moosi canal
-
మూసీ పునరుజ్జీవం.. ప్రజల ఆకాంక్ష
సాక్షి, యాదాద్రి: మూసీ పునరుజ్జీవం.. ఈ ప్రాంత ప్రజల చిరకాల ఆకాంక్ష అని, ఇందుకు ఎన్ని రూ.కోట్లయినా ఖర్చు చేసేందుకు సీఎం రేవంత్‌రెడ్డి సిద్ధంగా ఉన్నారని భువనగిరి ఎమ్మె ల్యే కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి స్పష్టం చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి మండలం పిలాయపల్లి నుంచి బీబీనగర్ మండలం మక్తా అనంతారం వరకు ఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి ఆధ్వర్యంలో శనివారం ప్రజాచైతన్య యాత్ర చేపట్టారు. ఈ సందర్భంగా మక్తా అనంతారం మూసీ ఒడ్డున ఏర్పాటు చేసిన సభలో ప్రసంగించారు. మూసీ కలుషిత జలాల వల్ల రైతులు, కులవృత్తులతోపాటు రేపటి తరాలు జీవచ్ఛవాలుగా మారే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఆ దుస్థితి రాకముందే పునరుజ్జీవంతో ప్రజలను విముక్తి చేయడమే లక్ష్యంగా ప్రభు త్వం ముందుకెళ్తుందన్నారు. కార్యక్రమంలో భువనగిరి ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం, వందలాది మంది రైతులు, కులవృత్తిదారులు, కూలీలు పాల్గొన్నారు. -
మూసీ దుర్ఘటన; ఆస్పత్రి వద్ద ఆందోళన
సాక్షి, భువనగిరి(యాదాద్రి ) : మూసీ కాలువలో ట్రాక్టర్ బోల్తా పడడంతో 15 మంది కూలీలు మృత్యువాత పడ్డారు. వేములకొండకు చెందిన 30 మంది మహిళా కూలీలు పత్తి విత్తనాలు నాటేందుకు వెళ్లున్న క్రమంలో ఆదివారం ఉదయం ఈ ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. మృతదేహాలను స్థానిక వేములకొండ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పోస్టుమార్టం నిర్వహించారు. భువనగిరి ఎమ్మెల్యే ఫైళ్ల శేఖర్‌రెడ్డి మృతదేహాలను చూసి కన్నీటి పర్యంమయ్యారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వ తరపున 2 లక్షల ఎక్స్‌గ్రేషియా, డబుల్ బెడ్రూం ఇళ్లు నిర్మించి ఇస్తామని మంత్రి జగదీష్‌రెడ్డితో కలిసి ప్రకటించారు. వారి పిల్లల చదువులకయ్యే మొత్తం ఖర్చులను ప్రభుత్వమే భరిస్తుందని హామీనిచ్చారు. అలాగే, తన వంతుగా ఫైళ్ల ఫౌండేషన్ తరపున బాధిత కుటుంబాలకు ఒక్కొక్కరికి లక్ష రూపాయల చొప్పున శేఖర్‌రెడ్డి సాయం ప్రకటించారు. కాగా, 2 లక్షల చొప్పున నష్టపరిహారం ప్రకటించి వెళ్లిపోతున్న మంత్రి జగదీష్ రెడ్డి తీరుపై స్థానిక కాంగ్రెస్, సీపీఐ నేతలు, ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎక్స్‌గ్రేషియా ప్రకటించడంలోనూ, క్షతగాత్రులకు వైద్యసాయం అందించడంలోనూ మంత్రి నిర్లక్ష్యంగా వ్యవహరించారని మండిపడ్డారు. మృతుల కుంటుంబాలకు నష్టపరిహారంగా 20 లక్షల రూపాయలు, ఒక ఉద్యోగం, డబుల్ బెడ్రూం ఇల్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ కోరుతూ ఆస్పత్రి నుంచి మృత దేహాల తరలింపును గ్రామస్తులు అడ్డుకోవడంతో అక్కడ ఉద్రికత్త నెలకొంది. వారిని చెదరగొట్టేందుకు పోలీసులు అదనపు బలగాలను రప్పిస్తున్నారు. -
ట్రాక్టర్ బోల్తా పడి 15 మంది దుర్మరణం
-
మూసీలో బోల్తా పడిన ట్రాక్టర్
-
మూసీలో ఘోర ప్రమాదం.. 15మంది మృతి
సాక్షి, యాదాద్రి : పేద కుటుంబాల్లో పెనువిషాదం అలుముకుంది. రెక్కాడితేగానీ డొక్కాడని నిరుపేద కూలీలను మృత్యువు కబళించింది. యాదాద్రి జిల్లాలో ఆదివారం ఘోరప్రమాదం చోటుచేసుకుంది. మహిళా కూలీలతో ప్రయాణిస్తున్న ట్రాక్టర్ అదుపు తప్పి మూసీ కాలువలో బోల్తా పడింది. వలిగొండ సమీపంలోని లక్ష్మాపురంలో ఈ ఘటన జరిగింది. ఈ ప్రమాదంలో 15మంది మహిళా కూలీలు మృతి చెందారు. ప్రమాద సమయంలో ట్రాక్టర్లో 30మంది మహిళా కూలీలు ఉన్నట్లు తెలుస్తోంది. మృతుల్లో 14మంది పెద్దవాళ్ళు, ఒక చిన్న పిల్లవాడు ఉన్నారు. విషయం తెలుసుకున్న గ్రామస్తులు ఘటన స్థలానికి చేరుకున్నారు. ఆ ప్రాంతంలో ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. అక్కడికి చేరుకున్న మృతుల బంధువులు విలపించిన తీరు వర్ణణాతీతం. మృతులంతా వేములకొండ గ్రామానికి చెందినవారు. వీరిలో తల్లీకొడుకు, తల్లీకూతురులు కూడా ఉన్నారు. దీంతో ఆ గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదానికి డ్రైవర్ నిర్లక్ష్యమే కారణమని మృతుల బంధువులు భావిస్తున్నారు. పత్తి విత్తనాలు నాటడానికి వెళ్తున్న సమయంలో ఈ ఘోరం జరిగిందని గ్రామస్తులు చెబుతున్నారు. మృతుల వివరాలు.. కడింగుల లక్ష్మీ, లక్ష్మి కూతురు అనూష, ఇంజమురి లక్ష్మమ్మ, ఇంజమురి శంకరమ్మ, అంబల రాములమ్మ, చుంచు నర్మదా, కందల భాగ్యమ్మ, ఏనుగుల మాధవి, జడిగి మరమ్మ ,పంజల భాగ్యమ్మ, బిసు కవిత, బంధారపు స్వరూప,గానే బోయిన అండలు, అరూర్ మణెమ్మ, ఆంధ్రా ప్రాంతానికి చెందిన తల్లీ కొడుకులు ఉన్నట్లుగా గుర్తించారు. యాదాద్రి ప్రమాదంపై సీఎం కేసీఆర్ దిగ్భ్రాంతి.. యాదాద్రి జిల్లా ట్రాక్టర్ ప్రమాద ఘటనపై ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు తీవ్ర దిగ్భాంత్రి వ్యక్తం చేశారు. మృతులు కుటుంబాలకు సీఎం కేసీఆర్ ప్రగాఢ సానుభూతి తెలిపారు. అంతేకాక ప్రమాదంలో గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. వలిగొండ ప్రమాదంపై గట్టు శ్రీకాంత్ రెడ్డి దిగ్ర్భాంతి.. వలిగొండ ట్రాక్టర్ ప్రమాదంపై వైఎస్సార్సీపీ రాష్ట్ర అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్ రెడ్డి తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. ఇలాంటి సంఘటనలు జరగడం దురదృష్టకరమన్నారు. అంతేకాక క్షతగాత్రులకు సకాలంలో వైద్యం అందేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. మృతుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని గట్టు శ్రీకాంత్ రెడ్డి డిమాండ్ చేశారు. ప్రమాదంపై మంత్రి జగదీష్ రెడ్డి దిగ్భాంత్రి వలికొండ ట్రాక్టర్ ప్రమాదంపై మంత్రి జగదీష్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బోనగిరి- యాదాద్రి జిల్లాల అధికారులను మంత్రి అప్రమత్తం చేశారు. ప్రమాదం విషయం తెలిసిన వెంటనే జిల్లా కలెక్టర్, డీసీపీలతో ఫోన్లో సమీక్షించారు. అంతేకాక సంఘటన స్థలానికి వెళ్లి సహాయక చర్యలు చేపట్టాలని భువనగిరి శాసనసభ్యులు ఫైళ్ల శేఖర్ రెడ్డిని మంత్రి ఆదేశించారు. ఈ విధమైన సంఘటన దురదృష్టకరమని మంత్రి అన్నారు. క్షతగాత్రులకు సకాలంలో వైద్యం అందేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌కు మంత్రి జగదీష్ రెడ్డి సూచించారు. -
మూసీ పరిధిలో కబ్జా ఆస్తులు స్వాధీనం చేసుకోవాలి: సీఎస్
సాక్షి,సిటీబ్యూరో: మెట్రో పనులు జరిగేందుకు వీలుగా మహాత్మాగాంధీ బస్‌స్టేషన్ నుంచి రంగ్‌మహల్ జంక్షన్ వరకు మూసీపై మూడోవంతెన నిర్మాణానికి వీలుగా నదిగర్భంలో కబ్జాకు గురైన ప్రభుత్వ ఆస్తులను తక్షణం స్వాధీనం చేసుకోవాలని రెవెన్యూ విభాగం అధికారులను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ ఆదేశించారు. మంగళవారం మెట్రో ప్రాజెక్టుపై సచివాలయంలో జరిగిన స్పెషల్ టాస్క్ ఫోర్స్ సమావేశంలో పనుల పురోగతిని ఆయన సమీక్షించారు. ఆస్తుల స్వాధీనానికి హైదరాబాద్ జిల్లా కలెక్టర్, పోలీసు కమిషనర్, జీహెచ్ఎంసీ కమిషనర్, హెచ్ఎంఆర్ ఎండీలు సంయుక్తంగా ప్రత్యేక డ్రైవ్ నిర్వహించాలని ఆదేశించారు. మూసీపై మూడో వంతెన నిర్మాణానికి ఇరిగేషన్ విభాగం జీహెచ్ఎంసీ,హెచ్‌ఎంఆర్‌లకు సహకరించాలని సూచిం చారు. ప్రధాన నగరంలోని రహదారులపై మెట్రో పనులు జరిగేందుకు వీలుగా తాజాగా 27 ఆస్తులను తొలగించామని జీహెచ్ఎంసీ అధికారులు వివరించారు. మరో 254 ఆస్తులను తొలగించాల్సి ఉందని ఆయన దృష్టికి తీసుకొచ్చారు. ఇందులో 193 ప్రైవేటు, మరో 61 మున్సిపల్ ఆస్తులున్నట్లు తెలిపారు. ఆస్తుల సేకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని సంబంధిత అధికారులను సీఎస్ ఆదేశించారు. జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్, పెద్దమ్మ దేవాలయం, మాదాపూర్, మధురానగర్, ఖైరతాబాద్,నాంపల్లి ప్రాంతాల్లో మెట్రో పనులకు అడ్డుగా ఉన్న 33 కెవి, 11 కెవి విద్యుత్ లైన్స్‌ను మార్పుచేయాలని టీఎస్ ఎస్పీడీసీఎల్ అధికారులను ఆదేశించారు. మెట్రో పనుల కోసం రహదారులపై తవ్విన గుంతలను తక్షణం పూడ్చివేయాలని, పనులు పూర్తయిన ప్రాంతాల్లో ట్రాఫిక్‌కు అంతరాయం లేకుండా చూడాలని సూచించారు. సమావేశంలో రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి బి.ఆర్.మీనా, జీహెచ్ఎంసీ కమిషనర్ సోమేష్ కుమార్,హెచ్ఎంఆర్ ఎండీ ఎన్వీఎస్రెడ్డి ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
మూడు నదుల అనుసంధానం....ముందుతరాలకు జీవనాధారం
సూర్యాపేట, న్యూస్‌లైన్: సూర్యాపేట నియోజకవర్గంలో బిరబిరా పొంగే కృష్ణమ్మ.. గలగల పారే గోదారమ్మ జలాలు పరుగులు తీస్తున్నాయి. ఎగిసి పడే మూసీ ప్రవాహపు జలసిరులు ఉన్నాయి. అయినా సాగు, తాగు నీటి కొరత వేధిస్తూనే ఉంది. ఎస్సారెస్పీ, ఏఎమ్మార్పీ కాలువలను మూసీ నదిలోకి అనుసంధానం చేస్తే ఈ ప్రాంతమంతా సస్యశ్యామలమవుతుంది. ఈ నేపథ్యంలోనే త్రివేణి సంగమం తెరపైకి వచ్చింది. దీనికోసం కొందరు పోరుబాట పట్టారు. అనుసంధానం ఇలా.. సూర్యాపేట నియోజకవర్గంలోని సోలిపేట గ్రామం వద్ద 1954లో మూసీ ప్రాజెక్ట్ నిర్మాణం చేపట్టారు. రంగారెడ్డి జిల్లా వికారాబాద్, అనంతగిరి పర్వతశ్రేణుల నుంచి ప్రవహిస్తూ వస్తున్న మూసీ నీటిని నిల్వ ఉంచేందుకు ఇక్కడ ఏర్పాటుచేసిన ప్రాజెక్ట్ 1958నాటికి పూర్తయింది. ఎడమ కాలువ 41 కి.మీ, కుడి కాలువ 38 కి.మీ ప్రవహించి 40 గ్రామాల ప్రజలకు సాగునీరు ఇస్తుంది. 595 అడుగుల లోతు, 571 క్యూసెక్కుల నీటినిల్వ సామర్థ్యంతో 30 క్రస్ట్‌గేట్లతో ప్రాజెక్ట్ నిర్మించారు. ఎడమ కాలువ ద్వారా సూర్యాపేట, చివ్వెంల, పెన్‌పహాడ్ మండలాల్లో 20వేల ఎకరాల వ్యవసాయ భూములకు నీరందుతుంది. కృష్ణాజలాలు మూసీలో ఎలా.. ఎక్కడ కలుస్తాయంటే.. మూసీ ప్రాజెక్ట్‌లోకి కృష్ణానీటిని వదిలితే ఎక్కు వ భూమి సాగులోకి వచ్చే అవకాశం ఉంది. 1972లో అప్పటి ముఖ్యమంత్రి టి.అంజయ్య ఎస్ఎల్బీసీ పనులు సర్వే చేయించగా 1983లో అధికారం చేపట్టిన ఎన్టీ రామారావు *52 కోట్లు విడుదల చేసి పనులకు శంకుస్థాపన చేశారు. దీంతో 30 టీఎంసీల నీటిని 3లక్షల ఎకరాలకు నీరివ్వాలాని ప్రతిపాదించారు. లిఫ్ట్ ద్వారా 22టీఎంసీల నీటిని అక్కంపల్లి, పానగల్లు (ఉదయసముద్రం) నుంచి మూసీ రిజర్వాయర్లకు నీటిని అందిస్తే 2.20 లక్షల ఎకరాలకు సాగునీరు ఇవ్వచ్చని ప్రణాళిక రూపొందిం చారు. దీని ప్రకారం ఉదయసముద్రం నుంచి ఏఎమ్మార్పీ ప్రధాన కాలువ ద్వారా కట్టంగూరు మండలం అయిటిపాముల చెరువుకు 2003లో కృష్ణా జలాలు చేరుకున్నాయి. 2004లో నకిరేకల్ మండలం నోముల గ్రామం వరకు నీటిని పంపే ఏర్పాటు చేశారు. ఏఎమ్మార్పీ చివరి పాయింట్ మూసీ నది అయినప్పటికీ కృష్ణాజలాలు మూసీలో కలవడంలేదు. నోముల వరకు ఉన్న ఏఎమ్మార్పీ కాలువను మూసీలో కలిపితే కృష్ణానీరు మూసీలో కలుస్తుంది. గోదావరి జలాలు.. 1969లో అప్పటి ప్రభుత్వం శ్రీరాంసాగర్ ప్రాజెక్టు (ఎస్సారెస్పీ) రెండో దశ నిర్మాణం చేపట్టి నల్లగొండ, ఖమ్మం, వరంగల్ జిల్లాలకు నీరందిస్తామని ప్రకటించింది. 1996లో ఎస్సారెస్పీ కాలువ పనులకు అనుమతిచ్చింది. వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రి అయిన వెంటనే 2004 నుంచి పనులు వేగవంతమై 2009 నాటికి నీరు విడుదల అయ్యింది. జిల్లా వ్యాప్తంగా దీని ద్వారా 2లక్షల 57వేల 508 ఎకరాలు పంట పొలాలకు నీరందనుంది. ఒక్క సూర్యాపేట నియోజకవర్గంలోనే 95 వేల354 ఎకరాలకు నీరందేలా కాలువలు తవ్వారు. కానీ, నేటికీ నీటి విడుదల కాలేదు. ఉపయోగం సరిగా లేదు. ఎస్సారెస్పీ రెండో దశ ద్వారా వస్తున్న గోదావరి నీటిని ప్రధాన కాలువ ద్వారా మూసీ ప్రాజెక్ట్‌కు తరలిస్తే ఈ ప్రాంత భూములు మరింత ఉపయోగంలోకి వస్తాయి. ఎస్సారెస్పీ ప్రధాన కాలువను మూసీ ఉప నది బిక్కేరు వాగులో కలిపితే గోదావరి జలాలు మూసీ ప్రాజెక్ట్‌కు అందుతాయి. ఈ రకంగా మూసీ ప్రాజెక్ట్‌కు అత్యంత చేరువగా ఉన్న కృష్ణా, గోదావరి జలాలను మూసీలో కలిపితే మూడు నదులు కలిసి త్రివేణి సంగమంగా ఏర్పడటమే కాదు.. తవ్విన అన్ని కాలువలకు నీరందుతుంది. మూసీ నదిలో కృష్ణా, గోదావరి జలాలను కలిపిన తరువాత మూసీ ప్రాజెక్ట్ నుంచి అర్వపల్లి మండలం తిమ్మాపురం గ్రామం వద్ద ఉన్న ఎస్సారెస్పీ కాలువల్లోకి నీటిని లిఫ్ట్ ద్వారా చేర్చితే ఆత్మకూర్(ఎస్), చివ్వెంల, పెన్‌పహాడ్ మండలాల్లోని కాలువలు జలకళ సంతరించుకుని రైతులకు ప్రయోజనం కలుగుతుంది. త్రివేణిసంగమ పోరుయాత్ర.. మూడు నదుల అనుసంధానం చేసి త్రివేణి సంగమంగా ఏర్పాటు చేయాలనే నినాదంతో ఇటీవల సూర్యాపేట నియోజకవర్గంలో కొంతమంది ఆత్మకూర్(ఎస్) సింగిల్‌విండో చైర్మన్ బీరెల్లి శ్రీనివాసరెడ్డి నేతృత్వంలో నియోజకవర్గ వ్యాప్తంగా పోరుయాత్ర నిర్వహించారు. వివిధ రాజకీయపార్టీల ముఖ్య నేతలను కలిసి వినతిపత్రాలు అందజేశారు. ప్రజల్లో చైతన్యం తెచ్చేందుకు గ్రామాల్లో పర్యటించారు. -
మూసీ కాల్వలోకి జారిపడిన ఓ చిన్నారి
హైదరాబాద్: ప్రమాదవశాత్తు ఓ చిన్నారి మూసీ కాల్వలోకి జారి పడిన ఘటన గురువారం స్థానికంగా కలకలం రేపింది. ఏడాదిన్నర వయస్సున చిన్నారి మాన్వీ తల్లి దండ్రుల చేతుల్లోంచి అకస్మికంగా జారి మూసీ కాల్వలోకి పడిపోయింది. చిన్నారి కుటుంబ సభ్యలు నాగోల్ మూసీ నదీ పరిసరప్రాంతాలను సందర్శిస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. దీంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు గురైయ్యారు. సమాచారం అందుకున్నఅగ్ని మాపక సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. మూసీ కాల్వ ప్రవాహం ఉధృతంగా ఉండటంతో చిన్నారిని వెతకటం కష్టతరంగా మారింది. చిన్నారి మాన్వీ తండ్రి యకేలో డాక్టర్‌గా పని చేస్తున్నాడు.