సాక్షి, కాకినాడ: అత్యంత అరుదైన.. విలువైందిగా భావించే చేప ‘పులస’ సీజన్ మొదలైంది. యానాం గోదావరికి ఎర్ర నీరు పోటెత్తిన సమయంలోనే పులసలు లభ్యమవుతాయని తెలిసిందే. ఈ క్రమంలో మార్కెట్‌లోకి మొదటి చేప వచ్చి.. మాంచి రేటుకే అమ్ముడుపోయింది.
తాజాగా కేంద్రపాలిత ప్రాంతమైన యానాంలో వేటకు వెళ్లిన మత్స్యకారులకు వారం తర్వాత మొట్టమొదటి పులస వలకి చిక్కిందట. రెండు కేజీల దాకా బరువు ఉన్న దీనిని రూ.15 వేల రూపాయలకు అమ్మినట్లు మహిళ చెబుతోంది. పులసల కోసం కాకినాడ, రాజమండ్రి నుంచే కాదు.. హైదరాబాద్ నుంచి కూడా జనం వస్తుంటారని సదరు మహిళ అంటోంది. దీంతో ఈ ఏడాది పులస గరిష్టంగా ఏ రేటుకు అమ్ముడుపోతుందో అనే ఆసక్తి నెలకొంది.
గోదావరి జిల్లాల్లో ‘పుస్తెలు అమ్మినా సరే.. పులస తినాలి’ అని నానుడి. పులస చేప దొరకడమే చాలా అరుదు.. అందుకే జీవితంలో ఒక్కసారైనా పులస చేపను తినాలని భావిస్తుంటారు. నదీ ప్రవాహానికి అతివేగంగా ఎదురీదడం ఈ చేప ప్రత్యేకత. దీంతో ఎంత రేటైనా కొనుగోలు చేసేందుకు జనం వెనుకాడరు.
పులసలు.. గోదావరి నదిలో మాత్రమే లభిస్తుంటాయి. ఇదే చేప సముద్రంలో దొరికితే దానిని ‘వలస చేప’ అంటారు. సంతానోత్పత్తి కోసం ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, టాంజానియా వంటి సుదూర ప్రాంతాల నుంచి ఖండాలను దాటి హిందూ మహాసముద్రం మీదుగా ప్రయాణించి అవి బంగాళాఖాతంలో ప్రవేశిస్తాయి.
గోదావరి నుంచి వరద నీరు వచ్చి అంతర్వేది వద్ద సముద్రంలో కలిసే సమయంలో గుడ్లు పెట్టడం కోసం గోదావరిలోకి ఎదురీదుకుంటూ ప్రవేశిస్తాయి. ఇదంతా జూన్ నుంచి ఆగస్టు మాసాల మధ్య జరుగుతుంది. గుడ్లు పెట్టిన తరువాత మళ్లీ అక్టోబరు నాటికి సముద్రంలో ప్రవేశిస్తాయి. గోదావరి వరదనీటిలో సంతానోత్పత్తికి గుడ్లు పొదగడానికి వచ్చి వలలో పడతాయి.
వలలో పడిన వెంటనే చనిపోవడం, రెండురోజులైనా పాడవకుండా ఉండడం కూడా పులసల విశిష్టత. గోదావరి తీపి నీటిలోకి వచ్చేసరికి ఈ చేప రంగు, రుచీ మారి పులసగా మారుతోంది. అలాగని గోదావరి అంతటా ఈ పులసలుండవు. కేవలం ధవళేశ్వరం బ్యారేజ్ నుంచి సముద్రంలో కలిసే మధ్యలోనే ఇవి దొరుకుతాయి.
Comments
Please login to add a commentAdd a comment