
వృద్ధాప్య వేగాన్ని భారీగా తగ్గించడమే లక్ష్యంగా వినూత్న నిర్ణయం
అమెరికన్ వ్యాపారవేత్త బ్రియాన్ జాన్సన్ కొత్త పోకడ
వృద్ధాప్య ఛాయలను దరిచేరనీయకుండా నిత్యం యవ్వన కాంతులీనడమే ధ్యేయంగా ప్రతి ఏటా కోట్ల రూపాయలు ఖర్చుచేస్తున్న అమెరికన్ వ్యాపారవేత్త, అత్యంత సంపన్నుడు బ్రియాన్ జాన్సన్ మరో వినూత్న నిర్ణయం తీసుకున్నారు. కలుషిత గాలికి బదులు స్వచ్ఛమైన ఆక్సిజన్ ఎక్కువ మోతాదులో లభ్యమయ్యే ఏర్పాటు చేసుకున్నారు. ఈ ఆక్సిజన్ ఛాంబర్‌నే తన కార్యస్థలిగా మార్చుకున్నారు.
ఆక్సిజన్ సరఫరా ట్యూబ్‌లు పెట్టుకుని డెస్క్ టాప్‌పై పనిచేస్తున్న వీడియోను తాజాగా ‘ఎక్స్’ఖాతాలో షేర్‌చేశారు. ‘‘హైపర్‌బారిక్ ఆక్సీజన్ ఛాంబర్‌లోకి ఆఫీస్‌కు తీసుకొచ్చా’’అని ఆయన రాసుకొచ్చారు. హైపర్‌బారిక్ ఆక్సిజన్ థెరపీ(హెచ్‌బీఓటీ) తీసుకుంటున్నట్లు చెప్పారు. ‘‘ఊపిరితిత్తుల్లోకి తగు పీడనంతో ఆక్సిజన్ వెళితే అంతర్గత కణజాలం ఏదైనా అతిసూక్ష్మస్థాయి రిపేర్లు ఉంటే వేగంగా చేసుకుంటుంది.
హెచ్‌బీఓటీ అనేది ప్రపంచంలోనే చర్మ సంబంధ అత్యంత అధునాతన థెరపీ. ఈ థెరపీతో చర్మంలోని కణజాలం సాంద్రత 12.8 శాతం పెరుగుతుంది. సాగి, మళ్లీ యథాస్థానానికి వచ్చే ఎలాస్టిక్ గుణం 144 శాతం మెరుగుపడుతుంది. చర్మంలో అతిసూక్ష్మ రక్తనాళాల సంఖ్య 40.9 శాతం పెరుగుతుంది. సీడీ31 అనే రక్తనాళం సామర్థ్యం 84.3 శాతం మెరుగవుతుంది. కణక్షీణత 21 శాతం తగ్గుతుంది’’అని బ్రియాన్ చెప్పుకొచ్చారు. సముద్రజలాల్లో 33 అడుగుల లోతులో ఉన్నప్పుడు ఎంత పీడనం అయితే ఉంటుందో అంతే పీడనంతో గాలిని ఈ ఛాంబర్‌లో పీల్చే వెసులుబాటు ఉంది. ఈ ఛాంబర్‌లో 95 నుంచి 100 శాతం స్వచ్ఛమైన ఆక్సిజన్‌ను పీలుస్తా’’అని చెప్పారు.
పీడనంతో అంతా సమతుల్యం
‘‘సరైన పీడనంతో ఆక్సిజన్ ఊపిరితిత్తుల్లోకి చేరితే అక్కడి నుంచి అన్ని శరీరభాగాలకు ఖచ్చితమైన సమయానికి ఆక్సీజన్ అందుతుంది. దీంతో అన్ని అవయవాల్లో ఆక్సిజన్ స్థాయిలు సవ్యంగా ఉంటాయి. కణజాలాల్లో ఆక్సీజన్ లభ్యత పెరిగి శరీరం ఏదైనా గాయాలు, రిపేర్లు ఉంటే ఆ పనిని త్వరగా పూర్తిచేస్తుంది. అతిసూక్ష్మ రక్తనాళాలు పాతబడిపోతే వాటి స్థానంలో కొత్త రక్తనాళాలు త్వరగా పుట్టుకొస్తాయి’’అని బ్రియాన్ చెప్పారు.
వయసు తగ్గింపు చర్యలపై స్పందించిన నెటిజన్లు
18 ఏళ్ల యువకుడిలా కనిపించేందుకు బ్రియాన్ పడుతున్న తాపత్రయాన్ని చూసి మెచ్చుకునే వాళ్లతోపాటు విమర్శించే వాళ్లూ పెరిగారు. ‘‘వాహనాలు, ఇతర
కాలుష్య ఉద్గారాలతో కలుషితమైన గాలితో పోలిస్తే ఇలాంటి ఆక్సిజన్ చాంబర్‌లో కూర్చుని కాస్తంత స్వచ్ఛమైన గాలి పీల్చడం బాగానే ఉందిగానీ ఇది ఏమంత సురక్షితం కాదు. ఆక్సిజన్ అగ్నిని మరింత రాజేస్తుంది. పూర్తిగా ఎలక్ట్రికల్, ఎల్రక్టానిక్ వైర్లమయమైన ఛాంబర్‌లో పొరపాటున ఒక్క నిప్పురవ్వ అంటుకున్నా మీకే ప్రమాదం. పైగా వేగంగా వేడెక్కే కంప్యూటర్ వాడుతున్నారు’’అని ఒక నెటిజన్ హెచ్చరించారు. హాలీవుడ్ సినిమా మ్యాడ్‌మ్యాక్స్‌లో మృత్యుంజయునిగా ఉండేందుకు తాపత్రయపడే ‘ఇమ్మోరా్టన్ జోయ్’పాత్రధారి వేషంలో బ్రియాన్ భలేగా ఉన్నాడని మరో నెటిజన్ వ్యంగ్య పోస్ట్‌చేశారు. దీనిని నటుడు కీస్ బైర్న్ ఫొటోను జతచేశారు. ‘‘చిన్నతనంలో కార్టూన్ సినిమాలో చూసిన క్యాప్సూల్ లాగా ఈయన గారి ఛాంబర్ ఉంది’’అని ఇంకొకరు వెటకారంగా పోస్ట్‌చేశారు.
– సాక్షి, నేషనల్ డెస్క్
Comments
Please login to add a commentAdd a comment