ప్రసాద్ అరెస్టును నిరసిస్తూ ఇల్లెందులో ర్యాలీ నిర్వహిస్తున్న ఎన్డీ నాయకులు
ఇల్లెందు ఖమ్మం : న్యూడెమోక్రసీ రాయల వర్గం మణుగూరు ఏరియా దళ నేత భట్టు సురేష్ అలియాస్ ప్రసాద్‌ను పోలీసులు సోమవారం తెల్లారుజామున ఇల్లెందు మండలం రొంపేడు కొత్తగుంపులో విశ్రాంతి తీసుకుంటుండగా అదుపులోకి తీసుకున్నారు. ఆళ్లపల్లి మండలం రాయిగూడెం గ్రామానికి చెందిన భట్టు సురేష్ అలియాస్ ప్రసాద్ 12 ఏళ్ల క్రితం అజ్ఞాతంలోకి వెళ్లారు.
గుండాల, ఆళ్లపల్లి, మణుగూరు, కొత్తగూడెం, పాల్వంచ, బంగారుచెలక, అశ్వాపురం, మణుగూరు, పినపాక ఏరియాలో వివిధ దళాల్లో సభ్యుడుగా, డిప్యూటీ కమాండర్‌గా, కమాండర్‌గా పనిచేశారు. ఐదారేళ్లుగా మణుగూరు ఏరియాలో దళ కమాండర్‌గా పని చేస్తున్నాడు. రెండు రోజుల క్రితం అనారోగ్యంతో రొంపేడులోని తన అత్తగారి ఇంటికి చేరాడు.
అక్కడే కుటుంబ సభ్యులతో విశ్రాంతి తీసుకుంటున్నాడు. పక్కా సమాచారంతో సోమవారం తెల్లారుజామున ప్రసాద్ అత్తగారింటిని చుట్టుముట్టి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అక్కడి నుంచి బోడు పోలీస్ స్టేషన్‌కు తరలించినట్లు తెలిసింది. అజ్ఞాతంలోకి వెళ్లక ముందే ప్రసాద్‌కు భార్య వీరాకుమారి, పిల్లలు నవీన్‌కుమార్, నందినిలున్నారు.
తండ్రి బట్టు పాపయ్య కూడా 20 ఏళ్ల క్రితం తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలో అజ్ఞాత దళ నేతగా కొంత కాలం పనిచేశారు. ప్రస్తుతం ప్రసాద్ 38 ఏళ్ల వయస్సు ఉంటుందని, 12 ఏళ్లుగా అజ్ఞాతంలో పని చేస్తున్నట్లు ఎన్డీ రాయల వర్గం పేర్కొంది.
ప్రసాద్‌ను విడుదల చేయాలని ఎన్డీ ఆందోళన
మణుగూరు ఏరియా దళ నేత భట్టు సురేష్ అలియాస్ ప్రసాద్‌ను పోలీసులు అరెస్టు చేయటాన్ని నిరశసిస్తూ ఎన్డీ రాయలవర్గం సోమవారం ఇల్లెందు లో ర్యాలీ నిర్వహించారు. పట్టణ ప్రధాన వీధుల గుండా సాగిన ర్యాలీలో ఆ పార్టీ నేతలు రాజు, తుపాకుల నాగేశ్వరరావు, కిన్నెరనర్సయ్య, నర్సింహారావు, సారంగపాణి, భాస్కర్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment