సాక్షి, అమరావతి: పులస చేపల స్వేచ్ఛా విహారం కోసం పోలవరం ప్రాజెక్టులో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. పులస చేపలు ఎగువకు, దిగువకు రాకపోకలు సాగించడానికి వీలుగా స్పిల్ వే రెండో పియర్‌లో ఫిష్ ల్యాడర్ గేట్లను అమర్చుతోంది. ప్రపంచంలో ఈ ఏర్పాట్లు ఉన్న అతి పెద్ద జలాశయం పోలవరం ప్రాజెక్టే కావడం గమనార్హం. పుస్తెలమ్మైనా సరే పులస తినాలన్నది ఉభయ గోదావరి జిల్లాల్లో నానుడి. దీన్ని బట్టే పులసకున్న ప్రాధాన్యతను, దాని రుచిని ఊహించుకోవచ్చు. గోదావరి వరద ప్రవాహం సముద్రంలో కలిసే సమయంలో అంటే.. జూన్ నాలుగో వారం నుంచి జూలై, ఆగస్టు మధ్యన సముద్రంలో జీవించే ఇలస రకం చేపలు సంతానోత్పత్తి కోసం నదిలోకి ఎదురీదుతాయి.
ఇలా గోదావరిలోకి చేరాక పులసలుగా రూపాంతరం చెందుతాయి. ప్రపంచంలో ఎక్కడా, మరే ఇతర సముద్రపు చేపలు నదుల్లోకి ఎదురీదే ఉదంతాలు లేవు. వరదల సమయంలో ధవళేశ్వరం బ్యారేజీ గేట్లను ఎత్తి ఉంచడం వల్ల గోదావరి సముద్రంలో కలిసే అంతర్వేది నుంచి దాదాపుగా భద్రాచలం వరకు ఈ చేప నదిలో ఎదురీదుతుంది. సంతానోత్పత్తి చేశాక తిరిగి సముద్రంలోకి చేరి మళ్లీ ఇలసగా మారుతుంది. పోలవరం ప్రాజెక్టును నిర్మిస్తే అత్యంత అరుదైన పులస చేపల రాకపోకలకు విఘాతం కల్పించినట్లు అవుతుందని కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ అనుమానాలు వ్యక్తం చేసింది. అయితే తగిన ఏర్పాట్లు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించడంతో ప్రాజెక్టుకు అనుమతి ఇచ్చింది.
చేప సైకాలజీపై అధ్యయనం
ఇలస రాక, పులస పోక ఎలాంటి ఆటంకం లేకుండా జరిగేందుకు వీలుగా పోలవరం ప్రాజెక్టుకు గేట్ల ఏర్పాటుపై అధ్యయనం బాధ్యతను కొల్‌కతాలోని ప్రఖ్యాత సీఐఎఫ్‌ఆర్‌ఐ (సెంట్రల్ ఇన్‌ల్యాండ్ ఫిషరీష్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్)కు రాష్ట్ర ప్రభుత్వం అప్పగించింది. రాకపోకల సమయంలో చేప ప్రవర్తించే తీరుపై సుమారు ఐదేళ్ల అధ్యయనానంతరం సీఐఎఫ్‌ఆర్‌ఐ.. ఫిష్ ల్యాడర్ గేట్లను డిజైన్ చేసింది. కేంద్ర జల సంఘం ఆమోదించిన మేరకు ఈ గేట్లను తయారు చేయించిన ప్రభుత్వం స్పిల్ వే రెండో పియర్‌కు అమర్చుతోంది.
ఏ స్థాయిలో ప్రవాహం ఉన్నా..
గోదావరి నదిలో వరద ప్రవాహం ఏ స్థాయిలో ఉన్నా పులసలు స్వేచ్ఛగా తిరిగేలా మూడు చోట్ల ఫిష్ ల్యాడర్ గేట్లను అమర్చుతున్నారు. ఫిష్ ల్యాడర్ 252 మీటర్ల పొడవు ఉంటుంది. దీనికి నాలుగు గేట్లు ఉంటాయి. స్పిల్ వే రెండో పియర్‌కు క్రస్ట్ లెవల్‌లో అంటే 25 మీటర్ల స్థాయిలో ఫిష్ ల్యాడర్‌కు ఒకటి, రెండు గేట్లను.. 34 మీటర్ల స్థాయిలో మూడో గేటును.. 41 మీటర్ల స్థాయిలో నాలుగో గేటును పెడుతున్నారు. పోలవరం ప్రాజెక్టు గరిష్ట నీటి మట్టం 45.72 మీటర్లు, కనిష్ట నీటి మట్టం 25.72 మీటర్లు. అంటే.. గోదావరిలో నీటి మట్టం గరిష్టంగా ఉన్నా, సాధారణంగా ఉన్నా, కనిష్టంగా ఉన్నా ఈ చేప ఎగువకు, దిగువకు రాకపోకలు సాగించేందుకు ఈ గేట్లు అనుకూలంగా ఉంటాయన్న మాట. ప్రపంచంలో ఒక చేప జాతి సైకాలజీపై అధ్యయనం చేసి.. దాని స్వేచ్ఛకు విఘాతం కల్పించకుండా నిర్మిస్తున్న ఏకైక ప్రాజెక్టు పోలవరమేనని పర్యావరణ నిపుణులు స్పష్టం చేస్తున్నారు.
దీని దారి రహదారే
Published Tue, Feb 9 2021 3:47 AM | Last Updated on Tue, Feb 9 2021 9:12 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment