సాక్షి, ఖమ్మం: కొత్తగూడెం జిల్లా గుండాల మండలం రోళ్లగడ్డ అటవీ ప్రాంతంలో పోలీసులకు, న్యూడెమోక్రసీ అజ్ఞాత దళానికి మధ్య ఎదురు కాల్పులు జరుగుతోన్న విషయం తెలిసిందే. ఈ ఘటనలో ఓ దళ సభ్యుడు మరణించగా.. ఏడుగురు సభ్యులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరో దళ సభ్యుడు గాయపడి వరంగల్ వైపు వస్తున్నట్లు పోలీసులకు సమచారం అందింది. దీంతో వరంగల్ జిల్లా పోలీసులు అప్రమత్తమై వర్ధన్నపేట పట్టణం, వరంగల్ ఖమ్మం ప్రధాన రహదారి పై విస్తృతంగా వాహనాలు తనిఖీ నిర్వహిస్తున్నారు.
మావోయిస్టు వారోత్సవాల సందర్భంగా అటవీ ప్రాంతంలో తిరుగుతున్న వీరు పోలీసులకు కనిపించిన సమయంలో ఇరువర్గాల మధ్య కాల్పులు మొదలయ్యాయి. ప్రస్తుతం దేవలగూడెం అటవీ ప్రాంతంలో ఉద్రిక్త వాతావరణం కనిపిస్తోంది. లింగన్న దళానికి చెందిన ఏడుగురు సభ్యులను పోలీసుల అదుపులోకి తీసున్నారని వారికి ఎటువంటి హాని తలపెట్టవద్దని న్యూడెమోక్రసీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇల్లందు పట్టణంలో ధర్నా చేపట్టారు. మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య ఆధ్వర్యంలో సుమారు 300 మంది పార్టీ కార్యకర్తలు, గ్రామస్థులు పోలీసులను చుట్టుముట్టారు. దీంతో పోలీసులు గాలిలోకి కాల్పులు జరిపారు. దళాలకు, పోలీసుల మధ్య కాల్పుల చోటుచేసుకోవడంతో గుండాల అటవీ ప్రాంతం ఉద్రిక్తంగా మారింది.
Comments
Please login to add a commentAdd a comment