సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో ఏపీఎస్‌ఏడీఏ (ఏపీస్టేట్ ఆక్వా డెవలప్‌మెంట్ అథారిటీ) బిల్లును బుధవారం శాసనసభ ఆమోదించింది. రాష్ట్రంలో చేపలు, రొయ్యల సాగు అభివృద్ధికి సంబంధించిన ప్రాధికార సంస్థ బిల్లును మత్స్య, పశు సంవర్ధక శాఖ మంత్రి మోపిదేవి వెంకటరమణారావు అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. బిల్లు ఆమోదం పొందిన అనంతరం మంత్రి మోపిదేవి మాట్లాడారు. ఆయన ఏం చెప్పారంటే..
► ఆక్వా ఉత్పత్తుల్లో ఏపీ అగ్రస్థానంలో ఉండగా, దేశ ఎగుమతుల్లో 50 శాతం రాష్ట్రం నుంచి అవుతున్నాయి. కరోనా కష్టకాలంలోనూ 80 వేల మెట్రిక్ టన్నుల ఉత్పత్తులకు గిట్టుబాటు ధర నిర్ణయించి కొనుగోలు చేయించాం.
► ఆక్వా రంగానికి ప్రధానమైన విద్యుత్ యూనిట్ రేటు గతంలో రూ. 3.50 ఉండగా, దాన్ని రూ. 1.50 తగ్గించాం.
► 9 జిల్లాల్లో 8 మేజర్ ఫిషింగ్ హార్బర్లు, 4 మైనర్ ఫిష్ ల్యాండింగ్ సెంటర్లు రూ. 3,200 కోట్లతో నిర్మించేందుకు సీఎం నిర్ణయం తీసుకున్నారు.
► ఆక్వా రంగంలో తీసుకున్న నిర్ణయాలతో 18 లక్షల మంది నిరుద్యోగ యువకులకు పరోక్షంగానూ, ప్రత్యక్షంగాను ఉపాధి లభిస్తోంది.
► వేల కోట్ల రూపాయల విదేశీ మారక ద్రవ్యాన్ని ఆర్జించి పెడుతున్న ఈ రంగం అసంఘటిత రంగంగా ఉన్న పరిస్థితుల్లో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు ఆ రంగంలో ఉన్నవారికి భరోసా కల్పిస్తున్నాయి.
► వైఎస్ జగన్ పాదయాత్ర సమయంలో ఆక్వారైతుల సమస్యలు విన్నారు. అధికారంలోకి రాగానే సమస్యలు పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ఈ మేరకు సమస్యలు పరిష్కరించారు.
ఆక్వా ప్రాధికార సంస్థతో ప్రయోజనాలు ఇవే
► చేపలు, రొయ్యల పెంపకంలో నూతన వ్యాపార మార్గాలను సృష్టించడం
► ఆక్వా పెంపకానికి సంబంధించిన సమస్యల పరిష్కారానికి జిల్లా, రాష్ట్రస్థాయిలో ఫోరం ఏర్పాటు
► ఆక్వా రైతులకు మార్కెట్ ఇంటిలిజెన్స్ సేవలు. చేపలు, రొయ్యలకు వచ్చే వ్యాధులపై నిఘా, నియంత్రణ చర్యలు
► సముద్ర ఆహార ఉత్పత్తుల ఎగుమతులపై మార్కెట్ సమాచారాన్ని సేకరించి ఎప్పటికప్పుడు రైతులకు ప్రయోజనం చేకూర్చడం. నాణ్యతా ప్రమాణాలు పాటించేందుకు తనిఖీలు..ఆడిట్‌లు
► సీడ్ హేచరీస్, ఫీడ్ ప్లాంట్ మేనేజ్‌మెంట్, ఆక్వా ఉత్పత్తి చేసే రైతులు, ప్రాసెసింగ్ చేసే ఎగుమతిదారులూ భాగస్వాములను చేయడం
► ఇప్పటికే రైతు భరోసా కేంద్రాల్లో 36 చోట్ల రూ.50 కోట్ల వ్యయంతో ఆక్వా టెస్టింగ్ లాబ్స్ ఏర్పాటు. క్వాలిటీ మెటిరియల్ అందించి రైతులు నష్టపోకుండా పర్యవేక్షణ విధానాన్ని ఏర్పాటు చేయడం
► ఆక్వా ఉత్పత్తుల నిల్వకు కోల్డ్ స్టోరేజీ ప్లాంట్లను ఏర్పాటు చేయడం
► అసంఘటిత రంగంగా ఉన్న ఈ రంగాన్ని సంఘటిత రంగంగా మార్చడం
జగన్ సర్కారు వచ్చాక తీసుకున్న నిర్ణయాలు ఇవే
► కోవిడ్ సమయంలో 1.10 లక్షల మందికి రూ. 10 వేలు చొప్పున సాయం.
► డీజిల్ సబ్సీడీని 6 రూపాయల నుంచి 9 రూపాయలకు పెంచి వేటకు వెళ్లిన రోజునే స్మార్ట్ కార్డు ద్వారా వారి ఖాతాల్లో జమచేయడం
► చేపల వేట నిషేధం సమయంలో ఇచ్చే రూ.4వేల పరిహారాన్ని రూ.10వేలకు పెంచడం. చనిపోయిన వ్యక్తులకు పరిహారం రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల వరకూ పెంచడం
► తూర్పు గోదావరి జిల్లాలో గుజరాత్ స్టేట్ పెట్రోలియం కార్పొరేషన్ ఆయిల్ కోసం చేపల వేటపై నిషేధం విధించిన సమయంలో వాళ్లు ఇస్తానన్న పరిహారం చెల్లించకపోతే ఏపీ ప్రభుత్వమే రూ.80 కోట్లు చెల్లించడం
► సీఎం వైఎస్ జగన్ ఇచ్చిన హామీ మేరకు ఉత్తరాంధ్రకు చెందిన 22 మంది మత్స్యకారులు గుజరాత్ వలస వెళ్లి పాకిస్తాన్ కోస్ట్‌గార్డ్ అధికారులు అరెస్టు చేస్తే.. వారిని నాలుగు మాసాల్లోనే విడిపించి స్వరాష్ట్రానికి తీసుకురావడం
► ఆక్వా రైతులకు కరెంటు చార్జీలు తగ్గించి రూ.720 కోట్ల అదనపు భారాన్ని ప్రభుత్వమే భరించడం.
మండలిలో ఆమోదం పొందిన బిల్లులు
► ఏపీ పంచాయతీ రాజ్ చట్టం – 1994 సవరణ బిల్లు
► ఏపీ విలువ ఆధారిత పన్ను చట్టం – 2005 సవరణ బిల్లు.. రాష్ట్ర జీఎస్టీ చట్ట సవరణ బిల్లు (జీఎస్టీ 38వ కౌన్సిల్ సమావేశంలో నిర్ణయం మేరకు)
► ఏపీ ఆబ్కారీ చట్టం –1968 సవరణ బిల్లు
► ఏపీ మద్య నిషేధ చట్టం –1995 సవరణ బిల్లు
► పురపాలక కార్పొరేషన్ల చట్టం – 1955, ఏపీ పురపాలికల చట్టం – 1965 సవరణ బిల్లు.
► ఏపీ ఉన్నత విద్య నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్ చట్ట సవరణ బిల్లు
► తిరుమల ఆలయం తలుపులు తెరిచి తొలి దర్శనం చేసుకొనే ‘సన్నిధి యాదవ్’కు వారసత్వ హక్కు కల్పిస్తూ దేవదాయ చట్ట సవరణ బిల్లు
► ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్ – జూన్ వరకు బడ్జెట్ కేటాయింపులకు వీలుగా తెచ్చిన ఆర్డినెన్స్ బిల్లు. రాష్టంలో 8 దేవాలయాల ట్రస్టు బోర్డుల నియామకాల్లో మార్పులు చేస్తూ బిల్లు
Comments
Please login to add a commentAdd a comment