రాజకీయాల్లో కృతజ్ఞత, విధేయత అనే పదాలకు పెద్దగా విలువ ఉండదన్న సంగతి మరోసారి రుజువైంది. వైఎస్సార్‌సీపీకి చెందిన ఇద్దరు ఎంపీలు మోపిదేవి వెంకట రమణరావు, బీదా మస్తాన్ రావులు జెండా ఫిరాయించేశారు. ఎంపీ పదవులకు రాజీనామా చేసి తెలుగుదేశంలో చేరుతున్న నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ తన పాత పద్దతులకు పదును పెడుతోందని, పదవుల అమ్మకాలు, కొనుగోళ్లు బేరసారాల పర్వం ఆరంభమైందన్న చర్చ మొదలైంది. కానీ ఈ తాజా పర్వంలో కొత్త ట్రెండ్ ఏంటంటే తెలుగుదేశానికి చెందిన కొందరు నేతలు తమకు ఎమ్మెల్సీ లేదా ఎంపీ పదవి కావాలనుకుంటే వైఎస్సార్‌సీపీలో ఆ పదవుల్లో ఉన్న వారిని ప్రలోభపెట్టి నేరుగా బేరం కుదుర్చుకుని రాజీనామాలు చేయిస్తుండటం! వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీకి టీడీపీ నేత ఒకరు రూ.పది కోట్లు ఆశపెట్టి రాజీనామా చేయిస్తున్నారని ప్రచారం జరుగుతోంది. రెండేళ్ల పదవి కాలం ఉన్నవారు రాజీనామా చేస్తే రూ. ఇరవై కోట్లు, నాలుగేళ్ల పదవి కాలం ఉన్న వారు రాజీనామా చేస్తే 40 కోట్లను ఆఫర్ చేస్తున్నారంటూ మీడియాలో కథనాలు వచ్చాయి. ఇప్పుడు తాజాగా ఇద్దరు ఎంపీలలో విషయంలోనూ ఇదే రకమైన వ్యవహారం నడించిందా? అనే గుసగుసలూ వినిపిస్తున్నాయి.
ఈ బేరసారాలన్నీ తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు, ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వం మొత్తాన్ని శాసిస్తున్న మంత్రి, బాబు గారి పుత్రుడు లోకేశ్ అనుమతితోనే జరుగుతున్నట్లు చెబుతున్నారు. వైఎస్సార్‌సీపీ ఎంపీలు మోపిదేవి, బీద మస్తాన్ రావుల రాజీనామాలకు రాజ్యసభ అధ్యక్షుడు ఇప్పటికే ఆమోదం కూడా తెలిపారు. టీడీపీలో చేరి తరువాత వారికే ఆ పదవులు ఇస్తే బేరసారాల వ్యవహారం నిజం కాదని అనుకోవచ్చు. వైఎస్సార్‌సీపీని వీడి టీడీపీలో చేరినందుకు వేరే ఏదో ఒకటి గిట్టుబాటు అయి ఉంటుందని అంచనా వేయవచ్చు. అలా కాకుండా.. ఈ పదవులకు ఇతరులకు దక్కితే మాత్రం అనుమానాలు రావడం సహజం.
వాస్తవానికి టీడీపీ నాయకత్వానికి ఈ రకమైన చీకటి వ్యవహారాలు, కొనుగోళ్లూ కొత్తేమీ కాదు. గతంలోనూ 23 మంది వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలను ప్రలోభ పెట్టి కొనుగోలు చేశారన్న ఆరోపణలు ఉన్న విషయం అందరికీ తెలిసిందే. ప్రస్తుతం రాజ్యసభలో టీడీపీకి అసలు ప్రాతినిథ్యమే లేదు. అందుకే వారు ఈ కొనుగోళ్లు, బేరసారాలకు తెరతీశారు. ఇందుకు డబ్బు, పదవులు ఆశపెడుతున్నారు. అయితే ఇది పార్టీ నేరుగా చేస్తున్న పనా? లేక పదవులు ఆశిస్తున్న నేతలతో పార్టీ కొనుగోలు చేయిస్తోందా? అన్న చర్చ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జోరుగా సాగుతోంది.
రాజీనామా చేసిన ఎంపీల్లో ఒకరైన మోపిదేవి మాత్రం చాలా స్పష్టంగా స్థానిక రాజకీయల్లో ఉండడం కోసమే రాజ్యసభ పదవిని వదులుకుంటున్నట్టు, టీడీపీలో చేరుతున్నట్టు ప్రకటించారు. కానీ ఈ వాదనలో తర్కమేమిటో ఆయనకే తెలియాలి! అందుకే తామూ ఇదంతా బేరాసారాల వ్యవహారమంటున్నామని వైఎస్సార్‌సీపీ నేతలు చెబుతున్నారు.
మోపిదేవి స్వస్థలం రేపల్లె. మంత్రి అనగాని సత్యప్రసాద్ ఇప్పుడు అక్కడి ప్రతినిధి. సత్యప్రసాద్‌ను కాదని మోపిదేవికి రేపల్లెలో ప్రాధాన్యత ఇచ్చే అవకాశం లేదు. మహ అయితే ఒక ఎమ్మెల్సీ ఇచ్చి పక్కన కూర్చోబెట్టవచ్చు. 2026లో నియెజకవర్గాల పునర్విభజన జరిగితే... మోపిదేవి లేదా అయన కుమారుడికి టిక్కెట్ ఇవ్వవచ్చని కొందరు అంటున్నారు. రెండేళ్ల పదవి కాలం ఉన్నవారు రాజీనామా చేస్తే రూ. ఇరవై కోట్లు, రూ.నాలుగేళ్ల పదవి కాలం ఉన్న వారు రాజీనామా చేస్తే రూ.40 కోట్లను ఆఫర్ చేస్తున్నారంటూ మీడియాలో కథనాలు వచ్చాయి. సరే డబ్బు సంగతి నేరుగా ఎవరు అంగీకరించరు. మొత్తమ్మీద చూస్తే మోపిదేవి పార్టీ మారడం వల్ల స్వస్థలం రేపల్లెలో పరపతి ఏమీ పెరగదు సరికదా.. తగ్గే అవకాశాలే ఎక్కువ. మోపిదేవి వరుసగా రెండుసార్లు ఓడిపోయినా వైఎస్సార్‌సీపీ అధినేత జగన్ ఆయనను గౌరవించి అధికారంలోకి రాగానే ఎమ్మెల్సీ పదవిని ఇవ్వడమే కాకుండా... మంత్రిని కూడా చేశారు.
విధాన పరిషత్‌ను రద్దు చేయాలన్న ఆలోచన వచ్చినప్పుడు కూడా మోపిదేవితోపాటు పిల్లి సుభాష్ చంద్రబోస్‌కు నష్టం జరక్కూడదన్న ఆలోచనతో వారిని రాజ్యసభకు పంపించారు. ఈ విషయాలను గుర్తు చేసుకుంటూనే పిల్లి సుభాష్ చంద్రబోస్ తనకు జగన్ ఎప్పుడూ అన్యాయం చేయలేదని, పార్టీ కూడా గౌరవంగా చూసిందని, తాను పార్టీకి విధేయుడినని స్పష్టం చేశారు. రాజీనామా చేయనున్నారన్న ప్రచారం చేసిన ఎల్లో మీడియాను తప్పుపట్టారు మోపిదేవి మాత్రం అందరని అశ్చర్య పరుస్తూ ఎంపీ పదవికి రాజీనామా చేసి టీడీపీలో చేరుతున్నారు. మోపిదేవి మొదట మండల అధ్యక్షుడిగా ఉండేవారు. కాంగ్రెస్ పార్టీ ఆయనకు అసెంబ్లీ టిక్కెట్ ఇచ్చింది. తరువాతి కాలంలో ఆయన 1999, 2004లలో కూచినపూడి నుంచి, 2009లో రేపల్లె నుంచి గెలుపోంది వైఎస్సార్ కేబినెట్‌లో మంత్రి అయ్యారు. రోశయ్య, నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి మంత్రివర్గాల్లోనూ కొనసాగారు.
వైఎస్సార్ అనుహ్య మరణం, తర్వాత జగన్ సొంత పార్టీ పెట్టుకునే పరిస్థితి రావడం.. కాంగ్రెస్ అధిష్టానం అక్రమ కేసులు బనాయించడం జరిగాయి. మోపిదేవిని కూడా కాంగ్రెస్ పార్టీ కేసుల్లో ఇరికించింది. కొంతకాలం జైలు జీవితమూ అనుభవించారు. ఈ విషయాలన్నీ తెలిసిన జగన్ పార్టీలో ఆ తరువాత అధికారం వచ్చిన తరువాత కూడా మోపిదేవికి మంచి ప్రాధన్యత ఇచ్చారు. అయితే 2024 ఎన్నికల్లో రేపల్లెలో పోటి చేయాలని అనుకున్నా గెలుపు అవకాశం లేదని సర్వేలు తేల్చిన నేపథ్యంలో వైఎస్సార్‌సీపీ మోపిదేవికి టిక్కెట్ ఇవ్వలేదు. అయితే ఆ సంగతిని మోపిదేవి ఇప్పుడు ప్రస్తావించడం ఇప్పుడు సముచితంగా లేదు. ఒక వేళ టిక్కెట్ ఇచ్చిన తరువాత ఓడిపోయి ఉంటే ఏం చేసేవారు?
రాజకీయాల్లో విధేయత అన్నది శాశ్వతం కాదు అన్నది ఈయన కూడా రుజువు చేశారు. జగన్ కేసుల్లో చిక్కుకున్న ప్రతి ఒక్కరిని చంద్రబాబు తీవ్రంగా విమర్శించేవారు. కానీ ఇప్పుడు మోపిదేవిని తన పార్టీలోకి తీసుకోవడం ద్వారా జగన్ పై పెట్టినవి అక్రమ కేసులే అని చంద్రబాబు ఒప్పుకున్నట్లు అయ్యింది.
రాజీనామా చేసిన మరో ఎంపీ బీద మస్తాన్ రావు గతంలో కావలి నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ తరఫున ఎమ్మెల్యే. కాని రెండు సార్లు వరుసగా ఓడిపోయారు. దీంతో ఆయన వైఎస్సార్‌సీపీ వైపు వచ్చేశారు. పార్టీ నాయకత్వం కూడా ఈయనను గుర్తించి ఎంపీ పదవి ఇచ్చింది. మస్తాన్ రావుకు రొయ్యల ఫీడ్ వ్యాపారంతోపాటు పలు వ్యాపారాలు ఉన్నాయి. టీడీపీ ప్రభుత్వంలో తన వ్యాపారాలకు ఇబ్బంది రాకుండా ఉండేందుకు పార్టీ మారుతూండవచ్చని అంటున్నారు.
అయితే వీరిద్దరే కాకుండా ఇంకా ఎవరైన వెళతారా అన్నది చూడాలి. ఎల్లో మీడియా అయితే ఇద్దరు ముగ్గురిని మినహాయించి అందరూ పార్టీ వీడతారని ప్రచారం చేసింది ఎల్లో మీడియా. అది వాస్తవం కాదని ఇప్పటికైతే స్పష్టం. వైఎస్సార్‌సీపీ రాజ్యసభ సభ్యులు మిగిలిన వారు అందరూ ఖండించారు. ఎంపీలు లేదా ఎమ్మెల్సీలు పార్టీలు ఫిరాయించినంత మాత్రాన వైఎస్సార్‌సీపీకి నష్టం జరుగుతుందని అనుకుంటే అది టీడీపీ పొరబాటే అవుతుంది. ఎందుకంటే 2014 - 2019 మధ్యకాలంలో వైఎస్సార్‌సీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా ఇలాగే చాలామంది ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇతరుల ప్రభావాలను లోనై పార్టీని వీడారు. అయినప్పటికీ జగన్ ప్రజాభిమానం ఏమాత్రం తగ్గలేదని 2019 నాటి ఎన్నికలు రుజువు చేశాయి.
ఎంపీలు వెళ్లిపోతే పార్టీ మళ్లీ గెలవలేదని అనుకుంటే.. తాజా ఎన్నికల్లో టీడీపీ కూడా గెలిచి ఉండకూడదు. ఎందుకంటే.. ఆ పార్టీ ఎంపీలు నలుగురు బీజేపీలోకి చేరారు మరి! కాకపోతే వారు చంద్రబాబు అనుమతి తీసుకుని పార్టీ మారారు అన్నది బహిరంగ రహస్యం. పీవీ నరసింహ రావు ప్రధానిగా ఉన్నప్పుడు టీడీపీ లోకసభ సభ్యులు అరడజను మందిని కాంగ్రెస్‌లోకి లాక్కొచ్చారు. కానీ ఆ తర్వాత 1994 అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్టీఆర్ ఆధ్వర్యంలో టీడీపీ ఘన విజయం సాధించింది. ఇలా చాలా ఉదాహరణలు ఉన్నాయి. 2019 ఎన్నికల్లో చంద్రబాబు నాయకత్వంలోని టీడీపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలైంది. ఎప్పుడు ఏమైనా జరగవచ్చు. అయితే చంద్రబాబు నాయుడు వైఎస్సార్‌సీపీ వారికి క్యారెక్టర్ లేదు అంటూనే ఆ పార్టీ వారిని టీడీపీలోకి చేర్చుకుంటూ ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తున్నారు. వైఎస్సార్‌సీపీకి రాజీనామా చేసి తమ పార్టీలో చేరారని చెబుతున్న ఈయన ఒంగోలు, ఏలూరు కార్పోరేషన్ ఛైర్మన్లను, మరికొన్ని చోట్ల కార్పొరేటర్లు, కౌన్సిలర్లను నేరుగా పార్టీలోకి ఎందుకు చేర్చుకున్నారో కూడా చెప్పాలి. ఏది ఏమైనా... ఎన్ని చట్టాలు ఉన్నా ఈ అయారాం.. గయారామ్‌ల వ్యవహారాలు మాత్రం ఆగడం లేదు.
– కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ పాత్రికేయులు
Comments
Please login to add a commentAdd a comment