
సీఎం అపాయింట్‌మెంట్ కోసం ఎదురుచూస్తున్న గుమ్మడి నర్సయ్య
ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచినా... నేటికీ వ్యవసాయ పనులు చేసుకుంటూ... ప్రజా సమస్యలపై పనిచేస్తూ సాధారణ జీవితం గడుపుతున్నారు గుమ్మడి నరసయ్య (జీఎన్). అటువంటి నాయకుడు మూడుసార్లు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy)ని కలిసేందుకు ప్రయత్నించారు. అయినా అపాయింట్‌మెంట్ ఆయనకు దొరకలేదంటే ఏమనాలి?
భూముల సమస్యను ప్రస్తావించేందుకు, చెక్‌డ్యామ్ అవసరాన్నీ, లిఫ్ట్ ఇరిగేషన్ (lift irrigation) పథకాల్లోని సమస్యలను సీఎంని కలిసి విన్నవించేందుకు జీఎన్ ప్రయత్నించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు నియోజరవర్గంలో పోడు భూములపై గిజనులకు హక్కులు కల్పించాలనీ, సీఎం ప్రకటించిన రైతు భరోసా డబ్బులు ఇప్పటి వరకు ఖాతాల్లో పడలేదనీ, ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన ఆరు గ్యారెంటీలు అమలు కావటం లేదనే విషయాలపై ఒక వినతి పత్రాన్ని ఇచ్చేందుకు తనకు పరిచయం ఉన్న అధి కారుల ద్వారా సీఎం అపాయింట్‌మెంట్ కోసం జీఎన్ ప్రయత్నించారు. ముందుగా సీఎం జూబ్లీహిల్స్‌లోని నివాసంలో ఉన్నట్టు తెలియటంతో అక్కడికి వెళ్లారు. మధ్యాహ్నం లేదా సాయంత్రంలోపు సీఎం కలిసే అవకాశం ఉందని సిబ్బంది చెప్పడంతో రోజంతా నిలబడి వేచిచూశారు. కానీ, సీఎం ఆయన్ను కలిసేందుకు అనుమతించలేదు.
తర్వాత తనకు పరిచయం ఉన్న అధికారులతో సీఎం కార్యా లయానికి ఫోన్ చేయిస్తే... ఏ సమయంలోనైనా సీఎం పిలవ వచ్చనే సమాచారం తెలవడంతో ఆశతో రోజంతా సెక్రటేరియట్ గేట్ బయటే పడిగాపులు కాచారు. దినం గడిచింది కానీ, సీఎం నుంచి పిలుపు రాలేదు. ఆయన నిరాశతో వెనుదిరిగారు. మరోసారి సీఎం నివాసం జూబ్లీహిల్స్‌కు వెళ్లి ఆయన్ను కలిసేందుకు ప్రయత్నించారు. ఎండలో గంటల తరబడి బయట వేచిచూసినప్పటికీ నర్సయ్యను లోపలికి అనుమతించలేదు. సాయంత్రం ఇంటి నుంచి బయటికి వెళ్తున్న ముఖ్యమంత్రిని గమనించిన గుమ్మడి నర్సయ్య సీఎం కాన్వాయ్‌కి ఎదురెళ్లినా... చూసీచూడనట్టుగా వెళ్లటంతో తీవ్ర అవమానంతో ఆయన వెనుదిరిగారు.
ఖమ్మం జిల్లా సింగరేణి మండలం టేకుల గూడెం గ్రామానికి చెందిన గుమ్మడి నర్సయ్య (Gummadi Narsaiah) సర్పంచ్‌గా రాజకీయ జీవితం ప్రారంభించారు. సీపీఐ ఎంఎల్ పార్టీ విప్లవ రాజకీయాల్లో రాష్ట్ర నాయకుడిగా, ఇల్లెందు నియోజకవర్గం నుంచి ఎనిమిది సార్లు పోటీ చేసి ఐదు పర్యాయాలు (1983, 1985, 1989, 1999, 2004ల్లో) గెలిచారు. హంగు, ఆర్భాటాలకు తావు లేకుండా తన పదవీ కాలమంతా ప్రజల మధ్యే గడిపారు. ఇప్పటికీ సామాన్య జీవితం గడుపుతున్నారు. తాను నమ్మిన సిద్ధాంతాల కోసం పనిచేస్తూ ప్రజలతోనే జీవిస్తున్నారు.
ఎన్టీ రామారావు, చంద్రబాబు నాయుడు, వైఎస్ రాజశేఖరరెడ్డి, కిరణ్ కుమార్ రెడ్డి, రోశయ్యలు ముఖ్య మంత్రి పదవిలో ఉన్నప్పుడు ఆయనకు ఏ క్షణమైనా అపాయింట్‌మెంట్ దొరికేది. 2009లో వైఎస్ రాజ శేఖరరెడ్డి రెండోసారి ముఖ్యమ్రంతి అయినప్పుడు ఇల్లెందులో గుమ్మడి నర్సయ్య ఓటమి పాలయ్యారు. ఆ సమయంలో ముఖ్యమంత్రిగా ఉన్న రాజశేఖర రెడ్డిని కలిసేందుకు వెళ్ళగా రాజశేఖరరెడ్డి లేచి నిలబడి ఎదురు వెళ్లి ‘నర్సన్నా... నీవు ఓడిపోవడం ఏందన్నా!’ అంటూ ఒకింత ఆశ్చర్యానికి గురయ్యారు. ‘మీలాంటి వాళ్ళు అసెంబ్లీలో ఉండాలం’టూ రాజశేఖరరెడ్డి తన రాజకీయ హుందాతనాన్ని ప్రదర్శించారు. అదే కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి మాత్రం దొరతనాన్ని ప్రదర్శిస్తున్నారు.
చదవండి: బియ్యాల జనార్దన్ సార్ కృషికి గుర్తింపేదీ?
కేసీఆర్ దర్శనం కోసం గద్దర్ పడిగాపులు కాసిన ఘటనను వివాదం చేసిన మేధావులు సీఎం నివాసం వద్ద ఫుట్ పాత్‌పై గుమ్మడి నర్సయ్య నిరీక్షిస్తున్న ఫోటోపై ఎందుకు నోరెత్తడం లేదు? ఇప్పటికైనా రేవంత్ తన పొరపాటు గ్రహించి జీఎన్‌ను పిలిపించుకుని మాట్లాడితే బాగుంటుంది. లేకపోతే ఈ ఉదంతం ఎప్పటికీ ఆయన పాలనా కాలంపై చెరగని మచ్చలా మిగిలిపోతుంది.
– వెంకటేష్, పీడీఎస్‌యూ తెలంగాణ రాష్ట్ర సహాయ కార్యదర్శి