ఇది జనగామ జిల్లాలోని తరిగొప్పుల చెరువు. ఇందులో వల వేస్తే దొరికే చేపల్ని ఏరడానికి రెండు చేతులూ చాలవంటారు ఇక్కడి మత్స్యకారులు. కానీ సంవత్సరం క్రితం వదిలిన చేపపిల్లలు ఇప్పటికీ పిల్లలుగానే ఉన్నాయని, బరువు పెరగలేదని దోసిలి చిన్నబోతోందని అంటున్నారు.
మెదక్ చెరువులో ఎదిగీ ఎదగని చేపపిల్లల్ని చూపుతున్న వీరిద్దరు గంగారాం, వెంకటేశ్. ఏడాది పాటు పిల్లల్ని పోసి పెంచితే..చేపలు అరకిలో మేరకైనా బరువు పెరగలేదని, దోసిలైనా నిండలేదని వాపోతున్నారు. ఏడాదిశ్రమ వృథా అయిందని వీరంటున్నారు.
శ్రీగిరి విజయ్‌కుమార్‌రెడ్డి (సాక్షి ప్రత్యేక ప్రతినిధి) చేపా చేపా ఎందుకు ఎదగలే అంటే.. పూర్తిగా ఊపిరి పోసుకోకుండానే పంపిణీ చేశారు.. అదను దాటాక నన్ను చెరువులోకి పంపారంటోంది. మండు వేసవిలోనూ కృష్ణా, గోదావరి నీళ్లతో కళకళలాడే 28,704 నిండు చెరువులు, కుంటల ద్వారా నీలి విప్లవం సాధన దిశగా ప్రభుత్వం వేసిన అడుగులను ఇంటి దొంగలే దారి మళ్లించారు. ఎక్కడికక్కడ నిబంధనలకు తిలోదకాలిచ్చి కోట్ల రూపాయల ప్రభుత్వ నిధులను ఫలహారంలా పంచుకుతిన్నారు. చెరువును, చేపను నమ్ముకున్న వారిని వంచన చేశారు. కొందరు ప్రభుత్వ పెద్దలు, అధికారులు లాభపడితే, నెలల తరబడి శ్రమించిన గంగపుత్రులు, ముదిరాజ్‌లు దగాపడ్డారు.
కూలీ కూడా గిట్టుబాటు కాలేదు
రాష్ట్రంలోని మత్స్యకారులకు ఉపాధి కల్పించడం ద్వారా వారికి ఆర్థిక భరోసా కల్పించాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ఉచిత (100 శాతం సబ్సిడీ) చేపపిల్లల పంపిణీ పథకాన్ని ప్రారంభించి అమలు చేస్తోంది. ఈ క్రమంలోనే 2021–22 వార్షిక సంవత్సరానికి గాను సుమారు రూ.93 కోట్ల వ్యయంతో రాష్ట్రంలోని అన్ని మత్స్య సహకార సంఘాలకు 89.09 కోట్ల చేపపిల్లలను పంపిణీ చేశారు.
అయితే విత్తన చేపల్లో 40 శాతానికి పైగా చెరువుల్లో వేయగానే మరణించగా, ప్రాణంతో మిగిలిన చేపలను ఎంతో జాగ్రత్తగా పెంచినా ఎక్కడా ఒక్క చేప కూడా 500 గ్రాములకు మించి బరువు పెరగలేదు. ఫలితంగా ఏడాదంతా కష్టపడిన మత్స్యకారులకు కూలీ కూడా గిట్టుబాటు కాకపోగా, అనేక చోట్ల ఎదగని చేపలను పట్టకుండా చెరువుల్లోనే వదిలేశారు.
చచ్చిన పిల్లలకూ లెక్కలు
చేప పిల్లల పంపిణీని జూన్ – జూలై మాసాల్లో మొదలు పెడితే చెరువులు, కుంటల్లో నీళ్లు తగ్గే మార్చి, ఏప్రిల్, మే మాసాలు ఎదిగిన చేపలు పట్టేందుకు అనుకూలమైన సమయం. ఆ తర్వాత వర్షాలు వస్తే చెరువులు, కుంటలు పొంగి పొర్లేందుకు అవకాశం ఉంటుంది. అయితే గత ఏడాది చేప విత్తనాల (పిల్లల) కొనుగోళ్ల ప్రక్రియ ప్రారంభం నుంచే కొందరు పెద్దలు, అధికారులు కాసుల వేట ప్రారంభించారు.
రాష్ట్రంలోని చెరువుల్లోనే చేప పిల్లలను ఉత్పత్తి చేయాలనే నిబంధన పక్కన పెట్టారు. ఇతర రాష్ట్రాల కాంట్రాక్టర్లతో కుమ్మక్కయ్యారు. తమకు అనుకూలమైన వారికి కాంట్రాక్టు దక్కేలా చూసే క్రమంలో ఏకంగా ఆరుసార్లు టెండర్లు పిలిచారు. కాంట్రాక్టులు పొందిన ఇతర రాష్ట్రాల వారు డ్రమ్ములు, ట్యాంకర్ల ద్వారా విత్తనాలు సరఫరా చేశారు. తీరిగ్గా సెప్టెంబర్, అక్టోబర్‌లో చెరువుల్లో వదిలారు. అప్పటికే అనేక చేప పిల్లలు మృత్యువాత పడ్డా వాటిని కూడా చెరువుల్లో కలిపేసి లెక్కలు రాసుకున్నారు.
సైజు, నాణ్యతలోనూ రాజీ
విత్తన చేప పిల్లలను 35– 40 (చిన్న చెరువులు, కుంటలకు), 80–100 (పెద్ద చెరువులు, రిజర్వాయర్లకు) మిల్లీమీటర్ల (పొడవు) చొప్పున రెండురకాల సైజుల్లో కొనుగోలు చేయాలని నిర్ణయించినా ఎక్కడా నిబంధనలు అమలు కాలేదు. పైగా సైజుతో పాటు పిల్లల నాణ్యతలో కూడా రాజీ పడిపోయారు. ఓ వైపు కాలం దాటాక చెరువుల్లో వేయటం, చిన్న సైజు.. సరిగ్గా అభివృద్ధి చేయని విత్తనాలను (నాణ్యత లేని చేప పిల్లలు) చెరువుల్లో వదలటం వల్ల ఆశించిన దిగుబడిలో సగం కూడా లేదని మత్స్య సహకార సంఘాలు వాపోతున్నాయి.
అదను దాటినా నాణ్యమైన చేప పిల్లలను వదిలితే 6–8 మాసాల్లోనే ఒక్కో చేప కిలో నుండి కిలోంబావు వరకు తూకం వచ్చేది. కానీ సగటున 450 గ్రాములు కూడా తూగటం లేదు. వాస్తవానికి గతంలో ప్రభుత్వమే చేప పిల్లలను ఉత్పత్తి చేసి సంఘాలకు ఇచ్చేది. కానీ గత కొన్నేళ్లుగా విత్తనాల పంపిణీని ప్రైవేటు సంస్థలకు అప్పగించింది. దీని వెనుక కూడా భారీ మతలబు ఉందనే ఆరోపణలున్నాయి.
కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలం బండ్రు కొండ మంగలి కుంట చెరువులో గతేడాది ఆగస్టు నెలలో బంగారు తీగ, బొచ్చ, రవ్వ రకాల చేప పిల్లలను వదిలారు. ఒక్కో చేప కేవలం 100 నుంచి 150 గ్రాములు మాత్రమే పెరిగింది. సుజాతనగర్ మండలం సింగభూపాలెం చెరువులో వేసిన 7.20 లక్షల చేప పిల్లల్లో 50 శాతం మాత్రమే
బతికాయి.
భారీగా ఎదిగిన ‘ప్రైవేటు’ పిల్లలు
మా తపాలఖాన్ చెరువులో గత సెప్టెంబర్‌లో 80 వేల చేపపిల్లలు (బొచ్చ, బంగారుతీగ, రవ్వ) వదిలారు. అన్నీ బాగా ఉంటే ఆర్నెల్లలో కిలోకు పైగా తూగాలి. కానీ ఈ రోజుకు 100 గ్రాములకు కూడా పెరగలేదు. ప్రభుత్వం ఉచితంగా చేప పిల్లలు పంపిణీ చేసినా మాకు ఏ ప్రయోజనం లేదు. మేము జగిత్యాల నుండి సొంత ఖర్చుతో ప్రైవేటు వ్యక్తుల నుండి తెచ్చిన పిల్లలు భారీ సైజు వచ్చాయి.
– బాలయ్య, తున్కిఖల్సా, వర్గల్, సిద్దిపేట జిల్లా
Comments
Please login to add a commentAdd a comment