ఆన్‌లైన్‌లో ఆక్వా సేద్యం..!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: స్టార్టప్ డైరీలో ఎన్నెన్ని వింతలో!! ఎన్నెన్ని ఆవిష్కరణలో!! ఏదైనా ఒక సమస్య వస్తే చాలు. దాన్ని పరిష్కరించుకోవటంతో పాటు... ఆ సమస్య ఇతరులకు రాకుండా ఒక స్టార్టప్‌ను ఆరంభించేస్తున్నారు నేటి యువత. ఆరంభించటమే కాదు... దాన్ని విజయవంతంగా నడిపిస్తూ ఇన్వెస్టర్లను కూడా ఆకర్షిస్తున్నారు. ఇలాంటి విజయగాధల్ని అందిస్తున్న ‘సాక్షి స్టార్టప్ డైరీ’కి పలు సంస్థలు తమ విజయాల్ని వివరిస్తూ మెయిల్స్ పంపిస్తున్నాయి.
స్థలాభావం వల్ల కొంత ఆలస్యం జరగటం... కొన్ని ఎంపిక చేసిన వాటిని మాత్రమే ప్రచురించటం వీలవుతోంది. అలాంటి స్టార్టప్స్‌లో కొన్ని ఈ వారం...
వ్యవసాయమంటే మాటలు కాదు. ఇందులోనూ ఆక్వా సేద్యమంటే మరీనూ! విత్తనాల నుంచి యంత్ర పరికరాల (ఏరోటర్స్) వరకూ ప్రతి ఒక్కటీ కీలకమే. ఎందుకంటే ఏ చిన్న పొరపాటు జరిగినే సేద్యమంతా చచ్చిపోతుంది మరి. అందుకే ఆక్వా సేద్యంపై రైతులను అవగాహన కల్పించడంతో పాటుగా ఆన్‌లైన్‌లోనే విత్తనాలు, తిండిగింజలు, ఏరోటర్స్, హార్వెస్టర్స్ వంటి ఆక్వా సేద్యానికి అవసరమయ్యే ప్రతి ఒక్కదాన్ని కొనుగోలు చేసే వీలు కల్పిస్తోంది ఆక్వాఆల్.
ఆక్వా సేద్యం కుటుంబం నేపథ్యమున్న అన్నదమ్ములు రామరాజు లక్కమరాజు, సూరిబాబు ఇద్దరూ కలిసి రూ.15 లక్షల పెట్టుబడితో ఈ ఏడాది మార్చిలో దీన్ని ప్రారంభించారు. ఆక్వా రైతులను, సప్లయర్స్‌ను ఒక గొడుగు కిందికి తీసుకురావటమే దీని ప్రధాన ఉద్దేశం.
తమ సంస్థకు సంబంధించి రామరాజు,సూరిబాబు ఏమంటారంటే...
టెక్నాలజీ వినియోగం తక్కువగా ఉండటం వల్ల ఆక్వా సేద్యంలో చాలా సమస్యలు ఎదురవుతున్నాయి. అందుకే రైతులకు టెక్నాలజీ వినియోగం నేర్పించడంతో పాటుగా దేశంలో లభ్యమయ్యే వివిధ రకాల ఆక్వా ఫీడ్, పంపిణీదారుల సమాచారం మొత్తాన్ని రైతులకు అందిస్తుంటాం. కాకపోతే అందరు రైతులకూ టెక్నాలజీ, ఇంటర్నెట్ వినియోగం రాకపోవచ్చు.
అందుకే తమకు అవసరమైన పరికరాలు, వస్తువుల గురించి రైతులో, వారి తరఫు వారో సమాచారమందిస్తే చాలు... ఆక్వాఆల్‌లో రిజిస్టరై ఉన్న పంపిణీదారులకు ఎస్‌ఎంఎస్ రూపంలో వెళుతుంది. వెంటనే వాళ్లు స్పందించి నేరుగా రైతులతో మాట్లాడతారు.
అద్భుతమైన స్టార్టప్‌ల గురించి అందరికీ తెలియజేయాలనుకుంటే startups@sakshi.com కు మెయిల్ చేయండి...