gummadi narsaiah
-
తెలుగు పొలిటికల్ స్టార్ బయోపిక్‌లో సముద్రఖని
సముద్రఖని సినీ ప్రియులకు పరిచయం అక్కర్లేని పేరు. నటుడిగా దర్శకుడిగా ఏది చేసిన తనకంటూ ఒక బ్రాండ్ ఇమేజ్‌ని క్రియేట్ చేసుకున్నారు. ఈ మధ్య కాలంలో తెలుగులో కూడా ఫుల్ బిజీగా సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నారు. దర్శకుడిగా చేసినా, నటుడిగా చేసినా సముద్రఖని చేశాడు అంటే అందులో కచ్చితంగా కొత్తదనం ఉంటుంది. తన మనసుకి నచ్చితేనే పాత్ర చేస్తాననే సముద్రఖని గురించి సోషల్ మీడియాలో ఓ వార్తా హల్చల్ చేస్తుంది. ఓ ప్రముఖ రాజకీయ నాయకుని బయోపిక్‌లో ప్రధాన పాత్ర పోషిస్తున్నట్టు ఇప్పటికే దానికి సంబంధించిన పనులు కూడా మొదలైనట్టు తెలుస్తుంది. తెలంగాణకు చెందిన గుమ్మడి నరసయ్య బయోపిక్‌లో సముద్రఖని నటిస్తున్నట్టుగా తెలుస్తోంది. అయన 1983-1994, 1999-2009 మధ్య యెల్లందు శాసనసభ సభ్యుడిగా స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికయ్యారు. నర్సయ్య నమోదుకాని రాజకీయ పార్టీ CPI (ML)కి చెందినవారు. యెల్లందు నుంచి ఆయన వరుసగా ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచాడు. కానీ ఇప్పటికీ ఆయనకు సొంత ఇల్లు కూడా లేదు. అవినీతి మచ్చలేని వ్యక్తిగా, పేద ప్రజల ఆశ జ్యోతిగా, ఉండడానికి స్వంత ఇళ్ళు కూడా సరిగ్గా నిర్మించుకోలేని ఓ గొప్ప మానవాతివాది కావడంతో అటువంటి గొప్ప వ్యక్తి గురించి ఈ జనరేషన్‌కు తెలియాలనే ఉద్దేశంతో ఆయన టైటిల్ రోల్ పోషిస్తున్నట్టు సినీ సన్నిహితుల నుంచి సమాచారం. ఇదే కనుక నిజమైతే సముద్రఖని మరో నట విశ్వరూపం మనం చూడబోతున్నాం. ఏం జరుగుతుందో మున్ముందు చూడాలి. ఈ చిత్రంపై అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది. -
పచ్చనోట్ల మధ్య..పదునెక్కని ఓటు
ఆకాశాన్ని తాకే ఆశయం, గుండె గొంతుకలోంచి పుట్టుకొచ్చే భావోద్వేగం, కష్టమైన, నిష్టూరమైనా సైద్ధాంతిక ఆలోచనా విధానమే అప్పట్లో రాజకీయ నేపథ్యంగా ఉండేది అంటున్నారు మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య. వామపక్ష ఉద్యమమే గీటురాయిగా పనిచేసిన సీపీఐ (ఎంఎల్) పార్టీ అంటే గుర్తుకొచ్చేది గుమ్మడి నర్సయ్యే. విలువలు, నిరాడంబర జీవితం ఆయన సొంతం. ఇల్లెందు నుంచి ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన.. నాటి నుంచి ఇప్పటివరకు అత్యంత సాధారణ జీవితాన్నే గడుపుతున్నారు. అప్పటికి ఇప్పటికి ఎన్నికల సరళి పూర్తిగా మారిపోయిందని.. పదునైన ఓటు ఆయుధం పచ్చనోట్ల మధ్య మొద్దుబారిపోతోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యాన్ని ధనస్వామ్యం అపహాస్యం చేస్తోందని వాపోయారు. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో.. మారిన ఎన్నికల తీరుపై గుమ్మడి నర్సయ్య ‘సాక్షి’కి ఇంటర్వ్యూ ఇచ్చారు. వివరాలు ఆయన మాటల్లోనే.. దోచుకున్నా గుర్తించరేం? దోపిడీ విధానాలపై ఉక్కు పిడికిలితో ఉద్యమించిన ప్రజల్లో మార్పు వచ్చింది. దీన్ని ఆకర్షణ పేరుతో పాలకులు అణచివేస్తున్నారు. తాయిలాలు, సంక్షేమానికి ఆకర్షితులవుతున్న జనం.. వాటి కోసం తమ జేబుకే చిల్లు పెడుతున్నారని గుర్తించడం లేదు. మద్యం పేరుతో సర్వం హరిస్తున్నా తెలుసుకోకపోవడం దారుణం. అభివృద్ధి, సంక్షేమానికి చాలా తేడా ఉంటుంది. అభివృద్ధి వల్ల శాశ్వత ఉపాధి అవకాశం లభిస్తుంది. అప్పుడు ఏ సంక్షేమ పథకాలకూ ప్రజలు ఆకర్షితులుకారు. మారిన లెఫ్ట్ పంథా.. వామపక్ష ఉద్యమ పంథాలో మార్పు వచ్చిందనేది నిజమే. సామాజిక మార్పులను గుర్తించకపోవడం నష్టమే. ఉద్యమ నేపథ్యం ఉన్న పక్షాలు ఐక్యంగా ముందుకెళ్లలేని స్థితి ఏర్పడింది. దీంతో ప్రజలు పోరాడే విధానానికి దూర మయ్యారు. ఒకప్పుడు పోడు భూముల కోసం ప్రాణాలు పణంగా పెట్టి పోరాడిన చరిత్ర ఉంది. ఇప్పుడు నేతలు పోటీపడి ఇస్తా మంటే ఆకర్షితులవుతున్నారు. తేలి కగా వచ్చే దానికి ఆకర్షితులవుతున్నారు. పోరాటానికి వెనకాడుతు న్నారు. ఈ ముసుగులోనే సోకాల్డ్ నేతలు ప్రజలను వంచిస్తున్నారు. రాజకీయమా.. వ్యాపారమా..? ‘‘1983 నుంచి నేను ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాను. అప్పట్లో ప్రజల్లో మమేకమైతేనే పార్టీలు సీట్లు ఇచ్చేవి అప్పట్లో. పోటీచేసే వ్యక్తిని జనం అదే రీతిలో సొంతం చేసుకునే వాళ్లు. పోస్టర్లు, గోడమీద రాతలు అవే ఆ కాలంలో అతిపెద్ద ఎన్నికల ఖర్చు. ప్రచారం కోసం వచ్చే వాళ్లకు ప్రజలే అన్నంపెట్టే వారు. ఆశ్రయం కల్పించేవారు. అంతా కలిపి రూ.లక్షన్నర వరకూ ఎన్నికల ఖర్చు ఉండేది. ప్రజలు పైసలు ఆశించేవాళ్లు కాదు. 1994 నుంచి రాజకీయాలు మారిపోయాయి. కోట్లు గుమ్మరిస్తేనే గెలుస్తామని పార్టీలు కూడా భావిస్తున్నాయి. ప్రజలకు, నాయకులకు మధ్య ధన సంబంధం ఏర్పడింది. రాజకీయాలు కలుíÙతమయ్యాయి. రూ.కోట్లు ఖర్చుపెట్టి గెలిచిన ఎమ్మెల్యేలు ఆ తర్వాత తమకు ఏది లాభమో దాన్నే అనుసరిస్తున్నారు. అవసరమైతే పార్టీలు మారుతున్నారు. మౌనం ఉరుముతున్న వేళ.. ఎన్నికల మహాభారతంలో ప్రజలే నిర్ణేతలు. ఎవరు డబ్బులు ఎక్కువిస్తే వాళ్లకే ఓట్లేసే ఆలోచన విధానం కొన్నేళ్లుగా పెరిగింది. కానీ ఒక తరం ఇలా చేయడం వల్ల దాని ప్రభావం భవిష్యత్ తరాలపై పడింది. అందుకే యువతలో ఇప్పుడు నిర్వేదం, నైరాశ్యం కొట్టొచ్చినట్టు కన్పిస్తున్నాయి. ఉపాధి లేని జీవితం.. సర్కారీ ఉద్యోగం ఎండమావేనని భావించే యువతలో ఆగ్రహం క్రమంగా కట్టలు తెంచుకుంటోంది. ఇది రానురాను రాజకీయ సమీకరణాలను మారుస్తుంది. ఒక తరం కోల్పోయిన పోరాట పంథాకు ఊపిరిపోస్తోంది. వామపక్ష ఉద్యమ నేపథ్యాన్ని తిరిగి తెలుసుకుంటోంది. పోరాటమే అంతిమ లక్ష్యమన్న ధోరణిలోంచే ఎన్నికల విధానంలోనూ మార్పు వస్తుందనేది వాస్తవం..’’అని గుమ్మడి నర్సయ్య పేర్కొన్నారు. 4 సార్లు ఎమ్మెల్యే.. 3 నియోజకవర్గాలు సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: నిజామాబాద్ రూరల్ సిట్టింగ్ బీఆర్ఎస్ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ నాలుగుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అయితే ఆయన మూడు వేర్వేరు నియోజకవర్గాల్లో ఈ ఘనత సాధించడం గమనార్హం. 1981లో నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలం చీమన్‌పల్లికి ఏకగ్రీవంగా సర్పంచ్ అయ్యారు. 1986లో సిరికొండ ఎంపీపీగా ఎన్నికయ్యారు. 1994లో కాంగ్రెస్ రెబల్ అభ్యర్థిగా ఆర్మూర్ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసి 33 వేల ఓట్లు సాధించారు. అసెంబ్లీ ఎన్నికల్లో తొలిప్రయత్నంలోనే ఆయన ఓటమి పాలయ్యారు. ఆ వెంటనే ఇండిపెండెంట్ ప్యానల్ ఏర్పాటు చేసి స్థానిక సంస్థల ఎన్నికల్లో భీంగల్ ఎంపీపీ, సిరికొండ జెడ్పీటీసీ, ఎంపీపీ స్థానాల్లో తన అనుచరులను గెలిపించుకున్నారు. 1999లో ఆర్మూర్ ఎమ్మెల్యేగా కాంగ్రెస్ తరఫున ఏలేటి అన్నపూర్ణమ్మ(టీడీపీ)పై గెలుపొందారు. 2004లో బాన్సువాడ స్థానంలో కాంగ్రెస్ తరఫున పోటీ చేసి పోచారం శ్రీనివాస్‌రెడ్డి(టీడీపీ)పై గెలుపొందారు. 2009లో బాన్సువాడ నుంచి కాంగ్రెస్ తరఫున పోటీచేసి పోచారం శ్రీనివాస్‌రెడ్డిపై ఓడిపోయారు. తర్వాత 2014లో నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యేగా బీఆర్ఎస్ తరఫున గోవర్ధన్ పోటీ చేసి ధర్మపురి శ్రీనివాస్(కాంగ్రెస్)పై, 2018లో నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యేగా భూపతిరెడ్డి(కాంగ్రెస్)పై విజయం సాధించారు. - వనం దుర్గాప్రసాద్ -
ఐదుసార్లు ఎమ్మెల్యే.. కూర్చోబెట్టి గౌరవించి.. గొంతు నొక్కేశారు
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పోడు పట్టాల పంపిణీ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే, సీపీఐ(ఎంఎల్) ప్రజాపంథా నేత గుమ్మడి నర్సయ్యకు ప్రాధాన్యత లభించడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. వచ్చే ఎన్నికలను దృష్టిలో ఉంచుకునే గుమ్మడికి గాలం వేసేందుకు బీఆర్ఎస్ ప్రయత్నాలు ప్రారంభించిందనే ప్రచారం జోరందుకుంది. ఈ ఏడాది జనవరి 12న ఐడీఓసీ ప్రారంభోత్సవం సందర్భంగా పోడు పట్టాల సమస్యపై సీఎం కేసీఆర్‌కు వినతిపత్రం ఇచ్చేందుకు గుమ్మడి నర్సయ్య సభా వేదిక వద్దకు రాగా, ఆయనకు ఆ అవకాశం కల్పించేందుకు ఇటు ప్రభుత్వ వర్గాలు, అటు బీఆర్ఎస్ పెద్దలు నిరాకరించారు. దీంతో ఆయన వినతిపత్రం ఇవ్వకుండానే వెనుదిరిగారు. కాగా, గత శుక్రవారం.. పోడు సాగు చేస్తున్న రైతులందరికీ పట్టా లు జారీ చేయాలని మంత్రి హరీశ్‌రావుకు వినతిపత్రం ఇచ్చేందుకు గుమ్మడి నర్సయ్య వచ్చారు. ఈసారి వినతిపత్రం తీసుకోవడమే కాక అనూహ్యంగా ఆయనను వేదికపైకి ఆహ్వానించారు. ప్రొటోకాల్ లేకపోయినా మాజీ శాసన సభ్యుడిని గౌరవిస్తూ అధికారిక కార్యక్రమ వేదిక పంచుకునే అవకాశం కల్పించారు. మంత్రులు హరీశ్‌రావు మొదలు జిల్లా కు చెందిన పలువురు ప్రజాప్రతినిధులు గుమ్మడి నర్సయ్య పేరును తమ ప్రసంగాల్లోనూ ప్రత్యేకంగా ప్రస్తావించారు. దీంతో గులాబీ పార్టీలో కొత్త చేరికలు ఏమైనా ఉంటాయా అనే ప్రచారం మొదలైంది. మచ్చలేని నేతగా.. ఇల్లెందు నుంచి గుమ్మడి నర్సయ్య ఐదుసార్లు శాసనసభకు ఎన్నికయ్యారు. సుదీర్ఘ కాలం రాజకీయాల్లో కొనసాగినా ఎక్కడా అవినీతి మరకలు ఆయనకు అంటుకోలేదు. ఎమ్మెల్యేగా పని చేసినప్పుడు కూడా ఆటోల్లో తిరుగుతూ.. వ్యవసాయం చేస్తూ సాధారణ జీవితమే గడిపారు. గుమ్మడి రాజకీయ ప్రస్థానం, జీవన విధానంపై సర్వత్రా ప్రశంసల జల్లు కురుస్తోంది. ఆయనకు ఇద్దరు కుమార్తెలు కాగా, పెద్ద కూతురు కవిత టీచర్‌గా, చిన్న కూతురు అనురాధ లా కాలేజీలో ప్రొఫెసర్‌గా పని చేస్తున్నారు. ఈ స్థాయికి చేరుకున్న తొలి ఆదివాసీ మహిళగా అనురాధ రాష్ట్ర వ్యాప్తంగా ప్రాచుర్యం పొందారు. మొత్తంగా గుమ్మడి నర్సయ్య కుటుంబానికి రాజకీయంగా క్లీన్ ఇమేజ్ ఉంది. పలు పార్టీల నుంచి ఆహ్వానం.. రాజకీయంగా క్లీన్ ఇమేజ్ ఉన్న గుమ్మడి నర్సయ్యను తమ పార్టీలోకి రావాలంటూ అనేక సార్లు వివిధ పార్టీలు ఆఫర్లు ఇచ్చాయి. కానీ సానుకూల ఫలితం రాబట్టలేకపోయాయి. దీంతో గత కొన్నేళ్లుగా గుమ్మడి నర్సయ్య కుమార్తెలకు టికెట్లు ఇస్తామంటూ పలు పార్టీలు రాయబారాలు నడుపుతున్నాయనేది బహిరంగ రహస్యం. అందులో భాగంగానే తమ వంతు ప్రయత్నాలను గులాబీ పార్టీ నేతలు మరింత ముమ్మరం చేస్తున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. సాధ్యమైనంత త్వరగా గుమ్మడి కుటుంబసభ్యులను ‘కారు’ ఎక్కించి, ఎంపిక చేసిన నియోజకవర్గంలో తమ అభ్యర్థిగా ఫోకస్ చేయాలనే యోచనలో ఆ పార్టీ నేతలు ఉన్నట్టు చర్చ జరుగుతోంది. అయితే ఇప్పటివరకు ఈ అంశంపై గుమ్మడి కుటుంబ సభ్యుల నుంచి ఎలాంటి ప్రకటనా రాలేదు. రాజకీయంగా జరుగుతున్న ప్రచారాలపై వారు మౌనంగానే ఉన్నారు. గౌరవించి గొంతు నొక్కేశారు జిల్లాలో పోడు సాగు చేసుకుంటున్న వారిలో అనేక మందికి పట్టాలు రాలేదు. ఈ విషయాన్ని మంత్రి హరీశ్‌రావు దృష్టికి తీసుకెళ్లేందుకు వినతిపత్రం ఇవ్వాలని సభాస్థలికి వెళ్లాను. ఈ క్రమంలో తనను మాజీ ఎమ్మెల్యేగా గుర్తించి వేదిక మీదకు పిలిచి కూర్చోబెట్టి గౌరవించారు, అయితే పోడు రైతుల పక్షాన వారి సమస్యను వినిపించే అవకాశం కల్పించకుండా గొంతు నొక్కేశారు. మాట్లాడే అవకాశం ఇవ్వనప్పుడు వేదిక పైకి పిలిచి గౌరవించడంలో అర్థం లేదు. దీని వల్ల ప్రజలకు కలిగిన ప్రయోజనం శూన్యం. – గుమ్మడి నర్సయ్య, మాజీ ఎమ్మెల్యే -
కేవలం రూ.లక్షతో విజయం సాధించా
మునుగోడు: తాను మొదటిసారి 1983లో ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు కేవలం రూ.లక్ష ఖర్చయ్యిందని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య చెప్పారు. ఆయన ఇల్లందు నుంచి ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. నర్సయ్య బుధవారం మునుగోడులో ఎన్నికల సరళిని పరిశీలించేందుకు వచ్చారు. ఈ సందర్భంగా ఆయన ‘సాక్షి’తో మాట్లాడుతూ.. ఎప్పుడు ఎన్నికల్లో నామినేషన్, వాల్ పోస్టర్లు, మైక్‌లకు ఇతర ఖర్చులు తప్ప.. ఓటర్లకు ఏనాడూ డబ్బులు ఇవ్వలేదని స్పష్టం చేశారు. ప్రచారంలో భాగంగా గ్రామాలకు వెళ్తే స్థానికులే తమకు భోజనాలు వండి పెట్టేవారని గుర్తు చేసుకున్నారు. 2004 ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు ఆ ఖర్చు రూ.3 లక్షలకు చేరిందన్నారు. కానీ, మునుగోడు ఉప ఎన్నికలో వందల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారని, ఇది అందరికి పెద్ద ముప్పుగా మారనుందని నర్సయ్య ఆవేదన వ్యక్తం చేశారు. -
తెరపైకి గుమ్మడి నర్సయ్య బయోపిక్..
బాలీవుడ్లో కొన్నేళ్లుగా బయోపిక్‌ల హవా నడుస్తోంది.. తెలుగులో కూడా ఈ సంస్కృతి ఈమధ్య ఊపందుకుంది. ఇటీవల కాలంలో వచ్చిన మహానటి, ఎన్టీఆర్ బయోపిక్, యాత్ర వంటి సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించాయి. ఈ తరహాలోనే ఫిల్మ్ నగర్ వర్గాల్లో ఈమధ్య అందరి మాటల్లో చర్చకు వస్తున్న ఓ విషయం ఆసక్తిని రేపుతోంది. అదే ప్రముఖ రాజకీయ నాయకుడు, అవినీతి మచ్చలేని వ్యక్తి, 5 సార్లు వరుసగా ఎమ్మెల్యే అయినప్పటికీ ఎలాంటి దోపిడీ దౌర్జన్యాలకి పాల్పడకుండా కేవలం ప్రజాసేవకే తన జీవితం అంకితం చేసి సాదా సీదా జీవితం సాగిస్తున్న ప్రజా నాయకుడు గుమ్మడి నర్సయ్య రాజకీయ ప్రస్థానం గురించి ఒక బయోపిక్ వస్తున్నట్లు ఫిల్మ్ నగర్లో టాక్ వినిపిస్తుంది. గత ఆరు నెలలుగా ఈ కథకి సంబంధించిన అధ్యయనం జరుగుతుందని ఈ సినిమాని పరమేశ్వర్ అనే నూతన దర్శకుడు తెరకెక్కిస్తున్నాడని సమాచారం. ఇదే కనుక నిజమైతే ఒక ఆదర్శవంతమైన నాయకుడి గురించి ప్రజలతో పాటు ఈ తరం మరియు రాబోయే తరాల రాజకీయ నాయకులకు కూడా తెలిసే అవకాశం ఉందిదీని గురించి పూర్తి వివరాలు తెలియాలంటే కొన్నాళ్ళు ఆగాల్సిందే. చదవండి: ‘రాధేశ్యామ్’ మరో రొమాంటిక్ లుక్, ఫ్యాన్స్ ఫిదా -
లాటరైట్ పరిశ్రమ నెలకొల్పాలి
ఇల్లెందు అర్బన్, న్యూస్‌లైన్: మండలంలోని మామిడిగుండాల గ్రామంలో లాటరైట్ పరిశ్రమ నెలకొల్పి స్థానికులకు ఉపాధి కల్పించాలని సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి పోటు రంగారావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం మామిడిగుండాలలో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ.. ఇక్కడి భూస్వామి రాఘవేంద్రరావు ఆక్రమించుకున్న భూముల పట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. భూస్వాములకు వ్యతిరేకంగా పోరాడాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ కార్యకర్త మూతి కృష్ణ పేదల భూములను బలవంతంగా స్వాధీనం చేసుకోవడం సరికాదన్నారు. మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య మాట్లాడుతూ పేదలపక్షాన పోరాడేది న్యూడెమోక్రసీ మాత్రమేనని అన్నారు. ఎన్డీపై తప్పుడు ఆరోపణలు చేయడం కృష్ణకు తగదన్నారు. తుడుందెబ్బ జిల్లా అధ్యక్షుడు నర్సింహరావు మాట్లాడుతూ ఉద్యమకారులు ప్రజలకు న్యాయం చేయాలే తప్ప కీడు తలపెట్టవద్దని కోరారు. పేదల భూములను కబ్జా చేస్తే సహించేంది లేదని హెచ్చరించారు. లాటరైట్ ఖనిజ పరిశ్రమ వల్ల ఎంతో మంది నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు లభిస్తాయన్నారు. సభలో నాయకులు నాయిని రాజు, తుపాకుల నాగేశ్వరరావు, బండారి ఐలయ్య, సక్రు, సారంగపాణి, సూర్ణపాక పార్వతి, కల్తీసుభద్ర పాల్గొన్నారు.