మూసీ పరిధిలో కబ్జా ఆస్తులు స్వాధీనం చేసుకోవాలి: సీఎస్
సాక్షి,సిటీబ్యూరో: మెట్రో పనులు జరిగేందుకు వీలుగా మహాత్మాగాంధీ బస్‌స్టేషన్ నుంచి రంగ్‌మహల్ జంక్షన్ వరకు మూసీపై మూడోవంతెన నిర్మాణానికి వీలుగా నదిగర్భంలో కబ్జాకు గురైన ప్రభుత్వ ఆస్తులను తక్షణం స్వాధీనం చేసుకోవాలని రెవెన్యూ విభాగం అధికారులను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ ఆదేశించారు. మంగళవారం మెట్రో ప్రాజెక్టుపై సచివాలయంలో జరిగిన స్పెషల్ టాస్క్ ఫోర్స్ సమావేశంలో పనుల పురోగతిని ఆయన సమీక్షించారు. ఆస్తుల స్వాధీనానికి హైదరాబాద్ జిల్లా కలెక్టర్, పోలీసు కమిషనర్, జీహెచ్‌ఎంసీ కమిషనర్, హెచ్‌ఎంఆర్ ఎండీలు సంయుక్తంగా ప్రత్యేక డ్రైవ్ నిర్వహించాలని ఆదేశించారు. మూసీపై మూడో వంతెన నిర్మాణానికి ఇరిగేషన్ విభాగం జీహెచ్‌ఎంసీ,హెచ్‌ఎంఆర్‌లకు సహకరించాలని సూచిం చారు.
ప్రధాన నగరంలోని రహదారులపై మెట్రో పనులు జరిగేందుకు వీలుగా తాజాగా 27 ఆస్తులను తొలగించామని జీహెచ్‌ఎంసీ అధికారులు వివరించారు. మరో 254 ఆస్తులను తొలగించాల్సి ఉందని ఆయన దృష్టికి తీసుకొచ్చారు. ఇందులో 193 ప్రైవేటు, మరో 61 మున్సిపల్ ఆస్తులున్నట్లు తెలిపారు. ఆస్తుల సేకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని సంబంధిత అధికారులను సీఎస్ ఆదేశించారు. జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్, పెద్దమ్మ దేవాలయం, మాదాపూర్, మధురానగర్, ఖైరతాబాద్,నాంపల్లి ప్రాంతాల్లో మెట్రో పనులకు అడ్డుగా ఉన్న 33 కెవి, 11 కెవి విద్యుత్ లైన్స్‌ను మార్పుచేయాలని టీఎస్ ఎస్‌పీడీసీఎల్ అధికారులను ఆదేశించారు. మెట్రో పనుల కోసం రహదారులపై తవ్విన గుంతలను తక్షణం పూడ్చివేయాలని, పనులు పూర్తయిన ప్రాంతాల్లో ట్రాఫిక్‌కు అంతరాయం లేకుండా చూడాలని సూచించారు. సమావేశంలో రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి బి.ఆర్.మీనా, జీహెచ్‌ఎంసీ కమిషనర్ సోమేష్ కుమార్,హెచ్‌ఎంఆర్ ఎండీ ఎన్వీఎస్‌రెడ్డి ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.