సాక్షి, హైదరాబాద్: చేపల వినియోగంలో గ్రామాలే అగ్రస్థానంలో ఉన్నాయి. పట్టణ ప్రజల కంటే రెట్టింపుస్థాయిలో పల్లె ప్రజలు వినియోగిస్తున్నారు. ఈ విషయాన్ని రాష్ట్ర మత్స్యశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన బేస్‌లైన్ సర్వే తేల్చింది. చేపలు తినే జనాభాను లెక్కలోకి తీసుకుంటే రాష్ట్రంలో తలసరి వినియోగం 7.88 కిలోలుంది. అందులో గ్రామీణ ప్రాంతాల ప్రజలు తలసరి 9.66 కిలోలు తింటుండగా, పట్టణ ప్రజలు 4.88 కిలోలే తింటున్నారని వెల్లడైంది. భారత వైద్య పరిశోధన మండలి(ఐసీఎంఆర్) సిఫారసుల ప్రకారం తలసరి చేపల వినియోగం 12 కిలోలు ఉండాలి. దాని ప్రకారం చూస్తే రాష్ట్రంలో మాత్రం చేపల వినియోగం తక్కువగా ఉంది. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన అనేక మత్స్య పథకాల కారణంగా ఇప్పుడిప్పుడే పరిస్థితి మెరుగవుతోంది. చేపల ఉత్పత్తి పెరుగుదలలో మార్పు వస్తుందని మత్స్యశాఖ వర్గాలు చెబుతున్నాయి. పట్టణ ప్రజలకు చేపలు సరిపడా అందుబాటులో ఉండటంలేదన్న చర్చ జరుగుతోంది. ఫలితంగా చేపల వినియోగం సగమే ఉంది.
మూడేళ్లలో పెరిగిన చేపల ఉత్పత్తి...
ప్రభుత్వం చేపట్టిన పథకాలతో రాష్ట్రంలో చేపల ఉత్పత్తి పెరుగుతోంది. ముఖ్యంగా ఉచిత చేపపిల్లల పంపిణీ వల్ల పరిస్థితి మెరుగు పడింది. రాష్ట్ర ప్రభుత్వం 2017– 18లో 11,068 జలాశయాలు, చెరువులు, ఇతర జలవనరుల్లో 51.01 కోట్ల చేపపిల్ల లను ఉచితంగా విడుదల చేసింది. 2018–19లో 10,786 జలవనరుల్లో 49.15 కోట్ల చేపపిల్లలను విడుదల చేసింది. మత్స్యకారులకు సబ్సిడీపై పరికరాలు అందజేసింది. ఫలితంగా రాష్ట్రంలో చేపల ఉత్పత్తి పెరిగిందని మత్స్యశాఖ డిప్యూటీ డైరెక్టర్ శ్రీనివాస రావు తెలిపారు. 2016–17లో 1.93 లక్షల టన్నుల చేపల ఉత్పత్తి ఉండగా 2017– 18లో 2.62 లక్షల టన్నులకు పెరిగింది. 2018–19లో 2.40 లక్షల టన్నుల ఉత్పత్తి జరి గింది. వర్షాభావ పరిస్థితుల కారణంగా ఒక్కోసారి కొన్నిచోట్ల చేపపిల్లలను కూడా విడుదల చేయలేని పరిస్థితులుండటంతో ఈ ఏడాది ఉత్పత్తి కాస్తంత తగ్గిందని అధికారులు విశ్లేషిస్తున్నారు.
రాష్ట్రంలో చేపలు తినేవారు 90%
తెలంగాణ ప్రజలు మాంసప్రియులు. జాతీయ స్థాయిలో 71% మంది మాంసప్రియులైతే, తెలంగాణలోనే 98.7% మాంసం, చేపలు తింటారు. పశ్చిమ బెంగాల్‌లో 98.55 %, ఏపీలో 98.25%, ఒడిషా 97.35%, కేరళ 97% ప్రజలు మాంసం, చేపలు తింటారు. రాష్ట్రంలో చేపలు తినేవారు 90% మంది ఉంటారని మత్స్యశాఖ నిర్ధారించింది. జాతీయ తలసరి ప్రకారం చూస్తే రాష్ట్రంలో ఇంకా 30% అదనంగా చేపలు అందుబాటులోకి రావాల్సి ఉంది.
బేస్‌లైన్ సిఫారసులు..
- యువతను ఈ రంగంవైపు తీసుకొని రావాలి. వారిని ఫోకస్డ్ యాక్టివిటీ గ్రూప్‌లుగా తయారు చేయాలి.
- చేపల ఉత్పత్తిపై మత్స్యకారుల్లో శిక్షణ కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా అవగాహన కల్పించాలి.
- చేపల రంగంలో వ్యాపార అవకాశాలు కల్పించాలి. చేపల ఉత్పత్తి మొదలు మార్కెటింగ్, రిటైల్ వరకు ఉన్న అవకాశాలపై అవగాహన, శిక్షణ ఇవ్వాలి.
- రిజర్వాయర్లలో కేజ్ కల్చర్ ద్వారా చేపల ఉత్పత్తిపై యువతకు శిక్షణ ఇవ్వాలి. వివిధ పథకాలను రూపొం దించాలి. మార్కెట్ లింకేజీ కల్పించాలి. చేప అనుబంధ ఉత్పత్తులు తయారు చేయాలి.
- నేరుగా వినియోగదారుల ఇష్టాయిష్టాలను బట్టి చేప అనుబంధ ఉత్పత్తుల తయారీలో నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తీసుకొని రావాలి.
- నాబార్డు సాయంతో ఆర్థిక సాయం అందించాలి.
- పెట్టుబడులు పెట్టేలా ‘ప్రైవేటు’ను ప్రోత్సహించాలి.
Comments
Please login to add a commentAdd a comment