కాకినాడ సిటీ: ఆక్వా రైతుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందని, రైతులెవరూ అధైర్య పడవద్దని అప్సడా (ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఆక్వా కల్చర్ డెవలప్‌మెంట్ అథారిటీ) రాష్ట్ర వైస్ చైర్మన్ వడ్డి రఘురామ్ చెప్పారు. సోమవారం ఇక్కడ ఏర్పాటు చేసిన రాష్ట్ర ఆక్వా రైతుల అవగాహన సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. గత ప్రభుత్వంలో ఆక్వా రైతులు ఎన్నో ఇబ్బందులు పడ్డారన్నారు. ప్రాసెసింగ్ ప్లాంట్ల యజమానులు వారికి అనుకూలమైన రేట్లు నిర్ణయించే వారన్నారు. ఆక్వా రైతుల కష్టాలు తెలుసుకున్న 24 గంటల్లోనే సీఎం వైఎస్ జగన్‌రొయ్యలకు గిట్టుబాటు ధర లభించేందుకు మంత్రులు, మత్స్యశాఖ అధికారులు, రైతులతో కలసి ఎంపవర్ కమిటీని వేయడంతో ఎన్నడూలేని విధంగా రైతులు పంటను అమ్ముకోగలుగుతున్నారని తెలిపారు.
ఆక్వా రైతుల సమస్యలపై చర్చించి ఆమోదయోగ్యమైన నిర్ణయం తీసుకోవాలన్న సీఎం ఆదేశాల మేరకు ప్రోసెసింగ్ ప్లాంట్ల యాజమానులతో ఇప్పటికే ఐదు సార్లు సమావేశమై గిట్టుబాటు ధరకు రొయ్యలు కొనేలా చర్యలు తీసుకున్నామన్నారు. గత ప్రభుత్వంలో రొయ్య 100 కౌంట్ రూ. 80కు కొనే వారని, ఇప్పుడు అదే కౌంట్ రూ. 210కి కొనాలని స్పష్టం చేశారు. రూపాయి తగ్గినా వెంటనే ఎంక్వైరీ కమిటీలో పెట్టి రైతులు, రైతు సంఘాల నాయకులు సమక్షంలోనే నిలదీసే పరిస్థితి ఉందన్నారు.
ఏలూరు జిల్లా గణపవరంలో జరిగిన సమావేశంలో రైతుల వినతి మేరకు ఆక్వాజోన్ పరిధిలో 10 ఎకరాల్లోపు ఉన్న రైతుకి రూ.1.50కే యూనిట్ విద్యుత్ ఇస్తున్నట్లు సీఎం వైఎస్ జగన్ అక్కడికక్కడే ప్రకటించారన్నారు. గత ప్రభుత్వంలో జోన్ వ్యవస్థ మధ్యలో వదిలేస్తే, సీఎం సుదీర్ఘమైన జోన్ల వ్యవస్థను ఏర్పాటు చేశారని చెప్పారు. దీని వల్ల 1,08,864 మంది రైతులు ఆక్వా జోన్‌లోకి వచ్చారన్నారు. వీరందరికీ యూనిట్ విద్యుత్ రూ. 1.50కే అందిస్తున్నట్లు తెలిపారు. పదిరోజులే రొయ్యల కొంటారంటూ కొందరు గుత్తేదారులు చేస్తున్న ప్రచారంలో వాస్తవం లేదని, 365 రోజులూ ప్రాసెసింగ్ ప్లాంట్లు రొయ్యలు కొంటాయని లేల్చి రెప్పారు. ఏ విధమైన అపోహలకు తావులేకుండా రైతులు నిర్భయంగా పంటలు పండించాలని సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment