సాక్షి, విజయవాడ: రాష్ట్రంలో ఆలయాలపై జరిగిన దాడుల కేసుల్లో టీడీపీ నేతల ప్రమేయం రుజువు కావడంతో ప్రతిపక్ష నేత చంద్రబాబులో ఆందోళన మొదలైందని మంత్రి వెల్లంపల్లి అన్నారు. మతపరమైన విద్వేషాలను రెచ్చగొట్టేందుకు టీడీపీ, బీజేపీలు కుట్రలకు పాల్పడ్డాయని రాష్ట్ర డీజీపీ గౌతమ్ సవాంగ్ స్పష్టం చేసిన నేపథ్యంలో, చంద్రబాబు వెన్నులో వణుకు పడుతోందని ఆయన ఎద్దేవా చేశారు. దాడులకు సంబంధించిన తొమ్మిది కేసుల్లో 21 మంది టీడీపీ, బీజేపీ నేతల పాత్ర ఉందని, వారిలో 15 మందిని అరెస్టు చేశామని ఇటీవల రాష్ట్ర డీజీపీ ప్రకటించిన విషయం తెలిసిందే. ఆలయాలపై జరిగిన దాడుల కేసులపై మంత్రి వెల్లంపల్లి మీడియాతో మాట్లాడుతూ..
దాడుల కేసుల్లో టీడీపీ, బీజేపీ నేతల ప్రమేయాన్ని బయటపెట్టిన రాష్ట్ర డీజీపీపై టీడీపీ, బీజేపీ నేతలు ఆరోపణలు చేయడం సరికాదని అన్నారు. ప్రతిపక్ష పార్టీల ప్రమేయాన్ని సాక్ష్యాధారాలతో బయటపెట్టిన డీజీపీని చంద్రబాబు, బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు టార్గెట్ చేయటాన్ని ఆయన తప్పుబట్టారు. డీజీపీనే బెదిరించేలా సోము వీర్రాజు లేఖ రాశారని, ఇది అతని స్థాయికి సరికాదని వెల్లంపల్లి హితవు పలికారు. నిజాలను నిగ్గుతేల్చినందుకు డీజీపీ రాజీనామా చేయాలా అని ప్రశ్నించారు. తిరుపతి ఉపఎన్నికల్లో లబ్ధి పొందేందుకు టీడీపీ, బీజేపీ, జనసేన కలిసి కుట్రలు పన్నుతున్నాయని ఆరోపించారు. సోషల్ మీడియా వేదికగా తప్పుడు ప్రచారం చేస్తున్నారని మంత్రి మండిపడ్డారు. బూట్లు వేసుకొని పూజలు చేసే చంద్రబాబుకు హిందువుల గురించి మాట్లాడే నైతిక అర్హత లేదని ఆయన పేర్కొన్నారు. హిందువుల మనోభావాలు దెబ్బతినేలా మాట్లాడిన జనసేనానికీ ఆయన చురకలంటించారు. అన్ని కులాలు, మతాలను గౌరవించే ఏకైక ప్రభుత్వం తమదేనని, మానవత్వమే తమ సీఎం జగన్‌మోహన్‌రెడ్డి మతం, అభిమతమని వెల్లంపల్లి పేర్కొన్నారు.
ఇంతకన్నా నిదర్శనం లేదు
సాక్షి, గుంటూరు: రాష్ట్రంలో పారదర్శక పాలన కొనసాగుతోందని, సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్రానికి అంతర్జాతీయ స్థాయి గుర్తింపు లభించిందని ఎంపీ మోపిదేవి వెంకటరమణ అన్నారు. జాతీయ స్థాయి ఉత్తమ ముఖ్యమంత్రుల జాబితాలోకి సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి 3వ స్థానం లభించటం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. ఇది రాష్ట్ర ప్రజలందరికీ దక్కిన గౌరవమని ఆయన పేర్కొన్నారు. ప్రశాంతంగా ఉన్న రాష్ట్రంలో మత కలహాలు సృష్టించాలని కుట్రలు పన్నుతున్నారని ఎంపీ ఆగ్రహం వ్యక్తం చేశారు. అందులో భాగంగానే కుటిల బుద్ధితో దేవాలయాలలో విగ్రహాలు ధ్వంసం చేయించడం లాంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని విమర్శించారు. విగ్రహాల ధ్వంసం, తప్పుడు ప్రచారం కేసులో అరెస్టయిన వారందరూ తెలుగుదేశం పార్టీకి చెందిన వారేనని ఆయన తెలిపారు. తమ ఉనికిని కాపాడుకోవటానికి చిల్లర రాజకీయాలు, చిల్లర వ్యవహారాలు చేస్తున్నారనడానికి ఇంతకన్నా నిదర్శనం లేదని ఎంపీ మోపిదేవి ఎద్దేవా చేశారు.
Comments
Please login to add a commentAdd a comment