారు. డిమాండ్, సప్లైపై అవగాహన లేకపోతే అంతిమంగా రైతులే నష్టపోతారన్నారు. టోల్ ఫ్రీ నెంబర్ ద్వారా వచ్చే ప్రతి ఫిర్యాదునూ త్వరితగతిన పరిష్కరించాలని చెప్పారు. వచ్చే నెలాఖరుకు జోనింగ్ సర్వే పూర్తి ఆక్వా జోన్ పరిధిలో 10 ఎకరాల లోపు సాగు చేసే వారికి ప్రభుత్వం విద్యుత్ సబ్సిడీని అందిస్తోందని మంత్రులు చెప్పారు. ఇప్పటికే 26 వేల కనెక్షన్లకు ప్రభుత్వం విద్యుత్ సబ్సిడీ ఇస్తోందని తెలిపారు. ఆక్వాజోన్, నాన్ ఆక్వా జోన్ పరిధిలో సాగయ్యే విస్తీర్ణాన్ని గుర్తించేందుకు నిర్వహిస్తున్న సర్వే వచ్చే నెలాఖరుకి పూర్తవుతుందన్నారు. సర్వేలో ఆధార్‌తో రైతుల వివరాలు అనుసంధానం చేస్తున్నారని, దీనివల్ల అర్హులైన రైతులు ఎంతమందో కచ్చితంగా తేలుతుందని తెలిపారు. అర్హత ఉన్న ప్రతి ఆక్వా రైతుకు విద్యుత్ సబ్సిడీ అందించాలని సీఎం వైఎస్ జగన్ నిర్దేశించారని, ఆ మేరకు అధికారులు చర్యలు తీసుకోవాలని మంత్రులు చెప్పారు. సమావేశంలో అప్సడా వైస్ చైర్మన్ వడ్డి రఘురాం, మత్స్య శాఖ కమిషనర్ కన్నబాబు, డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ప్రవీణ్ కుమార్, స్పెషల్ సీఎస్ (ఇంధనశాఖ) కె.విజయానంద్ తదితరులు పాల్గొన్నారు. -
ఆక్వా రైతుల సంక్షేమానికి ప్రభుత్వం నిరంతర కృషి
కాకినాడ సిటీ: ఆక్వా రైతుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందని, రైతులెవరూ అధైర్య పడవద్దని అప్సడా (ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఆక్వా కల్చర్ డెవలప్మెంట్ అథారిటీ) రాష్ట్ర వైస్ చైర్మన్ వడ్డి రఘురామ్ చెప్పారు. సోమవారం ఇక్కడ ఏర్పాటు చేసిన రాష్ట్ర ఆక్వా రైతుల అవగాహన సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. గత ప్రభుత్వంలో ఆక్వా రైతులు ఎన్నో ఇబ్బందులు పడ్డారన్నారు. ప్రాసెసింగ్ ప్లాంట్ల యజమానులు వారికి అనుకూలమైన రేట్లు నిర్ణయించే వారన్నారు. ఆక్వా రైతుల కష్టాలు తెలుసుకున్న 24 గంటల్లోనే సీఎం వైఎస్ జగన్‌రొయ్యలకు గిట్టుబాటు ధర లభించేందుకు మంత్రులు, మత్స్యశాఖ అధికారులు, రైతులతో కలసి ఎంపవర్ కమిటీని వేయడంతో ఎన్నడూలేని విధంగా రైతులు పంటను అమ్ముకోగలుగుతున్నారని తెలిపారు. ఆక్వా రైతుల సమస్యలపై చర్చించి ఆమోదయోగ్యమైన నిర్ణయం తీసుకోవాలన్న సీఎం ఆదేశాల మేరకు ప్రోసెసింగ్ ప్లాంట్ల యాజమానులతో ఇప్పటికే ఐదు సార్లు సమావేశమై గిట్టుబాటు ధరకు రొయ్యలు కొనేలా చర్యలు తీసుకున్నామన్నారు. గత ప్రభుత్వంలో రొయ్య 100 కౌంట్ రూ. 80కు కొనే వారని, ఇప్పుడు అదే కౌంట్ రూ. 210కి కొనాలని స్పష్టం చేశారు. రూపాయి తగ్గినా వెంటనే ఎంక్వైరీ కమిటీలో పెట్టి రైతులు, రైతు సంఘాల నాయకులు సమక్షంలోనే నిలదీసే పరిస్థితి ఉందన్నారు. ఏలూరు జిల్లా గణపవరంలో జరిగిన సమావేశంలో రైతుల వినతి మేరకు ఆక్వాజోన్ పరిధిలో 10 ఎకరాల్లోపు ఉన్న రైతుకి రూ.1.50కే యూనిట్ విద్యుత్ ఇస్తున్నట్లు సీఎం వైఎస్ జగన్ అక్కడికక్కడే ప్రకటించారన్నారు. గత ప్రభుత్వంలో జోన్ వ్యవస్థ మధ్యలో వదిలేస్తే, సీఎం సుదీర్ఘమైన జోన్ల వ్యవస్థను ఏర్పాటు చేశారని చెప్పారు. దీని వల్ల 1,08,864 మంది రైతులు ఆక్వా జోన్లోకి వచ్చారన్నారు. వీరందరికీ యూనిట్ విద్యుత్ రూ. 1.50కే అందిస్తున్నట్లు తెలిపారు. పదిరోజులే రొయ్యల కొంటారంటూ కొందరు గుత్తేదారులు చేస్తున్న ప్రచారంలో వాస్తవం లేదని, 365 రోజులూ ప్రాసెసింగ్ ప్లాంట్లు రొయ్యలు కొంటాయని లేల్చి రెప్పారు. ఏ విధమైన అపోహలకు తావులేకుండా రైతులు నిర్భయంగా పంటలు పండించాలని సూచించారు. -
ఆక్వా వర్సిటీ... ఫిషింగ్ హార్బర్
సాక్షి, అమరావతి: సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సోమవారం పశ్చిమగోదావరి జిల్లా నరసాపురంలో పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. ఆంధ్రప్రదేశ్ ఆక్వా విశ్వవిద్యాలయానికి, బియ్యపుతిప్ప ఫిషింగ్ హార్బర్‌కు, రూ.1,400 కోట్లతో జిల్లా రక్షిత నీటి సరఫరా ప్రాజెక్టులకు శంకుస్థాపన, నరసాపురం ప్రాంతీయ వైద్యశాల నూతన భవనానికి ప్రారంభోత్సవం చేశారు. అనంతరం బహిరంగ సభను ఉద్దేశించి ప్రసంగించారు. ఇప్పటి వరకు తమిళనాడు, కేరళలో మాత్రమే ఈ వర్సిటీలు ఉన్నాయి. ఆక్వా వర్సిటీ కోసం నరసాపురం పరిసర ప్రాంతాల్లోని సరిపల్లి, లిఖితపూడి గ్రామాల మధ్య 40 ఎకరాల భూమిని ఇప్పటికే కేటాయించారు. భవన నిర్మాణ పనుల కోసం రూ.332 కోట్ల అంచనా వ్యయంతో డీపీఆర్ ఆమోదించారు. మొదటి దశలో పరిపాలన భవనంతో పాటు విద్యార్థులకు వసతి గృహాలు, విశ్వవిద్యాలయం నిర్మాణానికి రూ.100 కోట్లు మంజూరు చేశారు. 2022–23 బడ్జెట్లో విశ్వవిద్యాలయ నిర్మాణ పనులకు రూ.40 కోట్లు కేటాయించారు. రెండవ దశ పనుల్లో భాగంగా నరసాపురం మండలం బియ్యపుతిప్ప గ్రామంలో 350 ఎకరాలలో రూ.222 కోట్ల అంచనా వ్యయంతో విశ్వవిద్యాలయ సముద్రతీర ప్రాంగణం, పరిశోధన కేంద్రం నిర్మాణాలు చేపట్టనున్నారు. ఈ విశ్వవిద్యాలయం ఏర్పాటు ద్వారా మత్స్యకారులు, ఆక్వా రైతులు ఎక్కువగా ప్రయోజనం పొందనున్నారు. వృత్తిపరంగా అర్హత కలిగిన మానవ వనరుల లభ్యత కారణంగా ఆక్వా రంగంలో నష్టాలను చాలా వరకు తగ్గించవచ్చు. తద్వారా దాదాపు సంవత్సరానికి రూ.4,000 నుంచి 5,000 కోట్ల ఆర్థిక ప్రయోజనం ఆక్వా రైతులకు చేకూరుతుంది. అవసరమైన సంఖ్యలో ఫిషరీస్ డిప్లొమా, బీఎఫ్ఎస్సీ, ఎంఎఫ్ఎస్సీ, పీహెచ్డీ అర్హత గల అభ్యర్థులను తయారు చేయడానికి ఆక్వా యూనివర్సిటీ ఆధ్వర్యంలో మరిన్ని కొత్త మత్స్య కళాశాలలు, మత్స్య పాలిటెక్నిక్ కళాశాలలు ప్రారంభించే ప్రతిపాదనలు కూడా ప్రభుత్వ పరిశీలనలో ఉన్నాయి. ప్రారంభానికి సిద్దంగా ఉన్న 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రి 6,000 మంది మత్స్యకారులకు లబ్ధి బియ్యపుతిప్ప వద్ద 150 ఎకరాల విస్తీర్ణంలో రూ.429.43 కోట్ల అంచనాతో ఫిషింగ్ హార్బర్ నిర్మించేందుకు ప్రభుత్వం ఇప్పటికే జీవో జారీ చేసింది. ఈ హార్బర్ నిర్మాణం ద్వారా మత్స్యకారులు అత్యంత సామర్థ్యం గల మోటారు బోట్లలో సముద్రంలో ఎక్కువ దూరం వేటకు వెళ్లేందుకు వీలుంటుంది. మార్కెటింగ్ సౌకర్యాలను పెంపొందించడం ద్వారా మత్స్య పరిశ్రమ అభివృద్ధికి అవసరమైన అన్ని ఏర్పాట్లను ప్రభుత్వం పూర్తి చేసింది. ఈ హార్బర్ నిర్మించే ప్రదేశం నరసాపురం పట్టణానికి 14 కి.మీ. దూరంలో ఉంది. దీనివల్ల నరసాపురం, మొగల్తూరు మండలాలకు చెందిన 6,000 మంది మత్స్యకారులు లబ్ధి పొందనున్నారు. కొల్లేటికి సముద్రపు నీటి నుంచి రక్ష సముద్రపు నీరు కొల్లేరు సరస్సులోకి చొరబడకుండా నిరోధించడానికి, కొల్లేరులో 5వ కాంటూర్ వరకు మంచి నీరు నిలువ ఉండే విధంగా ఉప్పుటేరు నదిపై కిలోమీటరు 57.950 వద్ద మొల్లపర్రు విలేజ్ లిమిట్స్‌లో రూ. 188.40 కోట్ల అంచనా వ్యయంతో రెగ్యులేటర్ కమ్ బ్రిడ్జ్ కమ్ లాక్ నిర్మాణం కొరకు రూపొందించిన ప్రణాళికను ప్రభుత్వం ఆమోదించింది. దీంతో ముఖ్యమంత్రి జగన్ నేడు దీనికి శంకుస్థాపన చేయనున్నారు. సురక్షిత తాగునీరివ్వడమే లక్ష్యంగా.. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో ఆక్వాకల్చర్ వల్ల, తీర ప్రాంతంలో ఉప్పు నీటి సాంద్రత వల్ల ఏర్పడిన తీవ్ర తాగునీటి ఎద్దడి సమస్యలను శాశ్వతంగా పరిష్కరించడానికి ప్రభుత్వం రూ.1,400 కోట్లతో రక్షిత నీటిసరఫరా ప్రాజెక్ట్‌ను మంజూరు చేసింది. విజ్జేశ్వరం జలాశయం నుండి గోదావరి నీటిని రాపిడ్ శాండ్ ఫిల్టర్ల ద్వారా శుద్ధి చేసి, పైప్ లైన్ల ద్వారా సరఫరా చేస్తుంది. ఈ పథకం ద్వారా నూతన జిల్లాలు పశ్చిమ గోదావరి, ఏలూరు, తూర్పు గోదావరిలోని నిడుదవోలు, తణుకు, ఆచంట, పాలకొల్లు, నరసాపురం, భీమవరం, ఉండి, ఉంగుటూరు, ఏలూరు (పార్ట్), తాడేపల్లిగూడెం(పార్ట్) నియోజకవర్గాల ప్రజలకు, కృష్ణా జిల్లాలోని కృత్తివెన్ను, బంటుమిల్లి, పెడన, గుడ్లవల్లేరు మండలాల ప్రజలకు సురక్షిత తాగునీరు సరఫరా చేయొచ్చు. ఈ పథకానికి నేడు సీఎం శంకుస్థాపన చేయనున్నారు. అగ్రికల్చర్ కంపెనీ భూ అనుభవదారులకు హక్కులు నరసాపురం మండలం నందలి వేములదీవి ఉప గ్రామమైన దర్బరేవు గ్రామంలో నాటి బ్రిటీష్ ప్రభుత్వం 1921లో 1,754 ఎకరాల భూమిని నరసాపురం అగ్రికల్చర్ కంపెనీ లిమిటెడ్‌కు 99 సంవత్సరాలు లీజుకు ఇచ్చింది. ఆ రోజు నుంచి 1,623 మంది రైతులు ఆ భూమి స్వాధీన అనుభవంలో ఉండి వ్యవసాయం చేసుకుంటున్నారు. కానీ రైతులకు ఎటువంటి భూ యాజమాన్య హక్కులు కానీ, రెవెన్యూ రికార్డు పరమైన హక్కులు కానీ లేవు. అందువల్ల ఆ భూమిని అమ్మడానికి లేదా బ్యాంకులలో తనఖా పెట్టి రుణం పొందడానికి అర్హత లేదు. అయితే వైఎస్ జగన్ ప్రభుత్వం జీవో జారీ చేసి, ఎకరాకు రూ.100 ధర నిర్ణయించి, ఆ 1,623 మంది రైతులకు భూ యాజమాన్య, రెవెన్యూ రికార్డు పరమైన సర్వహక్కులు కల్పించింది. దీంతో రైతులు వారి వారసులు నిరభ్యంతరంగా స్వాధీనములో ఉండి ఆ భూములను అనుభవించుకోవచ్చు. అవసరాల నిమిత్తం అమ్ముకోవచ్చు. తనఖా పెట్టి ఋణాలు కూడా పొందవచ్చు. ఇందుకు సంబంధించిన హక్కు పత్రాలను సీఎం జగన్ నేడు రైతులకు అందజేయనున్నారు. ఇవీ ప్రారంభోత్సవాలు ► నరసాపురం పట్టణం మధ్యలో ఉన్న ప్రాంతీయ వైద్యశాల ఇటీవలే 100 పడకల స్థాయికి అప్‌గ్రేడ్ అయింది. అందువల్ల చుట్టుపక్కల గ్రామాలలో నివసించే 2 లక్షల మందికి వైద్య సదుపాయాలు, సేవలు అందిస్తోంది. ఇప్పుడు అదే ఆస్పత్రిలో నూతనంగా మాతా శిశు సంరక్షణ విభాగం ఏర్పాటు చేశారు. రూ.13 కోట్లతో ఈ భవనాన్ని నిర్మించారు. ► నరసాపురం పట్టణంలో మంచి నీటి ఎద్దడి నివారణకు రూ.61.81 కోట్లతో నీటి సరఫరా అభివృద్ధి పథకం చేపట్టి పూర్తి చేశారు. ఈ పథకం వల్ల రాబోయే 30 ఏళ్ల వరకు నరసాపురం పట్టణానికి మంచి నీటి సరఫరాకు ఎటువంటి సమస్యా ఉండదు. ఇంకా శంకుస్థాపనలు ఇలా.. ► రూ.4 కోట్ల వ్యయంతో నరసాపురం బస్‌స్టేషన్ పునరుద్ధరణ పనులు. ► రూ.1.08 కోట్ల అంచనాతో నరసాపురం డివిజినల్ ఉప ఖజానా కార్యాలయం కొత్త భవన నిర్మాణం. ► రుస్తుంబాద గ్రామంలో రూ.132.81 కోట్లతో 220/ 132/ 33 కె.వి సబ్‌స్టేషన్ నిర్మాణ పనులు. ► నరసాపురం పురపాలక సంఘం పరిధిలో రూ.237 కోట్లతో అండర్ గ్రౌండ్ డ్రైనేజి నిర్మాణం. రూ.87 కోట్లతో మొదటి ఫేజ్ పనులు. ► రూ.26.32 కోట్లతో వశిష్ఠ వారధి – బుడ్డిగవాని రేవు ఏటి గట్టు పటిష్టం. ► రూ.7.83 కోట్ల అంచనా వ్యయంతో చివరి గ్రామాలకు సాగు, తాగునీటి సౌకర్యాలు కల్పించేందుకు శేషావతారం పంట కాలువ అభివృద్ధిలో భాగంగా ఛానల్ డీ సిల్టింగ్, టెయిల్ డ్యామ్ నిర్మాణం, సీసీ లైనింగ్ పనులు. ► రూ.24.01 కోట్లతో మొగల్తూరు వియర్ పంట కాలువ నిర్మాణం. ► రూ.8.83 కోట్లతో కాజ, ఈస్ట్ కొక్కిలేరు, ముస్కేపాలెం అవుట్‌ఫాల్ నాలుగు స్లూయీస్‌ల పునః నిర్మాణం. -
జగన్ ప్రభుత్వం ఆక్వా రైతులకి అండగా నిలిచింది : ఏపీ చీఫ్ విప్ ప్రసాద రాజు
-
మంత్రుల కమిటీపై ఆక్వా రైతుల హర్షం
కైకలూరు: రాష్ట్రంలో ఆక్వా రంగానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అండగా నిలవడంతో ఆ రైతులు హర్షం వ్యక్తంచేస్తున్నారు. వ్యాపారులు సిండికేట్‌గా మారి ధరలు తగ్గించడంపై శనివారం తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసిన సీఎం.. ఆ తర్వాత ముగ్గురు మంత్రులు, సీనియర్ అధికారులతో సాధికారత కమిటీని ఏర్పాటుచేయడం, వారం రోజుల్లో నివేదిక అందించాలని ఆదేశించడాన్ని వారు స్వాగతిస్తున్నారు. నిజానికి.. ఆక్వా ఉత్పత్తుల విక్రయ ప్రక్రియలో సిండికేట్లు చెప్పిందే రేటు. రొయ్యల సాగును చంటి బిడ్డల్లా సాకిన రైతుల కష్టానికి వీరి చర్యలతో తగిన ప్రతిఫలం దక్కడంలేదు. సిండికేట్లు ఎంత చెబితే అంత రేటుకు రైతు అమ్ముకోవాల్సి వస్తోంది. వాస్తవానికి అంతర్జాతీయ మార్కెట్ రొయ్యల ధరను నిర్ణయిస్తోంది. ఏపీలో ఆ రేట్లు అమలుకావడంలేదు. మరోవైపు మేతల ధరలూ ఆకాశాన్నంటుతున్నాయి. సిండికేట్లు ఇలా దోపిడీ చేస్తుండడంతో రైతులు, రైతు సంఘాల నేతలు శనివారం సీఎం దృష్టికి ఈ విషయాన్ని తీసుకురాగా.. ఆయన వెంటనే తక్షణ చర్యలు తీసుకోవడంపై ఆక్వా రైతులు హర్షం వ్యక్తంచేస్తున్నారు. సీఎం జగన్‌కు రుణపడి ఉంటాం ఆక్వా రంగాన్ని సీఎం జగన్ అన్ని విధాలా ఆదుకుంటున్నారు. కోవిడ్ విపత్కర పరిస్థితుల్లో సైతం ఉత్పత్తుల రవాణాకు అవకాశం కల్పించారు. ఆక్వా సాగులో మేతల రేట్లు పెరిగి, విక్రయ రేట్లు తగ్గాయి. మేతల ధరల పెంపుపై సీఎం కమిటీని ఏర్పాటు చేయడం అభినందనీయం. ఆయనకు రుణపడి ఉంటాం. – బలే నాగరాజు, ఏలూరు జిల్లా ఉత్తమ ఆక్వా రైతు, కొవ్వాడలంక, మండవల్లి మండలం ఆక్వాకు సర్కార్ అధిక ప్రాధాన్యం ఆక్వా రంగం ఆటుపోట్ల మధ్య సాగుతోంది. ముఖ్యంగా రొయ్యల సాగులో గిట్టుబాటు ధర రావడంలేదు. రేట్ల నిర్ణయంలో ప్రభుత్వం చొరవ తీసుకుంటోంది. ప్రభుత్వం ఆకా>్వ రంగానికి అధిక ప్రాధాన్యం కల్పిస్తోంది. రేట్లు, మేతల ధరల నియంత్రణపై ప్రత్యేక దృష్టిసారించాలి. – మంగినేని రామకృష్ణ, రొయ్యల రైతు, కైకలూరు -
మత్స్య, ఆక్వా పెట్టుబడుల హబ్‌గా ఏపీ
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ మత్స్య, ఆక్వా రంగాల్లో పెట్టుబడుల హబ్‌గా నిలవబోతోందని కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (సీఐఐ) జాతీయ కమిటీ కో చైర్మన్ అరబింద్దాస్ చెప్పారు. సముద్ర ఉత్పత్తులు, ఎగుమతుల్లో అగ్రగామిగా ఏపీని నిలబెట్టే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి పనిచేసేందుకు సీఐఐ కట్టుబడి ఉందన్నారు. సీఐఐ రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో మత్స్య, ఆక్వారంగాల సుస్థిరాభివృద్ధిపై విజయవాడలో శుక్రవారం నిర్వహించిన రాష్ట్ర సదస్సులో ఆయన మాట్లాడారు. ఆక్వారంగంలో పెట్టుబడులకు గమ్యస్థానంగా ఏపీని తీర్చిదిద్దేందుకు సీఐఐ కృషి చేస్తుందన్నారు. మత్స్యరంగంపై ఆధారపడి జీవిస్తున్నవారి జీవన ప్రమాణాలను మెరుగుపర్చేందుకు పలు సంక్షేమ కార్యక్రమాలతో పాటు తీరం వెంబడి పెద్దఎత్తున మౌలికసదుపాయాల కల్పనకు కృషిచేస్తున్న ప్రభుత్వ తీరు ప్రశంసనీయమన్నారు. తీరం వెంబడి చేపల కేజ్ కల్చర్‌కు ప్రోత్సాహం ఏపీ మారిటైమ్ బోర్డ్ డిప్యూటీ సీఈవో లెఫ్టినెంట్ సి.డి.రవీంద్రనాథ్‌రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో సముద్ర ఉత్పత్తుల ఎగుమతులు పెంచేందుకు కోల్డ్ చైన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఫిషింగ్ హార్బర్లు, ఇంటిగ్రేటెడ్ సీ పార్కుల ఏర్పాటుకు కృషి జరుగుతోందన్నారు. తీరం వెంబడి చేపల కేజ్ కల్చర్‌ను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ఒక పాలసీని తీసుకొచ్చేందుకు పరిశీలిస్తోందని చెప్పారు. మత్స్య, ఆక్వారంగాల్లో నైపుణ్యత కలిగిన మానవ వనరుల అభివృద్ధి లక్ష్యంగా ఏపీæ ఫిషరీస్ యూనివర్సిటీ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. మత్స్యశాఖ అదనపు సంచాలకులు డాక్టర్ ఎస్.ఏంజెలి మాట్లాడుతూ రాష్ట్రంలో మత్స్యరంగాభివృద్ధికి ప్రభుత్వం చేస్తున్న కృషిని వివరించారు. సీఐఐ రాష్ట్రశాఖ వైస్ చైర్మన్ డాక్టర్ ఎం.లక్ష్మీప్రసాద్ మాట్లాడుతూ మత్స్య రంగాభివృద్ధిలో రాష్ట్ర ప్రభుత్వానికి లోతైన, వ్యూహాత్మక ఆలోచన ఉందని చెప్పారు. ఈ రంగంపై ఆధారపడిన వర్గాల జీవనోపాధికి, ముఖ్యంగా మహిళలకు ఉద్యోగకల్పన, మత్స్యకారుల ఆదాయాన్ని పెంచడానికి ప్రభుత్వం తీసుకుంటున్న చొరవ తమకు స్ఫూర్తినిస్తున్నట్లు తెలిపారు. మత్స్యశాఖతో పాటు ఈ రంగంలోని వాటాదారులందరితో సీఐఐ కలిసి పనిచేస్తుందని చెప్పారు. వాటర్‌బేస్ లిమిటెడ్ సీఈవో రమాకాంత్, డెల్టా ఫిష్ ఫార్మర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ డాక్టర్ వి.రామచంద్రరాజు తదితరులు పాల్గొన్నారు. ఫిష్ బాస్కెట్‌గా రాష్ట్రం సదస్సులో వర్చువల్‌గా పాల్గొన్న రాష్ట్ర మత్స్యశాఖ మంత్రి సీదిరి అప్పలరాజు మాట్లాడుతూ నిర్దిష్టమైన ప్రణాళికతో రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కృషి ఫలితంగా ఫిష్ బాస్కెట్‌గా రాష్ట్రం నిలిచిందన్నారు. హేచరీలు, విత్తన పెంపకం, బ్రూడ్ బ్యాంకులు, బ్రూడ్ స్టాక్ మల్టిప్లికేషన్ సెంటర్లు, న్యూక్లియర్ బ్రీడింగ్ సెంటర్లు, పంట అనంతర నష్టాన్ని తగ్గించడానికి తగిన మౌలిక సదుపాయాల కల్పనకు రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేసిందని వివరించారు. పంటకోతకు ముందు, అనంతర మౌలిక సదుపాయాల కల్పనలో ప్రైవేటురంగ పాత్ర చాలా కీలకమన్నారు. సప్లయి చైన్‌ను బలోపేతం చేయడం ద్వారా చేపలు, ఆక్వా ఉత్పత్తులకు అదనపు విలువ జోడింపునకు కృషి చేస్తున్నట్లు చెప్పారు. -
స్పైసీ రుచులతో ఆక్వా రెస్టారెంట్లు.. ఇలా వెళ్లి అలా తిని రావొచ్చు
చేపలు.. రొయ్యలు.. పీతలు. వీటితో పులుసు.. ఇగురు.. వేపుడే కాదు. బిర్యానీ.. మంచూరియా.. స్నాక్స్ కూడా అప్పటికప్పుడు తయారవుతాయి. విభిన్న రుచులతో మత్స్య ప్రియుల జిహ్వ చాపల్యాన్ని ఇట్టే తీర్చేస్తాయి. దేశంలోనే తొలిసారిగా సర్టిఫై చేసిన మత్స్య ఉత్పత్తులు లైవ్ (బతికి ఉన్నవి)గానే కాకుండా ‘రెడీ టు కుక్’ రూపంలోనూ లభిస్తాయి. అంతేకాకుండా శుచిగా.. రుచిగా వండి అక్కడికక్కడే వడ్డించే రెస్టారెంట్లు సైతం అందుబాటులోకి వచ్చేస్తున్నాయి. – సాక్షి, అమరావతి సముద్ర, మంచినీటి, ఉప్పునీటి మత్స్య ఉత్పత్తులతో పాటు డ్రై ఫిష్, డ్రై ప్రాన్, చేప, రొయ్య పచ్చళ్లు కూడా అక్కడే లభిస్తాయి. వీటిలో ఏది కావాలన్నా స్వయంగా వెళ్లి తెచ్చుకోవచ్చు. లేదంటే.. ఇంట్లోనే ఉండి డోర్ డెలివరీ ద్వారా పొందవచ్చు. వీటి శాంపిల్స్‌ను ఆక్వా ల్యాబ్స్‌లో పరీక్షించిన తర్వాత ఫిష్ ఆంధ్రా హబ్, రిటైల్ అవుట్ లెట్స్ ద్వారా వినియోగదారులకు అందుబాటులోకి వస్తాయి. నేడు సీఎం జగన్ చేతుల మీదుగా ప్రారంభం ప్రజలకు ప్రొటీన్లతో కూడిన ఆహారం అందేలా మత్స్య ఉత్పత్తుల తలసరి వినియోగాన్ని పెంచే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం పెద్దఎత్తున ఫిష్ ఆంధ్రా ఆక్వా హబ్‌లను ఏర్పాటు చేస్తోంది. దీనివల్ల వినియోగదారులకు నాణ్యమైన మత్స్య ఉత్పత్తులు సరసమైన ధరలకే లభించడమే కాకుండా మత్స్యకారులు, ఆక్వా రైతులకు ప్రత్యామ్నాయ మార్కెటింగ్ వనరులు అందుబాటులోకి వస్తాయి. తద్వారా ఆక్వా పరిశ్రమకు మంచి రోజులొస్తాయి. ఇందులో భాగంగా పైలట్ ప్రాజెక్టుగా పులివెందులలో ఏర్పాటు చేస్తున్న ఆక్వా హబ్‌ను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈ నెల 24వ తేదీన ప్రారంభించనున్నారు. అక్కడే మరో 100 అవుట్‌లెట్స్, 2 స్పోక్స్ కూడా అందుబాటులోకి రావడంతోపాటు రాష్ట్ర వ్యాప్తంగా 2 వేలకు పైగా అవుట్ లెట్స్ అందుబాటులోకి రాబోతున్నాయి. సీఎం జగన్ ప్రారంభించనున్న పులివెందుల ఆక్వా హబ్ కంటైనర్ తరహా రెస్టారెంట్ మినీ అవుట్ లెట్లో బతికిన చేప, రొయ్యలు, రెడీ టు కుక్ పేరిట మారినేట్ చేసిన (ఊరవేసిన) ఉత్పత్తులు, ఎండు చేపలు, రొయ్యలు, పచ్చళ్ల విక్రయాలతో పాటు ఉదయం, సాయంత్రం వేళల్లో అక్కడికక్కడే తయారు చేసిన స్నాక్ ఐటమ్స్ పార్శిల్స్ రూపంలో అమ్ముతారు. మినీ అవుట్ లెట్ తరహాలోనే అన్నిరకాల ఉత్పత్తులు డెయిలీ, సూపర్, లాంజ్ యూనిట్లలోఅందుబాటులో ఉంటాయి. వాటితోపాటు డెయిలీ యూనిట్లో కిచెన్‌తో పాటు 6–7 మంది, సూపర్ యూనిట్లో 10–15 మందికి పైగా కూర్చుని వాటిలో వండిన ఆహార పదార్థాలను భుజించేందుకు వీలుగా ఏసీ సౌకర్యంతో డైనింగ్ ఉంటుంది. లాంజ్ యూనిట్ పూర్తిస్థాయి రెస్టారెంట్ తరహాలో ఉంటుంది. ఇక్కడ కనీసం 20–30 మంది కూర్చుని వాటిలో వండిన మత్స్య పదార్థాలను అక్కడే తినేందుకు వీలుగా కంటైనర్ తరహాలో డిజైన్ చేశారు. ఈ రెస్టారెంట్స్‌లో ఫిష్ మసాలా, ప్రాన్ మసాలా, ప్రాన్ తవా ఫ్రై, అపొలొ ఫిష్, మసాలా ఫిష్, ఫిష్ పిలెట్, ఆంధ్రా చిల్లీ ఫిష్, ఆంధ్రా చిల్లీ ప్రాన్స్, మసాలా ప్రాన్స్, పెప్పర్ ప్రాన్స్, పాంఫ్రెట్ స్టీక్స్, పాంఫ్రెట్ హోల్, వంజరం, పండుగప్ప ఫుల్ ఫిష్ ఫ్రై వంటి వాటితో పాటు సైడ్స్, డ్రింక్స్, బేకరీ, ఫ్రూట్ ఐటమ్స్, అన్ని రకాల ఐస్‌క్రీమ్స్ కూడా విక్రయిస్తారు. ఆక్వా హబ్‌కు అనుసంధానంగా.. సముద్ర, మంచినీటి, ఉప్పునీటి మత్స్య ఉత్పత్తులతో పాటు డ్రై ఫిష్, డ్రై ప్రాన్, మారినేట్ ఉత్పత్తులు, చేప, రొయ్య పచ్చళ్లను విక్రయించేందుకు వీలుగా ఆక్వా హబ్‌లకు అనుబంధంగా మినీ ఫిష్ రిటైల్ అవుట్‌లెట్స్, ఈ–మొబైల్ 3 వీలర్ ఫిష్ వెండింగ్ కార్ట్స్, మొబైల్ 4 వీలర్ ఫిష్ అండ్ ఫుడ్ వెండింగ్ వెహికల్స్, డెయిలీ (ఫిష్ కియోస్క్) యూనిట్లు, సూపర్ (లైవ్ ఫిష్ వెండింగ్ సెంటర్స్), ఒకటి లాంజ్ (వాల్యూ యాడెడ్) యూనిట్లను ఏర్పాటు చేస్తున్నారు. దేశంలో తొలిసారి సర్టిఫై చేసిన మత్స్య ఉత్పత్తులను వీటిద్వారా వినియోగదారులకు అందుబాటులోకి తెస్తారు. విశాఖలోని ఫిష్ ఆంధ్ర మినీ అవుట్ లేట్ వినియోగదారులతోపాటు మత్స్యకారులకూ ప్రయోజనం నాణ్యమైన మత్స్య ఉత్పత్తులను వినియోగదారులకు అందుబాటులోకి తీసుకురావడంతోపాటు మత్స్యకారులు, ఆక్వా రైతులకు ప్రత్యామ్నాయ మార్కెట్ వనరులను పెంచే లక్ష్యంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆలోచనలకు అనుగుణంగా ఆక్వా హబ్‌లను తీసుకొస్తున్నాం. దీనివల్ల స్థానిక వినియోగం పెరగడంతోపాటు ప్రజలకు ప్రొటీన్లతో కూడిన ఆహారం అందుబాటులోకి వస్తుంది. పైలట్ ప్రాజెక్టుగా పులివెందుల ఆక్వా హబ్‌తో పాటు దాని పరిధిలోని అవుట్‌లెట్స్, స్పోక్స్‌ను ఈ నెల 24వ తేదీన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రారంభించనున్నారు. – సీదిరి అప్పలరాజు, మత్స్యశాఖ మంత్రి -
ఆర్బీకేలతో ఆక్వా ల్యాబ్‌ల అనుసంధానం
కేజ్ ఫిష్ కల్చర్ (నీళ్లపై తేలే తొట్టెలలో చేపల పెంపకం), మారీకల్చర్ (నిర్దిష్ట వాతావరణంలో చేపల పెంపకం)పై దృష్టి పెట్టాలి. వీటితో ఆదాయాలు బాగా పెరుగుతాయి. కేజ్ ఫిష్ కల్చర్‌కు సంబంధించి కార్యాచరణ సిద్ధం చేయండి. దీనిపై రైతులు, ఔత్సాహికులు కలిసి ముందుకు సాగేలా ప్రణాళిక రూపొందించండి. ప్రభుత్వానికి ఆదాయంతో పాటు పేదవాడు లాభపడేలా ఈ ప్రణాళిక ఉండాలి. పైలట్ ప్రాజెక్టు కింద మూడు చోట్ల కేజ్ ఫిష్ కల్చర్, 3 చోట్ల మారీకల్చర్ను మొదలు పెట్టాలి. అనుభవాలను దృష్టిలో ఉంచుకుని విస్తరించాలి. ఆర్బీకే కియోస్కుల్లో పశు దాణా తదితర ఉత్పత్తులన్నింటినీ అందుబాటులో ఉంచాలి. కస్టమ్ హైరింగ్ సెంటర్లకు మంచి స్పందన వస్తున్నందున వాటి ద్వారా రైతులతో నేచురల్ ఫార్మింగ్ (సహజ వ్యవసాయం)ను ప్రోత్సహించాలి. – సీఎం జగన్ సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఇంటిగ్రేటెడ్ ఆక్వా ల్యాబ్‌ల గురించి బాగా ప్రచారం చేయడంతో పాటు వాటిని రైతు భరోసా కేంద్రాల(ఆర్బీకే)తో అనుసంధానం చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారులను ఆదేశించారు. ఈ ల్యాబ్‌లను సమర్థవంతంగా వినియోగించుకోవాలని సూచించారు. సీడ్, ఫీడ్ విషయంలో ఎక్కడా కల్తీ లేకుండా చర్యలు తీసుకోవాలని చెప్పారు. ఆక్వా రంగానికి సంబంధించి క్వాలిటీ చెకింగ్ ఎలా చేయించుకోవాలన్న దానిపై అందరికీ సమాచారం తెలియాలని, ఈ దిశగా అన్ని చర్యలు తీసుకోవాలన్నారు. పశు సంవర్థక, పాడి పరిశ్రమ, మత్స్య శాఖల కార్యకలాపాలపై బుధవారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రాష్ట్రంలో 35 ల్యాబ్‌లలో ఇప్పటికే 14 ప్రారంభం కాగా, మరో 21 ల్యాబ్‌లు నవంబర్‌లో ప్రారంభమవుతాయని తెలిపారు. ఈ ల్యాబ్‌ల వల్ల నాణ్యమైన సీడ్, ఫీడ్ అందుతుందని.. తద్వారా ఇటు రైతులు, అటు వినియోగదారులకు క్వాలిటీ ఉత్పత్తులు అందుబాటులో ఉంటాయని చెప్పారు. ఈ దిశగా రైతులకు.. వినియోగదారులకు మేలు చేయడానికే ఆక్వా హబ్‌లను కూడా తీసుకువచ్చామని స్పష్టం చేశారు. మత్స్య మార్కెట్ విస్తరించాలి రాష్ట్రంలో చేపలు, రొయ్యలు వంటి మత్స్య ఉత్పత్తుల వినియోగం పెరగాలని, వీటిని సరసమైన ధరలకే ప్రజలకు అందించాలనే లక్ష్యంతోనే వీటిని ఏర్పాటు చేశామని సీఎం వైఎస్ జగన్ తెలిపారు. స్థానిక మార్కెట్‌ను విస్తరించడం వల్ల రైతులకు మంచి ధర అందుతుందని చెప్పారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో మత్స్య ఉత్పత్తుల వినియోగం పెంచేందుకు ఆక్వా హబ్‌ల ఏర్పాటు, వాటికి అనుబంధంగా రిటైల్ దుకాణాలకు సంబంధించిన వివరాలను అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. ప్రస్తుతం రాష్ట్రంలో స్థానికంగా ఏడాదికి 4.36 లక్షల మెట్రిక్ టన్నులు ఉన్న చేపల వినియోగాన్ని 12 లక్షల మెట్రిక్ టన్నులకు పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. ఆక్వా హబ్‌ల నుంచి రిటైల్ దుకాణాల ద్వారా నాణ్యమైన మత్స్య ఉత్పత్తులను ప్రజలకు చేరవేసేందుకు చేపట్టిన చర్యలను వివరించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ ఏమన్నారంటే.. ఆక్వా యూనివర్సిటీ ఏర్పాటుపై దృష్టి ► ఆక్వా యూనివర్సిటీ ఏర్పాటుపై దృష్టి పెట్టాలి. ఇందుకు సంబంధించిన పనులను వేగవంతం చేయాలి. భూ సేకరణ పనులుపై మరింత ధ్యాస పెట్టాలి. కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి ఆక్వా రంగానికి బీమా సౌకర్యం కల్పించే అంశాన్ని పరిశీలించాలి. ► రాష్ట్రంలో 7 ఫిషింగ్ హార్బర్లు, 5 ఫిష్ ల్యాండ్ సెంటర్ల ఏర్పాటులో భాగంగా 5 ఫిషింగ్ హార్బర్లు, ఒక ఫిష్ ల్యాండ్ సెంటర్ పనులు ప్రారంభమయ్యాయి. మిగిలిన చోట్ల కూడా పనులు ప్రారంభించాలి. కేజ్ ఫిష్ కల్చర్, మారీకల్చర్పై కూడా దృష్టి సారించాలి. వెటర్నరీ డిస్పెన్సరీలు ► వెటర్నరీ డిస్పెన్సరీల్లో హేతుబద్ధత ఉండాలి. ప్రతి గ్రామంలో ఏముండాలి? మండల కేంద్రంలో ఏముండాలి? అన్నది నిర్ధారించాలి. గ్రామం, మండలం, నియోజకవర్గ స్ధాయిలో ఏయే డిస్పెన్సరీలు ఉండాలన్న దానిపై హేతుబద్ధత ఉండాలి. దానిపై కార్యాచరణ రూపొందించాలి. తర్వాత వాటిని మెరుగ్గా నిర్వహించాలి. ► మండలాన్ని ఒక యూనిట్‌గా తీసుకుని కావాల్సిన డిస్పెన్సరీలను ఏర్పాటు చేయాలి. రాష్ట్రంలో డిస్పెన్సరీలు లేని మండలాలు కూడా ఉన్నాయి. వీటన్నింటిపై పటిష్టంగా మ్యాపింగ్ చేయాలి. ► ప్రజా వైద్యానికి సంబంధించి మనం ఒక ప్రొటోకాల్ అనుసరిస్తున్నాం. మండలానికి రెండు పీహెచ్‌సీలు, నలుగురు వైద్యులు, రెండు అంబులెన్స్‌లు పెట్టాలన్న విధానంతో ప్రజారోగ్య రంగంలో ముందుకు పోతున్నాం. ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ ప్రకారం ముందుకు అడుగులు వేస్తున్నాం. ఇలాంటి హేతుబద్ధత, పటిష్టమైన వ్యవస్ధ పశు సంవర్థక శాఖలో కూడా ఉండాలి. పశువుల ఆస్పత్రుల్లోనూ నాడు–నేడు ► రాష్ట్ర వ్యాప్తంగా పశువుల ఆస్పత్రుల్లో నాడు–నేడుపై కార్యాచరణ సిద్ధం చేయాలి. నాడు–నేడులో భాగంగా మౌలిక సదుపాయాల కల్పన తదితర అంశాలను ముందుగా నిర్ధారించుకోవాలి. ► ఏయే రకాల మౌలిక సదుపాయాలు కల్పించాలన్న అంశంపై ప్రణాళిక తయారు చేయాలి. తర్వాత పనుల ప్రారంభానికి చర్యలు తీసుకోవాలి. ► ఏపీ అమూల్ ప్రాజెక్టు అమలుకు సంబంధించి అధికారులు సీఎంకు వివరించారు. ప్రకాశం, వైఎస్సార్, చిత్తూరు, గుంటూరు, పశ్చిమగోదావరి జిల్లాల్లో పాల వెల్లువ ప్రారంభమైందని, ఆగస్టులో విశాఖపట్నం, అనంతపురం జిల్లాలకు విస్తరిస్తున్నామని తెలిపారు. ► ఈ సమీక్షలో పశు సంవర్థక, పాడి పరిశ్రమాభివృద్ధి, మత్స్యశాఖ మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు, ఏపీ వ్యవసాయ మిషన్ వైస్ చైర్మన్ ఎంవీఎస్ నాగిరెడ్డి, ఆయా శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
మత్స్య దిగుబడులు మిలమిల
సాక్షి, అమరావతి: ఆక్వా రంగ సుస్థిరాభివృద్ధికి గడిచిన రెండేళ్లుగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలిస్తున్నాయి. కరోనా కష్టకాలంలో కూడా రికార్డు స్థాయిలో దిగుబడులు వచ్చాయి. దీంతో ఈ రంగంలో ఆంధ్రప్రదేశ్ రికార్డులను తిరగరాస్తోంది. రాష్ట్రంలో 974 కిలోమీటర్ల తీర ప్రాంతముంది. 54,500 హెక్టార్ల ఉప్పు నీటిలో, 1.44 లక్షల హెక్టార్ల మంచినీటిలో సాగు విస్తీర్ణం కలిగి ఉంది. మరో 48 వేల హెక్టార్లలో ఆక్వా సాగును పెంచేందుకు చర్యలు చేపట్టారు. మరోవైపు.. రాష్ట్ర ప్రభుత్వం గడిచిన రెండేళ్లుగా తీసుకొస్తున్న విప్లవాత్మక విధానాలు ఆక్వారంగ సుస్థిరాభివృద్ధికి దోహదపడుతున్నాయి. ఫలితంగా సాగు విస్తీర్ణం పెరగడమే కాదు.. దిగుబడులు కూడా గణనీయంగా పెరుగుతున్నాయి. ఎంతలా అంటే.. ► ఆక్వా సాగు, దిగుబడిలోనే కాదు.. ఇన్‌ల్యాండ్ (సంప్రదాయ చెరువులు), మెరైన్ ఉత్పత్తుల్లో దేశంలోనే ఏపీ టాప్‌లో కొనసాగుతోంది. ► దేశవ్యాప్తంగా జరుగుతున్న చేపల ఉత్పత్తిలో 29 శాతం, రొయ్యల ఉత్పత్తిలో 68 శాతం ఇక్కడ నుంచే జరుగుతోంది. ► అలాగే, మత్స్య ఉత్పత్తుల ఎగుమతుల్లో 40 శాతం వాటా ఏపీదే. ► 2019–20లో 18,860 కోట్ల విలువైన మత్స్య ఉత్పత్తులను ఎగుమతి చేయగలిగారు. పదేళ్లలో భారీగా గణనీయమైన వృద్ధిరేటు గడిచిన పదేళ్లుగా రాష్ట్రంలో చేపలు, రొయ్యల ఉత్పత్తులు మూడింతలు పెరిగాయి. 2010–11లో కేవలం 14,23,811 టన్నులున్న ఉత్పత్తులు 2019–20కి వచ్చేసరికి 41,75,511 టన్నులకు చేరింది. సముద్ర చేపల ఉత్పత్తి రెట్టింపు కాగా.. రొయ్యల ఉత్పత్తి నాలుగు రెట్లు పెరిగింది. ఇక సంప్రదాయ చెరువుల్లో చేపల ఉత్పత్తి రెండున్నర రెట్లు పెరగగా.. ఉప్పునీటి, మంచినీటి రొయ్యల ఉత్పత్తి 15 రెట్లు పెరిగింది. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 2014–15లో 19.78 లక్షల టన్నులున్న మెరైన్, ఆక్వా ఉత్పత్తులు 2020–21 ఆర్థిక సంవత్సరంలో ఫిబ్రవరి నాటికి రికార్డు స్థాయిలో 42.19 లక్షల టన్నులకు చేరింది. ఈ ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి ఇది కనీసం 44 లక్షల టన్నులు దాటే అవకాశాలు కన్పిస్తున్నాయి. ప్రభుత్వ తోడ్పాటుతోనే.. సంప్రదాయ చెరువులతో పాటు ఆక్వా చెరువులకు గడిచిన రెండేళ్లుగా నీటికొరత లేకుండా చేయడంతో పాటు ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు వైఎస్ జగన్ సీఎం కాగానే విద్యుత్ టారీఫ్ తగ్గించి యూనిట్ రూ.1.50లకే అందించడం ఆక్వాసాగుకు ఊతమిచ్చింది. వీటికితోడు రైతుభరోసా కేంద్రాల ద్వారా గడిచిన ఏడాదిగా నిర్వహిస్తున్న మత్స్య సాగుబడులు సత్ఫలితాలనిచ్చాయి. శాస్త్రవేత్తలు, నిపుణులు ఎప్పటికప్పుడు ఇచ్చిన మెళకువలు నాణ్యమైన దిగుబడుల సాధనకు దోహదపడ్డాయి. ఉత్పత్తులు భారీగా పెరిగాయి గడిచిన రెండేళ్లుగా ఉత్పత్తులు గణనీయంగా పెరుగుతున్నాయి. 2019–20లో 41.75 లక్షల టన్నులుగా నమోదు కాగా, 2020–21లో ఫిబ్రవరి నెలాఖరు నాటికే 42.19లక్షలు దాటింది. ప్రభుత్వం ఇస్తున్న ప్రోత్సాహకాలకు తోడు శాస్త్రీయ పద్ధతులను అవలంబించడం, నాణ్యమైన సీడ్, ఫీడ్ వినియోగించడం ద్వారా దిగుబడుల పెరుగుదలకు కారణమైంది. – కె. కన్నబాబు, కమిషనర్, మత్స్యశాఖ -
‘ఆ కుట్రల్లో నిమ్మగడ్డ బలి పశువు కావొద్దు’
సాక్షి, విశాఖపట్నం : ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నేతృత్వంలో రాష్ట్రంలో ఆక్వా, మత్స్యశాఖ రంగాలకు బంగారు భవిష్యత్తు ఏర్పడుతోందని మంత్రి మోపిదేవి వెంకట రమణ అన్నారు. బుధవారం నక్కపల్లి మండలం బంగారమ్మపేటలో 34.76 కోట్ల రూపాయల వ్యయంతో ఆక్వాటిక్ క్వారంటైన్ ఫెసిలిటీ సెంటర్ నిర్మాణానికి మంత్రి మోపిదేవి వెంకటరమణ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మట్లాడుతూ.. దేశంలోనే రెండో ఆక్వా క్వారంటైన్ సెంటర్‌ను రాష్ట్ర ప్రభుత్వ నిర్వహణలో ఏర్పాటు చేశారన్నారు. క్వారంటైన్ సెంటర్ ఏర్పాటుతో ఆక్వా రంగంలో పెను మార్పులు తీసుకు రావచ్చన్నారు. (త్వరలో వారికి కూడా కాపునేస్తం తరహా పథకం ) నిరుద్యోగ యువతకు ఉపాధితోపాటు, పారిశ్రామికంగా కోస్తా ప్రాంతమంతా అభివృద్ధి చెందుతుందని మంత్రి మోపిదేవి పేర్కొన్నారు. దేశంలో యాబై శాతం పైగా ఆంధ్ర రాష్ట్రం నుంచే ఎగుమతులవుతున్నాయన్నారు. కరోనా కష్టకాలంలో సరైన నిర్ణయాలతో ఆక్వా రైతులకు గిట్టుబాటు ధరలు కల్పిస్తున్నారని తెలిపారు. ఆక్వాతో పాటు మత్స్య సంపద అభివృద్దికి మూడు వేల కోట్లతో మేజర్ పోర్ట్‌ల అభివృద్ధి జరుగుతందని, ఆంధ్రప్రదేశ్‌లో త్వరలో మెరైన్ యూనివర్సిటీ ఏర్పాటుచేయబోతున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో మంచి పరిపాలనకు ఆటంకం కల్గించే దిశగా చంద్రబాబు కుట్రలు చేస్తున్నరని మండిపడ్డారు. (ఆ హక్కు రాష్ట్రానికి లేదు.. జూన్ నుంచి పూర్తి పింఛన్లు) చంద్రబాబు కుట్రల్లో ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ బలి పశువు కావద్దని సూచించారు. ఎన్నికల కమిషనర్‌కు సమస్యలుంటే ప్రభుత్వంతో చర్చించి పరిష్కరించుకోవాలని హితవు పలికారు. పరిపాలనా సంస్కరణలు చేపట్టిన ముఖ్యమంత్రులలో వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి నాలుగో స్థానం కైవసం చేసుకున్నారని మంత్రి మోపిదేవి గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో అనకాపల్లి ఎంపీ సత్యవతి, పాయకరావుపేట ఎమ్మెల్యే గొల్ల బాబురావు, మత్స్య శాఖ కమిషనర్ కన్నబాబు పాల్గొన్నారు. (వైఎస్సార్ కాపు నేస్తం ప్రారంభించిన సీఎం వైఎస్ జగన్) -
ఆక్వా బిల్లుకు అసెంబ్లీ ఆమోదం
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో ఏపీఎస్ఏడీఏ (ఏపీస్టేట్ ఆక్వా డెవలప్మెంట్ అథారిటీ) బిల్లును బుధవారం శాసనసభ ఆమోదించింది. రాష్ట్రంలో చేపలు, రొయ్యల సాగు అభివృద్ధికి సంబంధించిన ప్రాధికార సంస్థ బిల్లును మత్స్య, పశు సంవర్ధక శాఖ మంత్రి మోపిదేవి వెంకటరమణారావు అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. బిల్లు ఆమోదం పొందిన అనంతరం మంత్రి మోపిదేవి మాట్లాడారు. ఆయన ఏం చెప్పారంటే.. ► ఆక్వా ఉత్పత్తుల్లో ఏపీ అగ్రస్థానంలో ఉండగా, దేశ ఎగుమతుల్లో 50 శాతం రాష్ట్రం నుంచి అవుతున్నాయి. కరోనా కష్టకాలంలోనూ 80 వేల మెట్రిక్ టన్నుల ఉత్పత్తులకు గిట్టుబాటు ధర నిర్ణయించి కొనుగోలు చేయించాం. ► ఆక్వా రంగానికి ప్రధానమైన విద్యుత్ యూనిట్ రేటు గతంలో రూ. 3.50 ఉండగా, దాన్ని రూ. 1.50 తగ్గించాం. ► 9 జిల్లాల్లో 8 మేజర్ ఫిషింగ్ హార్బర్లు, 4 మైనర్ ఫిష్ ల్యాండింగ్ సెంటర్లు రూ. 3,200 కోట్లతో నిర్మించేందుకు సీఎం నిర్ణయం తీసుకున్నారు. ► ఆక్వా రంగంలో తీసుకున్న నిర్ణయాలతో 18 లక్షల మంది నిరుద్యోగ యువకులకు పరోక్షంగానూ, ప్రత్యక్షంగాను ఉపాధి లభిస్తోంది. ► వేల కోట్ల రూపాయల విదేశీ మారక ద్రవ్యాన్ని ఆర్జించి పెడుతున్న ఈ రంగం అసంఘటిత రంగంగా ఉన్న పరిస్థితుల్లో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు ఆ రంగంలో ఉన్నవారికి భరోసా కల్పిస్తున్నాయి. ► వైఎస్ జగన్ పాదయాత్ర సమయంలో ఆక్వారైతుల సమస్యలు విన్నారు. అధికారంలోకి రాగానే సమస్యలు పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ఈ మేరకు సమస్యలు పరిష్కరించారు. ఆక్వా ప్రాధికార సంస్థతో ప్రయోజనాలు ఇవే ► చేపలు, రొయ్యల పెంపకంలో నూతన వ్యాపార మార్గాలను సృష్టించడం ► ఆక్వా పెంపకానికి సంబంధించిన సమస్యల పరిష్కారానికి జిల్లా, రాష్ట్రస్థాయిలో ఫోరం ఏర్పాటు ► ఆక్వా రైతులకు మార్కెట్ ఇంటిలిజెన్స్ సేవలు. చేపలు, రొయ్యలకు వచ్చే వ్యాధులపై నిఘా, నియంత్రణ చర్యలు ► సముద్ర ఆహార ఉత్పత్తుల ఎగుమతులపై మార్కెట్ సమాచారాన్ని సేకరించి ఎప్పటికప్పుడు రైతులకు ప్రయోజనం చేకూర్చడం. నాణ్యతా ప్రమాణాలు పాటించేందుకు తనిఖీలు..ఆడిట్లు ► సీడ్ హేచరీస్, ఫీడ్ ప్లాంట్ మేనేజ్మెంట్, ఆక్వా ఉత్పత్తి చేసే రైతులు, ప్రాసెసింగ్ చేసే ఎగుమతిదారులూ భాగస్వాములను చేయడం ► ఇప్పటికే రైతు భరోసా కేంద్రాల్లో 36 చోట్ల రూ.50 కోట్ల వ్యయంతో ఆక్వా టెస్టింగ్ లాబ్స్ ఏర్పాటు. క్వాలిటీ మెటిరియల్ అందించి రైతులు నష్టపోకుండా పర్యవేక్షణ విధానాన్ని ఏర్పాటు చేయడం ► ఆక్వా ఉత్పత్తుల నిల్వకు కోల్డ్ స్టోరేజీ ప్లాంట్లను ఏర్పాటు చేయడం ► అసంఘటిత రంగంగా ఉన్న ఈ రంగాన్ని సంఘటిత రంగంగా మార్చడం జగన్ సర్కారు వచ్చాక తీసుకున్న నిర్ణయాలు ఇవే ► కోవిడ్ సమయంలో 1.10 లక్షల మందికి రూ. 10 వేలు చొప్పున సాయం. ► డీజిల్ సబ్సీడీని 6 రూపాయల నుంచి 9 రూపాయలకు పెంచి వేటకు వెళ్లిన రోజునే స్మార్ట్ కార్డు ద్వారా వారి ఖాతాల్లో జమచేయడం ► చేపల వేట నిషేధం సమయంలో ఇచ్చే రూ.4వేల పరిహారాన్ని రూ.10వేలకు పెంచడం. చనిపోయిన వ్యక్తులకు పరిహారం రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల వరకూ పెంచడం ► తూర్పు గోదావరి జిల్లాలో గుజరాత్ స్టేట్ పెట్రోలియం కార్పొరేషన్ ఆయిల్ కోసం చేపల వేటపై నిషేధం విధించిన సమయంలో వాళ్లు ఇస్తానన్న పరిహారం చెల్లించకపోతే ఏపీ ప్రభుత్వమే రూ.80 కోట్లు చెల్లించడం ► సీఎం వైఎస్ జగన్ ఇచ్చిన హామీ మేరకు ఉత్తరాంధ్రకు చెందిన 22 మంది మత్స్యకారులు గుజరాత్ వలస వెళ్లి పాకిస్తాన్ కోస్ట్‌గార్డ్ అధికారులు అరెస్టు చేస్తే.. వారిని నాలుగు మాసాల్లోనే విడిపించి స్వరాష్ట్రానికి తీసుకురావడం ► ఆక్వా రైతులకు కరెంటు చార్జీలు తగ్గించి రూ.720 కోట్ల అదనపు భారాన్ని ప్రభుత్వమే భరించడం. మండలిలో ఆమోదం పొందిన బిల్లులు ► ఏపీ పంచాయతీ రాజ్ చట్టం – 1994 సవరణ బిల్లు ► ఏపీ విలువ ఆధారిత పన్ను చట్టం – 2005 సవరణ బిల్లు.. రాష్ట్ర జీఎస్టీ చట్ట సవరణ బిల్లు (జీఎస్టీ 38వ కౌన్సిల్ సమావేశంలో నిర్ణయం మేరకు) ► ఏపీ ఆబ్కారీ చట్టం –1968 సవరణ బిల్లు ► ఏపీ మద్య నిషేధ చట్టం –1995 సవరణ బిల్లు ► పురపాలక కార్పొరేషన్ల చట్టం – 1955, ఏపీ పురపాలికల చట్టం – 1965 సవరణ బిల్లు. ► ఏపీ ఉన్నత విద్య నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్ చట్ట సవరణ బిల్లు ► తిరుమల ఆలయం తలుపులు తెరిచి తొలి దర్శనం చేసుకొనే ‘సన్నిధి యాదవ్’కు వారసత్వ హక్కు కల్పిస్తూ దేవదాయ చట్ట సవరణ బిల్లు ► ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్ – జూన్ వరకు బడ్జెట్ కేటాయింపులకు వీలుగా తెచ్చిన ఆర్డినెన్స్ బిల్లు. రాష్టంలో 8 దేవాలయాల ట్రస్టు బోర్డుల నియామకాల్లో మార్పులు చేస్తూ బిల్లు -
ఆన్లైన్లో ఆక్వా సేద్యం..!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: స్టార్టప్ డైరీలో ఎన్నెన్ని వింతలో!! ఎన్నెన్ని ఆవిష్కరణలో!! ఏదైనా ఒక సమస్య వస్తే చాలు. దాన్ని పరిష్కరించుకోవటంతో పాటు... ఆ సమస్య ఇతరులకు రాకుండా ఒక స్టార్టప్‌ను ఆరంభించేస్తున్నారు నేటి యువత. ఆరంభించటమే కాదు... దాన్ని విజయవంతంగా నడిపిస్తూ ఇన్వెస్టర్లను కూడా ఆకర్షిస్తున్నారు. ఇలాంటి విజయగాధల్ని అందిస్తున్న ‘సాక్షి స్టార్టప్ డైరీ’కి పలు సంస్థలు తమ విజయాల్ని వివరిస్తూ మెయిల్స్ పంపిస్తున్నాయి. స్థలాభావం వల్ల కొంత ఆలస్యం జరగటం... కొన్ని ఎంపిక చేసిన వాటిని మాత్రమే ప్రచురించటం వీలవుతోంది. అలాంటి స్టార్టప్స్‌లో కొన్ని ఈ వారం... వ్యవసాయమంటే మాటలు కాదు. ఇందులోనూ ఆక్వా సేద్యమంటే మరీనూ! విత్తనాల నుంచి యంత్ర పరికరాల (ఏరోటర్స్) వరకూ ప్రతి ఒక్కటీ కీలకమే. ఎందుకంటే ఏ చిన్న పొరపాటు జరిగినే సేద్యమంతా చచ్చిపోతుంది మరి. అందుకే ఆక్వా సేద్యంపై రైతులను అవగాహన కల్పించడంతో పాటుగా ఆన్లైన్లోనే విత్తనాలు, తిండిగింజలు, ఏరోటర్స్, హార్వెస్టర్స్ వంటి ఆక్వా సేద్యానికి అవసరమయ్యే ప్రతి ఒక్కదాన్ని కొనుగోలు చేసే వీలు కల్పిస్తోంది ఆక్వాఆల్. ఆక్వా సేద్యం కుటుంబం నేపథ్యమున్న అన్నదమ్ములు రామరాజు లక్కమరాజు, సూరిబాబు ఇద్దరూ కలిసి రూ.15 లక్షల పెట్టుబడితో ఈ ఏడాది మార్చిలో దీన్ని ప్రారంభించారు. ఆక్వా రైతులను, సప్లయర్స్‌ను ఒక గొడుగు కిందికి తీసుకురావటమే దీని ప్రధాన ఉద్దేశం. తమ సంస్థకు సంబంధించి రామరాజు,సూరిబాబు ఏమంటారంటే... టెక్నాలజీ వినియోగం తక్కువగా ఉండటం వల్ల ఆక్వా సేద్యంలో చాలా సమస్యలు ఎదురవుతున్నాయి. అందుకే రైతులకు టెక్నాలజీ వినియోగం నేర్పించడంతో పాటుగా దేశంలో లభ్యమయ్యే వివిధ రకాల ఆక్వా ఫీడ్, పంపిణీదారుల సమాచారం మొత్తాన్ని రైతులకు అందిస్తుంటాం. కాకపోతే అందరు రైతులకూ టెక్నాలజీ, ఇంటర్నెట్ వినియోగం రాకపోవచ్చు. అందుకే తమకు అవసరమైన పరికరాలు, వస్తువుల గురించి రైతులో, వారి తరఫు వారో సమాచారమందిస్తే చాలు... ఆక్వాఆల్లో రిజిస్టరై ఉన్న పంపిణీదారులకు ఎస్ఎంఎస్ రూపంలో వెళుతుంది. వెంటనే వాళ్లు స్పందించి నేరుగా రైతులతో మాట్లాడతారు. అద్భుతమైన స్టార్టప్‌ల గురించి అందరికీ తెలియజేయాలనుకుంటే startups@sakshi.com కు మెయిల్ చేయండి... -
అన్నదాతను ఊరిస్తున్న ఆక్వా!
రొయ్యల చెరువులుగా మారుతున్న పంటపొలాలు పాయకరావుపేట : ఆక్వాసాగు రైతులను ఊరిస్తోంది. రొయ్యల పెంపకం కాసుల వర్షం కురిపిస్తోంది. ఇప్పటివరకూ ఉప్పునీటి సాంద్రత కలిగిన ప్రాంతాలకే పరిమితమైన ఇది వనామి రొయ్య రాకతో భారీగా విస్తరించింది. ఈ రొయ్యల పెంపకం లాభసాటిగా ఉండటం, ఎలాంటి వాతావరణమైనా అనువుగా ఉండటంతో పలువురు రైతులు ఆసక్తి చూపిస్తున్నారు. పొలాలలను రొయ్యల పెంపకానికి చెరువులుగా మార్చివేస్తున్నారు. దీంతో భూముల లీజులు అమాంతంగా పెరిగిపోయాయి. ఒకప్పుడు ఎకరాకు రూ.10 వేల నుంచి రూ.20 వేల వరకూ ఉన్న లీజు రూ. 30 వేల నుంచి రూ.70 వేల వరకూ ప్రాంతాన్ని బట్టి పెరిగిపోయింది. రెండేళ్ల పాటు ఆరుగాలం కష్టపడి వ్యవసాయం చేస్తే వచ్చే ఆదాయం ఇలా లీజు రూపంలో వచ్చేస్తుండటంతో పలువురు భూయజమానులు తమ పొలాలు లీజుకిస్తున్నారు. గత ఏడాదితో పోలిస్తే ఈసారి పాయకరావుపేట మండలంలోని సాల్మన్‌పేట, రాజయ్యపేట, వెంకటనగరం, పెంటకోట, రాజవరం, కుమారపురం ప్రాంతాల్లో వందలాది ఎకరాల్లో ఆక్వా సాగు జరుగుతోంది. చెరువులు ఏర్పాటుకు సంబంధించి భారీగా వ్యయమవుతున్నా రైతులు వెనుకాడట్లేదు. సాధారణంగా రొయ్యలను మార్చి, ఏప్రిల్ నెలలో సాగు చేస్తారు. ఈ వేసవిలో చెరువుల తవ్వకం ఆలస్యమవడంతో ప్రస్తుతం సాగు మమ్మరంగా చేపట్టారు. మరోవైపు మార్కెట్లో రొయ్యల ధరలు ఆశాజనకంగా ఉండటంతో ఆక్వాసాగు ఊపందుకుంది. ప్రభుత్వ పోత్సాహం అందిస్తే మరింత అభివృద్ధి చెందుతుందని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. -
హడలిపోతున్న ఆక్వారైతు
చేపలలకు ఆక్సిజన్ లేమి ముప్పు ఒక్కసారిగా చల్లబడిన వాతావరణం ఏటా రూ. 100 కోట్ల నష్టం కైకలూరు : భానుడి భగభగలతో నిన్నటివరకు అగ్నిగోళంలా ఉన్న జిల్లా సోమవారం ఒక్కసారిగా చల్లబడడం ఆక్వా రైతులను హడలెత్తించేస్తోంది. ఉదయం నుంచే జిల్లా అంతటా ఆకాశం పూర్తిగా మేఘావృత్తమై వాతావరణం చల్లగా మారింది. అక్కడక్కడ సన్నపాటి వర్షపు జల్లులు పడ్డాయి. వాతావరణంలో ఒక్కసారిగా వచ్చిన మార్పు వల్ల చేపలకు ఆక్సిజన్ లేమి సమస్య ఏర్పడుంతుందని రైతులు ఆందోళన చెందుతున్నారు. జిల్లాలో లక్షా 10వేల ఎకరాల్లో చేపల సాగు, 10వేల ఎకరాల్లో రొయ్యల సాగు జరుగుతుంది. ఆదివారం వరకు జిల్లాలో ఉష్టోగ్రత 43 డిగ్రీల సెంటీగ్రేట్తో అదరగొట్టింది. రోహిణి కార్తె కావడంతో వేడి గాలులకు ప్రజలు అల్లాడిపోయారు. సోమవారం వచ్చిన మార్పు చేపల రైతులకు తీవ్ర నష్టదాయకమని పేర్కొంటున్నారు. విభజనతో ఇప్పటికే దెబ్బతిన్న రైతు ... రాష్ట్ర విభజన వ్యతిరేక, అనుకూల పోరాటాల నేపథ్యంలో ఇప్పటికే చేపల, రొయ్యల రైతులు రవాణా సౌకర్యం లేక తీవ్ర నష్టాల పాలయ్యారు. నెలల పాటు జరిగిన ఆందోళనల కారణంగా చెరువుల్లో వేసిన చేపల పట్టుబడికి వచ్చిన ఎగుమతిలు చే యలేని పరిస్థితి ఏర్పడింది. ఆందోళనకు ముందు కొల్లేరు సమీప ప్రాంతాల నుంచి రోజుకు 300 లారీల లోడు ఇతర ప్రాంతాలకు వెళ్లేది. నేడు ఆ సంఖ్య 250కి చేరింది. ఇదిలా ఉంటే గత రెండు నెలలుగా చేపల ధరలు పడిపోయాయి. గతంలో కిలో ధర రూ. 100 ఉంటే నేడు రూ. 75కి చేరింది. అదే విధంగా విద్యుత్ కోతలు ఆక్వా రంగాన్ని దెబ్బతీశాయి. ప్రధానంగా రొయ్యల సాగులో ఎరియేటర్ల ద్వారా నిత్యం వాటికి ఆక్సిజన్ అందించాలి. కోతల కారణంగా డీజిల్ ఇంజన్లు ఉపయోగించడంతో రైతులపై అదనపు భారం పడింది. ఇటీవల నీటి లభ్యత కొరత కారణంగా అనేక చెరువుల్లో నీటి మార్పిడి జరగలేదు. దీంతో నీరు చిక్కబడి చేపలు వ్యాధుల బారిన పడుతున్నాయి. ఏటా రూ. 100 కోట్ల నష్టం.... జిల్లాలో ఆక్వా రంగాన్ని ఆక్సిజన్ సమస్య ప్రతి ఏటా కుదిపేస్తోంది. అప్పటి వరకు ఎండలు మండిపోయి, ఒక్కసారిగా వర్షం కురిస్తే చెరువులు అడుగుభాగాన ఉన్న విష రసాయనాలు ఒక్కసారిగా పైకి వస్తాయి. దీని వల్ల ఆక్సిజన్ అందక చేపలు మృత్యువాత పడతాయి. మరో పక్క రుతుపవనాలు కారణంగా వర్షాలు పడే సూచన ఉందని వాతావరణ శాస్త్రవేత్తలు వెల్లడిస్తున్నారు. కొల్లేరు పరిసర ప్రాంతాల్లో ఇప్పటికే 45 శాతం చెరువులు పట్టుబడి దశలో ఉన్నాయి. ఈ సమయంలో వర్షం వ స్తే ఆక్సిజన్ సమస్యతో చేపలు మరణిస్తాయని రైతులు దిగులు చెందుతున్నారు ఈ పద్ధతులు పాటించండి..... ప్రతి ఏటా చేపల చెరువుల్లో ఆక్సిజన్ లేమి కారణంగా అనేక మంది రైతులు ఆర్థికంగా చితికిపోతున్నారని కైకలూరు మత్య్సశాఖ అభివృద్ధి అధికారి పి.సురేష్ చెప్పారు. వాతావరణంలో ఒక్కసారిగా మార్పులు సంభవించినప్పుడు పాటించాల్సిన పద్ధతులను ఆయన వివరించారు. కాల్షియం ఫెరాక్సైడ్, హైడ్రోజన్ ఫెరాక్సైడ్ మందులను చెరువుల వద్ద సిద్ధంగా ఉంచుకోవాలి. మేతలు, రసాయన పురుగుమందులను చెరువుల్లో వాడొద్దు. చేపల పట్టుబడులు నిలిపివేయాలి. చెరువులో ఆక్సిజన్ ఉత్పత్తి చేయడానికి బోటును కలియతిప్పాలి. చిన్న చెరువుల నుంచి పెద్ద చెరువులకు చేప పిల్లను మార్చకూడదు. నీటి, మట్టి పరీక్షలు వెంటనే చేయించాలి. చేపలు పైకి ముట్టెలు ఎత్తితే మొదట్లో సూచించిన మందును ఎకరం చెరువుకు అరకేజీ నుంచి కేజీ వరకు పిచికారీ చేయాలి. వైద్యుల సలహాలను ఎప్పటికప్పుడు పాటించాలి.