వేటకు వేళాయె..
- కోలాహలంగా నరసాపురం ఏటిగట్టు
- పెద్ద సంఖ్యలో సముద్రంలోకి బోట్లు
నరసాపురం అర్బన్ : నరసాపురం గోదావరి ఏటిగట్టుకు చాలాకాలం తర్వాత కళొచ్చింది. సముద్రంలో చేపల వేటకు మత్స్యకారులు బోట్లపై బయలుదేరారు. రెండు నెలలుగా ప్రచండ భానుడు ఉగ్రరూపం దాల్చడంతో మత్స్యకారులు సముద్రంలో ఎంతో కష్టపడినా చేపలు దొరకని పరిస్థితులు ఏర్పడ్డాయి. దీంతో సముద్రంలోకి వెళ్లిన బోట్లు వెనక్కు వచ్చాయి. వాతావరణ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని సీజన్ అయినా మత్స్యకారులు నెల రోజులుగా వేటకు విరామం ప్రకటించాల్సి వచ్చింది. నాలుగురోజులుగా వాతావరణం కాస్త చల్లబడడంతో మత్స్యకారులు తిరిగి వేటకు సమాయాత్తమయ్యారు.
మొన్నటి వరకు వశిష్టగోదావరి ఏటిగట్టు పాయవద్ద లంగరు వేసి ఉంచిన బోట్లు ఒక్కొక్కటీ సముద్రంలోకి వేటకు వెళుతున్నాయి. గురువారం ఒక్కరోజే నరసాపురం రేవు నుంచి 30 బోట్లు వేటకు బయలుదేరాయి. వేట సాగక ఇక్కడ లంగర్ వేసిన మచిలీపట్నం, కాకినాడ, నెల్లూరు తదితర ప్రాంతాలకు చెందిన పెద్ద మెకనైజ్డ్ బోట్లు కూడా సముద్రంలోకి వెళ్లిన వాటిలో ఉన్నాయి. దీంతో ఏటిగట్టు ప్రాంతంలో సందడి నెలకొంది.
అదేబాటలో స్థానిక మత్స్యకారులు
గోదావరిలో చేపలు వేటాడే స్థానిక మత్స్యకారులు వేటను ముమ్మరం చేశారు. నరికిన కొబ్బరి చెట్లను గోదావరిలోకి పడవలపై తీసుకెళ్లి వలకట్లు కడుతున్నారు. అనంతరం వేటను సాగించనున్నారు. ఈ ఏడాదైనా ప్రకృతి సహకరించాలని
మత్స్యకారులు కోరుకుంటున్నారు.
ఎండల వల్ల చేపలు చిక్కలేదు
రెండు నెలల నుంచి అన్నీ నష్టాలే. ఎండల కారణంగా సముద్రంలో చేపలు పడలేదు. పెట్టిన ఖర్చంతా వృథా. దీంతో వెనక్కి వచ్చేశాం. నాలుగు రోజులుగా వాతావరణం బాగుండడంతో మళ్లీ వేటకు బయలుదేరాం.
-కె.ప్రసాద్, బోటు యజమాని
నెల రోజులుగా ఖాళీగా ఉన్నాం
వేట సీజన్‌లో ఎప్పుడూ ఇంత ఖాళీగా లేం. ఎండలు ఎక్కువగా ఉండడంతో నెలరోజులుగా ఖాళీగా ఉన్నాం. ఇంట్లో చాలా కష్టంగా గడిచింది. ఇప్పుడు మళ్లీ వేటకు బయలుదేరాం. ఈసారైనా వాతావరణం అనుకూలించాలి.
- బలపాటి శ్రీను, మత్స్యకారుడు,కాకినాడ