ఆక్వా వర్సిటీ... ఫిషింగ్‌ హార్బర్‌  | CM YS Jagan To Inaugurate many development works in Narasapuram | Sakshi
Sakshi News home page

ఆక్వా వర్సిటీ... ఫిషింగ్‌ హార్బర్‌ 

Published Mon, Nov 21 2022 3:39 AM | Last Updated on Mon, Nov 21 2022 2:01 PM

CM YS Jagan To Inaugurate many development works in Narasapuram - Sakshi

సాక్షి, అమరావతి: సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సోమవారం పశ్చిమగోదావరి జిల్లా నరసాపురంలో పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. ఆంధ్రప్రదేశ్‌ ఆక్వా విశ్వవిద్యాలయానికి, బియ్యపుతిప్ప ఫిషింగ్‌ హార్బర్‌కు, రూ.1,400 కోట్లతో జిల్లా రక్షిత నీటి సరఫరా ప్రాజెక్టులకు శంకుస్థాపన, నరసాపురం ప్రాంతీయ వైద్యశాల నూతన భవనానికి ప్రారంభోత్సవం చేశారు. అనంతరం బహిరంగ సభను ఉద్దేశించి ప్రసంగించారు.

ఇప్పటి వరకు తమిళనాడు, కేరళలో మాత్రమే ఈ వర్సిటీలు ఉన్నాయి. ఆక్వా వర్సిటీ కోసం నరసాపురం పరిసర ప్రాంతాల్లోని సరిపల్లి, లిఖితపూడి గ్రామాల మధ్య 40 ఎకరాల భూమిని ఇప్పటికే కేటాయించారు. భవన నిర్మాణ పనుల కోసం రూ.332 కోట్ల అంచనా వ్యయంతో డీపీఆర్‌ ఆమోదించారు. మొదటి దశలో పరిపాలన భవనంతో పాటు విద్యార్థులకు వసతి గృహాలు, విశ్వవిద్యాలయం నిర్మాణానికి రూ.100 కోట్లు మంజూరు చేశారు. 2022–23 బడ్జెట్‌లో విశ్వవిద్యాలయ నిర్మాణ పనులకు రూ.40 కోట్లు కేటాయించారు.

రెండవ దశ పనుల్లో భాగంగా నరసాపురం మండలం బియ్యపుతిప్ప గ్రామంలో 350 ఎకరాలలో రూ.222 కోట్ల అంచనా వ్యయంతో విశ్వవిద్యాలయ సముద్రతీర ప్రాంగణం, పరిశోధన కేంద్రం నిర్మాణాలు చేపట్టనున్నారు. ఈ విశ్వవిద్యాలయం ఏర్పాటు ద్వారా మత్స్యకారులు, ఆక్వా రైతులు ఎక్కువగా ప్రయోజనం పొందనున్నారు. వృత్తిపరంగా అర్హత కలిగిన మానవ వనరుల లభ్యత కారణంగా ఆక్వా రంగంలో నష్టాలను చాలా వరకు తగ్గించవచ్చు.

తద్వారా దాదాపు సంవత్సరానికి రూ.4,000 నుంచి 5,000 కోట్ల ఆర్థిక ప్రయోజనం ఆక్వా రైతులకు చేకూరుతుంది. అవసరమైన సంఖ్యలో ఫిషరీస్‌ డిప్లొమా, బీఎఫ్‌ఎస్‌సీ, ఎంఎఫ్‌ఎస్‌సీ, పీహెచ్‌డీ అర్హత గల అభ్యర్థులను తయారు చేయడానికి ఆక్వా యూనివర్సిటీ ఆధ్వర్యంలో మరిన్ని కొత్త మత్స్య కళాశాలలు, మత్స్య పాలిటెక్నిక్‌ కళాశాలలు ప్రారంభించే ప్రతిపాదనలు కూడా ప్రభుత్వ పరిశీలనలో ఉన్నాయి. 
ప్రారంభానికి సిద్దంగా ఉన్న 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రి   

6,000 మంది మత్స్యకారులకు లబ్ధి
బియ్యపుతిప్ప వద్ద 150 ఎకరాల విస్తీర్ణంలో రూ.429.43 కోట్ల అంచనాతో ఫిషింగ్‌ హార్బర్‌ నిర్మించేందుకు ప్రభుత్వం ఇప్పటికే జీవో జారీ చేసింది. ఈ హార్బర్‌ నిర్మాణం ద్వారా మత్స్యకారులు అత్యంత సామర్థ్యం గల మోటారు బోట్లలో సముద్రంలో ఎక్కువ దూరం వేటకు వెళ్లేందుకు వీలుంటుంది. మార్కెటింగ్‌ సౌకర్యాలను పెంపొందించడం ద్వారా మత్స్య పరిశ్రమ అభివృద్ధికి అవసరమైన అన్ని ఏర్పాట్లను ప్రభుత్వం పూర్తి చేసింది. ఈ హార్బర్‌ నిర్మించే ప్రదేశం నరసాపురం పట్టణానికి 14 కి.మీ. దూరంలో ఉంది. దీనివల్ల నరసాపురం, మొగల్తూరు మండలాలకు చెందిన 6,000 మంది మత్స్యకారులు లబ్ధి పొందనున్నారు. 

కొల్లేటికి సముద్రపు నీటి నుంచి రక్ష
సముద్రపు నీరు కొల్లేరు సరస్సులోకి చొరబడకుండా నిరోధించడానికి, కొల్లేరులో 5వ కాంటూర్‌ వరకు మంచి నీరు నిలువ ఉండే విధంగా ఉప్పుటేరు నదిపై కిలోమీటరు 57.950 వద్ద మొల్లపర్రు విలేజ్‌ లిమిట్స్‌లో రూ. 188.40 కోట్ల అంచనా వ్యయంతో రెగ్యులేటర్‌ కమ్‌ బ్రిడ్జ్‌ కమ్‌ లాక్‌ నిర్మాణం కొరకు రూపొందించిన ప్రణాళికను ప్రభుత్వం ఆమోదించింది. దీంతో ముఖ్యమంత్రి జగన్‌ నేడు దీనికి శంకుస్థాపన చేయనున్నారు.

సురక్షిత తాగునీరివ్వడమే లక్ష్యంగా..
ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో ఆక్వాకల్చర్‌ వల్ల, తీర ప్రాంతంలో ఉప్పు నీటి సాంద్రత వల్ల ఏర్పడిన తీవ్ర తాగునీటి ఎద్దడి సమస్యలను శాశ్వతంగా పరిష్కరించడానికి ప్రభుత్వం రూ.1,400 కోట్లతో రక్షిత నీటిసరఫరా ప్రాజెక్ట్‌ను మంజూరు చేసింది. విజ్జేశ్వరం జలాశయం నుండి గోదావరి నీటిని రాపిడ్‌ శాండ్‌ ఫిల్టర్ల ద్వారా శుద్ధి చేసి, పైప్‌ లైన్ల ద్వారా సరఫరా చేస్తుంది.

ఈ పథకం ద్వారా నూతన జిల్లాలు  పశ్చిమ గోదావరి, ఏలూరు, తూర్పు గోదావరిలోని నిడుదవోలు, తణుకు, ఆచంట, పాలకొల్లు, నరసాపురం, భీమవరం, ఉండి, ఉంగుటూరు, ఏలూరు (పార్ట్‌), తాడేపల్లిగూడెం(పార్ట్‌) నియోజకవర్గాల ప్రజలకు, కృష్ణా జిల్లాలోని కృత్తివెన్ను, బంటుమిల్లి, పెడన, గుడ్లవల్లేరు మండలాల ప్రజలకు సురక్షిత తాగునీరు సరఫరా చేయొచ్చు. ఈ పథకానికి నేడు సీఎం శంకుస్థాపన చేయనున్నారు. 

అగ్రికల్చర్‌ కంపెనీ భూ అనుభవదారులకు హక్కులు
నరసాపురం మండలం నందలి వేములదీవి ఉప గ్రామమైన దర్బరేవు గ్రామంలో నాటి బ్రిటీష్‌ ప్రభుత్వం 1921లో 1,754 ఎకరాల భూమిని నరసాపురం అగ్రికల్చర్‌ కంపెనీ లిమిటెడ్‌కు 99 సంవత్సరాలు లీజుకు ఇచ్చింది. ఆ రోజు నుంచి 1,623 మంది రైతులు ఆ భూమి స్వాధీన అనుభవంలో ఉండి వ్యవసాయం చేసుకుంటున్నారు. కానీ రైతులకు ఎటువంటి భూ యాజమాన్య హక్కులు కానీ, రెవెన్యూ రికార్డు పరమైన హక్కులు కానీ లేవు.

అందువల్ల ఆ భూమిని అమ్మడానికి లేదా బ్యాంకులలో తనఖా పెట్టి రుణం పొందడానికి అర్హత లేదు. అయితే వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం జీవో జారీ చేసి, ఎకరాకు రూ.100 ధర నిర్ణయించి, ఆ 1,623 మంది రైతులకు భూ యాజమాన్య, రెవెన్యూ రికార్డు పరమైన సర్వహక్కులు కల్పించింది. దీంతో రైతులు వారి వారసులు నిరభ్యంతరంగా స్వాధీనములో ఉండి ఆ భూములను అనుభవించుకోవచ్చు. అవసరాల నిమిత్తం అమ్ముకోవచ్చు. తనఖా పెట్టి ఋణాలు కూడా పొందవచ్చు. ఇందుకు సంబంధించిన హక్కు పత్రాలను సీఎం జగన్‌ నేడు రైతులకు అందజేయనున్నారు.

ఇవీ ప్రారంభోత్సవాలు
► నరసాపురం పట్టణం మధ్యలో ఉన్న ప్రాంతీయ వైద్యశాల ఇటీవలే 100 పడకల స్థాయికి అప్‌గ్రేడ్‌ అయింది. అందువల్ల చుట్టుపక్కల గ్రామాలలో నివసించే 2 లక్షల మందికి వైద్య సదుపాయాలు, సేవలు అందిస్తోంది. ఇప్పుడు అదే ఆస్పత్రిలో నూతనంగా మాతా శిశు సంరక్షణ విభాగం ఏర్పాటు చేశారు. రూ.13 కోట్లతో ఈ భవనాన్ని నిర్మించారు.
► నరసాపురం పట్టణంలో మంచి నీటి ఎద్దడి నివారణకు రూ.61.81 కోట్లతో నీటి సరఫరా అభివృద్ధి పథకం చేపట్టి పూర్తి చేశారు. ఈ పథకం వల్ల రాబోయే 30 ఏళ్ల వరకు నరసాపురం పట్టణానికి మంచి నీటి సరఫరాకు ఎటువంటి సమస్యా ఉండదు. 

ఇంకా శంకుస్థాపనలు ఇలా..
► రూ.4 కోట్ల వ్యయంతో నరసాపురం బస్‌స్టేషన్‌ పునరుద్ధరణ పనులు.
► రూ.1.08 కోట్ల అంచనాతో నరసాపురం డివిజినల్‌ ఉప ఖజానా కార్యాలయం కొత్త భవన నిర్మాణం.
► రుస్తుంబాద గ్రామంలో రూ.132.81 కోట్లతో 220/ 132/ 33 కె.వి సబ్‌స్టేషన్‌ నిర్మాణ పనులు.
► నరసాపురం పురపాలక సంఘం పరిధిలో రూ.237 కోట్లతో అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజి నిర్మాణం. రూ.87 కోట్లతో మొదటి ఫేజ్‌ పనులు.
► రూ.26.32 కోట్లతో వశిష్ఠ వారధి – బుడ్డిగవాని రేవు ఏటి గట్టు పటిష్టం. 
► రూ.7.83 కోట్ల అంచనా వ్యయంతో చివరి గ్రామాలకు సాగు, తాగునీటి సౌకర్యాలు కల్పించేందుకు శేషావతారం పంట కాలువ అభివృద్ధిలో భాగంగా ఛానల్‌ డీ సిల్టింగ్, టెయిల్‌ డ్యామ్‌ నిర్మాణం, సీసీ లైనింగ్‌ పనులు.
► రూ.24.01 కోట్లతో మొగల్తూరు వియర్‌ పంట కాలువ నిర్మాణం. 
► రూ.8.83 కోట్లతో కాజ, ఈస్ట్‌ కొక్కిలేరు, ముస్కేపాలెం అవుట్‌ఫాల్‌ నాలుగు స్లూయీస్‌ల పునః నిర్మాణం.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement