ప్రాణవాయువు తగ్గిపోతోంది...
భూ వాతావరణంలోని ఆక్సిజన్ మోతాదు తగ్గిపోతోంది. 8 లక్షల సంవత్సరాల్లో దాదాపు 0.7 శాతం వరకు తగ్గిపోయిందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ప్రిన్స్‌టన్ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్త డేనియల్ స్టోల్‌పర్, మరికొంత మంది శాస్త్రవేత్తలు కలసి అంటార్కిటికా, గ్రీన్‌లాండ్‌లోని అతిపురాతనమైన మంచు ఖండాల్లో చిక్కుకుపోయిన గాలి బుడగలను పరిశీలించి ఈ అంచనాకు వచ్చారు. అయితే దీనివల్ల మనకొచ్చిన నష్టమేమీ లేదని చెబుతున్నారు.
సముద్ర మట్టం కంటే వంద మీటర్ల ఎత్తుకు వెళ్లినా ఆక్సిజన్ పరిమాణంలో ఈ మేర తగ్గుదల కనిపిస్తుందని పేర్కొన్నారు. అయితే ఆక్సిజన్ తగ్గుదలకు గల కారణాలను మాత్రం విశ్లేషించలేకపోయారు. భూమి పై పొరలు తొలిగిపోతుండటం వల్ల రాళ్లు పైకి తేలుతున్నాయని, ఈ రాళ్లు వాతావరణంలోని ఆక్సిజన్‌ను పీల్చుకునే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. భూమ్మీద చల్లటి వాతావరణం ఎక్కువగా ఉన్న సమయంలో నీటిలో ఎక్కువ మోతాదులో వాయువులు ఉండే అవకాశముందని మరికొందరు చెబుతున్నారు.