సాక్షి, కాకినాడ: ఆడపిల్లగా జన్మించడమే ఆ శిశువుపాలిట మరణ శాసనమైంది. ఆడిపిల్ల భారం మోయలేనంటూ అమ్మేస్తానని భార్యతో చెప్పడంతో ఆమె వద్దన్న పాపానికి రక్తం పంచిన కన్న తండ్రే ఆ శిశువును కడతేర్చాడు. ఈ దారుణ ఘటన కాకినాడ జిల్లాలో చోటుచేసుకుంది.
వివరాల ప్రకారం.. కాకినాడ జగన్నాథపురం పప్పులమిల్లు ప్రాంతానికి చెందిన చెక్కా భవానీ కొన్ని సంవత్సరాల క్రితం భర్త చనిపోవడంతో కేతా శివమణి అనే వ్యక్తితో సహాజీవనం చేస్తోంది. వీరికి కొన్నేళ్ల క్రితం బాబు జన్మించాడు. అనంతరం, ఆ బాలుడిని శివమణి మరో వ్యక్తి అమ్మేశాడు. ఇక, 34 రోజుల క్రితమే వీరికి మరో ఆడ శిశువు జన్మించింది. అప్పటి నుంచి శివమణి ఆడపిల్ల పుట్టిందని అసంతృప్తితో ఉన్నాడు. ఆడపిల్ల తనకు భారం అంటూ భవానీతో నిత్యం గొడవ పడుతూనే ఉన్నాడు. దీనిలో భాగంగానే బుధవారం రాత్రి భవానీ వద్దకు వచ్చి మంచి బేరం కుదిరింది అని బిడ్డను అమ్మేస్తానని చెప్పాడు. దీంతో, కంగుతిన్న భవానీ.. శివమణి తీరును తప్పుబట్టింది. బిడ్డను అమ్మేందుకు భవానీ అంగీకరించను అంటూ తెగేసి చెప్పింది.
ఈ నేపథ్యంలో వారి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. వాగ్వాదం జరుగుతుండగానే పక్కనే నిద్రపోతున్న శిశువును తన చేతిలోకి తీసుకున్న శివమణి.. బిడ్డ గొంతు నులిమి గోడకు కొట్టాడు. అప్పటికే అచేతనంగా పడి ఉన్న శిశువును భవానీ స్థానికుల సాయంతో కాకినాడ జీజీహెచ్‌కు తీసుకెళ్లింది. కొన ప్రాణాలతో ఆసుపత్రిలో చేరిన కాసేపటికే శిశువు మృతిచెందింది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న కాకినాడ వన్‌టౌన్ పోలీసులు సీఐ దుర్గారావు ఆధ్వర్యంలో కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. నిందితుడు శివమణి పరారీలో ఉన్నట్టు పోలీసులు తెలిపారు.
ఇది కూడా చదవండి: జత్వానీ ఫోన్, ల్యాప్‌టాప్‌ను ఎఫ్‌ఎస్‌ఎల్‌కు పంపండి
Comments
Please login to add a commentAdd a comment