
మత్స్యకారులకు కాసులు కురిపిస్తున్న ట్యూనా చేపలు
గంగపుత్రులకు రెట్టింపైన ఆదాయం
కాకినాడ తీరంలో రోజుకు 250 టన్నులకుపైగా లభ్యం
వీటిలో నామాల ట్యూనాలదే సింహభాగం
వేట నిషేధ పరిహారం అందని పరిస్థితుల్లో ఆదుకుంటున్న ట్యూనాలు
సాక్షి ప్రతినిధి, కాకినాడ: పెన్షనర్ల ప్యారడైజ్‌గా పేరొందిన కాకినాడలోని గంగపుత్రులు జల పుష్పాలతో జాక్‌పాట్ కొడుతున్నారు. అరుదైన ట్యూనా(tuna fish) చేపలను పట్టడంలో చేయితిరిగిన మత్స్యకారులు కాకినాడ తీరానికే సొంతం. ఇక్కడి సముద్ర తీరానికి 175–300 నాటికల్ మైళ్ల దూరంలో ట్యూనా చేపల సందడితో గంగపుత్రులు ఉబ్బితబ్బిబ్బవుతున్నారు. మునుపెన్నడూ లేనిరీతిలో తొలిసారి రికార్డు స్థాయిలో ట్యూనా చేపలు చిక్కుతూ వారికి సిరుల వర్షం కురిపిస్తున్నాయి.
మూడు రకాల ట్యూనా చేపలలో అరుదైన జాతి స్కిట్‌జాగ్. వీటికి మరోపేరు నామాలు. వాడుక భాషలో మాత్రం తూర చేపలని పిలుస్తుంటారు. మత్స్యకారుల వలలకు చిక్కుతున్న ట్యూనాల్లో స్కిట్‌జాగ్ జాతి చేపలే అధికంగా ఉంటున్నాయి. వీటితోపాటు ఎల్లో ఫిన్ ట్యూనా, వైట్ ట్యూనా రకాల చేపలు కూడా విరివిగా లభిస్తున్నాయి. స్కిట్‌జాగ్ రకం కిలో రూ.70, వైట్ ట్యూనాలు కిలో రూ.105, ఎల్లో ఫిన్ ట్యూనాలు కిలో రూ.95 ధర పలుకుతున్నాయి.
జాలర్ల పంట పండుతోంది
జనవరి రెండో వారం నుంచే ట్యూనాలు విరివిగా లభిస్తుండటంతో మత్స్యకారుల పంట పండుతోంది. కాకినాడ తీరం నుంచి నిత్యం 25 నుంచి 30 బోట్లలో సముద్ర లోతుల్లోకి వెళ్లి ట్యూనాలు వేటాడుతున్నారు. ఒకసారి వేట (వాజీ)కి వెళితే దొరికే చేపలను బట్టి రూ.లక్ష నుంచి రూ.2 లక్షలు వస్తే గొప్పగా చెప్పుకుంటారు. అటువంటిది ప్రస్తుతం ఒక ఫైబర్ బోటులో రూ.3.50 లక్షల నుంచి రూ.5 లక్షలు విలువైన ట్యూనాలు పడుతుండటంతో మత్స్యకారుల ఆనందానికి అవధులు లేవు. ఎల్లో ఫిన్ ట్యూనా రోజుకు ఐదారు టన్నులు వస్తుంటే అత్యధికంగా నామాలుగా పిలిచే (స్కిట్‌జాగ్) ట్యూనాలు 20 నుంచి 25 టన్నులు ఉంటున్నాయి.
కాకినాడ తీరానికి నిత్యం 250 నుంచి 300 టన్నుల ట్యూనాలు వస్తున్నాయి. ఫైబర్ బోటుపె మేస్త్రీ, కళాసీలు కలిసి మొత్తం ఆరుగురు వేటకు వెళుతుంటారు. సముద్రంపై 10 రోజులపైనే ఉంటే తప్ప రూ.2 లక్షల విలువైన మత్స్య సంపద దొరికేది కాదు. ప్రస్తుతం వారం రోజులు గడవకుండానే రూ.నాలుగైదు లక్షల విలువైన ట్యూనాలతో తిరిగొస్తున్నామని మత్స్యకారులు సంతోషంగా చెబుతున్నారు. ఇదే ఒరవడి కొనసాగి ట్యూనాలు మార్చి నెలాంతం వరకు దొరుకుతాయనిఅంచనా వేస్తున్నారు. అదే నిజమైతే ఈ సీజన్‌లో ట్యూనాలతో ఆర్థికంగా స్థిరపడతామనే ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.
పరిహారం ఎగ్గొట్టినా ట్యూనాలే ఆదుకుంటున్నాయి
కాకినాడ, ఉప్పాడ కొత్తపల్లి తదితర ప్రాంతాల్లో సముద్రంలో చేపల వేట ఆధారంగా సుమారు 300 ఫైబర్ బోట్లను మత్స్యకారులు నడుపుతున్నారు. ఏప్రిల్ 15 నుంచి జూన్ 15 వరకు సముద్ర వేట నిషేధ సమయం. వేట నిషేధంతో ఉపాధి కోల్పోయే మత్స్యకారుల జీవనానికి ఇబ్బంది కలగకుండా వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం వేట నిషేధ పరిహారాన్ని ఎప్పటికప్పుడు అందిస్తూ వచ్చింది. కూటమి ప్రభుత్వం గద్దెనెక్కాక వేట నిషేధ పరిహారం కొండెక్కింది.
కళ్లు కాయలు కాసేలా ఎదురుచూసినా మత్స్యకారులకు నిరాశనే మిగిలింది. సంక్రాంతి పండుగ కూడా సంతోషం లేకుండా గడచిపోయిందనే ఆవేదన చెందుతున్నారు. వేటకు వెళ్లినా వలకు సరైన చేపలు చిక్కక కొన్ని సందర్భాల్లో ఫైబర్ బోటు నిర్వహణ వ్యయం రూ.లక్ష కూడా చేతికొచ్చేది కాదు. ఈ తరుణంలో సముద్రంలో లభిస్తున్న ట్యూనా చేపలు మత్స్యకారులకు ఊపిరిపోస్తున్నాయి.
ట్యూనాలకు కేరాఫ్ కాకినాడ
కాకినాడ తీరం ట్యూనా చేపలకు ప్రసిద్ధి. ఇక్కడి మత్స్యకారులు ఎంతో నైపుణ్యంతో సముద్రంలో సుదీర్ఘ ప్రాంతానికి వెళ్లి ట్యూనా చేపలను వేటాడతారు. మూడు రకాల ట్యూనాలు లభ్యమవుతున్నాయి. వేట నిషేధ సమయం తరువాత ఆరు నెలలపాటు ట్యూనా చేపలు ఎక్కువగా లభిస్తాయి. జనవరి నెలలో ట్యూనా దిగుబడి బాగా వచ్చింది. గతంతో పోలిస్తే 10 శాతం ధర పెరిగింది. దీంతో మత్స్యకారులు ఆర్థిక పరిస్థితి బాగుంది. – అనురాధ, ఫిషరీస్ డెవలప్‌మెంట్ ఆఫీసర్, హార్బర్ పేట, కాకినాడ
కాకినాడ తీరానికి అభిముఖంగానే ట్యూనాలు
కాకినాడ తీరం ఎదురుగా విశాఖ, చింతపల్లి ప్రాంతంలో సుమారు 175 నాటికల్ మైళ్ల దూరంలో ట్యూనా చేపలు లభ్యమవుతున్నాయి. ఈ సీజన్‌లో జనవరి నెలలో మత్స్యకారుల వలలకు ట్యూనా చేపలు భారీగా చిక్కాయి. దీంతో వేట కోసం ప్రతి మత్స్యకారుడు సముద్రంలో వేట కొనసాగిస్తున్నారు. – మల్లే కొండబాబు, మత్స్యకారుడు, సూర్యారావుపేట
Comments
Please login to add a commentAdd a comment