పులసలు
సాక్షి, పశ్చిమగోదావరి: సుదూర ప్రాంతాలనుంచి మైళ్ల కొద్దీ ఈదుకుని వచ్చి సముద్రం నుంచి గోదావరి ఎర్రనీటిలో ప్రవేశించే పులసలంటే ఎంతో క్రేజీ. రాష్ట్రంలో కేవలం ఉభయ గోదావరి జిల్లాల్లో గోదావరి పరివాహక ప్రాంతంలో మాత్రమే లభించే వీటిని పుస్తెలమ్మైనా పులస తినాలనే నానుడిని నిజం చేస్తూ ధరలోనూ అధరహో అంటూ రుచికి చేపల్లో రారాజుగా నిలిచిపోయింది. ఏడాదిలో రెండు మూడు నెలలు మాత్రమే లభిస్తుండగా, సీజన్‌లో వేలకు వేలు ఖర్చు చేసి మరీ కొనుగోలు చేసి జిహ్వ చాపల్యాన్ని సంతృప్తి పరచుకుంటారు చేపల ప్రియులు.
గోదావరికి వరద నీరు మొదలైనప్పటి నుంచి ఇంచుమించుగా జూలైలో ప్రారంభమై సెప్టెంబర్ వరకూ నర్సాపురం నుంచి దవళేశ్వరం వరకూ పులసలు విరివిగా జాలర్లకు చిక్కుతుంటాయి. ఎర్రనీటిలో ఎంత దూరం ప్రయాణిస్తే అంత రుచిగా ఉంటాయి. వశిష్టా గోదావరిలో సిద్ధాంతం నుంచి ప్రారంభమై మల్లేశ్వరం, ఖండవల్లి, తీపర్రు, పెండ్యాల్లోనూ, గౌతమి నదిలో జొన్నాడ ఆలమూరు, చెముడు లంక, కేదారిలంక ప్రాంతాల్లో అధికంగా జాలర్ల వలకు ఈ చేపలు చిక్కుతూ ఉంటాయి. దీంతో జాతీయ రహదారిలో పులసల అమ్మకాలు ఎక్కువగా జరుగుతుంటాయి. జాతీయ రహదారిలో పయనించే ఇతర జిల్లా వాసులు వీటిని ఎగబడి మరీ కొనుగోలు చేస్తుంటారు.
చదవండి: ఇలస చేప.. పులసగా ఎలా మారుతుందో తెలుసా?
సంతానోత్పత్తి కోసం వచ్చి..
ఆ్రస్టేలియా, థాయ్‌లాండ్ వంటి దేశాల్లో ఉండే ఈ ఆరుదైన చేప సంతానోత్పత్తి కోసం సుదూర ప్రాంతాల నుంచి హిందూ మహాసముద్రాన్ని ఈదుకుంటూ బంగాళాఖాతం చేరుకొని గోదావరి, సముద్రం కలిసే ప్రాంతానికి చేరుకుని ఎర్రనీటిలో ప్రయాణిస్తూ సంతానం ఉత్పత్తి చేస్తుంటాయి. హిల్సా ఇలీషా నామంతో ఆయా ప్రాంతాల్లో పిలిచే ఈ చేప గోదావరి ఎర్రనీటిలో ప్రవేశించేటప్పటికి పులసగా పిలవబడుతుంది.
గరావిపాలెం వద్ద పులస అమ్మకాలు
ఇలసలే పులసలుగా అమ్మకాలు
పులసకు ఉండే డిమాండ్‌తో కొన్ని ప్రాంతాల్లో ఇలసలను పులసలుగా అమ్మకాలు సాగిస్తున్నారు. ఒడిశా సముద్రతీరంలో విరివిగా లభించే ఇలసలను తక్కువ ధరకు తీసుకువచ్చి పులసలుగా ఇక్కడ కొందరు అమ్మకాలు సాగిస్తుంటారు. అయితే వీటి మధ్య తేడాను గుర్తించడం కష్టసాధ్యమే. నిజమైన పులస ఎర్రనీటి ప్రయాణం చేసి కొద్దిపాటి ఎర్రనీటిఛాయతో వెండి రంగుతో, ధగధగమంటూ గోధమవర్ణంలో కనిపిస్తుంటాయి. ఇలసలు తెలుపుగానే కనిపిస్తాయి. దీంతో వీటి మధ్య తేడా గుర్తించడంలో కష్టం కావడంతో ఇలసలే పులసలుగా భావించి కొనుగోలు చేసేవారూ అధికంగానే ఉంటారు. దీంతో పులస ప్రియులు వీటిని ఆచితూచి కొనుగోలు చేయాల్సిందే.
రూ.1500 నుంచి రూ.6000 వరకూ..
నానుడికి తగ్గట్టుగానే పులస ధర సైతం నిజంగా పుస్తేలు అమ్ముకునే స్థాయిలోనే ఉంటాయి. సామాన్య కుటుంబాలకు పులస కొనాలంటే కలగానే మిగిలిపోతుంది. కేజీ బరువుండే పులసలు రూ.1500 నుంచి రూ.6000 వరకూ సమయాన్ని బట్టి అమ్మకాలు సాగిస్తుంటారు. సాధారణంగా పులస దొరకాలంటే కష్టసాధ్యంగానే ఉంటుంది. దీంతో ఇలసలు లభించే ప్రాంతాల్లో వీటి ధర రూ.1000 వరకూ అమ్ముతుంటారు. తెలియని వారు వీటినే పులసలుగా భావించి కొనుగోలు చేస్తుంటారు.
కోవిడ్ ప్రభావంతో నష్టం
కోవిడ్ ప్రభావం పులసల అమ్మకందారులకు తగిలింది. గత ఏడాది కోవిడ్ నిబంధనలు కఠినంగా ఉండడంతో పులసలు కొనేనాథుడు లేకపోయాడు. జాతీయ రహదారిలో ప్రయాణాలపై ఆంక్షలు ఉండడంతో దుకాణాలు నిర్వహించలేని పరిస్థితి నెలకొంది. దీంతో గత ఏడాది పులసల సీజన్‌లో వ్యాపారులు తీవ్రంగానే నష్టపోయారు.
పులుసు తయారీలోనూ ప్రత్యేక పద్ధతులు
పులస చేపకున్న క్రేజీతో పాటు పులస పులుసు తయారీలో ప్రత్యేక పద్ధతులు పాటిస్తారు. పులసను ఇతర చేపల వలే వండడం కుదరని పని. దీనికోసం ప్రత్యేక పద్ధతులు పాటించి వండుతూ ఉంటారు. మట్టి కుండలో పులస వంటకం రుచిని మరింత పెంచుతుంది. ముళ్లు అధికంగా ఉండడంతో ప్రత్యేక విధానాలు అవలంబిస్తారు. ముందుగా చేప ముక్కలకు వెన్న, ఆముదం పూసి కొంత సమయం పాటు ఉంచి వీటిని పిడకల పొయ్యిపై అతి తక్కువ మంటపై ఎక్కువ సమయం వండవలసి ఉంటుంది. ఆవకాయ ఊట, వంకాయ, బెండకాయ వంటి వాటిని వేసీ మరీ వండుతుంతారు. వంటకం పూర్తవగానే తినకుండా మర్నాడు తింటే దీని రుచి అమోఘంగా ఉంటుందని చేప ప్రియులు అంటుంటారు.
Comments
Please login to add a commentAdd a comment