Oxygen Therapy
-
ఆక్సిజన్ ఛాంబరే అతని ఆఫీస్
వృద్ధాప్య ఛాయలను దరిచేరనీయకుండా నిత్యం యవ్వన కాంతులీనడమే ధ్యేయంగా ప్రతి ఏటా కోట్ల రూపాయలు ఖర్చుచేస్తున్న అమెరికన్ వ్యాపారవేత్త, అత్యంత సంపన్నుడు బ్రియాన్ జాన్సన్ మరో వినూత్న నిర్ణయం తీసుకున్నారు. కలుషిత గాలికి బదులు స్వచ్ఛమైన ఆక్సిజన్ ఎక్కువ మోతాదులో లభ్యమయ్యే ఏర్పాటు చేసుకున్నారు. ఈ ఆక్సిజన్ ఛాంబర్‌నే తన కార్యస్థలిగా మార్చుకున్నారు.ఆక్సిజన్ సరఫరా ట్యూబ్‌లు పెట్టుకుని డెస్క్ టాప్‌పై పనిచేస్తున్న వీడియోను తాజాగా ‘ఎక్స్’ఖాతాలో షేర్చేశారు. ‘‘హైపర్బారిక్ ఆక్సీజన్ ఛాంబర్లోకి ఆఫీస్‌కు తీసుకొచ్చా’’అని ఆయన రాసుకొచ్చారు. హైపర్బారిక్ ఆక్సిజన్ థెరపీ(హెచ్‌బీఓటీ) తీసుకుంటున్నట్లు చెప్పారు. ‘‘ఊపిరితిత్తుల్లోకి తగు పీడనంతో ఆక్సిజన్ వెళితే అంతర్గత కణజాలం ఏదైనా అతిసూక్ష్మస్థాయి రిపేర్లు ఉంటే వేగంగా చేసుకుంటుంది. హెచ్‌బీఓటీ అనేది ప్రపంచంలోనే చర్మ సంబంధ అత్యంత అధునాతన థెరపీ. ఈ థెరపీతో చర్మంలోని కణజాలం సాంద్రత 12.8 శాతం పెరుగుతుంది. సాగి, మళ్లీ యథాస్థానానికి వచ్చే ఎలాస్టిక్ గుణం 144 శాతం మెరుగుపడుతుంది. చర్మంలో అతిసూక్ష్మ రక్తనాళాల సంఖ్య 40.9 శాతం పెరుగుతుంది. సీడీ31 అనే రక్తనాళం సామర్థ్యం 84.3 శాతం మెరుగవుతుంది. కణక్షీణత 21 శాతం తగ్గుతుంది’’అని బ్రియాన్ చెప్పుకొచ్చారు. సముద్రజలాల్లో 33 అడుగుల లోతులో ఉన్నప్పుడు ఎంత పీడనం అయితే ఉంటుందో అంతే పీడనంతో గాలిని ఈ ఛాంబర్లో పీల్చే వెసులుబాటు ఉంది. ఈ ఛాంబర్లో 95 నుంచి 100 శాతం స్వచ్ఛమైన ఆక్సిజన్‌ను పీలుస్తా’’అని చెప్పారు. పీడనంతో అంతా సమతుల్యం ‘‘సరైన పీడనంతో ఆక్సిజన్ ఊపిరితిత్తుల్లోకి చేరితే అక్కడి నుంచి అన్ని శరీరభాగాలకు ఖచ్చితమైన సమయానికి ఆక్సీజన్ అందుతుంది. దీంతో అన్ని అవయవాల్లో ఆక్సిజన్ స్థాయిలు సవ్యంగా ఉంటాయి. కణజాలాల్లో ఆక్సీజన్ లభ్యత పెరిగి శరీరం ఏదైనా గాయాలు, రిపేర్లు ఉంటే ఆ పనిని త్వరగా పూర్తిచేస్తుంది. అతిసూక్ష్మ రక్తనాళాలు పాతబడిపోతే వాటి స్థానంలో కొత్త రక్తనాళాలు త్వరగా పుట్టుకొస్తాయి’’అని బ్రియాన్ చెప్పారు.వయసు తగ్గింపు చర్యలపై స్పందించిన నెటిజన్లు 18 ఏళ్ల యువకుడిలా కనిపించేందుకు బ్రియాన్ పడుతున్న తాపత్రయాన్ని చూసి మెచ్చుకునే వాళ్లతోపాటు విమర్శించే వాళ్లూ పెరిగారు. ‘‘వాహనాలు, ఇతర కాలుష్య ఉద్గారాలతో కలుషితమైన గాలితో పోలిస్తే ఇలాంటి ఆక్సిజన్ చాంబర్లో కూర్చుని కాస్తంత స్వచ్ఛమైన గాలి పీల్చడం బాగానే ఉందిగానీ ఇది ఏమంత సురక్షితం కాదు. ఆక్సిజన్ అగ్నిని మరింత రాజేస్తుంది. పూర్తిగా ఎలక్ట్రికల్, ఎల్రక్టానిక్ వైర్లమయమైన ఛాంబర్లో పొరపాటున ఒక్క నిప్పురవ్వ అంటుకున్నా మీకే ప్రమాదం. పైగా వేగంగా వేడెక్కే కంప్యూటర్ వాడుతున్నారు’’అని ఒక నెటిజన్ హెచ్చరించారు. హాలీవుడ్ సినిమా మ్యాడ్మ్యాక్స్లో మృత్యుంజయునిగా ఉండేందుకు తాపత్రయపడే ‘ఇమ్మోరా్టన్ జోయ్’పాత్రధారి వేషంలో బ్రియాన్ భలేగా ఉన్నాడని మరో నెటిజన్ వ్యంగ్య పోస్ట్‌చేశారు. దీనిని నటుడు కీస్ బైర్న్ ఫొటోను జతచేశారు. ‘‘చిన్నతనంలో కార్టూన్ సినిమాలో చూసిన క్యాప్సూల్ లాగా ఈయన గారి ఛాంబర్ ఉంది’’అని ఇంకొకరు వెటకారంగా పోస్ట్‌చేశారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
హైదరాబాద్‌లో తొలిసారిగా ఆక్సిజన్ థెరపీ ఛాంబర్
హైదరాబాద్: నగరంలోని వైద్య చికిత్సలలో ఇదో సరికొత్త విప్లవం. నగరంలో ఇన్నాళ్లుగా అందుబాటులో లేని హైపర్బేరిక్ ఆక్సిజన్ థెరపీ (హెచ్‌బీఓటీ) సాయంతో 20 మందికి రాస్ మెడికల్ ఫిట్నెస్ సెంటర్ విజయవంతంగా చికిత్స అందించింది.హెచ్‌బీఓటీ అనేది ఒక నాన్ ఇన్వేజివ్ థెరపీ. ఇందులో ఆరోగ్యం కావాలనుకునేవారు ప్రెషరైజ్డ్ ఛాంబర్లో 100% స్వచ్ఛమైన ఆక్సిజన్ పీల్చుకుంటారు. దీనివల్ల శరీరం ఆక్సిజన్‌ను మరింత మెరుగ్గా స్వీకరిస్తుంది. ఈ ప్రక్రియ సెల్యులార్ మరమ్మతును వేగవంతం చేస్తుంది, యాంటీ ఏజింగ్ ప్రయోజనాలను ప్రోత్సహిస్తుంది. నాడీ, జీవక్రియ ఆరోగ్యానికి మద్దతు ఇస్తుంది, మంటలను తగ్గిస్తుంది, రోగనిరోధక శక్తిని పెంచుతుంది.. ఇలా మొత్తం ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఈ చికిత్సను ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా వైద్య నిపుణులు, అథ్లెట్లు, వెల్నెస్ ఔత్సాహికులు విస్తృతంగా ఉపయోగిస్తున్నారు. ఇప్పుడు హైదరాబాద్ నగరంలో కూడా దాని ప్రయోజనాలు అందరికీ అందుబాటులోకి వచ్చాయి.సయ్యద్ ఖలీల్, ఫిజికల్ థెరపిస్ట్: "మేము హైదరాబాద్‌లో మొట్టమొదటి హెచ్‌బిఒటి (హైపర్బారిక్ ఆక్సిజన్ థెరపీ) ఛాంబర్‌ను పరిచయం చేయడం ఎంతో ఆనందంగా ఉంది. ఇది ‘మేక్ ఇన్ ఇండియా’ ఉత్పత్తి గా, ఆరోగ్య పునరుద్ధరణ మరియు యాంటీ-ఏజింగ్ పరిష్కారాలను విప్లవాత్మకంగా మార్చుతోంది. ఈ అత్యాధునిక చికిత్స ఆక్సిజన్ శోషణను పెంచి, మానవ శరీరపు స్వాభావిక నయం చేసే శక్తిని వేగవంతం చేస్తుంది మరియు మొత్తం ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఒత్తిడి పెంచిన ఛాంబర్లో 100% శుద్ధ ఆక్సిజన్ శ్వాసించడం ద్వారా కణాల పునరుద్ధరణ మెరుగుపడి, వాపు తగ్గి, రోగనిరోధక శక్తి పెరుగుతుంది. నాడీ సంబంధిత ఆరోగ్యం, మెటాబాలిక్ ఆరోగ్యం, మరియు జీవనశైలి పునరుద్ధరణ వంటి అనేక ప్రయోజనాలతో, హెచ్‌బిఒటి ఆధునిక ఆరోగ్య సంరక్షణలో గేమ్-చేంజర్‌గా మారింది.రుజువైన ప్రయోజనాలు- యాంటీ ఏజింగ్, రికవరీ విషయంలో సమూల మార్పులు రాస్ మెడికల్ ఫిట్నెస్ సెంటర్‌ను ప్రారంభించినప్పటి నుంచి రోగులు వేగంగా కోలుకోవడానికి, ఆరోగ్యం మెరుగుపడడానికి సేవలు అందిస్తోంది. ఇప్పటివరకు పలు విభాగాల్లో అసాధారణ ఫలితాలు సాధించింది. వాటిలో ప్రధానమైనది యాంటీ ఏజింగ్, చర్మ పునరుజ్జీవనం.వయసుతో వచ్చే సమస్యలకు సరైన పరిష్కారంహెచ్బీఓటీ చికిత్స వల్ల చర్మం మీద అసాధారణ ప్రభావాలు కనిపిస్తాయని ఇప్పటికే శాస్త్రీయంగా రుజువైంది. బయటి వాతావరణంలో మనం గాలి పీల్చుకునేటప్పుడు అందులో 20 శాతం మాత్రమే ఆక్సిజన్ ఉంటుంది. దాన్ని మనం పీల్చుకుని, మళ్లీ 15% బయటకు వదిలేస్తాం. అంటే, 5 శాతం ఆక్సిజన్ మాత్రమే మన శరీరంలోకి వెళ్తుంది. కానీ, అదే హెచ్‌బీఓటీ ఛాంబర్లో అయితే మొత్తం నూరుశాతం ఆక్సిజన్ మాత్రమే ఉంటుంది. దాన్ని మన శరీరం పూర్తిగా పీల్చుకోవడం వల్ల కొల్లాజెన్ ఉత్పత్తి ప్రేరేపితం అవుతుంది. చర్మం స్థితిస్థాపకత మెరుగుపడుతుంది. దానివల్ల శరీరం మీద ఉండే గీతలు తగ్గిపోతాయి. మన కణజాలం కూడా చాలా ఆరోగ్యంగా తయారవుతుంది. ఎముకలు, కండరాలకు వయసుతో పాటే వాటిల్లే నష్టాన్ని కూడా ఇది తగ్గిస్తుంది. దీనివల్ల గుండె కండరాలు, ఊపిరితిత్తుల పనితీరు చాలా మెరుగుపడుతుంది. గతంలో మధుమేహ బాధితులకు ఏవైనా గాయాలు అయినప్పుడు, లేదా శస్త్రచికిత్సలు చేసినప్పుడు వారి చర్మం త్వరగా కోలుకునేందుకు వీలుగా ఇలాంటి చికిత్సలు సూచించేవారు. కానీ, ఇప్పుడు సంపూర్ణ ఆరోగ్యవంతులకు కూడా ఈ చికిత్స వల్ల చర్మంతో పాటు శరీరంలోని కణాలన్నింటికీ కూడా ఎనలేని ప్రయోజనం చేకూరుతుంది. అవన్నీ ఆరోగ్యవంతం కావడంతో వయసు ప్రభావం వల్ల కనిపించే చర్మం ముడతలు, ఇతర సమస్యలన్నీ తగ్గిపోతాయి.ఇది కాక ఇంకా...దీర్ఘకాలిక అలసట, శక్తి బూస్ట్: ఈ చికిత్స ఆక్సిజన్ డెలివరీని పెంచి, అలసటను తగ్గిస్తుంది, సామర్థ్యాన్ని పెంచుతుందిడయాబెటిస్, జీవక్రియపరమైన ఆరోగ్యం: రక్త ప్రసరణకు ఇది సహాయపడుతుంది. గాయం నయం చేయడాన్ని వేగవంతం చేస్తుంది, రక్తంలో చక్కెరశాతాన్ని సరిగ్గా నిర్వహించేలా చూస్తుంది. క్యాన్సర్ చికిత్సలు: రేడియేషన్ తర్వాత కణజాల పునరుద్ధరణకు సహాయపడుతుంది. క్యాన్సర్ బాధితులకు రోగనిరోధకశక్తి మెరుగుపడేందుకు ఉపయోగపడుతుంది. నాడీ సమస్యలు: స్ట్రోక్, మెదడుకు అయ్యే గాయాలు, రోగులలో న్యూరోడీజెనరేటివ్ సమస్యలకు, జ్ఞాపకశక్తి పునరుద్ధరణకు సహాయపడుతుంది. ఒత్తిడి, జీవనశైలి పునరుద్ధరణ: ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గిస్తుంది, మానసిక స్పష్టతను పెంచుతుంది, విశ్రాంతిని ప్రోత్సహిస్తుందిఆధునిక వైద్యం, చికిత్సలలో గేమ్ ఛేంజర్అసలు తొలినాళ్లలో దీన్ని కనుక్కున్నప్పుడు.. డ్రైవర్లలో డీకంప్రెషన్ సిక్నెస్కు చికిత్స చేయడానికి ఉపయోగించేవారు. కానీ తర్వాత ఇప్పుడు దానివల్ల అనేక ప్రయోజనాలు కలుగుతున్నాయి. యాంటీ ఏజింగ్, జీవితకాలాన్ని పెంచడం, క్యాన్సర్ చికిత్సల వల్ల కలిగే దుష్ప్రభావాలు, ముఖ్యంగా రేడియేషన్ వల్ల కలిగే నష్టాల నుంచి కోలుకునేలా చేయడం, జ్ఞాపకశక్తిని మెరుగుపరచడం, ఒత్తిడి, నిద్రలేమి లాంటి జీవనశైలి సమస్యలను పరిష్కరించడం, అథ్లెట్ల సామర్థ్యాన్ని పెంచి, కండరాలు కోలుకునేలా చేయడం లాంటి అనేక ప్రయోజనాలు దీంతో సిద్ధిస్తున్నాయి.రాస్ మెడికల్ ఫిట్నెస్ సెంటర్ గురించి: రాస్ మెడికల్ ఫిట్నెస్ సెంటర్ అనేది హైదరాబాద్ నగరంలోని ఒక ప్రధాన వెల్నెస్, హెల్త్‌కేర్ సంస్థ. వ్యాధుల నుంచి కోలుకుఓవడం, సమగ్ర ఆరోగ్యం, పనితీరు విషయాలకు సంబంధించి శాస్త్రీయ చికిత్సలను అత్యాధునిక విధానాల్లో అందించేందుకు ఇది అంకితమైంది. సంపూర్ణ వైద్యం, వినూత్న చికిత్సలపై దృష్టి సారించిన రాస్ సంస్థ.. హెచ్‌బీఓటీ, ఇతర పునరుత్పత్తి చికిత్సలతో చికిత్సల భవిష్యత్తును పునర్నిర్వచిస్తోంది -
యవ్వనానికి ఆక్సిజన్ గది
అమృతం తాగితే జరామరణాలు ఉండవని అంటారు. అయితే, కోల్పోయిన యవ్వనాన్ని తిరిగి పొందటానికి అమృతమే తాగాల్సిన పనిలేదు. ఈ గదిలో రోజుకు ఓ గంట పడుకుంటే చాలు. కేవలం సంపన్నులకు మాత్రమే అందుబాటులో ఉండే ‘హెచ్‌బీఓటీ (హైపర్బ్యారిక్ ఆక్సిజన్ థెరపీ)’ నేడు తక్కువ ధరల్లోనే దొరకనుంది. దీనికోసం అమెరికాకు చెందిన హెచ్ఓబీఓ2 అనే సంస్థ ప్రత్యేకమైన ఓ మెటల్ చాంబర్‌ను రూపొందించింది. సాధారణంగా మన వాతావరణంలో 21 శాతం ఆక్సిజన్, 79 శాతం నైట్రోజన్, ఇతర వాయువులు ఉంటాయి. అదే ఈ చాంబర్లో 95 శాతం స్వచ్ఛమైన ఆక్సిజన్ అందుతుంది. ఇక ఇందులోని ప్రత్యేకమైన కొల్లాజెన్ ఫైబర్స్, లైటింగ్ సిస్టమ్ ముడతలను తొలగించి, చర్మాన్ని కాంతిమంతగానూ, మృదువుగా చేస్తుంది. కావాల్సిన వారు వీరి అధికారిక వెబ్సైట్ నుంచి కొనుగోలు చేయవచ్చు. అద్దెకు కూడా తీసుకోవచ్చు. నెలకు రూ.80 వేల నుంచి, రూ. లక్ష తీసుకుంటారు. ఒక్క రోజుకు కూడా అద్దెకు ఇస్తారు. అయితే, ప్రస్తుతం విదేశాల్లో మాత్రమే అందుబాటులో ఉంది. -
ఉన్నచోటనే ఆక్సిజన్! డీఆర్డీవో వినూత్న పరికరం
సాక్షి, హైదరాబాద్: కోవిడ్-19 వ్యాధి ముదిరి ఆసుపత్రి పాలు కావద్దనుకుంటే రక్తంలోని ఆక్సిజన్ మోతాదు 94 శాతానికి తగ్గకుండా చూసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. అయితే పల్స్ ఆక్సీమీటర్ పరికరంతో రక్తంలోని ఆక్సిజన్ ఎంతుందో తెలుసుకోవచ్చు కానీ.. తక్కువ ఉంటే అప్పటికప్పుడు ఆక్సిజన్ కావాలంటే మాత్రం ఆసుపత్రికి పరుగెత్తాల్సిందే. అయితే డీఆర్డీవో పుణ్యమా అని ఇప్పుడు ఈ సమస్యకు పరిష్కారం దొరకనుంది. సరిహద్దులోని పర్వత ప్రాంతాల్లో గస్తీ కాసే సైనికులకు ఆక్సిజన్ అందించేందుకు డీఆర్డీవో అభివృద్ధి చేసిన ఓ పరికరం ఇప్పుడు కరోనా బాధితులకు వరంగా మారనుంది. బెంగళూరులోని డీఆర్డీవోకు చెందిన ‘ది డిఫెన్స్ బయో ఇంజినీరింగ్ అండ్ ఎలక్ట్రో మెడికల్ లేబొరేటరీ’తయరుచేసిన ‘ఎస్పీవో-2 సప్లిమెంటల్ ఆక్సిజన్ డెలివరీ సిస్టం’లో చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. ఆక్సిజన్ సిలిండర్‌కు అనుసంధానమై ఉండే ఈ పరికరం రక్తంలోని ఆక్సిజన్ నిర్ణీత మోతాదు కంటే తక్కువైన వెంటనే తనంతట తానే ఆక్సిజన్ సరఫరా మొదలుపెడుతుంది. ముంజేతికి కట్టుకునే ఓ పరికరం ద్వారా ఎప్పటికప్పుడు ఎస్పీఓ2ను పరిశీలిస్తూ హెచ్చుతగ్గులకు అనుగుణంగా ఆక్సిజన్ సరఫరా చేస్తుంటుంది. దీంతో వైద్యసిబ్బందిపై ఒత్తిడి తీవ్రంగా తగ్గుతుంది. ఒక లీటర్ నుంచి మొదలుకొని 1,500 లీటర్ల ఆక్సిజన్‌ను సరఫరా చేయగల సామర్థ్యం ఉంటుంది. కోవిడ్ రోగులకు ఇళ్లలోనే చికిత్స అందించే సందర్భాల్లో ఈ యంత్రం ఉపయుక్తంగా ఉంటుందని డీర్డీవో ఓ ప్రకటనలో తెలిపింది. రోగికి అవసరమైనంత ఆక్సిజన్ మాత్రమే ఉపయోగిస్తున్న కారణంగా వృథా తగ్గుతుందని తెలిపింది. డీఆర్డీవో అభివృద్ధి చేసిన ఈ యంత్రాన్ని వాణిజ్య స్థాయిలో ఉత్పత్తి చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. -
ఆక్సిజన్ థెరపీతో కోలుకున్న 396 మంది
భోపాల్ : ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ కరాళ నృత్యం చేస్తుంది. భారత్‌లోనూ కోవిడ్ కేసుల సంఖ్య 60 వేలకు చేరువలో ఉంది. ఈ మహమ్మారికి మందులేని కారణంగా రోజోరోజుకు పెరుగుతున్న కరోనా కేసులతో పరిస్థితి ఆందోళనకరంగా మారింది. నేపథ్యంలో మధ్యప్రదేశ్‌లోని చిరాయి ఆసుపత్రిలో ఆక్సిజన్ చికిత్స ద్వారా 396 మంది కరోనా రోగులు కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. శుక్రవారం ఒక్కరోజే 18 మంది కోలుకున్నారని చిరాయు హాస్పిటల్ డైరెక్టర్ అజయ్ గొయెంకా ప్రకటించారు. ఆక్సిజన్ థెరపీ ద్వారా సత్ఫలితాలు వస్తున్నాయని తెలిపారు. (మందు కొంటే ‘మార్క్’ పడాల్సిందే! ) డిశ్చార్జ్ అయిన తర్వాత 14 రోజుల పాటు ఇంట్లోనే స్వీయ నిర్భందంలోకి వెళ్లాలని సూచించినట్లు పేర్కొన్నారు. అంతేకాకుండా సంపూర్ణ ఆరోగ్యవంతులుగా అయ్యాక తమ ఫ్లాస్మాను దానం చేయాల్సిందిగా కోరినట్లు వెల్లడించారు. అంతేకాకుండా భోపాల్ ఎయిమ్స్ నుంచి 2 కరోనా రోగులు కూడా ఆక్సిజన్ థెరపీ అందించడం వల్ల కోలుకున్నారని ఎయిమ్స్ డైరెక్టర్ శర్మాన్ తెలిపారు. ఆక్సిజన్ థెరపీ కరోనా రోగులపై మంచి ప్రభావం చూపుతుందని, దీని ద్వారా వారు త్వరగా కోలుకోగలుగుతున్నారని వెల్లడించారు. ఇక మధ్యప్రదేశ్‌లో 3341 కరోనా కేసులు నమోదవగా, వారిలో 1300కి పైగా కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. ప్రపంచ వ్యాప్తంగా 40 లక్షల మందికి పైగా కోవిడ్ సోకగా, భారత్‌లో కరోనా కేసుల సంఖ్య 60 వేలకు చేరుకుంది. -
సీవోపీడీకి ఆక్సిజన్ థెరపీ మంచిదేనా?
పల్మునాలజీ కౌన్సెలింగ్ నా వయసు 43 ఏళ్లు. నేను కొద్దికాలంగా సీవోపీడీ (క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మునరీ డిసీజ్)తో బాధపడుతున్నాను. దీనికి ఆక్సిజన్ థెరపీతో మంచి ఉపశమనం ఉంటుందని చదివాను. దీని గురించి వివరించండి. - శ్రీనివాసరావు, మంచిర్యాల మీరు చెప్పింది నిజమే. క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మునరీ డిసీజ్ (సీవోపీడీ)తో బాధపడుతూ ఊపిరితిత్తుల సామర్థ్యం తగ్గినవారికి ఆక్సిజన్ థెరపీతో మంచి ప్రయోజనం ఉంటుంది. మీ శ్వాస తీసుకోవడంలో అవరోధాలు ఉన్నాయి కాబట్టి, మీరు హాయిగా ఫీలయ్యేందుకు, మీ దైనందిన వ్యవహారాలకు అవసరమైనంతగా మీ శరీరానికి ఆక్సిజన్ అవసరం. మీరు పీల్చుకోగలిగే ఆక్సిజన్ తక్కువ కాబట్టి ఈ అదనపు ఆక్సిజన్ వల్ల మీ ఊపిరితిత్తుల కార్యకలాపాలు మెరుగుపడతాయి. దాంతో మీరు పనిచేసే సామర్థ్యం, చురుగ్గా వ్యవహరించగల శక్తి మీకు చేకూరతాయి. ఆక్సిజన్ థెరపీ వల్ల మీ నిద్ర నాణ్యత కూడా గణనీయంగా మెరుగుపడటంతో పాటు మీ మానసికసామర్థ్యం కూడా పెరుగుతుంది. ఇలా దీర్ఘకాలం పాటు ఆక్సిజన్ చికిత్స చేయడం మరో విధంగా కూడా ఉపయోగపడుతుందని అధ్యయనాలు నిరూపిస్తున్నాయి. అంటే ఆక్సిజన్ చికిత్స సీవోపీడీ కండిషన్‌ను మెరుగుపరచడంతో పాటు హార్ట్‌ఫెయిల్యూర్‌ను నివారిస్తుందని అధ్యయనాలు పేర్కొంటున్నాయి. ఆక్సిజన్ థెరపీ తీసుకోవడం మూడు రకాలుగా జరుగుతుంది. అవి... 1) కంప్రెస్డ్ ఆక్సిజన్‌ను తీసుకోవడం లేదా ద్రవరూపంలో ఉన్న ఆక్సిజన్‌ను కొలుగోలు చేసి ఈ చికిత్సను ఇంటివద్దనే తీసుకోవచ్చు. ఈ ఆక్సిజన్‌ను స్టీల్ లేదా అల్యూమినియమ్ ట్యాంకుల్లో భద్రపరుస్తారు. సైజ్‌లో పెద్దవిగా ఉండేవాటిని ఇంటిదగ్గర వాడుకోవచ్చు. 2) మీతో పట్టుకెళ్లగలిగేవి కూడా లభిస్తాయి. వాటిని మీరు బయటకు వెళ్లినప్పుడు, ప్రయాణాలు చేస్తున్నప్పుడు వాడవచ్చు. ద్రవరూపంలో ఉన్న ఆక్సిజన్‌ను నిల్వ చేయడానికి చిన్న కంటెయినర్లు సరిపోతాయి. పైగా ఒకచోట నుంచి మరోచోటికి తేలిగ్గా తరలించవచ్చు. అయితే వీటిని చాలాకాలం పాటు నిల్వ చేసి ఉంచకూడదు. ఎందుకంటే అందులోని ఆక్సిజన్ ఆవిరైపోతుంది. 3) ఆక్సిజన్ థెరపీ తీసుకునేవారిలో చాలామంది ఒక ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ అనే మెషిన్‌ను వాడతారు. ఇది వాతావరణంలో ఉన్న ఆక్సిజన్‌నే సంగ్రహించి మీకు అందిస్తుంది. ఇది చవకైనదీ, పైగా మళ్లీ భర్తీ చేయాల్సిన అవసరం ఉండదు కాబట్టి ఉపయోగించడమూ తేలికే. అయితే ఆ ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు పెద్ద సైజులో ఉంటాయి. పైగా ఎక్కువ శబ్దం చేస్తుంటాయి. పైగా ఇది నడవాలంటే విద్యుత్ సరఫరా కూడా అవసరం. దాంతో విద్యుత్ బిల్లు భారమూ అదనం. దీని నుంచి వేడి కూడా వెలువడుతుంది కాబట్టి వేసవిలో దీన్ని ఉపయోగించడం ఇబ్బందికరం. ఒకవేళ కరెంటుపోతే మెషిన్ ఆగిపోకుండా ప్రత్యామ్నాయం అవసరం. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని, మీ డాక్టర్‌ను సంప్రదించి మీకు అన్నివిధాలా సరిపోయే ప్రత్నామ్యాయాన్ని ఎంచుకోండి. డాక్టర్ వి.వి.రమణ ప్రసాద్ కన్సల్టెంట్ పల్మునాలజిస్ట్, కిమ్స్ హాస్పిటల్స్, సికింద్రాబాద్