హడలిపోతున్న ఆక్వారైతు
- చేపలలకు ఆక్సిజన్ లేమి ముప్పు
- ఒక్కసారిగా చల్లబడిన వాతావరణం
- ఏటా రూ. 100 కోట్ల నష్టం
కైకలూరు : భానుడి భగభగలతో నిన్నటివరకు అగ్నిగోళంలా ఉన్న జిల్లా సోమవారం ఒక్కసారిగా చల్లబడడం ఆక్వా రైతులను హడలెత్తించేస్తోంది. ఉదయం నుంచే జిల్లా అంతటా ఆకాశం పూర్తిగా మేఘావృత్తమై వాతావరణం చల్లగా మారింది. అక్కడక్కడ సన్నపాటి వర్షపు జల్లులు పడ్డాయి. వాతావరణంలో ఒక్కసారిగా వచ్చిన మార్పు వల్ల చేపలకు ఆక్సిజన్ లేమి సమస్య ఏర్పడుంతుందని రైతులు ఆందోళన చెందుతున్నారు.
జిల్లాలో లక్షా 10వేల ఎకరాల్లో చేపల సాగు, 10వేల ఎకరాల్లో రొయ్యల సాగు జరుగుతుంది. ఆదివారం వరకు జిల్లాలో ఉష్టోగ్రత 43 డిగ్రీల సెంటీగ్రేట్‌తో అదరగొట్టింది. రోహిణి కార్తె కావడంతో వేడి గాలులకు ప్రజలు అల్లాడిపోయారు. సోమవారం వచ్చిన మార్పు చేపల రైతులకు తీవ్ర నష్టదాయకమని పేర్కొంటున్నారు.
విభజనతో ఇప్పటికే దెబ్బతిన్న రైతు ...
రాష్ట్ర విభజన వ్యతిరేక, అనుకూల పోరాటాల నేపథ్యంలో ఇప్పటికే చేపల, రొయ్యల రైతులు రవాణా సౌకర్యం లేక తీవ్ర నష్టాల పాలయ్యారు. నెలల పాటు జరిగిన ఆందోళనల కారణంగా చెరువుల్లో వేసిన చేపల పట్టుబడికి వచ్చిన ఎగుమతిలు చే యలేని పరిస్థితి ఏర్పడింది. ఆందోళనకు ముందు కొల్లేరు సమీప ప్రాంతాల నుంచి రోజుకు 300 లారీల లోడు ఇతర ప్రాంతాలకు వెళ్లేది. నేడు ఆ సంఖ్య 250కి చేరింది. ఇదిలా ఉంటే గత రెండు నెలలుగా చేపల ధరలు పడిపోయాయి.
గతంలో కిలో ధర రూ. 100 ఉంటే నేడు రూ. 75కి చేరింది. అదే విధంగా విద్యుత్ కోతలు ఆక్వా రంగాన్ని దెబ్బతీశాయి. ప్రధానంగా రొయ్యల సాగులో ఎరియేటర్ల ద్వారా నిత్యం వాటికి ఆక్సిజన్ అందించాలి. కోతల కారణంగా డీజిల్ ఇంజన్లు ఉపయోగించడంతో రైతులపై అదనపు భారం పడింది. ఇటీవల నీటి లభ్యత కొరత కారణంగా అనేక చెరువుల్లో నీటి మార్పిడి జరగలేదు. దీంతో నీరు చిక్కబడి చేపలు వ్యాధుల బారిన పడుతున్నాయి.
ఏటా రూ. 100 కోట్ల నష్టం....
జిల్లాలో ఆక్వా రంగాన్ని ఆక్సిజన్ సమస్య ప్రతి ఏటా కుదిపేస్తోంది. అప్పటి వరకు ఎండలు మండిపోయి, ఒక్కసారిగా వర్షం కురిస్తే చెరువులు అడుగుభాగాన ఉన్న విష రసాయనాలు ఒక్కసారిగా పైకి వస్తాయి. దీని వల్ల ఆక్సిజన్ అందక చేపలు మృత్యువాత పడతాయి. మరో పక్క రుతుపవనాలు కారణంగా వర్షాలు పడే సూచన ఉందని వాతావరణ శాస్త్రవేత్తలు వెల్లడిస్తున్నారు. కొల్లేరు పరిసర ప్రాంతాల్లో ఇప్పటికే 45 శాతం చెరువులు పట్టుబడి దశలో ఉన్నాయి. ఈ సమయంలో వర్షం వ స్తే ఆక్సిజన్ సమస్యతో చేపలు మరణిస్తాయని రైతులు దిగులు చెందుతున్నారు
ఈ పద్ధతులు పాటించండి.....
ప్రతి ఏటా చేపల చెరువుల్లో ఆక్సిజన్ లేమి కారణంగా అనేక మంది రైతులు ఆర్థికంగా చితికిపోతున్నారని కైకలూరు మత్య్సశాఖ అభివృద్ధి అధికారి పి.సురేష్ చెప్పారు. వాతావరణంలో ఒక్కసారిగా మార్పులు సంభవించినప్పుడు పాటించాల్సిన పద్ధతులను ఆయన వివరించారు.
కాల్షియం ఫెరాక్సైడ్, హైడ్రోజన్ ఫెరాక్సైడ్ మందులను చెరువుల వద్ద సిద్ధంగా ఉంచుకోవాలి.
మేతలు, రసాయన పురుగుమందులను చెరువుల్లో వాడొద్దు.
చేపల పట్టుబడులు నిలిపివేయాలి.
చెరువులో ఆక్సిజన్ ఉత్పత్తి చేయడానికి బోటును కలియతిప్పాలి.
చిన్న చెరువుల నుంచి పెద్ద చెరువులకు చేప పిల్లను మార్చకూడదు.
నీటి, మట్టి పరీక్షలు వెంటనే చేయించాలి.
చేపలు పైకి ముట్టెలు ఎత్తితే మొదట్లో సూచించిన మందును ఎకరం చెరువుకు అరకేజీ నుంచి కేజీ వరకు పిచికారీ చేయాలి.
వైద్యుల సలహాలను ఎప్పటికప్పుడు పాటించాలి.