వర్చువల్ విధానంలో మహారాష్ట్ర నుంచి ప్రధాని మోదీ శ్రీకారం
76.89 ఎకరాల్లో రూ.288.8 కోట్లతో నిర్మాణం
1,250 బోట్లు నిలుపుకునేలా ‘హార్బర్’ అభివృద్ధి
ఏడాదికి 41 వేల టన్నుల మత్స్య సంపద వెలికితీసే అవకాశం.. అందుబాటులోకి జగన్ కలల ప్రాజెక్టు
రూ.392.58 కోట్లతో నిర్మిస్తున్న పూడిమడక హార్బర్‌కూ శంకుస్థాపన
రాష్ట్రంలో మత్స్యకారుల కష్టాలనుతీర్చడానికి రూ.3,500 కోట్లతో 10 హార్బర్ల నిర్మాణం చేపట్టిన జగన్ సర్కార్
తొలిదశలో జువ్వలదిన్నె, నిజాంపట్నం, మచిలీపట్నం, ఉప్పాడ హార్బర్ల నిర్మాణం
ఎన్నికల కోడ్ రావడంతో జువ్వలదిన్నె ప్రారంభం వాయిదా
సాక్షి, అమరావతి/నెల్లూరు (దర్గామిట్ట)/తుమ్మపాల(అనకాపల్లి) : రాష్ట్రవ్యాప్తంగా 555 మత్స్యకార గ్రామాల్లో 6.8 లక్షల మంది మత్స్యకారులకు ప్రయోజనం చేకూర్చే విధంగా సుమారు రూ.3,500 కోట్లతో గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం శ్రీకారం చుట్టిన పది ఫిషింగ్ హార్బర్లు, ఆరు ఫిష్ హ్యాండ్లింగ్ సెంటర్లలోని మొట్టమొదటిదైన జువ్వలదిన్నె హార్బర్ మత్స్యకారులకు అందుబాటులోకి వచ్చిం ది.
నెల్లూరు జిల్లా బోగోలు మండలం జువ్వలదిన్నె వద్ద కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్త భాగస్వామ్యంతో రూ.288.8 కోట్ల వ్యయంతో 76.89 ఎకరాల్లో అభివృద్ధి చేసిన ఈ హార్బర్‌ను ప్రధాని నరేంద్ర మోదీ మహారాష్ట్ర పాలఘర్ నుంచి శుక్రవారం వర్చువల్‌గా ప్రారంభించారు. దీంతో.. ఇప్పటివరకూ పొట్టకూటి కోసం కూలీలుగా పొరుగు రాష్ట్రాలకు వలస వెళ్లిన వారు ఇప్పుడు ఇక్కడే అధునాతన మెకనైజ్డ్ బోట్లతో చేపలు పట్టుకునే వెసులుబాటు అందుబాటులోకి వచ్చింది.
ఈ హార్బర్ ప్రారంభంతోపాటు అనకాపల్లి జిల్లా పూడిమడక వద్ద రూ.392.58 కోట్లతో అభివృద్ధి చేయనున్న ఫిషింగ్ హార్బరుకూ ప్రధాని వర్చువల్‌గానే శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ, జెడ్పీ చైర్‌పర్సన్ ఆనం అరుణమ్మ, కావలి ఎమ్మెల్యే డీవీ కృష్ణారెడ్డి, జిల్లా కలెక్టర్ ఆనంద్, జేసీ కార్తీక్ నెల్లూరు కలెక్టరేట్ నుంచి.. అనకాపల్లి జిల్లా కలెక్టర్ విజయ కృష్ణన్ ఏపీ మారిటైమ్ బోర్డు అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులూ అనకాపల్లి నుంచి పాల్గొన్నారు.
ఎన్నికల కోడ్‌తో వాయిదా..
రాష్ట్రంలో మొత్తం పది ఫిషింగ్ హార్బర్లలో తొలిదశలో రూ.1,204.56 కోట్లతో జువ్వలదిన్నె, నిజాంపట్నం, మచిలీపట్నం, ఉప్పాడ హార్బర్ల నిర్మాణాన్ని గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం చేపట్టింది. ఇందులో తొలుత జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ పూర్తికాగా గత ప్రభుత్వ హయాంలో దీన్ని వర్చువల్‌గా అప్పటి సీఎం వైఎస్ జగన్ చేతుల మీదుగా ప్రారంభించడానికి అధికారులు ప్రయత్నించారు.
కానీ, ఇటువంటి ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టును నేరుగా మత్స్యకారులతో కలిసి ప్రారంభిస్తానంటూ ఆయన వాయిదా వేశారు. ఆ తర్వాత ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో ప్రారంభ కార్యక్రమం వాయిదా పడింది. ఇప్పుడు ప్రధాని 13 రాష్ట్రాలకు చెందిన రూ.1,200 కోట్ల విలువైన 217 మత్స్యకార ప్రాజెక్టులను శుక్రవారం ప్రారంభించగా ఇందులో ‘జువ్వలదిన్నె’ ఒకటి.
25వేల కుటుంబాలకు లబ్ది..
ప్రధాని ప్రారంభించిన జువ్వలదిన్నె ప్రాజెక్టు ద్వారా 25,000మత్స్యకార కుటుంబాలు ప్రయోజనం పొందనున్నాయి. 1,250 మోటరైజ్డ్, మెకనైజ్డ్ బోట్లు నిలుపుకునేలా ఈ హార్బరును అంతర్జాతీయ ప్రమాణాలతో తీర్చిదిద్దారు. ఈ హర్బర్ ద్వారా ఏటా 41,250 టన్నుల మత్స్య సంపద అదనంగా అందుబాటులోకి రానుంది.
హార్బర్‌లోనే కోల్డ్‌చైన్, ఐస్‌ప్లాంటు, చిల్‌రూం వంటి మౌలిక వసతులతో పాటు బోట్ రిపేర్ వర్క్‌షాపులు, గేర్òÙడ్లు, నెట్ మెండింగ్ షెడ్లు వంటి సౌకర్యాలు అందుబాటులోకి తీసుకొచ్చారు. అలాగే, నిర్మాణ పనులు ప్రారంభించిన పూడిమడక హార్బరు ద్వారా 980 బోట్లు నిలుపుకునే వెసులుబాటుతో పాటు 4,870 మంది మత్స్యకార కుటుంబాలు లబ్దిపొందనున్నాయి.
మరోవైపు.. రాష్ట్రంలో తలపెట్టిన పది ఫిషింగ్ హార్బర్లు, ఆరు ఫిష్‌ల్యాండ్ సెంటర్లు పూర్తిగా అందుబాటులోకి వస్తే మొత్తం 6.8 లక్షల మంది మత్స్యకారులు లబి్ధపొందనున్నారు. వీటి ద్వారా 10,521 మెకనైజ్డ్ బోట్లు నిలుపుకునే సామర్థ్యంతో పాటు 4.5 లక్షల టన్నుల అదనపు మత్స్య సంపద సమకూరనుంది. తద్వారా రాష్ట్ర జీడీపీకి రూ.9,000 కోట్ల ఆదాయం వస్తుందని అంచనా.
ఎక్కడ: శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా బోగోలు మండలం జువ్వలదిన్నె
పనులు ప్రారంభం : 2021 మార్చి 19న
ఖర్చు : 288.8 కోట్లు
పనులు పూర్తి : 2024 ఎన్నికలకు ముందు.. ఎన్నికల కోడ్‌తో ప్రారంభం వాయిదా
ఈ హార్బర్‌తో ఉపయోగం : ఏటా 41,250 టన్నుల మత్స్య సంపదతో పాటు 25,000మత్స్యకార కుటుంబాలకు లబ్ధి
ప్రజాసంకల్ప పాదయాత్రలో భాగంగామత్స్యకారుల కష్టాలు స్వయంగా చూసిన వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి.. సీఎంగా బాధ్యతలు చేపట్టిన వెంటనే తీరంపై ప్రత్యేక శ్రద్ధ చూపి ప్రణాళిక రూపొందించారు.
మొత్తంప్రణాళిక లక్ష్యం 10 ఫిషింగ్ హార్బర్లు , 6 ఫిష్ ల్యాండింగ్ సెంటర్ల ఏర్పాటు
ఎంత మందికి లబ్ధి : 555 తీరప్రాంత మత్య్సకార గ్రామాల్లో దాదాపు 6.8 లక్షల మంది మత్స్యకారులకు మేలు
మొత్తం అంచనా వ్యయం రూ.3,500 కోట్లు
తొలివిడతలో పనులుప్రారంభమైనవి: జువ్వలదిన్నె, నిజాంపట్నం,మచిలీపట్నం, ఉప్పాడ
వీటి అంచనా విలువరూ.1,204.56 కోట్లు
Comments
Please login to add a commentAdd a comment