సమావేశంలో మంత్రులు బొత్స సత్యనారాయణ, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, సీదిరి అప్పలరాజు
సాక్షి, అమరావతి: మార్చి నెలాఖరులోగా రాష్ట్రంలో 4 వేల ఫిష్ అవుట్‌లెట్ల ఏర్పాటు పూర్తి చేయాలని ఆక్వా మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్స సత్యనారాయణ, డాక్టర్ సీదిరి అప్పలరాజు అధికారులను ఆదేశించారు. సోమవారం సచివాలయంలో జరిగిన ఆక్వా సాధికారత కమిటీ సమావేశంలో ఆక్వా రంగం అభివృద్ధికి తీసుకున్న నిర్ణయాలు, వాటి అమలు, భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు.
ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్ ఆక్వా రంగానికి అధిక ప్రాధాన్యతనిస్తున్నారని చెప్పారు. సీఎం ఆదేశాల మేరకు ఆక్వా రైతులకు అండగా నిలవడం, సీడ్, ఫీడ్ రేట్లను శాస్త్రీయంగా నిర్ణయించడం, ధరల స్థిరీకరణ వంటి అంశాల్లో కమిటీ తీసుకున్న నిర్ణయాలు సత్ఫలితాలను ఇస్తున్నాయన్నారు.
రాష్ట్రంలో ఉత్పత్తయ్యే వాటిలో స్థానిక వినియోగం కనీసం 30 శాతం పెంచేలా ప్రజల్లో అవగాహన కల్పించాలన్నారు. ఒడిశాలో ఆక్వా ఉత్పత్తులు స్థానిక అవసరాలకు సరిపోతున్నాయని, అంతర్జాతీయ మార్కెట్‌పై ఆధారపడాల్సిన పరిస్థితి లేదని తెలిపారు. దీనివల్ల మార్కెట్ ఒడిదొడుకుల సమయంలో రైతులు నష్టపోకుండా ప్రత్యామ్నాయ మార్కెట్ అవకాశాలు మెరుగు పడతాయన్నారు. మన రాష్ట్రంలో కూడా స్థానిక వినియోగం పెంచాలని అన్నారు.
ఇందులో భాగంగా ఏర్పాటు చేస్తున్న ఫిష్ అవుట్‌లెట్లకు ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన (పీఎంఎంఎస్‌వై) కింద సబ్సిడీతో కూడిన రుణాలిచ్చేందుకు కేంద్రం అంగీకరించిందన్నారు. పొరుగు రాష్ట్రాల్లో కూడా ఆక్వా హబ్‌ల ద్వారా మన ఉత్పత్తులు విక్రయించాలని చెప్పారు. రాష్ట్రంతో పాటు దేశవ్యాప్తంగా అన్ని ప్రముఖ నగరాల్లో ఆక్వా ఫుడ్ ఫెస్టివల్స్ నిర్వహించాలన్నారు.
నియంత్రణలో ఫీడ్, సీడ్ రేట్లు
సీడ్ తయారీదారులు, ప్రాసెసింగ్ యూనిట్లతో ఎప్పటికప్పుడు జరుపుతున్న చర్చల ఫలితంగా సీడ్, ఫీడ్ ధరలు నియంత్రణలోకి వచ్చాయని, ఆక్వా ఉత్పత్తుల ధరలు పతనం కాకుండా అడ్డుకట్ట వేయగలిగామని మంత్రులు పేర్కొన్నారు. రైతుల్లోనూ అంతర్జాతీయ మార్కెట్లు, ధరలపై అవగాహన కల్పించి, హేతుబద్ధమైన విస్తీర్ణంలోనే సాగు చేసేలా చూడాలన్నారు. డిమాండ్, సప్లైపై అవగాహన లేకపోతే అంతిమంగా రైతులే నష్టపోతారన్నారు. టోల్ ఫ్రీ నెంబర్ ద్వారా వచ్చే ప్రతి ఫిర్యాదునూ త్వరితగతిన పరిష్కరించాలని చెప్పారు.
వచ్చే నెలాఖరుకు జోనింగ్ సర్వే పూర్తి
ఆక్వా జోన్ పరిధిలో 10 ఎకరాల లోపు సాగు చేసే వారికి ప్రభుత్వం విద్యుత్ సబ్సిడీని అందిస్తోందని మంత్రులు చెప్పారు. ఇప్పటికే 26 వేల కనెక్షన్లకు ప్రభుత్వం విద్యుత్ సబ్సిడీ ఇస్తోందని తెలిపారు. ఆక్వాజోన్, నాన్ ఆక్వా జోన్ పరిధిలో సాగయ్యే విస్తీర్ణాన్ని గుర్తించేందుకు నిర్వహిస్తున్న సర్వే వచ్చే నెలాఖరుకి పూర్తవుతుందన్నారు. సర్వేలో ఆధార్‌తో రైతుల వివరాలు అనుసంధానం చేస్తున్నారని, దీనివల్ల అర్హులైన రైతులు ఎంతమందో కచ్చితంగా తేలుతుందని తెలిపారు.
అర్హత ఉన్న ప్రతి ఆక్వా రైతుకు విద్యుత్ సబ్సిడీ అందించాలని సీఎం వైఎస్ జగన్ నిర్దేశించారని, ఆ మేరకు అధికారులు చర్యలు తీసుకోవాలని మంత్రులు చెప్పారు. సమావేశంలో అప్సడా వైస్ చైర్మన్ వడ్డి రఘురాం, మత్స్య శాఖ కమిషనర్ కన్నబాబు, డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ప్రవీణ్ కుమార్, స్పెషల్ సీఎస్ (ఇంధనశాఖ) కె.విజయానంద్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment