nd leaders
-
ఎన్డీ రాష్ట్ర కమిటీ సభ్యుడు గోపన్న అరెస్ట్
సాక్షి, ఖమ్మం (కొత్తగూడెం) : వ్యాపారులు, స్థానికంగా పని చేస్తున్న కాంట్రాక్టర్లను చందాల నిమిత్తం తుపాకులతో బెదిరిస్తూ భయభ్రాంతులకు గురి చేస్తున్న సీపీఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ రాష్ట్ర కమిటీ సభ్యుడు దనసరి సమ్మయ్య అలియాస్ గోపన్నను అరెస్టు చేసినట్లు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ సునీల్‌దత్ వెల్లడించారు. మంగళవారం స్థానిక ఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్పీ వివరాలను వెల్లడించారు. కొద్ది రోజుల క్రితం పోలీసులపై కాల్పులు జరిపి పారి పోయిన అజ్ఞాత సాయుధ దళ సభ్యుల కొరకు వెతుకుతుండగా కొత్తగూడ మండలం మహబూబాబాద్ జిల్లాకు చెందిన గోపన్న గుండాలలోని రాయగూడెం అటవీ ప్రాంతంలో, కేసు పరిశోధన అధికారి, మహబూబాబాద్ డీఎస్పీ, గుండాల సీఐ సిబ్బందితో కలిసి గోపన్నను అరెస్టు చేసి, ఆయన వద్ద ఉన్న 303 బోల్ట్ యాక్షన్ తుపాకీ, తూటాలు స్వాధీన పరుచుకున్నట్లు వివరించారు. గోపన్నపై మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూ డెం జిల్లాలోని వివిధ పోలీసు స్టేషన్లలో 13 కేసులు నమోదు అయినట్లు తెలిపారు. గోపి అమాయక గిరిజనులను, ప్రజలను రెచ్చగొడుతూ పోడుభూముల పేరుతో అడవులను నరికిస్తున్నాడు. న్యూడెమోక్రసీ పార్టీకి ఓపెన్ క్యాడర్ ఉన్నప్పటికీ వారి మాట వినని ప్రజలను, నాయకులను, ప్రభుత్వ అధికారులను అజ్ఞాత సాయుధ దళాలచే బెదిరిస్తూ వారిపై భౌతికదాడులకు పాల్పడుతున్నారని వివరించారు. అజ్ఞాత సాయుధ దళాల కార్యకలపాలు పెచ్చుమీరిపోయి సాధారణ ప్రజానీకానికి అభివృద్ధి కార్యకలాపాలకు అడ్డంకిగా మారారు. వీరిని అదుపు చేసే క్రమంలో గతంలో చాలాసార్లు అజ్ఞాత సాయుధ దళాలు పోలీసుల మీద కాల్పులకు దిగగా వివిధ పోలీసు స్టేషన్లలో కేసులు కూడా నమోదయ్యాయి. అయినప్పటికీ వారి పద్ధతి మార్చుకోకుండా అజ్ఞాత సాయుధ దళాల నాయకుడు లింగన్న ఆధ్వర్యంలో చట్ట వ్యతిరేక కార్యకలాపాలు నిర్వహిస్తున్నాడు. చందాల కోసం ఇటీవల తునికాకు కాంట్రాక్టర్లను బెదిరించి వసూళ్లకు పాల్పడిన న్యూడెమోక్రసీ పార్టీ ఇల్లెందు టౌన్ కార్యదర్శి తుపాకుల నాగేశ్వరరావును పట్టుకొని ఇల్లెందు పోలీసు స్టేషన్లో కేసు నమోదు చేసి రూ.6 లక్షలు స్వాధీన పరుచుకున్నట్లు వివరించారు. గతంలో వారిపై అనేక కేసు లు నమోదు అయినప్పటికీ వారి పద్ధతి మా ర్చుకోకుండా అజ్ఞాత సాయుధ దళం కొద్ది రోజుల క్రితం గుండాల మండలం రోళ్లగడ్డ అటవీ ప్రాం తంలో మకాం వేసి చందాల కొరకు కాంట్రాక్టర్లు, వ్యాపారస్తులను, పోడు భూముల పేరుతో అమాయక ప్రజలను రెచ్చగొడుతూ చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారనే సమాచారం మేరకు పోలీసులు జూలై 31న గాలింపు చర్యలు చేపట్టి అజ్ఞాత సాయుధ దళాన్ని అదుపులోకి తీసుకొనే క్రమంలో లింగన్న సాయుధ దళం పోలీసులపై కాల్పులు జరుపగా, ఇరువైపులా జరిగిన కాల్పుల్లో దళ నాయకుడైన లింగన్న మరణించాడని, ఇతర దళ సభ్యులు తుపాకులతో తప్పించుకున్నారని వివరించారు. పారిపోయిన అజ్ఞాత సాయుధ దళ సభ్యుల కొరకు వెతుకుతుండగా గోపన్న దొరకడంతో అరెస్టు చేశామని, అతడిని కోర్టులో హాజరు పరుస్తున్నట్లు వివరించారు. ఈ సమావేశంలో ఓఎస్డీ ఉదయ్‌కుమార్‌రెడ్డి, మహబూబాబాద్ డీఎస్పీ నరేష్కుమార్, సీఐ శ్రీనివాస్, ఎస్సై సురేష్, శ్రావణ్‌కుమార్ పాల్గొన్నారు. -
ఉద్రిక్తంగా గుండాల అటవీ ప్రాంతం
సాక్షి, ఖమ్మం: కొత్తగూడెం జిల్లా గుండాల మండలం రోళ్లగడ్డ అటవీ ప్రాంతంలో పోలీసులకు, న్యూడెమోక్రసీ అజ్ఞాత దళానికి మధ్య ఎదురు కాల్పులు జరుగుతోన్న విషయం తెలిసిందే. ఈ ఘటనలో ఓ దళ సభ్యుడు మరణించగా.. ఏడుగురు సభ్యులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరో దళ సభ్యుడు గాయపడి వరంగల్ వైపు వస్తున్నట్లు పోలీసులకు సమచారం అందింది. దీంతో వరంగల్ జిల్లా పోలీసులు అప్రమత్తమై వర్ధన్నపేట పట్టణం, వరంగల్ ఖమ్మం ప్రధాన రహదారి పై విస్తృతంగా వాహనాలు తనిఖీ నిర్వహిస్తున్నారు. మావోయిస్టు వారోత్సవాల సందర్భంగా అటవీ ప్రాంతంలో తిరుగుతున్న వీరు పోలీసులకు కనిపించిన సమయంలో ఇరువర్గాల మధ్య కాల్పులు మొదలయ్యాయి. ప్రస్తుతం దేవలగూడెం అటవీ ప్రాంతంలో ఉద్రిక్త వాతావరణం కనిపిస్తోంది. లింగన్న దళానికి చెందిన ఏడుగురు సభ్యులను పోలీసుల అదుపులోకి తీసున్నారని వారికి ఎటువంటి హాని తలపెట్టవద్దని న్యూడెమోక్రసీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇల్లందు పట్టణంలో ధర్నా చేపట్టారు. మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య ఆధ్వర్యంలో సుమారు 300 మంది పార్టీ కార్యకర్తలు, గ్రామస్థులు పోలీసులను చుట్టుముట్టారు. దీంతో పోలీసులు గాలిలోకి కాల్పులు జరిపారు. దళాలకు, పోలీసుల మధ్య కాల్పుల చోటుచేసుకోవడంతో గుండాల అటవీ ప్రాంతం ఉద్రిక్తంగా మారింది. -
తుపాకుల మోతతో దద్దరిల్లుతున్న గుండాల
సాక్షి, ఖమ్మం: కొత్తగూడెం జిల్లా గుండాల మండలం రోళ్లగడ్డ అటవీ ప్రాంతంలో పోలీసులకు, న్యూడెమోక్రసీ అజ్ఞాత దళానికి మధ్య ఎదురు కాల్పులు జరుగుతున్నాయి. దేవలగూడెం అడవుల్లో లింగన్న దళానికి, పోలీసులకు మధ్య ఉదయం నుండి భారీ ఎత్తున ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయి. ఈ కాల్పుల్లో దళ కమాండర్ లింగన్నతో సహా, ఓ దళ సభ్యుడు మరణించినట్లు తెలుస్తోంది. దీనిని పోలీసులు నిర్థారించాల్సి ఉంది. గత కొంత కాలంగా దేవలగూడెం అటవీ ప్రాంతంలో లింగన్న దళం సంచరిస్తోందన్న సమాచారం పోలీసులు అందింది. దీంతో బుధవారం ఉదయం నుంచి అజ్ఞాత దళాన్ని టార్గెట్‌గా చేసుకుని పోలీసులు కాల్పులు జరుపుతున్నారు. దీంతో తుపాకుల మోతతో దేవలగూడెం,గుండాల అటవీప్రాంతం దద్దరిల్లుతోంది. అయితే కాల్పులకు వ్యతిరేకంగా ఇల్లందు పట్టణంలో న్యూడెమోక్రసి నేతలు ర్యాలీ నిర్వహించారు. ఏకపక్షంగా జరుపుతున్న కాల్పులను నిలిపివేయాలంటూ ఇల్లందు మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య డిమాండ్ చేశారు. -
ఎన్డీ దళ నాయకులుముగ్గురి అరెస్ట్
ఇల్లెందు ఖమ్మం : ఎన్డీ రాయల వర్గం దళ నేత సంగపొంగు ముత్తయ్య అలియాస్ పుల్లన్నను, ఆయన భార్య జయను, మరో దళ సభ్యుడు కృష్ణను మహబూబాబాద్ జిల్లా గంగారం మండలం పెద్దఎల్లాపురంలో పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. ఇరవయ్యేళ్లుగా అజ్ఞాతంలోనే... బయ్యారం మండలం ఇర్సులాపురం గ్రామానికి చెందిన సంగపొంగు ముత్తయ్య అలియాస్ పుల్లన్న.. 1996లో ఎన్డీ ప్రజాప్రతిఘటన అజ్ఞాత దళంలో చేరాడు. ఇల్లెందు ఏరియా, పాఖాల కొత్తగూడ, దుబ్బగూడెం ఏరియా దళాల నేతగా పనిచేశారు. 2012–13లో ఎన్డీలో చీలిక తరువాత చంద్రన్న వర్గంలోకి వెళ్లారు. కొన్నాళ్లకే రాయల గూటికి వచ్చారు. మహబూబాబాద్ జిల్లాలో కీలక నేతలు అరెస్టవడంతో జిల్లా ఇన్చార్జ్ బాధ్యతలను పుల్లన్న నిర్వహిస్తున్నట్టు తెలిసింది. వరుస అరెస్టులు న్యూడెమోక్రసీ అజ్ఞాత దళ అగ్ర నేతలందరినీ పోలీసులు వరుసగా అరెస్ట్ చేస్తున్నారు. ఈ ఏడాదిలో రాష్ట్ర నాయకుడు ఆవునూరి నారాయణస్వామి (మధు) రెండుసార్లు అరెస్టయ్యారు. దనసరి సమ్మయ్య(గోపి), పూనెం లింగయ్య(లింగన్న), యదళ్లపల్లి విశ్వనాధం(ఆజాద్), కొమురం వెంకటేశ్లర్లు(గణేష్) అరెస్టయ్యారు. ఆ తర్వాత చాలామందిని పోలీసులు అరెస్ట్ చేశారు. వీరిలో ఆజాద్ బయటికొచ్చిన తరువాత తిరిగి అజ్ఞాతంలోకి వెళ్లారు. గణేష్ కూడా విడుదలయ్యాడు. ఆయన మాత్రం టీఆర్ఎస్లో చేరారు. ఎన్డీ చంద్రన్న వర్గం నాయకులు సురేష్, ప్రతాప్‌ను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. -
పోలీసుల అదుపులో ఎన్డీ దళ నేత
ఇల్లెందు ఖమ్మం : న్యూడెమోక్రసీ రాయల వర్గం మణుగూరు ఏరియా దళ నేత భట్టు సురేష్ అలియాస్ ప్రసాద్‌ను పోలీసులు సోమవారం తెల్లారుజామున ఇల్లెందు మండలం రొంపేడు కొత్తగుంపులో విశ్రాంతి తీసుకుంటుండగా అదుపులోకి తీసుకున్నారు. ఆళ్లపల్లి మండలం రాయిగూడెం గ్రామానికి చెందిన భట్టు సురేష్ అలియాస్ ప్రసాద్ 12 ఏళ్ల క్రితం అజ్ఞాతంలోకి వెళ్లారు. గుండాల, ఆళ్లపల్లి, మణుగూరు, కొత్తగూడెం, పాల్వంచ, బంగారుచెలక, అశ్వాపురం, మణుగూరు, పినపాక ఏరియాలో వివిధ దళాల్లో సభ్యుడుగా, డిప్యూటీ కమాండర్‌గా, కమాండర్‌గా పనిచేశారు. ఐదారేళ్లుగా మణుగూరు ఏరియాలో దళ కమాండర్‌గా పని చేస్తున్నాడు. రెండు రోజుల క్రితం అనారోగ్యంతో రొంపేడులోని తన అత్తగారి ఇంటికి చేరాడు. అక్కడే కుటుంబ సభ్యులతో విశ్రాంతి తీసుకుంటున్నాడు. పక్కా సమాచారంతో సోమవారం తెల్లారుజామున ప్రసాద్ అత్తగారింటిని చుట్టుముట్టి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అక్కడి నుంచి బోడు పోలీస్ స్టేషన్‌కు తరలించినట్లు తెలిసింది. అజ్ఞాతంలోకి వెళ్లక ముందే ప్రసాద్‌కు భార్య వీరాకుమారి, పిల్లలు నవీన్‌కుమార్, నందినిలున్నారు. తండ్రి బట్టు పాపయ్య కూడా 20 ఏళ్ల క్రితం తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలో అజ్ఞాత దళ నేతగా కొంత కాలం పనిచేశారు. ప్రస్తుతం ప్రసాద్ 38 ఏళ్ల వయస్సు ఉంటుందని, 12 ఏళ్లుగా అజ్ఞాతంలో పని చేస్తున్నట్లు ఎన్డీ రాయల వర్గం పేర్కొంది. ప్రసాద్‌ను విడుదల చేయాలని ఎన్డీ ఆందోళన మణుగూరు ఏరియా దళ నేత భట్టు సురేష్ అలియాస్ ప్రసాద్‌ను పోలీసులు అరెస్టు చేయటాన్ని నిరశసిస్తూ ఎన్డీ రాయలవర్గం సోమవారం ఇల్లెందు లో ర్యాలీ నిర్వహించారు. పట్టణ ప్రధాన వీధుల గుండా సాగిన ర్యాలీలో ఆ పార్టీ నేతలు రాజు, తుపాకుల నాగేశ్వరరావు, కిన్నెరనర్సయ్య, నర్సింహారావు, సారంగపాణి, భాస్కర్ పాల్గొన్నారు. -
పోలీసుల అదుపులో ఎన్డీ దళ సభ్యులు
కొత్తగూడ(ములుగు): సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ పెద్ద చంద్రన్న వర్గం అజ్ఞాత దళానికి చెందిన వారిని ఆయుధాలతో సహా గురువారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలం గుండ్రపల్లి సమీప అటవీ ప్రాంతంలో దళకమాండర్లు జంపన్న అలియాస్ జక్కుల సమ్మయ్య, కేకే అలియాస్ క్రాంతికుమార్, ప్రదీప్ అలియాస్ సోలం పాపారావుతో పాటు దళసభ్యులు వినోద్, అశోక్, ఆనంద్ సమావేశమైనట్లు సమాచారం తెలుసుకున్న పోలీసులు చుట్టుముట్టి పట్టుకున్నారు. వారిని పోలీసులు అదుపులోకి తీసుకుని ఎస్పీ కార్యాలయానికి తరలించారు. ఇందులో జంపన్న కొత్తగూడ మండలం పెగడపల్లి, ప్రదీప్ గుంజేడు గ్రామాలకు చెందిన వారు కాగా, మిగతా వారి వివరాలు తెలియాల్సి ఉంది. వీరి వద్ద 2 ఎస్ఎల్ఆర్, 9 ఎంఎం కార్బన్ 1, 8 ఎంఎం తుపాకులు రెండు, 5 కిట్ బ్యాగులు, 3 సెల్ఫోన్లు పోలీసులకు లభించినట్లు సమాచారం. మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ – గంగారం మండలాల పరిధిలో గురువారం పోలీసులు అదుపులోకి తీసుకున్న సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ సూర్యం దళ సభ్యులను వెంటనే కోర్టులో హాజరు పరచాలని ఆ పార్టీ అజ్ఞాత దళ నేత ఖమ్మం, వరంగల్ జిల్లా ఏరియా దళ కమాండర్ ప్రసాద్ కోరారు.గురువారం రాత్రి ఆయన ‘సాక్షి’తో ఫోన్లో మాట్లాడారు. పోలీసులు వారికి ఎలాంటి హాని తలపెట్టొద్దని కోరారు. -
ఎన్డీ నేతల అరెస్టు
ఇల్లెందు : తమ భూములను దున్నుకోనివ్వడం లేదం టూ టీఆర్ఎస్ నాయకుడు దేవీలాల్ నాయక్ ఫిర్యాదు ఇచ్చిన నేపథ్యంలో న్యూడెమోక్రసీ నాయకులను పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు. సీఐ ఎన్.రమేష్ నేతృత్వంలో ఎన్డీ నాయకులు నాయిని రాజు తదితరులను వారి ఇళ్ల వద్ద అదుపులోకి తీసుకుని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. సమాచారం అందుకున్న ఎన్డీ కార్యకర్తలు మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య, నాయకులు రాయల చంద్రశే ఖర్, జగ్గన్నల ఆధ్వర్యంలో సుమారు 200 మంది పట్టణంలో ప్రదర్శన నిర్వహించారు. అనంతరం పోలీస్ స్టేషన్ ఎదుట బైఠాయించారు. సుమారు రెండు గంటల పాటు ఈ ఆందోళన జరిగింది. ఈక్రమంలో సీఐ ఎన్.రమేష్‌తో ఎన్డీ నేతలు వాగ్వాదానికి దిగారు. భూవివాధంలో మీ జోక్యం ఏమిటని, ఏ అధికారంతో అరెస్టు చేశారని ప్రశ్నించారు. ఆయుధాలతో వచ్చి బెదిరింపులకు పాల్పడినట్లు తమ వద్ద ఆధారాలున్నాయని, అందులో భాగంగానే అరెస్టు చేయాల్సి వచ్చిందని సీఐ సమాధానం ఇచ్చారు. ఈ క్రమంలో వాగ్వాదం తారస్థాయికి చేరుకుంది. తనను ఏకవచనంతో సంబోధించడంతో సీఐ అసహనం వ్యక్తం చేశారు. స్టేషన్ ఎదుట నుంచి పది నిమిషాల్లో వైదొలగాలని మైక్‌లో ఆదేశాలు జారీ చేశారు. ఈ క్రమంలోనే సబ్ డివిజన్‌కు చెందిన పలువురు సీఐలు, ఎస్సైలను, కొత్తగూడెం నుంచి ప్రత్యేక బలగాలను రప్పించారు. ఆందోళనకారులను మించిన స్థాయిలో పోలీసు బలగాలు స్టేషన్ ముందుకు చేరుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఆందోళన విషయాన్ని సీఐ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ఏఎస్పీ రమణకుమార్ హుటాహుటిన ఇల్లెందు చేరుకుని ఆందోళన చేస్తున్న ఎన్డీ నేతలను స్టేషన్లోకి పిలిచి చర్చించారు. సమస్యను పరిష్కరిస్తామని ఏఎస్పీ హామీ ఇవ్వడంతో ఎన్డీ నేతలు ఆందోళన విరమించారు. వివాదం ఇలా... ధర్మారం తండాకు చెందిన లాకావత్ దేవీలాల్ నాయక్ భూముల విషయంలో 2006 నుంచి వివాదం నడుస్తోంది. తనకు తీవ్ర అన్యాయం జరిగిందని దేవీలాల్ నాయక్ ఇటీవల ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిసింది. ఈ క్రమంలోనే గత నెల 22న భూముల వద్ద దేవీలాల్‌కు, ఎన్డీ నేతలకు మధ్య వాగ్వాడం చోటుచేసుకున్న విషయం విదితమే. ఈ నేపథ్యంలో దేవీలాల్ ఫిర్యాదు మేరకు ఎన్డీ నేతలను పోలీసులు అరెస్టు చేశారు.