
కొత్తగూడ(ములుగు): సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ పెద్ద చంద్రన్న వర్గం అజ్ఞాత దళానికి చెందిన వారిని ఆయుధాలతో సహా గురువారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలం గుండ్రపల్లి సమీప అటవీ ప్రాంతంలో దళకమాండర్లు జంపన్న అలియాస్ జక్కుల సమ్మయ్య, కేకే అలియాస్ క్రాంతికుమార్, ప్రదీప్ అలియాస్ సోలం పాపారావుతో పాటు దళసభ్యులు వినోద్, అశోక్, ఆనంద్ సమావేశమైనట్లు సమాచారం తెలుసుకున్న పోలీసులు చుట్టుముట్టి పట్టుకున్నారు. వారిని పోలీసులు అదుపులోకి తీసుకుని ఎస్పీ కార్యాలయానికి తరలించారు.
ఇందులో జంపన్న కొత్తగూడ మండలం పెగడపల్లి, ప్రదీప్ గుంజేడు గ్రామాలకు చెందిన వారు కాగా, మిగతా వారి వివరాలు తెలియాల్సి ఉంది. వీరి వద్ద 2 ఎస్‌ఎల్‌ఆర్, 9 ఎంఎం కార్బన్ 1, 8 ఎంఎం తుపాకులు రెండు, 5 కిట్ బ్యాగులు, 3 సెల్‌ఫోన్‌లు పోలీసులకు లభించినట్లు సమాచారం. మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ – గంగారం మండలాల పరిధిలో గురువారం పోలీసులు అదుపులోకి తీసుకున్న సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ సూర్యం దళ సభ్యులను వెంటనే కోర్టులో హాజరు పరచాలని ఆ పార్టీ అజ్ఞాత దళ నేత ఖమ్మం, వరంగల్ జిల్లా ఏరియా దళ కమాండర్ ప్రసాద్ కోరారు.గురువారం రాత్రి ఆయన ‘సాక్షి’తో ఫోన్‌లో మాట్లాడారు. పోలీసులు వారికి ఎలాంటి హాని తలపెట్టొద్దని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment