
సాక్షి ప్రతినిధి, కాకినాడ: గోదావరిలో సీజనల్‌గా దొరికే పులసలు ఈ ఏడాది జాడ లేకుండా పోయాయి. గోదావరికి వరదలు రావడంతోనే వలస వచ్చే పులసల సీజన్ ప్రారంభమవుతుంది. ఏటా గోదావరికి జూలై నుంచి సెప్టెంబర్ వరకు వరద ప్రవాహం వస్తుంది. సాధారణంగా ఆగస్టు నెలలో వరదలు ఎక్కువ వస్తాయి.
ఈ ఏడాది జూలైలోనే వరదలు వచ్చి వెళ్లిపోయాయి. వరదల సమయంలో సముద్రం నుంచి గోదావరిలోకి ఎదురీదుతూ పునరుత్పత్తి కోసం గుంపులు గుంపులుగా పులసలు వస్తుంటాయి. కానీ.. ఈ సీజన్‌లో పులసలు మొహం చాటేశాయి. గోదావరి తీరంలో అక్కడక్కడా ఒకటి, రెండు పులసలు వలలో పడ్డా వేలకు వేలు పెట్టి పులస ప్రియులు ఎగరేసుకుపోతున్నారు.
‘క్వీన్ ఆఫ్ ఫిష్’గా పేరు
గోదావరిలో లభించే పులస ‘క్వీన్ ఆఫ్ ఫిష్’ గా ప్రపంచంలోనే పేరుంది. 2015 గణాంకాల ప్రకారం ప్రపంచంలో హిల్షా ఉత్పత్తిలో 50–60 శాతంతో బంగ్లాదేశ్ మొదటి స్థానంలో ఉండగా.. మయన్మార్ 20–25 శాతంతో రెండో స్థానంలోను, 15–20 శాతంతో మన దేశం మూడో స్థానంలో ఉన్నాయి. గోదావరిలో పుట్టిన పులస పిల్లలే సముద్రంలోకి వెళ్లి ఇలసలుగా వృద్ధి చెందుతాయి. సముద్రంలో ఉండే ఇలస రుచిగా ఉండకపోవడానికి అవి కొవ్వుతో ఉండటమే కారణం.
ఏటా వరదల సమయంలో సముద్రంలోని ఇలసలు పునరుత్పత్తి కోసం సముద్రంలో 11వేల నాటికల్స్ ప్రయాణించి గోదావరిలోకి ఎదురీదుతాయి. ఇలా ఎదురీత ప్రయాణం వల్ల పులసలో ఉండే కొవ్వు కరిగిపోయి ఎరుపు, గోధుమ రంగులోకి మారి పోషకాలు కలిగిన కొత్త శక్తితో స్మార్ట్‌గా మారుతుంది. కొన్ని రోజులు గోదావరిలోనే ఉండి గుడ్లు పెట్టి తిరిగి సముద్రంలోకి వెళ్లిపోతుంటుంది. ఇలా గోదావరిలోకి వచ్చిన పులసల్ని ఇష్టపడని మాంసాహార ప్రియులు ఉండరు.
అర కేజీ దొరకడమే గగనం
పులస గతంలో కేజీ నుంచి మూడు కేజీలు వరకు లభించేవి. మూడు కేజీల బరువున్న పులసలు నాలుగైదు చిక్కాయంటే వేటకు వెళ్లిన మత్స్యకారుల పంట పండినట్టే. మూడు కేజీల తూకం ఉండే పులస రూ.20 వేల నుంచి రూ.25 వేలు పలికేది. ప్రస్తుత సీజన్‌లో అరకిలో పులస దొరకడమే గగనమైపోతోంది. ఆ అరకిలో పులసే ఐదారువేలు పలుకుతోంది.
గోదావరి జిల్లాల్లో యా నాం, ఎదుర్లంక, ధవళేశ్వరం, రావు లపాలెం, సిద్ధాంతం, నరసాపురం తదితర తీర ప్రాంతాల్లో ఒకప్పుడు విరివిగా దొరికే పులసలు అరకొరగానే పడుతున్నాయి. సముద్ర ముఖద్వారాల వద్ద ఇసుక తిప్పలు పెరగడం, గోదావరిలోకి సల్ఫర్, అమ్మోనియా, లెడ్ తదితర కర్బనాలు కలిసిపోతుండటం, విచక్షణా రహితంగా సాగే వేట ఈ జాతి రాక తగ్గడానికి కారణంగా పేర్కొంటున్నారు. పులసలు సంతానోత్పత్తి జరిగే సమయంలో వేట సాగడం తగ్గిపోవడానికి మరో కారణం.
పులసల మనుగడకు ‘సిఫ్రీ’ కృషి
పులస చేప జాతిని పరిరక్షించే దిశగా కోల్‌కతాలోని సిఫ్రీ (సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫ్రెష్ వాటర్ రీసెర్చ్ ఇన్‌స్టిస్ట్యూట్) కృషి చేస్తోంది. పులస సీడ్‌ను వృద్ధి చేసి బంగాళాఖాతంలో విడిచిపెడుతోంది. ఈ ప్రయత్నం వల్లే ఒడిశా, పశ్చిమ బెంగాల్ తీరంలో పులసలు లభిస్తున్నాయంటున్నారు. కానీ.. గోదావరిలో లభించే పులసలకున్నంత రుచి ఆ ప్రాంతంలో పులసలకు ఉండదు. – చిట్టూరి గోపాలకృష్ణ, మత్స్య శాస్త్రవేత్త
పులసల రాక తగ్గిపోతోంది
పులసలు రాక క్రమంగా తగ్గిపోతోంది. గతంలో జూలై, ఆగస్టు నెలల్లో మాకు పండగలా ఉండేది. వందలాది పులసలు మా వలల్లో చిక్కేవి. అటువంటిది ఈ సీజన్‌లో పులసలు జాడ కనిపించడం లేదు. ఇప్పుడా పరిస్థితి కనిపించడం లేదు. – ముదే హరిచంద్ర, మత్స్యకారుడు, యానాం