మాస్కులు... చేతుల పరిశుభ్రత... తదితర జాగ్రత్తలు మళ్ళీ బలంగా వినిపిస్తున్నాయి. హ్యూమన్ మెటా న్యూమోవైరస్ (హెచ్‌ఎంపీవీ) వల్ల చైనాలో వ్యాధిగ్రస్థుల సంఖ్య పెరుగుతున్నట్టు వార్తలు వస్తున్న నేపథ్యంలో, మన దేశంలోనూ కేసులు కొన్ని బయటపడడంతో జనం ఉలిక్కిపడుతున్నారు. ఒక్కసారిగా పాత కరోనా జ్ఞాపకాలు ముప్పిరిగొంటున్నాయి. చైనా వార్తలతో సోమవారం బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ (బీఎస్‌ఈ) సెన్సెక్స్ 1.5 శాతం పైగా పడిపోవడం గగ్గోలు రేపుతోంది.
ఉత్తరాన చైనాకు సమీపంలో ఉన్నందున ప్రజా సంబంధాలు, ఆర్థిక సంబంధాల రీత్యా స్వైన్‌ఫ్లూ, ఏవియన్ ఫ్లూ, కోవిడ్‌ల లానే ఇది కూడా వ్యాపించే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ పరిస్థితుల్లో శ్వాసకోశ అనారోగ్యాలపై ఓ కన్నేసి ఉంచాలనీ, వేయికళ్ళతో పరిస్థితిని కనిపెట్టాలనీ, ఒకరి నుంచి మరొకరికి హెచ్‌ఎంపీవీ వ్యాప్తి చెందకుండా నిరోధించేందుకు ప్రజల్లో చైతన్యం తేవాలనీ రాష్ట్రాలకు కేంద్ర సర్కార్ తాజాగా సూచనలు జారీ చేయడం గమనార్హం.
హెచ్‌ఎంపీవీ సహా అలాంటి అనేక ఇతర వైరస్‌ల వల్ల చైనాలో ఇప్పటికే భారీ సంఖ్యలో శ్వాసకోశ వ్యాధులు ప్రబలాయి. ఆ దేశంలో జనం మాస్కులు ధరించి ఆస్పత్రుల్లో, బయట సంచ రిస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో భారత్ సహా ప్రపంచమంతటా ఈ కేసులపై దృష్టి పెరిగింది. హెచ్‌ఎంపీవీ వైరస్ వ్యవహారం చర్చనీయాంశమైంది. కోవిడ్ సృష్టించిన భయోత్పాతం రీత్యా, వైరస్‌లు, మహమ్మారుల పేరు చెప్పగానే జనం సహజంగానే బెంబేలెత్తిపోతున్నారు.
ప్రజల్లో వ్యక్తమవుతున్న ఈ భయాందోళనలు అర్థం చేసుకోదగినవే. నిజానికి, హెచ్‌ఎంపీవీ కొత్త వైరస్ ఏమీ కాదు. శాస్త్రవేత్తలు 2001లోనే తొలిసారి దీని జాడ గుర్తించారు. వైరస్ స్వభావం, అది సోకినప్పటి లక్షణాల గురించి అవగాహన కూడా వచ్చింది. అయిదేళ్ళ లోపు చిన్నారులకూ, రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారికీ, వృద్ధులకూ ఈ వైరస్ సోకే ప్రమాదం అధికం. అందువల్లే, హెచ్‌ఎంపీవీతో తంటా చాలాకాలంగా ఉన్నదేననీ ఓ వాదన.
అసలు మన దగ్గర తాజాగా ఈ కేసులు చాలా గమ్మత్తుగా బయటపడ్డాయి. అంతకంతకూ చలి ముదురుతున్న ఈ శీతకాలంలో శ్వాసకోశ అనారోగ్యాలను పసిగట్టి, వాటిపై నిఘా ఉంచేందుకు ‘ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్’ (ఐసీఎంఆర్) ఎప్పటిలానే చర్యలు చేపట్టింది. ఆ క్రమంలో ఈ వైరస్ బాధిత కేసులు వెలుగులోకి వచ్చాయి. అయితే, దేశంలో శ్వాసకోశ వ్యాధి పీడితుల్లో అనూహ్యమైన పెరుగుదల ఏదీ ఇప్పటికీ కనిపించలేదని కేంద్ర ఆరోగ్య శాఖ స్పష్టం చేయడం ఒకింత ఊరటనిస్తోంది.
ఈ పరిస్థితిని ఎదుర్కొనేందుకు సర్వసన్నద్ధమై ఉన్నామన్నది ఆ శాఖ ఆశ్వాసన. ఆ మాటకొస్తే, దేశంలో శ్వాసకోశ, సీజనల్ ఇన్‌ఫ్లుయెంజా కేసులను క్రమం తప్పకుండా గమనిస్తూ ఉండడం ఆరోగ్య శాఖ అధికారులు నిరంతరం చేసేదే. ఇప్పుడు హెచ్‌ఎంపీవీ పరిస్థితిపై ఒక్క సారిగా గగ్గోలు రేగడంతో అంతర్జాతీయ సంస్థలతోనూ సంప్రతిస్తున్నట్టు అధికారిక కథనం.
కరోనా మొదలు నేటి హెచ్‌ఎంపీవీ దాకా అన్నీ చైనా కేంద్రంగా వార్తల్లోకి రావడంతో అనేక అనుమానాలు, భయాలు తలెత్తుతున్నాయి. చైనా సర్కార్ మాత్రం పౌరులతో పాటు తమ దేశానికి వచ్చే విదేశీ పర్యాటకుల ఆరోగ్యాన్ని సైతం కాపాడతామంటూ భరోసా ఇస్తోంది. బీజింగ్ ఎన్ని మాటలు చెప్పినా, గత చరిత్ర కారణంగా ప్రపంచ దేశాల్లో ఇప్పటికీ నమ్మకం కుదరడం లేదు. చిత్రమేమిటంటే, ప్రస్తుత ఇన్‌ఫెక్షన్లపై ప్రపంచ ఆరోగ్య సంస్థ సైతం ఎలాంటి ప్రకటన, మార్గదర్శకాలు విడుదల చేయనేలేదు.
విదేశీ ప్రయాణాలు చేయనివారికి సైతం హెచ్‌ఎంపీవీ సోకినట్టు వార్తలు రావడంతో, ఇది సీజనల్ సమస్యే తప్ప మరేమీ కాకపోవచ్చనే అభిప్రాయమూ ఉంది. చలికాలంలో ఇన్‌ఫెక్షన్లు సాధారణమే. అయితే, సరైన సమాచారం లేనప్పుడు పుకార్లు షికార్లు చేసి, లేనిపోని భయాలు సృష్టించి, ఆర్థిక, సామాజిక నష్టానికి దారి తీసే ముప్పుంది. జనవరి 13 నుంచి 45 రోజులు ప్రయాగలోని కుంభమేళాకు 40 కోట్ల పైగా భక్తులు హాజరవు తారని అంచనాలున్న వేళ అప్రమత్తత అవసరం. వైరస్‌ల విహారానికి ముకుతాడు వేయడం ముఖ్యం.
కోవిడ్–19 కాలంలో లానే తరచూ చేతులను సబ్బునీళ్ళతో కడుక్కోవడం, చేతులు కడుక్కోకుండా కళ్ళు–ముక్కు–నోటిని తాకకపోవడం, వ్యాధి లక్షణాలున్న వారితో సన్నిహితంగా మెలగక పోవడం, దగ్గు – తుమ్ములు వచ్చినప్పుడు ముక్కు – నోటికి అడ్డు పెట్టుకోవడం, మాస్కులు ధరించడం ఉత్తమం. అసలు కరోనా, హెచ్‌ఎంపీవీ లాంటి వాటితో సంబంధం లేకుండా ఈ ఖర్చులేని సర్వసాధారణ జాగ్రత్తలను మన నిత్యజీవితంలో భాగం చేసుకోవడం ఆరోగ్య పరిరక్షణకు మరీ ఉత్తమం.
కోవిడ్ అనుభవం ప్రపంచానికి నేర్పిన పాఠం – అప్రమత్తత. దేన్నీ తేలిగ్గా తీసుకోవద్దనీ, ఎట్టి çపరిస్థితుల్లోనూ స్వీయరక్షణ చర్యలను వదిలిపెట్టవద్దనీ తేల్చిచెప్పింది. దేశంలో 78 శాతం మేర చొచ్చుకుపోయిన మొబైల్ ఫోన్లనూ, 65 కోట్ల మందికి పైగా వీక్షకులున్న దూరదర్శన్‌నూ ప్రజాహిత సమాచార ప్రచారానికి వినియోగించాలి. అంతేకాక, ఇలాంటి వివిధ రకాల వైరస్‌లు, వ్యాధులకు దేశంలో టెస్టింగ్ సౌకర్యాలను విస్తరించాలి.
ఆరోగ్య పరిరక్షణ వ్యవస్థను పటిష్ఠం చేసుకుంటేనే అవాంఛనీయ పరిస్థితుల్ని ఎదుర్కొనే సామర్థ్యం సిద్ధిస్తుంది. వైరస్‌ల తీవ్రత తక్కువ, ఎక్కువలతో సంబంధం లేకుండా పాలకులు పారిశుద్ధ్యం, స్వచ్ఛమైన గాలి, నీరు, వాతావరణంపై శ్రద్ధ పెట్టడం అవసరం. వ్యాధులు ప్రబలాక చికిత్సకు శ్రమించే కన్నా, వైరస్‌లను ముందే పసిగట్టి, వాటి విజృంభణను నివారించేందుకు సర్వసన్నద్ధం కావడం అన్ని విధాలా ఉపయుక్తం, శ్రేయస్కరం.
భయం వద్దు... జాగ్రత్త ముద్దు!
Published Wed, Jan 8 2025 1:03 AM | Last Updated on Wed, Jan 8 2025 1:03 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment