సాక్షి, అమరావతి: సముద్ర ఆధారిత వ్యాపారంలో (బ్లూ ఎకానమీ) ఆంధ్రప్రదేశ్‌ను దేశంలోనే అగ్రగామిగా నిలబెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం స్పష్టమైన కార్యాచరణతో ముందుకెళ్తోంది. ఇందులో భాగంగా కొత్తగా నాలుగు పోర్టుల నిర్మాణాన్ని చేపట్టి మూడు, నాలుగేళ్లలో పూర్తిచేసేలా అడుగులు వేస్తోంది. అలాగే, ఎనిమిది ఆధునిక ఫిషింగ్ హార్బర్ల ఏర్పాటు ద్వారా మత్స్యరంగంలో అనూహ్య మార్పులు తీసుకురావడానికి రంగం సిద్ధమైంది.
ఎగుమతులు,దిగుమతులు మూడింతలు పెంపు
దేశంలో గుజరాత్ తర్వాత 974 కిలోమీటర్ల అత్యధిక తీర ప్రాంతం ఉన్న రాష్ట్రం మనది. ప్రస్తుతం ఒక మేజర్ పోర్టు, 16 మైనర్ పోర్టులు ఉన్నాయి. వీటిద్వారా (విశాఖ మేజర్ పోర్టును మినహాయించి) ఏటా 103 మిలియన్ టన్నుల ఎగుమతులు, దిగుమతులు జరుగుతున్నాయి. వీటిని మూడింతలు పెంచేలా పోర్టుల ఏర్పాటుకు మారిటైమ్ బోర్డు ప్రణాళిక రూపొందించింది. అలాగే..
► 2024 సంవత్సరానికల్లా భావనపాడు, మచిలీపట్నం, రామాయపట్నం, కాకినాడ సెజ్ గేట్‌వే పోర్టుల నిర్మాణం పూర్తిచేసి కార్గో ఎగుమతులు ప్రారంభించేందుకు కసరత్తు చేస్తోంది.
► సీఎం వైఎస్ జగన్ ఇప్పటికే వీటి అభివృద్ధిపై ప్రత్యేక దృష్టిపెట్టారు. ఈ నాలుగు పోర్టుల నిర్మాణానికి ఈ నెలలోనే టెండర్ల ప్రక్రియ ప్రారంభం కానుంది.
► రూ.3,800 కోట్ల అంచనాతో రామాయపట్నం, రూ.4 వేల కోట్ల అంచనాతో మచిలీపట్నం పోర్టుల సవివర నివేదికలు (డీపీఆర్) ఇప్పటికే తయారయ్యాయి.
► రూ.3,200 కోట్ల అంచనాతో భావనపాడు పోర్టు సవివర నివేదిక ఈ నెల పదో తేదీకల్లా సిద్ధం కానుంది.
► కాకినాడ సెజ్ గేట్‌వే పోర్టును ప్రైవేటుగా అభివృద్ధి చేసేందుకు ఇప్పటికే జీఎంఆర్‌కు అప్పగించారు. త్వరలో అది ఫైనాన్షియల్ క్లోజర్‌కు రానుంది.
► ఈ నాలుగింటినీ చేపట్టేందుకు ఈ నెలలోనే పీఎంసీ (ప్రాజెక్టు మేనేజ్‌మెంట్ కన్సల్టెంట్)ని నియమించనున్నారు.
► నెలరోజుల్లో ఈ నాలుగు పోర్టుల నిర్మాణానికి టెండర్ల ప్రక్రియ మొదలుపెట్టనున్నారు.
► ఇక భావనపాడు, రామాయపట్నం పోర్టులను ప్రభుత్వ ఆధ్వర్యంలో ఈపీసీ విధానంలో చేపట్టనున్నారు.
► మచిలీపట్నం పోర్టును పీపీపీ విధానంలో చేపడతారు.
► ఈ నాలుగు పోర్టుల ద్వారా సంవత్సరానికి దాదాపు 400 మిలియన్ టన్నుల కార్గో ఎగుమతులు, దిగుమతులు చేసే అవకాశం ఉంది.
ఫిషింగ్ హార్బర్లతో అనూహ్య మార్పు
మత్స్యకారుల అవసరాలు తీర్చేలా రాష్ట్రంలోని ఎనిమిది తీర ప్రాంత జిల్లాల్లో ఫిషింగ్ హార్బర్లు ఏర్పాటు చేయాలని సీఎం వైఎస్ జగన్ నిర్ణయించారు. ఇందులో భాగంగా రాబోయే రెండున్నరేళ్లలో రాష్ట్రంలో ఎనిమిది ఆధునిక ఫిషింగ్ హార్బర్లు రాబోతున్నాయి. అవి..
► శ్రీకాకుళం జిల్లా బుడగట్లపాలెం, విశాఖ జిల్లా పూడిమడక, తూర్పుగోదావరి జిల్లా ఉప్పాడ, పశ్చిమ గోదావరి జిల్లా బియ్యపుతిప్ప, కృష్ణాజిల్లా మచిలీపట్నం రెండో దశ, గుంటూరు జిల్లా నిజాంపట్నం రెండో దశ, ప్రకాశం జిల్లా కొత్తపట్నం, నెల్లూరు జిల్లా జువ్వలదిన్నెలో వీటిని ఏర్పాటుచేస్తున్నారు. ఈ నెలలో వీటికి టెండర్లు పిలవనున్నారు.
► సాధారణ హార్బర్లలా కాకుండా మత్స్యకారులకు ఉపయోగపడేలా.. మార్కెటింగ్, నిల్వకు ఇబ్బంది లేకుండా అందులోనే ఫిష్ ప్రాసెసింగ్ యూనిట్, కోల్డ్ స్టోరేజి ఏర్పాటుచేస్తున్నారు.
► ఒక్కో హార్బర్ నిర్మాణానికి రూ.250కోట్ల నుంచి రూ.300 కోట్లు ఖర్చవుతుంది.
► కేంద్ర ప్రభుత్వం, నాబార్డు, ఇతర బ్యాంకుల ద్వారా వీటికి అవసరమైన నిధులు సమకూర్చుకునేలా ప్రణాళిక రూపొందించారు.
► ఈ ఫిషింగ్ హార్బర్లలోనే ఒకటి, రెండు బెర్తులు ఏర్పాటుచేయడానికి సాధ్యాసాధ్యాలను మారిటైమ్ బోర్డు పరిశీలిస్తోంది. కోస్ట్‌గార్డ్ ఈ తరహా బెర్తులను తీసుకుని పనిచేసేందుకు ఆసక్తి చూపుతోంది.
► రాబోయే రోజుల్లో కోస్టల్ షిప్పింగ్‌కు ఎక్కువ ప్రాధాన్యం పెరిగే అవకాశాలున్న నేపథ్యంలో ఈ తరహా ఆలోచన చేస్తున్నారు.
► జువ్వలదిన్నె ఇందుకు అనువుగా ఉందని ఇప్పటికే నిర్ధారించారు. మిగిలిన హార్బర్లలోనూ ఇలాంటి అవకాశాలను పరిశీలిస్తున్నారు.
2024కి నాలుగు పోర్టులు పూర్తి చేస్తాం
నాలుగు పోర్టులను 2024 నాటికి పూర్తిచేసి కార్గో ఎగుమతులు, దిగుమతులు చేసేలా కార్యాచరణ రూపొందించాం. ఎనిమిది ఆధునిక హార్బర్లను కూడా చేపట్టనున్నాం. ఈ నెలలోనే వీటికి టెండర్ల ప్రక్రియ మొదలవుతుంది. పోర్టులు, హార్బర్ల విషయంలో సీఎం వైఎస్ జగన్ చాలా స్పష్టమైన దిశానిర్దేశం చేశారు. అందుకనుగుణంగా ముందుకెళ్తున్నాం.
– రామకృష్ణారెడ్డి, మారిటైమ్ బోర్డు సీఈఓ ఎన్‌పీ
Comments
Please login to add a commentAdd a comment